ప్రధాన మంత్రి కార్యాలయం
బిహార్లోని గయలో రూ. 12, 000 కోట్ల విలువైన వివిధ బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
గయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వం ఎంతో ప్రాచీనమైనది, అత్యంత గొప్పది: ప్రధానమంత్రి
దేశ రక్షణ వ్యూహంలో ’ఆపరేషన్ సిందూర్’ కొత్త అధ్యాయాన్ని లిఖించింది: ప్రధానమంత్రి
బిహార్ వేగవంతమైన అభివృద్దే.. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ప్రధాన ప్రాధాన్యత: ప్రధానమంత్రి
ఏమాత్రం ఉపేక్షించకుండా ప్రతి చొరబాటుదారుని దేశం నుంచి గెంటేస్తాం: ప్రధానమంత్రి
Posted On:
22 AUG 2025 1:52PM by PIB Hyderabad
బిహార్‌లోని గయలో రూ.12,000 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. జ్ఞానం, విముక్తికి పవిత్ర నగరమైన గయకు ప్రధానమంత్రి వందనాలు అర్పించారు. విశిష్టమైన విష్ణుపాద ఆలయం ఉన్న ఈ పుణ్యభూమి నుంచి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గయ ప్రాంతం ఆధ్యాత్మికత, శాంతికి నిలయం అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ పవిత్ర నేలలోనే గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందారని గుర్తుచేశారు.. ‘గయా జీ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వం ప్రాచీనమైనది మాత్రమే కాక అత్యంత గొప్పది’ అని మోదీ పేర్కొన్నారు. ఈ నగరాన్ని కేవలం ’గయ‘ అని కాకుండా గౌరవంగా ‘గయా జీ’ అని పిలవాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజల భావనను గౌరవించినందుకు బిహార్ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి అభినందించారు. గయా జీ వేగవంతమైన అభివృద్ధి కోసం కేంద్రం, బిహార్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.
పవిత్రమైన గయా జీ ప్రాంతం నుంచి ఒక్క రోజులోనే రూ. 12,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభమై, శంకుస్థాపనలు జరిగాయని ప్రధానమంత్రి తెలిపారు. ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, పట్టణాభివృద్ధి వంటి కీలక రంగాలకు చెందిన ఈ ప్రాజెక్టులు బిహార్ పారిశ్రామిక సామర్థ్యాన్ని బలోపేతం చేయడంతోపాటు యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని వ్యాఖ్యానించారు. ఇలాంటి గొప్ప ప్రాజెక్టులను అందుకుంటున్నందుకు బిహార్ ప్రజలను అభినందించారు. రాష్ట్రంలో ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఓ ఆసుపత్రి, పరిశోధనా కేంద్రాన్ని కూడా నేడు ప్రారంభించినట్లు తెలిపారు. దీని ద్వారా ఇకపై బిహార్ ప్రజలకు క్యాన్సర్ చికిత్స కోసం అదనపు సౌకర్యం లభించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
పేదల జీవితాల నుంచి కష్టాలను తొలగించడం, మహిళల జీవితాలను సులభతరం చేయడం ప్రజా సేవకుడిగా తనకు అత్యంత సంతృప్తినిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.పేదలకు పక్కా ఇళ్ళు అందించడం తన ప్రధాన లక్ష్యాలలో ఒకటని పునరుద్ఘాటించారు. అవసరమైన ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు లభించే వరకు తాను విశ్రాంతి తీసుకోనని తెలిపారు. ఈ సంకల్పంతోనే గత 11 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా పేదల కోసం 4 కోట్ల పక్కా ఇళ్ళు నిర్మించామని తెలిపారు. కేవలం బిహార్ లోనే 38 లక్షలకు పైగా ఇళ్ళ నిర్మాణం జరిగిందని, గయ జిల్లాలో 2 లక్షలకు పైగా కుటుంబాలు తమ సొంత పక్కా ఇళ్ళు పొందాయని మోదీ ప్రస్తావించారు. ఇవి కేవలం ఇళ్ళు మాత్రమే కాదని, పేదల గౌరవానికి చిహ్నాలని ప్రధాని అన్నారు. విద్యుత్, నీరు, మరుగుదొడ్లు. గ్యాస్ కనెక్షన్లతో ఈ ఇళ్లు నిర్మించినట్లు తెలిపారు. వీటితో పేద కుటుంబాలు కూడా సౌలభ్యం, భద్రత, గౌరవంతో జీవించేందుకు ఉపయోగపడతాయని తెలిపారు.
