ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బిహార్‌లోని గయా జీలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 22 AUG 2025 3:20PM by PIB Hyderabad

విజ్ఞానం, విముక్తి కోసం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర నగరం గయా జీకి వందనాలు.

విష్ణుపాద ఆలయం గల మహిమాన్విత భూమిపై నేను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

గౌరవనీయమైన బిహార్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ గారు, జనాదరణ గల ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు జీతన్ రామ్ మాంఝీ గారు, రాజీవ్ రంజన్ సింగ్ గారు, చిరాగ్ పాస్వాన్ గారు, రామ్‌ నాథ్ ఠాకూర్ గారు, నిత్యానందరాయ్ గారు, సతీష్ చంద్ర దుబే గారు, రాజ్ భూషణ్ చౌదరి గారు, ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి గారు, విజయ్ కుమార్ సిన్హా గారు, బిహార్ ప్రభుత్వ మంత్రులు, నా తోటి పార్లమెంటేరియన్ ఉపేంద్ర కుష్వాహా గారు, ఇతర ఎంపీలు, నా ప్రియమైన బిహార్ సోదర సోదరీమణులారా!

ఈ గయా జీ భూమి ఆధ్యాత్మికత, శాంతికి నిలయం. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన పవిత్ర భూమి ఇది. గయా జీ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వం అత్యంత పురాతనమైనది, సుసంపన్నమైనది. ఇక్కడి ప్రజలు ఈ నగరాన్ని కేవలం గయ అని కాకుండా గయా జీ అని పిలవాలని కోరుకున్నారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు బిహార్ ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నాను. గయా జీ వేగవంతమైన అభివృద్ధి కోసం బిహార్ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను.

సోదర సోదరీమణులారా,

ఈరోజు గయా జీ పవిత్ర భూమి నుంచి 12,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపనలు చేసుకున్నాం. ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, పట్టణాభివృద్ధికి సంబంధించిన అనేక ప్రధాన ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి. ఇవి బిహార్ పరిశ్రమలను మరింత బలోపేతం చేస్తాయి. స్థానిక యువతకు కొత్త ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి. ఈ ప్రాజెక్టుల ప్రారంభ సందర్భంగా బిహార్ ప్రజలకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. బిహార్‌లో మెరుగైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల కోసం ఈరోజు ఇక్కడ ఒక కొత్త ఆసుపత్రి, పరిశోధనా కేంద్రం కూడా ప్రారంభించుకున్నాం. ఇప్పుడు బిహార్ ప్రజల క్యాన్సర్ చికిత్స కోసం మరో సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

మిత్రులారా,

ప్రజాసేవకునిగా పేదలకు పక్కా ఇళ్లు ఇవ్వడం వంటి కార్యక్రమాలతో ఈ ప్రాంత పేదలు, మహిళల జీవితాలను సులభతరం చేయడంలో గొప్ప సంతృప్తి లభిస్తుంది.

మిత్రులారా,

నాకు ఒక పెద్ద సంకల్పం ఉంది. ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు లభించే వరకు.. మోదీకి ప్రశాంతత లేదు. ఈ దార్శనికతతోనే గత 11 సంవత్సరాల్లో 4 కోట్లకు పైగా ఇళ్ళు నిర్మించి పేదలకు అప్పగించాం. బిహార్‌లోనే 38 లక్షలకు పైగా ఇళ్ళు నిర్మించాం. గయా జిల్లాలో కూడా 2 లక్షలకు పైగా కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చాం. ఇల్లు ఇవ్వడం అంటే కేవలం నాలుగు గోడలు ఇవ్వడం కాదు.. పేదలకు ఆత్మగౌరవం కల్పించాం. ఈ ఇళ్ళు విద్యుత్, నీరు, మరుగుదొడ్లు, గ్యాస్ కనెక్షన్ల వంటి సకల సదుపాయాలు కలిగి ఉంటాయి. అంటే పేద కుటుంబాలు ఇప్పుడు సౌకర్యం, భద్రత, గౌరవంతో జీవించే భరోసాను పొందాయి.

