ప్రధాన మంత్రి కార్యాలయం
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో రూ. 5,200 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన ప్రధానమంత్రి
కోల్‌కతా వంటి నగరాలు భారతదేశ చరిత్ర, భవిష్యత్తు.. రెండింటికి గొప్ప ప్రతిరూపాలుగా ఉన్నాయి: ప్రధాని
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారత్ చేస్తున్న ప్రయాణంలో
డమ్ డమ్, కోల్‌కతా వంటి నగరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి: ప్రధానమంత్రి
21వ శతాబ్దపు భారత్‌కు 21వ శతాబ్దపు రవాణా వ్యవస్థ అవసరం. అందువల్ల నేడు దేశవ్యాప్తంగా రైల్వేల నుంచి రోడ్ల వరకు, మెట్రోల నుంచి విమానాశ్రయాల వరకు ఆధునిక రవాణా సౌకర్యాలను కల్పించటమే కాకుండా అనుసంధానత సజావుగా ఉండేందుకు వాటన్నింటిని ఏకీకృతం చేస్తున్నాం: ప్రధానమంత్రి
Posted On:
22 AUG 2025 6:14PM by PIB Hyderabad
పశ్చిమ బెంగాల్ రాజధాని నగరం కోల్‌కతాలో ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రూ. 5,200 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని.. పశ్చిమ బెంగాల్ అభివృద్ధిని వేగవంతం చేసే అవకాశం తనకు మరోసారి లభించిందన్నారు. నోపారా నుంచి జై హింద్ విమానాశ్రయం వరకు కోల్‌కతా మెట్రోలో ప్రయాణించిన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ పర్యటనలో చాలా మంది సహచరులతో మాట్లాడానని, కోల్‌కతా ప్రజా రవాణా వ్యవస్థ ఆధునికీకరించటం పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఆరు వరుసల ఎలివేటెడ్ కోనా ఎక్స్‌ప్రెస్‌వేకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. వేల కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ప్రాజెక్టులకు సంబంధించి కోల్‌కతా, పశ్చిమ బెంగాల్ ప్రజలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
"కోల్‌కతా వంటి నగరాలు భారతదేశ చరిత్ర, భవిష్యత్తు రెండింటికీ గొప్ప ప్రతిరూపాలు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా భారత్ చేస్తోన్న ప్రయాణంలో డమ్ డమ్, కోల్‌కతా వంటి నగరాలు కీలక పాత్ర పోషిస్తాయి" అని మోదీ వ్యాఖ్యానించారు. నేటి కార్యక్రమం కేవలం మెట్రో ప్రారంభం, రహదారి శంకుస్థాపనకే పరిమితమైనది కాదని పేర్కొన్న ఆయన.. ఆధునిక భారత్ పట్టణ రూపురేఖలను ఎలా మారుస్తుందో చెప్పేందుకు ఈ కార్యక్రమం ఒక నిదర్శనమని అన్నారు. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్లు, ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచుతూ దేశంలోని నగరాల్లో హరిత రవాణాను ప్రోత్సహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధానంగా చెప్పారు. 'వ్యర్థాల నుంచి సంపద (వేస్ట్ టు వెల్త్)' కార్యక్రమం కింద నగరాలు ఇప్పుడు చెత్త నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయని అన్నారు. మెట్రో సేవలు, మెట్రో నెట్‌వర్క్‌ల విస్తరణ గురించి ప్రధానంగా ప్రస్తావించిన ఆయన.. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌ను కలిగి ఉండటం తనకు గర్వకారణమని తెలిపారు. 2014కి ముందు దేశంలో 250 కిలోమీటర్ల మెట్రో మార్గం మాత్రమే ఉండేదని.. నేడు దేశంలో మెట్రో నెట్‌వర్క్ 1,000 కిలోమీటర్లకు పైకి చేరుకుందని ప్రధానంగా చెప్పారు. కోల్‌కతాలో కూడా మెట్రో విస్తరణ నిరంతరం జరుగుతోందని అన్నారు. కోల్‌కతా మెట్రో రైలు నెట్‌వర్క్‌లో సుమారు 14 కిలోమీటర్ల కొత్త మార్గం, ఏడు నూతన స్టేషన్లు కొత్తగా వచ్చాయని పేర్కొన్నారు. ఇవన్నీ కోల్‌కతా ప్రజల జీవన, ప్రయాణ సౌలభ్యాన్ని పెంచుతాయని అన్నారు.
"21వ శతాబ్దపు భారత్‌కు 21వ శతాబ్దపు రవాణా వ్యవస్థ అవసరం. అందుకే నేడు దేశవ్యాప్తంగా రైల్వేల నుంచి రోడ్ల వరకు, మెట్రోల నుంచి విమానాశ్రయాల వరకు ఆధునిక రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేస్తూ పరస్పరం అనుసంధానిస్తున్నాం" అని ప్రధానంగా పేర్కొన్నారు. ఒక నగరాన్ని మరొక నగరానికి అనుసంధానించడం మాత్రమే కాకుండా.. ప్రజలకు అందుబాటులో సరైన రవాణా సదుపాయాలు ఉండేలా చూసేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. కోల్‌కతా బహుళ నమూనా అనుసంధానతలో ఈ దార్శనికతను చూడొచ్చని అన్నారు. దేశంలోని అత్యంత రద్దీగా హౌరా, సీల్దా అనే రెండు రైల్వే స్టేషన్లు ఇప్పుడు మెట్రోతో అనుసంధానమయ్యాయని చెప్పారు. గతంలో ఈ స్టేషన్ల మధ్య ప్రయాణించేందుకు దాదాపు ఒకటిన్నర గంటలు పట్టేదని, మెట్రో వల్ల అది కొన్ని నిమిషాలకు తగ్గిపోయిందన్నారు. హౌరా స్టేషన్ సబ్‌వే బహుళ నమూనా అనుసంధానతను నిర్ధారిస్తోందని పేర్కొన్నారు. గతంలో తూర్పు రైల్వే, ఆగ్నేయ రైల్వే ప్రధాన స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించేందుకు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వచ్చేదని, ఈ సబ్‌వే నిర్మాణంతో పరస్పర మార్పిడి సమయం గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. కోల్‌కతా విమానాశ్రయం ఇప్పుడు మెట్రో నెట్‌వర్క్‌తో అనుసంధానమైందని.. ఇది నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు విమానాశ్రయానికి చేరుకోవటాన్ని సులభతరం చేస్తుందని ప్రధాని అన్నారు.
పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని పునరుద్ఘాటించారు. రైల్వే విద్యుదీకరణను 100 శాతం పూర్తి చేసిన రాష్ట్రాలలో పశ్చిమ బెంగాల్ ఒకటని ప్రధానంగా పేర్కొన్నారు. పురులియా, హౌరా మధ్య మెమూ రైలు నడపాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉందనీ, కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్‌ను నెరవేర్చిందని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని వివిధ మార్గాల్లో ప్రస్తుతం తొమ్మిది వందే భారత్ రైళ్లు, రెండు అమృత్ భారత్ రైళ్లు నడుస్తున్నాయని ప్రధాని తెలియజేశారు.
గత 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో అనేక ప్రధాన రహదారి ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు ప్రధాని తెలిపారు. అనేక ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆరు వరుసల కోన ఎక్స్‌ప్రెస్‌వే పూర్తయిన తర్వాత నౌకాశ్రయాల మధ్య అనుసంధానత గణనీయంగా పెరుగుతుందని ప్రధానంగా పేర్కొన్నారు. ఈ మెరుగైన అనుసంధానత కోల్‌కతా, పశ్చిమ బెంగాల్‌ల భవిష్యత్తుకు కావాల్సిన పునాదిని బలపరుస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సీ.వీ. ఆనంద బోస్.. కేంద్ర మంత్రులు శ్రీ శాంతను ఠాకూర్, శ్రీ రవ్నీత్ సింగ్ బిట్టు, డాక్టర్ సుకాంత మజుందార్ తదితరులు పాల్గొన్నారు.
నేపథ్యం:
ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అధునాతన పట్టణ అనుసంధానత విషయంలో తమ నిబద్ధతకు అనుగుణంగా ప్రధానమంత్రి కోల్‌కతాలో పలు మెట్రో రైల్వే ప్రాజెక్టులను ఆవిష్కరించారు. కొత్తగా నిర్మించిన 13.61 కి.మీ.ల మెట్రో మార్గాన్ని, ఆయా మార్గాల్లోని మెట్రో సేవలను ప్రారంభించారు. ఆయన జెస్సోర్ రోడ్ మెట్రో స్టేషన్‌ను సందర్శించారు. అక్కడ నుంచి నోపారా-జై హింద్ బిమన్‌బందర్ మెట్రో రైలును ప్రారంభించారు. వీటితో పాటు వర్చువల్ విధానంలో సీల్దా-ఎస్‌ప్లానేడ్ మెట్రో రైలు, బెలెఘాటా-హేమంత ముఖోపాధ్యాయ మెట్రో రైలును ప్రారంభించారు. జెస్సోర్ రోడ్ మెట్రో స్టేషన్ నుంచి జై హింద్ బిమన్‌బందర్ వరకు మెట్రో ప్రయాణించిన ఆయన… తిరిగి మెట్రో రైలులోనే జై హింద్ బిమన్‌బందర్‌కు వచ్చారు.
కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ఈ మెట్రో విభాగాలను, హౌరా మెట్రో స్టేషన్‌లో కొత్తగా నిర్మించిన సబ్‌వేను ప్రారంభించారు. నోపారా-జై హింద్ బిమన్‌బందర్ మెట్రో మార్గం విమానాశ్రయానికి వెళ్లటాన్ని సులభతరం చేస్తుంది. సీల్దా-ఎస్‌ప్లానేడ్ మెట్రో రెండింటి మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు 40 నిమిషాల నుంచి కేవలం 11 నిమిషాలకు తగ్గిస్తుంది. బెలెఘాటా-హేమంత ముఖోపాధ్యాయ మెట్రో మార్గం ఐటీ హబ్‌కు అనుసంధానతరను పెంచటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మెట్రో మార్గాలు కోల్‌కతాలో అత్యంత రద్దీగా ఉండే కొన్ని ప్రాంతాలను కలుపుతాయి. ఇవి ప్రయామ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. బహుళ నమూనా అనుసంధానతను బలోపేతం చేస్తాయి. లక్షలాది మంది రోజువారీ ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తాయి.
ఇక్కడ రోడ్డు రవాణా మౌలిక సదుపాయాలకు పెద్ద ఊతం ఇస్తూ.. రూ. 1,200 కోట్లతో చేపట్టనున్న 7.2 కి.మీ.ల ఆరు వరుసల ఎలివేటెడ్ కోన ఎక్స్‌ప్రెస్‌వేకు శంకుస్థాపన చేశారు. ఇది హౌరా, చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాలు.. కోల్‌కతా మధ్య అనుసంధానతను పెంచటమే కాకుండా ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో వాణిజ్యం, పర్యాటక రంగానికి గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది.
***
(Release ID: 2160048)
Visitor Counter : 4
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada