ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్ లోని హన్సల్ పూర్ లో గ్రీన్ మొబిలిటీ కార్యక్రమ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగానికి తెలుగు అనువాదం
Posted On:
26 AUG 2025 2:21PM by PIB Hyderabad
గుజరాత్ రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయి పటేల్ గారు, భారత్ లోని జపాన్ రాయబారి కెయిచి ఓనో సాన్, సుజుకి మోటార్ కార్పొరేషన్ అధ్యక్షుడు తోషిహిరో సుజుకి సాన్, మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ హిసాషి తాకెచి సాన్, చైర్మన్ ఆర్ సీ భార్గవ గారు, హన్సల్ పూర్ ఉద్యోగులు, ఇతర ముఖ్య అతిథులు, ప్రియమైన పౌరులారా!
గణేష్ పండుగ ఉత్సవ తరుణంలో నేడు ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. ‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్’ అనే నినాదం మన లక్ష్యం వైపు ఒక పెద్ద ముందడుగు. ఈరోజు నుంచి దేశంలో తయారైన ఎలక్ట్రిక్ వాహనాలు 100 దేశాలకు ఎగుమతి కానున్నాయి. దీనితోపాటు హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ ఉత్పత్తి కూడా నేడు ప్రారంభమవుతోంది. ఇది భారత్, జపాన్ మధ్య స్నేహానికి కొత్త కోణాన్ని అందిస్తుంది. అందుకు నేను దేశ ప్రజలకు, జపాన్, సుజుకి సంస్థకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. పదమూడు అనే సంఖ్య టీనేజ్ దశ ప్రారంభాన్ని సూచిస్తుంది. టీనేజ్ రెక్కలు విప్పే కాలం, కలల్లో విహరించే సమయం. ఈ దశలో అనేక ఆకాంక్షలు పుట్టుకొస్తాయి. కాళ్లు భూమి మీద నిలబడవు అన్నట్లుగా ఉంటుంది. మారుతి తన యౌవన దశలోకి ప్రవేశిస్తోంది. గుజరాత్‌లో మారుతి తన యౌవన దశలోకి ప్రవేశించటం అంటే రాబోయే రోజుల్లో మారుతి కొత్త రెక్కలు తొడిగి, కొత్త శక్తి, ఉత్సాహంతో ముందుకు సాగుతుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది.
మిత్రులారా..
భారత్ లో ఈ విజయగాథకు దాదాపు 13 సంవత్సరాల కిందట బీజాలు పడ్డాయి. 2012లో నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హన్సల్ పూర్ లో మారుతి సుజుకికి భూమిని కేటాయించాం. ఆ సమయంలో కూడా నా దృష్టి ఆత్మనిర్భర భారత్, మేక్ ఇన్ ఇండియా వైపు ఉండేది. అప్పటి మా ప్రయత్నాలే నేడు దేశ ఆకాంక్షలను నెరవేర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.
మిత్రులారా,
ఈ సందర్భంగా నేను స్వర్గీయ ఒసాము సుజికి సాన్ ను సర్మించుకోవాలనుకుంటున్నాను. ఆయనకు పద్మ విభూషణ్ అవార్డును ఇవ్వడం మా ప్రభుత్వానికి దక్కిన ఓ గౌరవం. మారుతిసుజుకి ఇండియాపై ఆయనకున్న దూరదృష్టి కారణంగా నేడు మనం దీనిని విస్తరించడం ఎంతో ఆనందంగా ఉంది.