మిత్రులారా,

ఈ ప్రయత్నానికి కొనసాగింపుగా ఈరోజు బిహార్‌లోని మగధ ప్రాంతానికి చెందిన 16,000కి పైగా కుటుంబాలు తమ సొంతింటి కలను నెరవేర్చుకున్నాయి. అంటే ఈ సంవత్సరం దీపావళి, ఛత్ పూజ వేడుకలను ఈ కుటుంబాలు మరింత సంతోషంగా జరుపుకోనున్నాయి. ఇళ్ళు పొందిన లబ్ధిదారుల కుటుంబాలకు హృదయపూర్వక అభినందనలు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇప్పటికీ ప్రయోజనం పొందని వారందరికీ అంటే ప్రతి పేదకుటుంబానికి పక్కా ఇల్లు అందించే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని హామీ ఇస్తున్నాను.

మిత్రులారా,

బిహార్ చంద్రగుప్త మౌర్యుడు, చాణక్యుడు వంటి మహనీయుల భూమి. శత్రువులు భారత్‌ను సవాలు చేసిన ప్రతిసారి బిహార్ దేశానికి రక్షణ కవచంగా నిలిచింది. ఈ భూమిపై తీసుకునే ప్రతి సంకల్పంలో ఈ నేల బలం ఉంటుంది.. ఇక్కడ తీసుకున్న ప్రతి సంకల్పం కచ్చితంగా నెరవేరుతుంది.

అందుకే, సోదర సోదరీమణులారా,

కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి జరిగినప్పుడు మతం అడిగి మరీ అమాయకులను హతమార్చారు. ఆ ఉగ్రవాదులను మట్టుపెడతామని ఈ బిహార్ నుంచే నేను ప్రకటించాను. ఈ బిహార్ గడ్డ నుంచి తీసుకున్న సంకల్పం నెరవేరడం నేడు ప్రపంచమంతా చూస్తోంది. మీకు గుర్తుండే ఉంటుంది.. ఆ సమయంలో పాకిస్థాన్ డ్రోన్ దాడులు చేస్తూ.. మనపై క్షిపణులు ప్రయోగిస్తూ ఉంటే.. భారత్ ఆ పాకిస్థానీ క్షిపణులను గడ్డిపోచల్లా గాలిలోనే నిర్వీర్యం చేసింది. పాకిస్థాన్ నుంచి వచ్చిన ఒక్క క్షిపణి కూడా మనకు ఎలాంటి హాని కలిగించలేకపోయింది.



మిత్రులారా,

ఆపరేషన్ సిందూర్ భారత్ రక్షణ విధానంలో కొత్త పంథాను చూపింది. ఇప్పుడు ఉగ్రవాదులను భారత్‌కు పంపే సాహసం ఎవరూ చేయలేరు.. దాడులు చేసి తప్పించుకోలేరు.. ఉగ్రవాదులు పాతాళంలో దాక్కున్నా మన క్షిపణులు వారిని అక్కడే పాతిపెడతాయి.

మిత్రులారా,

బిహార్ వేగవంతమైన అభివృద్ధి కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి అతిపెద్ద ప్రాధాన్యంగా ఉంది. అందుకే నేడు బిహార్ అన్ని రంగాల్లో అభివృద్ధితో పురోగమిస్తోంది. గత సంవత్సరాల్లో ఏళ్లుగా నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాం. పురోగతికి కొత్త మార్గాలను సృష్టించాం. "లాంతరు పాలన" సమయంలో పరిస్థితులు ఎలా ఉండేవో గుర్తుచేసుకోండి. ఆ సమయంలో ఈ ప్రాంతంలో వామపక్ష తీవ్రవాదం విస్తృతంగా వ్యాపించింది. మావోయిస్టుల కారణంగా సూర్యాస్తమయం తర్వాత ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి ఉండేది. నాటి లాంతరు పాలనలో గయా జీ వంటి నగరాలూ అంధకారంలో మునిగిపోయాయి. వేలాది గ్రామాలకు విద్యుత్ స్తంభాలు కూడా లేవు. లాంతరు పాలన బిహార్ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది. విద్య లేదు.. ఉపాధి లేదు.. ఈ కారణంగా తరతరాలుగా బిహార్ ప్రజలు వలస బాటపట్టారు.