బిహార్‌లోని మగధ్ ప్రాంతంలో 16,000కు పైగా కుటుంబాలు నేడు పక్కా ఇళ్ళు పొందాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది దీపావళి, ఛఠ్ పూజ వేడుకలు ఈ ఇళ్లలో మరింత ఉత్సాహంగా జరుగుతాయని తెలిపారు. ఇళ్లు పొందిన ప్రతి లబ్ధిదారుల కుటుంబాలకు అభినందనలు తెలియజేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇంకా లబ్ది పొందేందుకు ఎదురుచూస్తున్న వారికి కూడా త్వరలో ఈ ప్రయోజనం చేరుతుందని, ప్రతి పేద వాడికి పక్కా ఇల్లు లభించే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని మోదీ హామీ ఇచ్చారు.
‘చంద్రగుప్త మౌర్యుడు, చాణక్యుల ప్రాంతం బిహార్. శత్రువుల నుంచి భారత్ కు సవాళ్లు ఎదురైనప్పుడల్లా దేశానికి బిహార్ కవచంగా నిలిచింది’ అని మోదీ పేర్కొన్నారు. బిహార్ నేలపై చేసిన ఏ ప్రతిజ్ఞ కూడా నెరవేరకుండా పోలేదని అన్నారు. కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ప్రస్తావిస్తూ.. తమ మతాన్ని అడిగీ మరి అమాయక పౌరులను ఉగ్రవాదులు హతమార్చారని తెలిపారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి తాను బిహార్ నుంచే ప్రతిజ్ఞ చేశానని గుర్తు చేశారు. బిహార్ గడ్డపై చేసిన ఆ సంకల్పం నెరవేరడాన్ని నేడు ప్రపంచం కళ్లజూస్తోందని ఆయన చెప్పారు. పాకిస్థాన్ ప్రయోగిస్తున్న డ్రోన్, క్షిపణి దాడులను భారత్ గాల్లోనే అడ్డగించి నిర్వీర్యం చేసిందని మోదీ ప్రస్తావించారు. పాకిస్థాన్ నుంచి వచ్చిన ఒక్క క్షిపణి కూడా భారత్ కు హాని కలిగించలేదని మోదీ స్పష్టం చేశారు.
‘ఆపరేషన్ సిందూర్ దేశ రక్షణ వ్యూహంలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది‘ అని మోదీ పేర్కొన్నారు. భారత్ లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు, దాడులు చేసిన ముష్కరులెవరూ తప్పించుకోలేరని అన్నారు.. ఉగ్రవాదులు పాతాళంలో దాక్కున్నప్పటికీ, దేశ క్షిపణులు వారిని అక్కడే సమాధి చేస్తాయని వ్యాఖ్యానించారు.
’బిహార్ ను వేగవంతంగా అభివృద్ధి చేయడం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత‘ అని పేర్కొన్నారు. బిహార్ నేడు సమగ్ర అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతోందని అన్నారు. బిహార్ లో దీర్ఘకాలంగా కొనసాగుతున్న సమస్యలకు ఇటీవలి కాలంలో పరిష్కారాలు లభించాయని, ఇవి రాష్ట్ర అభివృద్దికి కొత్త మార్గాలను సృష్టించాయని తెలిపారు. ‘లాంతరు పాలన’ సమయంలోని దారుణమైన పరిస్థితులను గుర్తుచేసుకుంటూ.. ఆ కాలంలో ఈ ప్రాంతం మావోయిస్టు స్థావరంగా మారిపోయిందని గుర్తుచేశారు. నక్సలైట్ల కార్యలపాలు అధికంగా ఉండేవని, సూర్యాస్తమయం తర్వాత ప్రజలు బయట తిరగాలంటే భయపడేవారని అన్నారు. గయాజీ వంటి నగరాలు లాంతరు పాలనలో చీకటిలో మునిగిపోయాయని పేర్కొన్నారు. వేలాది గ్రామాలకు విద్యుత్ స్తంభాల వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలు కూడా లేకుండా పోయాయని ప్రధాన మంత్రి విమర్శలు గుప్పించారు. లాంతరు యుగ పాలకులు బిహార్ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని పేర్కొన్నారు. విద్య, ఉపాధి లేని కారణంగా బిహారీలు తరతరాలుగా వలస వెళ్లాల్సి వచ్చిందని అన్నారు.