మిత్రులారా,
దేశానికి ప్రజాస్వామ్య శక్తితోపాటు జనాభా పరంగా కూడా గొప్ప సానుకూలత ఉంది. అంతేగాక దేశంలో అనుభవజ్ఞులైన, నైపుణ్యాలు కలిగిన భారీ శ్రామిక బలగం ఉంది. ఇది మన భాగస్వాములకు విజయం సాధించేందుకు దోహదపడుతుంది. నేడు మీరు చూస్తున్నట్లుగా, సుజుకి జపాన్ సంస్థ దేశంలో తయారీ చేస్తోంది. ఇక్కడ తయారైన కార్లు తిరిగి జపాన్‌కు ఎగుమతి అవుతున్నాయి. ఇది భారత–జపాన్ సంబంధాల బలాన్ని మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు దేశంపై పెట్టుకున్న నమ్మకాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ఒక విధంగా మారుతి సుజుకి వంటి సంస్థలు “మేక్ ఇన్ ఇండియా”కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాయి. గత నాలుగు సంవత్సరాలుగా భారత్ లో మారుతి అత్యధికంగా కార్లు ఎగుమతి చేస్తున్న సంస్థగా నిలిచింది. నేటి నుంచి ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతులు కూడా అదే స్థాయిలో ప్రారంభమవుతున్నాయి. ఇకపై ప్రపంచంలోని అనేక దేశాల్లో తిరుగుతున్న ఈవీలపై “మేడ్ ఇన్ ఇండియా” అనే గుర్తింపు కనిపిస్తుంది.
మిత్రులారా,
ఈవీల్లో అత్యంత కీలక భాగం బ్యాటరీ అని మనందరికీ తెలుసు.కొన్నేళ్ల క్రితం దాకా బ్యాటరీ ల విషయంలో దిగుమతులపైనే ఆధారాపాడవలసి వచ్చేది. కానీ ఈవీల తయారీని బలోపేతం చేయాలంటే భారత్ లో బ్యాటరీలు తయారు చేయడం అవసరం. ఈ దూరదృష్టితో 2017లో బ్యాటరీ ప్లాంట్ కు పునాది వేశాం. ఇప్పుడు టీడీఎస్‌జీ తీసుకొచ్చిన కొత్త పథకంలో భాగంగా మూడు జపాన్ కంపెనీలు కలిసి ఫ్యాక్టరీలో తొలిసారిగా దేశంలో సెల్‌లు తయారు చేయబోతున్నాయి. అంతేగాక బ్యాటరీ సెల్‌ల కోసం అవసరమైన ఎలక్ట్రోడ్లను భారత్ లోనే తయారు చేయబోతున్నారు. ఈ లోకలైజేషన్ భారత ఆత్మనిర్భరతకు కొత్త శక్తిని ఇస్తుంది. ఇది హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధిని వేగవంతం చేస్తుంది. ఈ చారిత్రక ప్రారంభానికి మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
కొన్నేళ్ల కిందట ఈవీలను కేవలం ఒక ప్రత్యామ్నాయంగా మాత్రమే చూసేవారు.. కానీ ఈవీలు అనేక సమస్యలకు దృఢమైన పరిష్కారంగా నిలుస్తాయని నేను నమ్మాను. అందుకే గతేడాది నేను సింగపూర్ పర్యటనలో ఉన్నప్పుడు మన పాత వాహనాలను, పాత అంబులెన్సులను హైబ్రిడ్ ఈవీలుగా మార్చవచ్చని చెప్పాను. మారుతి సుజుకి ఈ విషయాన్ని అంగీకరించి కేవలం 6 నెలల్లో ఒక ప్రారంభ నమూనాను అభివృద్ధి చేసింది. ఈ హైబ్రిడ్ అంబులెన్స్ నమూనా మోడల్ ను నేను స్వయంగా చూశాను. ఇవి పీఎం ఈ - డ్రైవ్ పథకంలో సరిగ్గా సరిపోతాయి. దాదాపు రూ.11,000 కోట్లతో కూడిన ఈ పథకంలో.. ఈ-అంబులెన్సుల కోసం ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయించాం. హైబ్రిడ్ ఈవీలు కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా పాత వాహనాలను మార్చేందుకు ఒక మంచి ప్రత్యామ్నాయాన్ని అందిస్తాయి.
మిత్రులారా,
స్వచ్ఛ ఇంధనం, హరిత రవాణా.. ఇదే మన భవిష్యత్తు. ఈ దిశగా చేసే ప్రయత్నాలు... భారత్ స్వచ్ఛ ఇంధనం, హరిత రవాణాలకు కేంద్రంగా మారుతుంది.
మిత్రులారా,
ప్రస్తుతం, వస్తు సరఫరా వ్యవస్థలో వస్తున్న ఇబ్బందులతో ప్రపంచం సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో, గత పదేళ్ల కన్నా ఎక్కువ కాలంలో భారత్ రూపొందించిన విధానాలు మన దేశానికి ఎంత మేలు చేశాయన్నది స్పష్టంగా తెలుస్తోంది. మీరు 2014లో ఈ దేశానికి సేవ చేయమంటూ నాకు ఒక అవకాశాన్ని ఇచ్చినప్పుడు, వెంటనే ఈ దిశగా సన్నాహాల్ని మేం ప్రారంభించేశాం. ‘భారత్‌లో తయారీ’ ప్రచార ఉద్యమాన్ని మేం మొదలుపెట్టడంతో పాటు దేశీయ, అంతర్జాతీయ తయారీ సంస్థలకు అనువైన పరిస్థితుల్ని ఏర్పరిచాం. ‘భారత్‌లో తయారీ’ని సమర్థంగా, ప్రపంచ వ్యాప్తంగా పోటీ పడేటట్లుగా తీర్చిదిద్దడానికి పారిశ్రామిక కారిడార్లను మేం అభివృద్ధిచేస్తున్నాం. వెంటనే ఉపయోగించుకోగలిగిన వసతి సదుపాయాలను అందిస్తున్నాం. ఆధునిక వస్తు రవాణా వ్యవస్థల్ని అందుబాటులోకి తెస్తున్నాం. అనేక రంగాల్లో తయారీ సంస్థలకు ఉత్పత్తితో ముడిపెట్టిన ప్రోత్సాహక (పీఎల్ఐ) ప్రయోజనాలను కూడా భారత్ అందిస్తోంది.
మిత్రులారా,
ప్రధాన సంస్కరణలను ప్రవేశపెట్టి, మేం పెట్టుబడిదారులు ఎదుర్కొన్న పాత కష్టాలకు స్వస్తి పలికాం. డబ్బును భారత తయారీ రంగంలో పెట్టుబడి పెట్టడాన్ని ఇన్వెస్టర్లకు సులభతరం చేసింది. ఫలితాలు మీ ముందున్నాయి: ఈ దశాబ్దంలో, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉత్పత్తి సుమారు 500 శాతం పెరిగింది. మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 2014తో పోలిస్తే 2,700 శాతం విస్తరించింది. రక్షణ రంగంలో ఉత్పత్తి కూడా గత పదేళ్ల కన్నా ఎక్కువగా 200 శాతానికి పైగా ఎగబాకింది. ఈ సాఫల్యాలు సంస్కరణల్లోను, పెట్టుబడులను ఆకర్షించడంలోను ప్రతి రాష్ట్రం పోటీపడేలా దేశంలో అన్ని రాష్ట్రాలకూ ప్రేరణనిస్తున్నాయి. ఈ ఆరోగ్యకర పోటీ దేశానికి మేలుచేస్తోంది.
మనం ఏదో జరగబోతోందని అది జరిగేదాకా ఎదురుచూడకుండా మన స్థాయిలో మనం ముందస్తుగా అవసరమైన చర్యలేవో తీసుకోవడం మంచిదని అన్ని రాష్టాలకు ప్రతి సమావేశంలోను, వ్యక్తిగత సంభాషణల్లోను, బహిరంగ సభల్లోను చెబుతున్నా. మనం అభివృద్ధికి అనుకూలంగా ఉండే విధానాలను రూపొందించి తీరాలి. అన్ని అనుమతులను త్వరగా ఇవ్వడంపై శ్రద్ధ చూపాలి. ఈ పోటీ యుగంలో చట్టాల్లో సంస్కరణలపై దృష్టి నిలపాలి. ఒక రాష్ట్రం తన విధానాలను సూటిగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎంత వేగంగా తీర్చిదిద్దగలిగితే, అంతగా పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరుగుతుంది. వాళ్లు ధైర్యంగా ముందడుగు వేస్తారు. ఇవాళ ప్రపంచదేశాలు భారత్‌వైపు చూస్తున్నాయి. ఇలాంటి స్థితిలో, ఏ రాష్ట్రాన్నీ వెనుక వరుసలో నిలబెట్టకూడదు. ప్రతి రాష్ట్రం ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. భారత్‌లో అడుగుపెట్టే పెట్టుబడిదారు ఈ రాష్ట్రానికి వెళ్లనా, లేక ఆ రాష్ట్రానికి వెళ్లనా అని ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి కష్టపడే తీరులో... పోటీ ఉండాలి. ఈ స్థితి దేశానికి లాభించేలా ఉండాలి. ఈ కారణంగా, సంస్కరణలను ప్రవేశపెట్టడానికి పోటీ పడాల్సిందిగాను, సుపరిపాలనను అందించడానికి పోటీపడాల్సిందిగాను, అభివృద్ధికి తోడ్పడే విధానాలను రూపొందించడంలో పోటీ పడాల్సిందిగాను, భారత్‌ను 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని సాధించడంలో మన భాగస్వామ్యం ఉండి తీరాలనే దృష్టిని కలిగి ఉండాల్సిందిగాను అన్ని రాష్ట్రాలను నేను ఆహ్వానిస్తున్నా.