మిత్రులారా,

ఆర్‌జేడీ, దాని మిత్రపక్షాలు బిహార్ ప్రజలను తమ ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తాయి. వారికి పేదల సంతోషాలు, దుఃఖాలు, గౌరవమర్యాదల పట్ల ఎటువంటి చింతా లేదు. బిహార్ ప్రజలను తమ రాష్ట్రంలోకి అనుమతించబోమని ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రకటించిన విషయం మీరు గుర్తుండే ఉంటుంది. బిహార్ ప్రజల పట్ల కాంగ్రెస్‌కు ఉన్న తీవ్ర ద్వేషం, చులకనభావం ఎప్పటికీ మర్చిపోలేనివి. బిహార్ ప్రజలను కాంగ్రెస్ ఎంతగా అవమానించినా ఆర్‌జేడీ నాయకులు ఇంకా గాఢ నిద్రలోనే ఉన్నారు.

సోదర సోదరీమణులారా,

కాంగ్రెస్, ఇండీ కూటమి చేస్తున్న ఈ ద్వేషపూరిత ప్రచారాన్ని బిహార్‌లోని ఎన్‌డీఏ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బిహార్ బిడ్డలకు ఇక్కడే ఉపాధి లభించాలి. వారు గౌరవప్రదమైన జీవితాలను గడపాలి. వారి తల్లిదండ్రులను ఇక్కడే జాగ్రత్తగా చూసుకోవాలి అనే దృక్పథంతో మేం పనిచేస్తున్నాం. ఇప్పుడు బిహార్‌కు ప్రధాన ప్రాజెక్టులు వస్తున్నాయి. గయా జీ జిల్లాలోని దోభిలో.. బిహార్‌లోని అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం ఏర్పాటవుతోంది. గయా జీలో ఒక టెక్నాలజీ సెంటర్ కూడా ఏర్పాటవుతోంది. ఈరోజే బక్సర్ థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభమైంది. కొన్ని నెలల కిందట నేను ఔరంగాబాద్‌లోని నవీనగర్ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌కు పునాది రాయి వేశాను. భాగల్పూర్‌లోని పిర్పైంటిలో కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ కూడా నిర్మాణంలో ఉంది. ఈ విద్యుత్ ప్లాంట్లు బిహార్‌లో విద్యుత్ సరఫరాను మెరుగుపరుస్తాయి. అయితే మీ అందరికీ తెలుసు.. విద్యుత్ ఉత్పత్తి పెరిగినప్పుడు ఏం జరుగుతుంది? ఇళ్లకు విద్యుత్ సరఫరా మెరుగవుతుంది. పరిశ్రమలకూ ఎక్కువ విద్యుత్ లభిస్తుంది. అలాగే కొత్త అపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.

మిత్రులారా,

బిహార్ యువతకు సురక్షితమైన ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడానికి నితీష్ జీ ఒక పెద్ద ప్రచారాన్ని ప్రారంభించారు. నితీష్ జీ కృషి కారణంగానే ఇక్కడ ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగింది.

మిత్రులారా,

ఇక్కడి యువత బిహార్‌లోనే అత్యధిక ఉపాధి అవకాశాలను పొందేలా.. ఉద్యోగాల కోసం వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయడానికి.. కేంద్ర ప్రభుత్వ నూతన పథకం ప్రధానంగా పని చేస్తుంది. గత వారం స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన ప్రారంభమైంది. ఈ పథకం కింద మన యువత ప్రైవేట్ రంగంలో తమ మొదటి ఉద్యోగాన్ని చేపట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం వారికి నేరుగా 15,000 రూపాయలు అందిస్తుంది. యువతకు ఉపాధి కల్పించే ప్రైవేట్ కంపెనీలు కూడా ప్రభుత్వం నుంచి అదనపు ఆర్థిక సాయాన్ని పొందుతాయి. బిహార్‌ యువత ఈ పథకం ద్వారా ఎంతో ప్రయోజనం పొందనున్నారు.