ప్రతిపక్షాలు, దాని మిత్రదేశాలు బిహార్ ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తాయని మోదీ పేర్కొన్నారు. పేదల సుఖ, దుఃఖాలపై.. గౌరవ మర్యాదలపై వారికి ఎలాంటి ఆందోళన లేదని తెలిపారు. బిహార్ ప్రజలను తమ రాష్ట్రంలోకి అనుమతించబోమని ఒక పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి ఒకసారి వేదికపై నుంచి బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. అలాంటి నాయకుల ద్వేషం, ధిక్కారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఆ అవమానాన్ని ప్రత్యక్షంగా చూసినప్పటికీ ప్రతిపక్ష పార్టీల నాయకత్వం గాఢ నిద్రలోనే మగ్గిపోయిందని మోదీ పేర్కొన్నారు.
ప్రస్తుత బీహార్ ప్రభుత్వం ప్రతిపక్ష కూటముల విభజన ప్రచారాన్ని తిప్పికొడుతోందని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బిహార్ అమ్మాయిలు, అబ్బాయిలు రాష్ట్రంలోనే ఉపాధి పొందేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. బిహార్ అంతటా ప్రధాన ప్రాజెక్టులు ప్రస్తుతం అభివృద్ధి జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతంగా గయా జీ జిల్లాలోని దోభీ మారబోతుందని, గయా జీలో ఒక సాంకేతిక కేంద్రం కూడా ఏర్పాటు కాబోతుందని మోదీ తెలిపారు. నేడు బక్సర్ థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం జరిగినట్లు ప్రస్తావించారు. కొన్ని నెలల క్రితం ఔరంగాబాద్‌లోని నబీనగర్ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌కు తాను శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తుచేశారు. భాగల్పూర్‌లోని పిర్పైంటిలో కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మిస్తామని తెలిపారు. ఈ విద్యుత్ ప్రాజెక్టులు బిహార్‌లో విద్యుత్ సరఫరాను గణనీయంగా పెంచేందుకు దోహదపడుతాయని తెలిపారు. విద్యుదుత్పత్తి పెరిగితే గృహాలకు, పరిశ్రమలకు విద్యుత్ సరఫరా మెరుగుపడుతుందని, ఫలితంగా ఇంధన మౌలిక సదుపాయాల విస్తరణ జరిగి కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పతాయని మోదీ పేర్కొన్నారు.
బిహార్ యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్ భారీ ప్రచారాన్ని ప్రారంభించారని ప్రధానమంత్రి చెప్పారు. నితీష్ నాయకత్వం కారణంగా రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలు పూర్తి పారదర్శకంగా జరిగాయని ఆయన వ్యాఖ్యానించారు. బిహార్ లోని యువత రాష్ట్రంలోనే ఉపాధి పొందేలా కృషి జరుగుతోందని, ఉద్యోగాల కోసం వలస వెళ్ళాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు సహయం చేస్తుందని తెలిపారు. తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ‘ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన‘ను ప్రకటించినట్లు మోదీ చెప్పారు. ఈ పథకం కింద యువత ప్రైవేట్ రంగంలో మొదటిసారి ఉద్యోగంలో చేరినప్పుడు. కేంద్ర ప్రభుత్వం వారికి నేరుగా రూ.15,000 అందజేస్తుందని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించే ప్రైవేట్ కంపెనీలు కూడా ఆర్థిక సహాయం పొందుతాయని ఆయన అన్నారు. అదేవిధంగా, యువతకు ఉపాధి కల్పించే ప్రైవేట్ కంపెనీలకు కూడా ఆర్థిక సహాయం అందిస్తుందని అన్నారు.. ఈ పథకం బిహార్ యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
ప్రజాధనానికి ఎన్నడూ విలువనివ్వని ప్రతిపక్షాలను, వాటి ప్రభుత్వాలను శ్రీ మోదీ విమర్శిస్తూ, వారి దృష్టిలో ప్రజా నిధులంటే తమ సొంత ఖజానాను నింపుకొనే సాధనం అని విమర్శించారు. ప్రతిపక్ష పాలనలో, ప్రాజెక్టులు ఏళ్ల తరబడి పూర్తి కాకుండా నిలిచిపోయాయని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఒక పథకం అమల్లో ఎంత జాప్యం జరిగితే, దాని నుంచి వారు అంత ఎక్కువగా సొమ్ము చేసుకున్నారన్నమాటేనన్నారు. ఈ తప్పుడు మనస్తత్వాన్ని తమ ప్రభుత్వం ఇప్పుడు మార్చివేసిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఒక పునాదిరాయిని వేస్తే, ఆ పనిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఉద్ఘాటించారు. ఈ విధానానికి ఈ రోజు చేపట్టిన కార్యక్రమమే ఒక ఉదాహరణ అని శ్రీ మోదీ అంటూ, ఆంటా-సిమరియా సెక్షనుకు తానే శంకుస్థాపన చేసి, ఇప్పుడు దీనిని ప్రారంభిస్తున్నట్లు గుర్తుచేశారు. ఈ వంతెన రహదారులను కలపడం మాత్రమే కాదు.. ఉత్తర, దక్షిణ బిహార్‌లను కూడా జోడిస్తుందన్నారు. ఇంతకు ముందు గాంధీ సేతు మీదుగా 150 కి.మీ. చుట్టుదారిన ప్రయాణించక తప్పని భారీ వాహనాలకు ఇప్పుడు నేరు దోవ అందుబాటులోకి వచ్చిందని ఆయన వివరించారు. ఇది వాణిజ్యాన్ని పెంపొందించి, పరిశ్రమలను బలోపేతం చేసి, తీర్థయాత్రికులకు ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని ప్రధాని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన అభివృద్ధి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, ఇది తప్పక జరిగి తీరుతుందని ఆయన ఉద్ఘాటించారు.
బిహార్‌లో రైల్వేలను వేగంగా అభివృద్ధిచేయాలని కేంద్ర, రాష్ట్రాల్లోని తమ ప్రభుత్వాలు అదే పనిగా పెట్టుకున్నాయని ప్రధానమంత్రి తెలిపారు. గయా జీ రైల్వే స్టేషన్ ప్రయాణికులకు తాము విమానాశ్రయంలో ఉన్నామా! అనే అనుభూతిని కలగజేసేంతగా స్టేషన్‌ను ‘అమృత్ భారత్ స్టేషన్ పథకం’లో భాగంగా ఆధునికీకరిస్తున్నామన్నారు. గయా నగరంలో ఇప్పుడు రాజధాని, జన్ శతాబ్ది రైళ్లతో పాటు భారత్‌లో తయారు చేసిన వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయని శ్రీ మోదీ వెల్లడించారు. గయా జీ నుంచి సాసారామ్, ప్రయోగ్‌రాజ్, కాన్పూర్ మీదుగా ఢిల్లీకి నేరు రైలు సంధాన సదుపాయం ఏర్పాటు బిహార్ యువతకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కొత్త కొత్త అవకాశాల్ని కల్పిస్తోందని ఆయన ఉద్ఘాటించారు.