మిత్రులారా,
భారత్ ఇక్కడితోనే ఆగిపోదు. మనం చక్కటి పనితీరును కనబర్చిన రంగాల్లో మరింతగా రాణించి తీరాలి. దీనికి మిషన్ మాన్యుఫాక్చరింగ్’పై మేం శ్రద్ధ తీసుకుంటున్నాం. రాబోయే కాలంలో, మనం భవిష్యత్తు కాలపు అవసరాలను తీర్చే పరిశ్రమలపైన దృష్టి పెట్టాలి. సెమీకండక్టర్ రంగంలో భారత్ జోరును కనబరచనుంది. ఈ రంగంలో 6 ప్లాంట్లు దేశంలో సర్వసన్నద్ధమవుతున్నాయి. సెమీకండక్టర్ తయారీలో మనం మరింత ముందుకు పోవలసిన అవసరముంది.
మిత్రులారా,
కీలక ఖనిజాల కొరత వల్ల వాహన పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులు కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. ఈ విషయంలో దేశ సామర్థ్యాలను మెరుగుపరచడానికి మేం కూడా ‘జాతీయ కీలక ఖనిజాల మిషన్’ను మొదలుపెట్టాం. దీనిలో భాగంగా, దేశంలో వేర్వేరు చోట్ల 1200 కన్నా ఎక్కువ అన్వేషణ కార్యక్రమాలను నిర్వహించి, కీలక ఖనిజాలను వెదుకుతున్నాం.
మిత్రులారా,
నేను వచ్చే వారంలో జపాన్ వెళ్తున్నాను. భారత్, జపాన్ల మధ్య సంబంధం దౌత్య సంబంధాలకు మించింది. ఇది సంస్కృతిపైన, నమ్మకంపైన ఆధారపడిన సంబంధం. మనం ఒకరి పురోగతిలోనే మరొకరి పురోగతి ఉందని భావిస్తాం. మారుతీ సుజుకీతో మనం మొదలుపెట్టిన ప్రయాణం ఇప్పుడు బులెట్ రైలంత వేగాన్ని అందుకొంది.