మిత్రులారా,

కాంగ్రెస్ అయినా.. ఆర్‌జేడీ అయినా.. వారి ప్రభుత్వాలు ప్రజాధనం విలువను ఎన్నడూ అర్థం చేసుకోలేదు. వారికి ప్రజాధనం అంటే వారి సొంత ఖజానా నింపుకోవడం కోసం మాత్రమే. అందుకే కాంగ్రెస్-ఆర్‌జేడీ ప్రభుత్వాల కాలంలో ప్రాజెక్టులు సంవత్సరాల తరబడి అసంపూర్ణంగా ఉండేవి. ఒక ప్రాజెక్ట్ ఎంత ఎక్కువ కాలం ఆలస్యం అయితే వారు అంత ఎక్కువ ప్రజాధనం దుర్వినియోగం చేసేవారు. ఎన్‌డీఏ ప్రభుత్వం ఈ తప్పుడు విధానానికి ముగింపు పలికింది. ఇప్పుడు శంకుస్థాపన జరిగిన తర్వాత ఇచ్చిన గడువులోగా వీలైనంత త్వరగా పనులు పూర్తిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈనాటి కార్యక్రమం కూడా దీనికి ఒక మంచి ఉదాహరణ. అవుంటా-సిమారియా విభాగానికి శంకుస్థాపన చేసే అవకాశం నాకు లభించింది. మీ ఆశీర్వాదం, ప్రేమ కారణంగా ఈ వంతెనను ప్రారంభించే అవకాశం కూడా నాకు లభించింది. ఈ వంతెన రహదారులను అనుసంధానించడమే కాకుండా.. ఉత్తర-దక్షిణ బిహార్‌ను కూడా ఏకం చేస్తుంది. గతంలో గాంధీ సేతు ద్వారా 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన భారీ వాహనాలు ఇప్పుడు నేరుగా ఒకే మార్గంలో ప్రయాణించనున్నాయి. ఇది వాణిజ్యాన్ని మరింత వేగవంతం చేస్తుంది. పరిశ్రమలకు సాధికారత కల్పిస్తుంది. యాత్రికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి సులభం చేస్తుంది. ఎన్‌డీఏ ప్రభుత్వం ఈ అభివృద్ధి ప్రాజెక్టులకు పునాది వేసినప్పుడే అవి కచ్చితంగా పూర్తవుతాయని భరోసానిచ్చింది.

మిత్రులారా,

ఎన్‌డీఏ ఆధ్వర్యంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఇక్కడ రైల్వేల అభివృద్ధి కోసం వేగంగా కృషి చేస్తోంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద గయా జీ రైల్వే స్టేషన్‌ను ఆధునికీకరిస్తున్నాం. ఇది ప్రయాణికులకు విమానాశ్రయంలో ఉండే సౌకర్యాలను అందిస్తుంది. జన శతాబ్ది రైలు, దేశీయంగా తయారైన వందే భారత్ రైళ్ల సేవలను గయా జీ నగరం కలిగి ఉంది. గయా జీ, ససారాం, ప్రయాగ్‌రాజ్, కాన్పూర్ నుంచి ఢిల్లీకి నేరుగా అనుసంధానంతో బిహార్ యువత, రైతులు, వ్యాపారులకు కొత్త అవకాశాలను అందుబాటులోకి వస్తాయి.