దేశ ప్రజల ఆశీస్సులు, అచంచల విశ్వాసాలు 2014లో ప్రధాని పదవిబాధ్యతలను తాను చేపట్టేటట్లు చేశాయని శ్రీ మోదీ చెబుతూ, అందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆనాడు మొదలైన తన పదవీకాలం అంతరాయం లేకుండా సాగుతోందని, ఇన్నేళ్లలో తన ప్రభుత్వంపై ఒక్క అవినీతి మరకైనా పడలేదని ఆయన స్పష్టం చేశారు. దీనికి భిన్నంగా, స్వాతంత్య్రం సంపాదించుకున్న తరువాత ఆరు, ఆరున్నర దశాబ్దాలు పాలించిన విపక్ష ప్రభుత్వాలకు అవినీతి కేసుల చిట్టా చేంతాడంత ఉందని, విపక్షాల అవినీతి సంగతి బిహార్‌లో ప్రతి చిన్నారికి కూడా తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతిపై పోరాటాన్ని దాని తర్కబద్ధ ముగింపునకు తీసుకుపోవాలంటే, ఏ ఒక్కరూ చర్యల పరిధికి వెలుపల ఉండకూడదని ప్రధానమంత్రి సూటిగా చెప్పారు. ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం ప్రకారం, చివరికి ఒక జూనియర్ ప్రభుత్వ ఉద్యోగి అయినా కస్టడీలో 48 గంటల పాటు ఉంటే సస్పెన్షన్ దానంతట అదే వర్తిస్తుంది అని ప్రధాని గుర్తుచేశారు. ఒక ముఖ్యమంత్రి జైలులో ఉంటూ అధికార ప్రయోజనాల్ని పొందడం ఎలా సాధ్యం?! అని ఆయన ప్రశ్నించారు. జైలులో ఉండి ఫైళ్లపై సంతకాలు పెట్టడం, అధికారిక ఉత్తర్వులు అక్కడి నుంచే నేరుగా జారీ చేసిన ఇటీవలి సంఘటనల్ని ప్రధాని ఉదహరించారు. రాజకీయ నేతల ధోరణి ఇలా ఉంటే, అప్పుడిక అవినీతికి వ్యతిరేకంగా పోరాటాన్ని సమర్థంగా ఎలా కొనసాగించగలం? అని శ్రీ మోదీ అన్నారు.
ప్రతి ప్రజాప్రతినిధి నిజాయతీగా ఉంటూ, పారదర్శకంగా నడుచుకోవాలని భారత రాజ్యంగం ఆశిస్తోందని ప్రధానమంత్రి ప్రధానంగా చెప్పారు. రాజ్యాంగ గౌరవానికి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం రానీయనేకూడదు అని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం కచ్చితమైన అవినీతి నిరోధక చట్టాన్ని తీసుకువస్తోందని, ఈ చట్టం దేశ ప్రధానికైనా సరే వర్తిస్తుందని ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రులను, మంత్రులను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకువస్తారని ఆయన అన్నారు. దీనిని గురించి శ్రీ మోదీ మరింతగా వివరిస్తూ, ఈ చట్టం ఆచరణలోకి వస్తే, అరెస్టయిన ఏ ప్రధాని, ముఖ్యమంత్రి లేదా మంత్రి 30 రోజుల లోపల జామీను పొందాల్సిన అవసరం ఉంటుందన్నారు. బెయిలు మంజూరు కాకపోతే, వారు 31వ రోజున తమ పదవిని విడిచిపెట్టాల్సి ఉంటుందన్నారు. ఇలాంటి తీవ్ర చట్టాన్ని తెచ్చే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఆయన స్పష్టం చేశారు.