భారత్-జపాన్ భాగస్వామ్యానికి సంబంధించి పారిశ్రామిక అవకాశాలను సాకారం చేసే ప్రధాన కార్యక్రమం ఇక్కడ గుజరాత్‌లోనే ప్రారంభమైంది. 20 ఏళ్ల కిందట మనం ‘వైబ్రంట్ గుజరాత్ సదస్సు’ను ప్రారంభించిన సమయంలో కీలక భాగస్వాములలో జపాన్ ఒకటిగా ఉన్న విషయం నాకు గుర్తుంది. ఒక్కసారి ఆలోచించండి- ఓ అభివృద్ధి చెందుతున్న దేశంలోని చి న్న రాష్ట్రం నిర్వహిస్తున్న పెట్టుబడి సదస్సులో జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశం భాగస్వామిగా ఉంది. భారత్ - జపాన్ సంబంధాల పునాదులు అత్యంత బలంగా ఉన్నాయనేందుకు ఇది నిదర్శనం. ‘వైబ్రంట్ గుజరాత్’ ప్రస్థానాన్ని నేను గుర్తుచేసుకుంటున్న ఈ వేళ.. ఇక్కడ ఆశీననులై ఉన్న నా మిత్రుల్లో ఒకరు 2003లో భారత్‌లో జపాన్ రాయబారిగా ఉన్నారు. ఆయనిప్పుడు పదవీ విరమణ చేశారు. కానీ భారత్ పట్ల, గుజరాత్ పట్ల ఆయనకున్న ప్రేమ అలానే ఉంది. ఆయనకు నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. గుజరాత్ ప్రజలు కూడా జపాన్ ప్రజలపై అవే ప్రేమాభిమానాలను కనబరిచారు. పారిశ్రామిక సంబంధిత నియమ నిబంధనలను జపనీస్ భాషలో కూడా మేం ముద్రించాం. నేను గుజరాత్‌లో ఉన్నప్పుడు, ప్రతి చిన్న విషయంపైనా శ్రద్ధ చూపేవాడిని. నా విజిటింగ్ కార్డును కూడా జపనీస్ భాషలో ముద్రించాను. మేం ప్రచార వీడియోలు చేసిన ప్రతిసారీ జపనీస్ డబ్బింగ్ చేసేవాళ్ళం. ఈ మార్గంలో బలంగా ముందుకెళ్లాల్సి ఉందన్న విషయం నాకు బాగా తెలుసు. అందుకే నేను అన్ని ఇతర రాష్ట్రాలకు చెప్తున్నాను- మిత్రులారా, ఆకాశాన్నంటే అవకాశాలున్నాయి. కష్టపడి పనిచేయండి. ముందుకు రండి. మీరు అమితంగా ప్రయోజనం పొందుతారు.
తొలినాళ్లలో మా జపాన్ మిత్రులు మమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు క్రమంగా నేను వారికి దగ్గరై, వారి జీవన విధానాన్ని అర్థం చేసుకున్నాను. జపనీయుల్లో నేను ఓ విషయాన్ని గమనించాను.. వారు సంస్కృతికి అమిత ప్రాధాన్యమిస్తారు. తమ ఆహారాన్నే కావాలనుకుంటారు. గుజరాత్ ప్రజలదీ ఇదే లక్షణం. గుజరాత్‌లో వారాంతాల్లో బయటికెళ్లి రెస్టారెంట్‌కు పోతే మెక్సికన్ లేదా ఇటాలియన్ ఆహారం కావాలని అడగొచ్చు గానీ, రాష్ట్రం బయటికి వెళ్తే మాత్రం గుజరాతీ ఆహారం కోసం వెతుకుతూ ఉంటారు. జపాన్ ప్రజల్లోనూ అదే లక్షణాన్ని నేను గమనించాను. అందుకే నేను గుజరాత్‌లో జపాన్ వంటకాలను ఏర్పాటు చేశాను. వాటిని అందించాలని పలు హోటళ్లను ఆహ్వానించాను కూడా. తరువాత, గోల్ఫ్ లేకుండా జీవితం అసంపూర్ణమని జపనీయులు భావిస్తారని నాకు చెప్పారు. అందుకే దానికీ నేను అంతలా ప్రాధాన్యమిచ్చాను. మా జపాన్ స్నేహితులను దృష్టిలో పెట్టుకుని.. గతంలో అసలు గోల్ఫ్ అంటే తెలియని గుజరాత్‌లో ఏడెనిమిది కొత్త గోల్ఫ్ కోర్సులను అభివృద్ధి చేశాం. చూడండీ... మీరు అభివృద్ధిని కోరుకుంటే, పెట్టుబడులు తేవాలనుకుంటే, ప్రపంచాన్ని ఆకట్టుకోవాలనుకుంటే... ప్రతి విషయంపైనా మీరు శ్రద్ధ వహించాలి. మన దేశంలోని చాలా రాష్ట్రాలు దీన్ని అనుసరిస్తున్నాయి. ఇప్పటికీ అందులో వెనుకబడిన రాష్ట్రాలకు నేను చెబుతున్నాను - ప్రతి చిన్న విషయాన్ని ఓ అవకాశంగా భావించి సరికొత్త అభివృద్ధిలో దిశలో ముందుకు సాగండి. అది మాత్రమే కాదు మిత్రులారా.. మా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో జపాన్ భాష బోధనకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం. నేడు గుజరాత్‌లో చాలా మంది జపనీస్ భాషా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అనేక పాఠశాలల్లో జపనీస్ భాషను బోధిస్తున్నారు.