సోదర సోదరీమణులారా,

మీ ఆశీర్వాదాలు, యావత్ దేశం అచంచల విశ్వాసం కారణంగానే 2014 నుంచి ప్రధానమంత్రిగా నా ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ కాలంలో మా ప్రభుత్వంపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు. స్వాతంత్య్రం తర్వాత 60–65 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాల అవినీతి కేసుల జాబితా చాలా పెద్దది. ఆర్‌జేడీ అవినీతి గురించి బిహార్‌లోని ప్రతి బిడ్డకూ తెలుసు. అవినీతి వ్యతిరేక పోరాట లక్ష్యాన్ని సాధించడం కోసం ఎవరికీ దాని నుంచి మినహాయింపులు ఉండకూడదని నేను గట్టిగా నమ్ముతున్నాను. దాని గురించి ఆలోచించండి. నేడు ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగిని కూడా 50 గంటలు నిర్బంధంలో ఉంచితే అతనిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయవచ్చని చట్టం చెబుతోంది. అది డ్రైవర్ అయినా.. జూనియర్ గుమస్తా అయినా.. కర్మచారి అయినా అవినీతి మచ్చపడితే వారి జీవితం శాశ్వతంగా నాశనం అవుతుంది. కానీ ఎవరైనా ముఖ్యమంత్రి.. మంత్రి.. ప్రధానమంత్రి.. జైల్లో ఉన్నా వారు మాత్రం అధికారపు ఆనందాలను అనుభవించవచ్చు. ఇది ఎలా న్యాయమవుతుంది? జైలు నుంచి ఫైళ్లపై సంతకాలు చేయడం.. జైలు లోపల నుంచి ప్రభుత్వ ఆదేశాలు జారీ చేయడం ఇటీవలే మనం చూశాం. నాయకులు ఇలా ప్రవర్తిస్తూ ఉంటే అవినీతిపై పోరాటం ఎలా గెలవగలదు?

మిత్రులారా,

రాజ్యాంగం ప్రతి ప్రజాప్రతినిధి నుంచి నిజాయితీనీ, పారదర్శకతను ఆశిస్తుంది. రాజ్యాంగ గౌరవాన్ని మనం విచ్ఛిన్నం చేయకూడదు. అందుకే ఎన్‌డీఏ ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం ప్రధానమంత్రి కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తారు. ఈ చట్టం ముఖ్యమంత్రులు, మంత్రులకూ వర్తిస్తుంది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి అయినా.. ముఖ్యమంత్రి అయినా.. మరే ఇతర మంత్రి అయినా ఒకవేళ వారు అరెస్టయితే 30 రోజుల్లోగా బెయిల్ పొందవలసి ఉంటుంది. బెయిల్ లభించకపోతే 31వ రోజున వారు తమ కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. సోదరులారా.. ఎవరైనా తప్పు చేసి జైలుకు వెళితే వారు తమ పదవిని వదిలి వెళ్లాలా వద్దా? వారు ఆ పదవిలో కొనసాగవచ్చా? వారు జైలు నుంచి ప్రభుత్వ ఫైళ్ళపై సంతకం చేయవచ్చా? జైలు లోపల నుంచే ఎవరైనా ప్రభుత్వాన్ని నడపగలరా? అందుకే మేం ఇంత కఠినమైన చట్టాన్ని రూపొందించి ముందుకు సాగుతున్నాం.

మిత్రులారా,

ఈ ఆర్‌జేడీ, కాంగ్రెస్, వామపక్ష నేతలంతా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు కోపంగా ఉన్నారు. ఎందుకో ఎవరికీ తెలియదు? పాపం చేసిన వాళ్ళు వాళ్ళ నేరాలను ఇతరుల నుంచి దాచవచ్చు.. కానీ వారు చేసిన తప్పులేమిటో వారి మనసుకి తెలుసు. వారందరి కథ ఇది. ఈ ఆర్‌జేడీ, కాంగ్రెస్ నాయకులు కొందరు బెయిల్ మీద బయట ఉన్నారు.. మరికొందరు రైల్వే కుంభకోణంలో చిక్కుకొని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. బెయిల్ మీద బయటకు వచ్చి స్వేచ్ఛగా తిరుగుతున్న వారే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. జైలుకు వెళితే తమ కలలన్నీ చెదిరిపోతాయని వారు భయపడుతున్నారు. అందుకే పగలూ-రాత్రి మోదీపై అన్ని రకాలుగా దూషణలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చాలా ఆందోళనతో, అశాంతితో ఉన్నారు. ఈ ప్రజామోదిత చట్టాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. అధికార దాహంతో నాయకులు అవినీతికి పాల్పడతారనీ.. జైలుకు వెళ్లిన తర్వాత కూడా తమ పదవులను పట్టుకొని వేలాడతారని మన రాజేంద్ర బాబు, మన బాబాసాహెబ్ అంబేద్కర్ కలలో కూడా ఊహించలేదు. కానీ ఇప్పుడు అవినీతిపరులు జైలుకు వెళ్లక తప్పదు. దాంతో వారి పదవి కూడా పోతుంది. భారత్‌ను అవినీతి రహితంగా మార్చాలనే సంకల్పం ఈ దేశంలోని కోట్లాది మందికి ఉంది. ఈ సంకల్పం కచ్చితంగా నెరవేరుతుంది.