ఈ బిల్లును వ్యతిరేకించినందుకు ప్రతిపక్షాలను శ్రీ మోదీ విమర్శిస్తూ, వారి కోపం భయం నుంచి పుట్టింది అని వ్యాఖ్యానించారు. తప్పు చేసిన వారు ఇతరుల నుంచి దాక్కోవచ్చు, కానీ తాము చేసిన పనులు ఏమిటన్నది వారికి తెలుసు అని ఆయన అన్నారు. ప్రతిపక్షాల్లోని కొందరు నేతలు జామీను మీద బయటకు వచ్చారు, ఇతరులు కుంభకోణాలకు సంబంధించిన న్యాయ విచారణల్లో చిక్కుకుపోయారు, మరి ఈ వ్యక్తుల భయమల్లా వారు గనక జైలుకు వెళ్తే, వారి రాజకీయ కలలు చెదిరిపోతాయనేదేనని ఆయన తెలిపారు. ఈ కారణంగానే వారు ప్రతిపాదిత చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆయన చెప్పారు. అధికారం కోసం తపించే మనుషులు అవినీతికి పాల్పడి, జైలులో ఉన్న కాలంలోనూ పదవిని పట్టుకు వేళ్లాడుతారని రాజేంద్ర బాబు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి నేతలు ఎన్నడూ ఊహించి ఉండరని ప్రధాని అన్నారు. కొత్త చట్టం ప్రకారం, అవినీతిపరులు కటకటాల వెనక్కి వెళ్లడం ఒక్కటే కాకుండా తమ అధికార పదవులను కూడా కోల్పోతారని ఆయన స్పష్టం చేశారు. ‘‘అవినీతి నుంచి భారతదేశానికి విముక్తినివ్వాలనేది కోట్లాది పౌరుల ఉమ్మడి నిబద్ధత.. ఈ సంకల్పాన్ని నెరవేరుస్తాం’’ అని శ్రీ మోదీ తెలిపారు.
ఎర్ర కోట మీది నుంచి తాను ఒక గంభీర అంశాన్ని ప్రస్తావించిన సంగతిని శ్రీ మోదీ గుర్తు చేశారు. ఈ అంశం బిహార్‌పైన కూడా ప్రభావాన్ని ప్రసరిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో చొరబాటుదారుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతూ ఉండడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ఆయన అన్నారు. బిహార్ సరిహద్దు జిల్లాల జనసంఖ్య సంబంధిత ముఖ చిత్రం వేగంగా మారిపోతోందని చెప్తూ, దేశ భవితను చొరబాటుదారులు నిర్ణయించేటట్లు చేయకూడదని తమ ప్రభుత్వం సంకల్పం చెప్పుకొందన్నారు. బిహార్ యువతకు దక్కాల్సిన ఉద్యోగావకాశాలను చొరబాటుదారులు లాగేసుకొనేందుకు అనుమతించబోమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భారతీయ పౌరులకు ఉద్దేశించిన సదుపాయాలను చొరబాటుదారుల పాలు కాకుండా చూస్తామని ఆయన పునరుద్ఘాటించారు. ఈ ముప్పును పరిష్కరించడానికి, ‘డెమోగ్రఫీ మిషన్’ను తీసుకువస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ మిషన్ కార్యకలాపాలు త్వరలోనే మొదలవుతాయన్నారు. ప్రతి చొరబాటుదారును దేశం నుంచి బహిష్కరించి తీరుతామని ఆయన అన్నారు. చొరబాటుదారులకు దేశం లోపల మద్దతిస్తున్న వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని బిహార్ ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. బిహారీలను వారి హక్కులకు దూరం చేయాలని, ఆ హక్కులను చొరబాటుదారుల పరం చేయాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని శ్రీ మోదీ తీవ్రంగా విమర్శించారు. బుజ్జగింపు రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలపై దృష్టి పెట్టి, ఆ పార్టీలు ఎంత వరకైనా వెళ్లడానికి సిద్ధమయ్యాయని ఆయన అన్నారు. బిహార్ ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
ప్రతిపక్షాల నష్టదాయక ఉద్దేశాల బారి నుంచి బిహార్‌ను రక్షించి తీరుతామని శ్రీ మోదీ ప్రధానంగా ప్రస్తావిస్తూ, ఇది బిహార్‌కు చాలా కీలక తరుణమని స్పష్టం చేశారు. రాష్ట్ర యువత కలలను నెరవేర్చుతామన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు కొత్త రెక్కలు తొడగాలి అని కూడా ఆయన అన్నారు. ఈ ఉద్దేశంతోనే శ్రీ నితీశ్ కుమార్‌తో కేంద్ర ప్రభుత్వం భుజం భుజం కలిపి పనిచేస్తోందని ప్రధాని ప్రధానంగా చెప్పారు. బిహార్‌లో అభివృద్ధి వేగాన్ని కొనసాగించడానికి కేంద్రంలోను, రాష్ట్రంలోను తమ ప్రభుత్వాలు నిరంతరం కష్టపడి పనిచేస్తున్నాయని, ఈనాడు చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులతో ఈ దిశలో ఒక ముఖ్యమైన ముందడుగును వేసినట్లు అయిందని చెప్తూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో బిహార్ గవర్నరు శ్రీ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, బిహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీశ్ కుమార్, కేంద్ర మంత్రులు శ్రీ రాజీవ్ రంజన్ సింగ్, శ్రీ జీతన్ రామ్ మాంఝీ, శ్రీ గిరిరాజ్ సింగ్, శ్రీ చిరాగ్ పాస్‌వాన్, శ్రీ నిత్యానంద్ రాయ్, శ్రీ రామ్ నాథ్ ఠాకూర్, డాక్టర్ రాజ్ భూషణ్ చౌదరి, శ్రీ సతీశ్ చంద్ర దుబే తో పాటు ఇతర ప్రముఖులు ఉన్నారు.