మిత్రులారా,
మా ప్రయత్నాల వల్ల భారత్ - జపాన్ ప్రజా సంబంధాలు అద్భుతంగా బలోపేతమయ్యాయి. నైపుణ్యాలు, మానవ వనరుల విషయానికొస్తే.. మనం ఒకరి అవసరాలను మరొకరం తీర్చుకోగలుగుతున్నాం. మారుతి - సుజుకి వంటి కంపెనీలు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో భాగం కావాలని, యువతను భాగస్వాములను చేసే కార్యక్రమాలను విస్తరించాలని నేను కోరుతున్నాను.
మిత్రులారా,
అదే విధంగా రాబోయే కాలంలో అన్ని కీలక రంగాల్లో మనం ముందుకు సాగాలి. ఈ రోజు మనం తీసుకుంటున్న చర్యలు 2047లో ‘వికసిత భారత్’ సౌదాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తాయన్న నమ్మకం నాకుంది. ఈ మిషన్‌లో మాతో పాటు విశ్వసనీయ భాగస్వామిగా జపాన్ నడుస్తుందని, ఈ స్నేహం విడదీయరానిదిగా కొనసాగుతుందని అంతే నమ్మకంతో ఉన్నాను. భారత్ - జపాన్ సంబంధాల విషయానికొస్తే, అది ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ భాగస్వామ్యం అని నేనెప్పుడూ చెప్తుంటాను. ఈ రోజు మారుతికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు మీ టీనేజీ ప్రారంభంలో ఉన్నారు. మీరు రెక్కలు విప్పి, కొత్త కలలు కనాలి. మీ లక్ష్యాల్లోనూ, వాటిని నెరవేర్చడంలోనూ మేం పూర్తిగా సహకరిస్తాం. ఈ విశ్వాసంతో ఆత్మనిర్భర భారత్ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. స్థానికతను ప్రోత్సహించేలా గొంతెత్తుదాం. ‘స్వదేశీ’ మన జీవన మంత్రంగా మారాలి. మిత్రులారా.. స్వదేశీ దిశగా సగర్వంగా పయనిద్దాం. జపాన్ ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నది కూడా స్వదేశీయే. స్వదేశీకి నేనిచ్చే నిర్వచనం చాలా సులభం: ఎవరి డబ్బు పెట్టుబడిగా పెట్టారన్నది ముఖ్యం కాదు. డాలర్లు, పౌండ్లు- ఏవైనా కావచ్చు, కరెన్సీ నలుపో తెలుపో ఏదైనా కావచ్చు... ఉత్పత్తిలో నా దేశస్తుల కృషి ఉండడమే ముఖ్యం. డబ్బు వేరొకరిది కావచ్చు. కానీ కృషి, శ్రమ మనది. నా మాతృభూమి, భారతభూమి పరిమళాన్ని ఆ ఉత్పత్తులు వెదజల్లుతాయి. ఈ స్ఫూర్తితో నాతో కలసి నడవండి మిత్రులారా... 2047 నాటికి మీ భవిష్యత్ తరాలు మీ త్యాగాలను, మీ కృషిని చూసి గర్వించేలా భారత్‌ను తీర్చిదిద్దుదాం. మీ రాబోయే తరాల ఉజ్వల భవిష్యత్తు కోసం, ఆత్మనిర్భర భారత్ మంత్రం సాకారమవడం కోసం, స్వదేశీ మార్గం దిశగా దేశ ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నాను. నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను- మనమందరం కలిసి ముందుకు సాగుదాం. 2047 నాటికి మనం ‘వికసిత భారత్’ను సాకారం చేసి తీరుతాం. ప్రపంచ సంక్షేమం కోసం తోడ్పాటును భారత్ మరింత విస్తృతంగా కొనసాగిస్తుంది. ఈ స్ఫూర్తితో, మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను!
ధన్యవాదాలు!
***
(Release ID: 2161051)