మిత్రులారా,

ఎర్రకోట నుంచి నేను మరో ముప్పు గురించి మాట్లాడాను. ఈ ముప్పు బిహార్‌కు కూడా పొంచి ఉంది. దేశంలో పెరుగుతున్న చొరబాటుదారుల సంఖ్య చాలా ఆందోళన కలిగిస్తోంది. బిహార్ సరిహద్దులోని జనాభా వేగంగా పెరుగుతోంది. అందుకే ఈ దేశ భవిష్యత్తును చొరబాటుదారులు నిర్ణయించడానికి అనుమతించకూడదని ఎన్‌డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. బిహార్ యువత ఉద్యోగాలను చొరబాటుదారులు లాక్కోవడానికి మేం అనుమతించం. భారత ప్రజలకు న్యాయంగా చెందాల్సిన సౌకర్యాలను చొరబాటుదారులు దోచుకోవడానికీ మేం అనుమతించం. ఈ ముప్పును ఎదుర్కోవడానికి నేను డెమోగ్రఫీ మిషన్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాను. అతి త్వరలోనే ఈ మిషన్ దాని పనిని మొదలుపెడుతుంది. మేం ప్రతి చొరబాటుదారుడినీ ఈ దేశం నుంచి తరిమేస్తాం. ఈ చొరబాటుదారులను తరిమేయాలా వద్దా? ఒక చొరబాటుదారుడు మీ ఉద్యోగాన్ని లాక్కుంటే మీరు అంగీకరిస్తారా? ఒక చొరబాటుదారుడు మీ భూమిని స్వాధీనం చేసుకుంటే మీరు అంగీకరిస్తారా? ఒక చొరబాటుదారుడు మీ హక్కులను లాక్కుంటే మీరు అంగీకరిస్తారా? బిహార్ ప్రజలారా.. దేశంలో ఈ చొరబాటుదారులకు మద్దతిచ్చే వారి పట్ల జాగ్రత్త వహించండి. చొరబాటుదారులకు ఎవరు అండగా నిలుస్తారో మీకు బాగా తెలుసు. కాంగ్రెస్, ఆర్‌జేడీ వంటి పార్టీలు బిహార్ ప్రజల హక్కులను హరించాలనీ, వాటిని చొరబాటుదారులకు అప్పగించాలని చూస్తున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆ పార్టీలు ఏ స్థాయికైనా దిగజారవచ్చు. అందుకే బిహార్ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి.

మిత్రులారా,

కాంగ్రెస్, ఆర్‌జేడీల కుటిల యత్నాల నుంచి మనం బిహార్‌ను రక్షించాలి. బిహార్‌కు ఇది చాలా కీలకమైన సమయం. బిహార్ యువత కలలు నెరవేరడానికి.. బిహార్ ప్రజల ఆకాంక్షలు మరింత ఉన్నత స్థాయికి ఎదగడానికి కేంద్ర ప్రభుత్వం, నితీష్ జీ ప్రభుత్వం బిహార్ సంక్షేమం లక్ష్యంగా ఐక్యంగా పనిచేస్తున్నాయి. బిహార్‌లో అభివృద్ధి వేగం కొనసాగించేందుకు మా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. నేటి అభివృద్ధి ప్రాజెక్టులు ఆ దిశగా కీలక ముందడుగు అవుతాయి. మరోసారి ఈ ప్రాజెక్టుల ప్రారంభ సందర్భంగా బిహార్‌ ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నాతో కలిసి అందరూ చెప్పండి.

భారత్ మాతాకీ జై!

భారత్ మాతాకీ జై!

భారత్ మాతాకీ జై!

చాలా ధన్యవాదాలు.

 


 

***


(Release ID: 2161052) Visitor Counter : 12