నేపథ్యం
ప్రాంతాల మధ్య అనుసంధానం పెంచాలనే సంకల్పానికి అనుగుణంగా ప్రధాన మంత్రి, జాతీయ రహదారి-31పై 8.15కి.మీ. అంటా-సిమారియా వంతెనను ప్రారంభించారు. ఇందులో గంగా నదిపై 6 లైన్లతో కూడిన 1.86కి.మీ వంతెన కూడా ఉంది. ఈ ప్రాజెక్టును రూ.1,870 కోట్లకు పైగా వ్యయంతో చేపడుతున్నారు. ఇది పాట్నాలోని మోకమా, బెగుసరైని నేరుగా కలపనుంది.
ఈ వంతెనను పాత 2 లైన్ల రైలు-రోడ్డు వంతెన 'రాజేంద్ర సేతు'కు సమాంతరంగా నిర్మించారు. అది శిథిలావస్థకు చేరుకోవటంతో భారీ వాహనాలను దారి మళ్లించాల్సి వస్తుంది. ఈ కొత్త వంతెన ద్వారా ఉత్తర బిహార్(బెగుసరై, సుపాల్, మధుబని, పూర్ణియా, అరరియా మొదలైనవి) నుంచి దక్షిణ బీహార్ ప్రాంతాల(షేక్ పురా, నవదా, లక్ష్మిసరై)కు ప్రయాణించే భారీ వాహనాలకు 100కి.మీ పైగా అదనపు ప్రయాణ దూరం తగ్గుతుంది. వాహనాలు దారి మళ్లించుకోవాల్సి వచ్చినప్పుడు ఏర్పడే ట్రాఫిక్ జామ్ సమస్యను తగ్గించేందుకు ఈ వంతెన ఉపయోగపడుతుంది.
ఇది సమీప ప్రాంతాల ఆర్థిక వృద్ధికి సహకరిస్తుంది. ముఖ్యంగా ఉత్తర బిహార్‌కు ఉపయోగకరం. అవసరమైన ముడి సరుకు కోసం దక్షిణ బిహార్, జార్ఖండ్‌పై ఆధారపడే ఈ ప్రాంతాలకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఇది ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిమరియా ధామ్‌కు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది ప్రఖ్యాత దివంగత కవి శ్రీ రామ్‌ధరి సింగ్ దిన్‌కర్ జన్మస్థలం కూడా.
ఎన్‌హెచ్-31లోని భక్తియార్‌పుర్ నుంచి మోకమా మధ్య నాలుగు లైన్ల రహదారి విభాగాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును దాదాపు రూ.1,900 కోట్లతో చేపట్టారు. రద్దీని తగ్గించటం, ప్రయాణ సమయం కుదింపు, ప్రయాణికులు, సరుకు రవాణాను మెరుగుపరచటానికి ఇది సహకరిస్తుంది. బిహార్‌లోని ఎన్‌హెచ్-120లో బిక్రమ్‌గంజ్-దవాత్-నవానగర్-దుమ్రాన్ మార్గంలో రెండు లైన్ల రహదారిని గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపడేలా అభివృద్ధి చేయటం వల్ల స్థానికులకు కొత్త ఆర్థికావకాశాలు లభిస్తాయి.
విద్యుత్ రంగంలో సదుపాయాలను బలోపేతం చేసేందుకు, దాదాపు రూ.6,880 కోట్లతో బక్సర్ థర్మల్ విద్యుత్ ప్లాంట్(660x1 ఎండబ్ల్యూ)ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఇది విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి, ఇంధన భద్రతను మెరుగుపరిచి, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చనుంది.
ఆరోగ్య మౌలిక సదుపాయాలకు పెద్దఎత్తున ప్రోత్సాహం అందించేందుకు, ముజఫర్‌పుర్‌లో హోమి భాభా క్యాన్సర్ ఆస్పత్రి & పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రంలో అధునాతన ఆంకాలజీ ఓపీడీ, ఐపీడీ వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, ఆధునిక ప్రయోగశాల, బ్లడ్ బ్యాంక్, 24 పడకల ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యూనిట్) మరియు హెచ్‌డీయూ (హై డిపెండెన్సీ యూనిట్) ఉన్నాయి. ఇది బీహార్, చుట్టుపక్కల రాష్ట్రాల రోగులకు అత్యాధునిక సదుపాయాలతో తక్కువ ఖర్చుతో క్యాన్సర్ చికిత్సను అందిస్తుంది. దీంతో మెరుగైన చికిత్సకు దూర నగరాలకు వెళ్లటం తగ్గుతుంది.
స్వచ్ఛ భారత్ విజన్‌లో భాగంగా, గంగానది నిరంతరం నిర్మలంగా ప్రవహించేందుకు ముంగేర్‌లో మురుగునీటి శుద్ధి కేంద్రం(ఎస్ టీపీ), మురుగునీటి వ్యవస్థను ప్రధాన మంత్రి ప్రారంభించారు. నమామి గంగా పథకంలో భాగంగా రూ.520 కోట్లకు పైగా వ్యయంతో దీన్ని నిర్మించారు. దీని వల్ల గంగా నదిలో కాలుష్యం తగ్గుతుంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో పారిశుద్ధ్య సౌకర్యాలు మెరుగుపడతాయి.
సుమారు రూ.1,260 కోట్ల విలువైన పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. వీటిలో ఔరంగాబాద్‌లోని దౌద్‌నగర్, జెహానాబాద్‌లలో ఎస్‌టీపీ, మురుగునీటి పారుదల వ్యవస్థలు; లఖిసరైలోని బరహియా, జముయ్‌లో ఎస్‌టీపీ, మురుగునీరు ఆపటం, మళ్లింపు పనులు ఉన్నాయి. అమృత్ 2.Oలో భాగంగా ఔరంగబాద్, బోధ్‌గయా, జెహనాబాద్‌లో నీటి సరఫరా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరు, ఆధునిక మురుగు నీటి వ్యవస్థలు, మెరుగైన పారిశుద్ధాన్ని అందించవచ్చు. తద్వారా ఆ ప్రాంతంలోని ప్రజల ఆరోగ్య, జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి.
ఆ ప్రాంతంలో రైల్వే అభివృద్ధిలో భాగంగా, ప్రధాన మంత్రి జెండా ఊపి రెండు రైళ్లను ప్రారంభించారు. గయా-ఢిల్లీ అమృత్ భారత్ రైలు ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికుల సౌకర్యాన్ని, భద్రతను మెరుగుపరుస్తుంది. వైశాలి-కొడెర్మా మధ్య బుద్దిస్ట్ సర్క్యూట్ రైలు, పర్యాటకం, ఆ ప్రాంతంలోని ముఖ్యమైన బౌద్ధ స్థలాల పర్యటనను ప్రోత్సహిస్తుంది.
పీఎంఏవై-గ్రామీణ్ పథకం కింద 12,000 మంది లబ్ధిదారులు, పీఎంఏవై-అర్బన్ కింద 4,260 మంది పట్టణ లబ్ధిదారుల గృహ ప్రవేశ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కొందరు లబ్ధిదారులకు ఇంటి తాళాలను ప్రధాన మంత్రి అందించారు. దీని ద్వారా వేల కుటుంబాల సొంతింటి కలను సాకారం చేశారు.
(Release ID: 2159996)
Visitor Counter : 11
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam