ప్రధాన మంత్రి కార్యాలయం
అంతరిక్ష యాత్రికుడు శ్రీ శుభాంశు శుక్లాతో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
* స్వయంసమృద్ధి అందించే అండదండలతో అంతరిక్ష లక్ష్యాలను సాధించడంలోనే భారత్ విజయ రహస్యం దాగి ఉంది: ప్రధాని
* భావి సాహసయాత్రలకు సారథ్యం వహించగల 40-50 మంది రోదసీ యాత్రికుల జట్టును భారత్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది: ప్రధాని
* ఇండియా ఎదుట ఇప్పుడు రెండు వ్యూహాత్మక సాహసయాత్రలు ఉన్నాయి.. అవి ఒకటి గగన్‌యాన్, రెండోది అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడం: ప్రధాని
* వ్యోమగామి శ్రీ శుక్లా చేసిన ప్రయాణం మన దేశ అంతరిక్ష ఆకాంక్షల్లో మొదటి మెట్టు మాత్రమే: ప్రధాని
Posted On:
19 AUG 2025 11:32AM by PIB Hyderabad
రోదసీ యాత్రికుడు శ్రీ శుభాంశు శుక్లాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న న్యూ ఢిల్లీలో సమావేశమయ్యారు. అంతరిక్ష యానం అందించిన పరివర్తనాత్మక అనుభవాన్ని గురించి ప్రధాని ఈ సందర్భంగా మాట్లాడుతూ, అలాంటి ముఖ్య ప్రస్థానాన్ని చేపట్టి ముగించిన తరువాత ఎవరైనా మార్పును అనుభూతి చెందితీరుతారన్నారు. ఈ మార్పు తాలూకు అనుభవాన్ని వ్యోమగాములు ఎలా అర్థం చేసుకుంటారో తెలుసుకోవాలని ఉందని శ్రీ మోదీ అన్నారు. శ్రీ శుభాంశు శుక్లా జవాబిస్తూ, రోదసిలో స్థితి అచ్చంగా వేరేగా ఉంటుందని, భూమ్యాకర్షణ శక్తి లోపించడం దీనికి ఒక కీలక కారణమన్నారు.
మీ ప్రయాణంలో కూర్చోవడానికి చేసిన ఏర్పాటు.. యాత్ర కొనసాగినన్నాళ్లు.. ఒకే విధంగా ఉంటుందా? అని ప్రధాని అడిగారు. ‘‘అవును సర్, అది యాత్ర పొడవునా ఒకే విధంగా ఉంటుంది’’ అని శ్రీ శుక్లా అన్నారు. ఒకే చోటులో అంతరిక్ష యాత్రికులు 23-24 గంటలు గడపాల్సి వస్తుందన్న మాట అని కూడా శ్రీ మోదీ అన్నారు. అవునండీ అని శుక్లా చెబుతూ, ఒకసారి రోదసిలోకి వెళ్లడమంటూ జరిగాక, రోదసీ యాత్రికులు తమ సీటు బెల్టులు ఊడదీసుకొని, క్యాప్సుల్‌లో స్వేచ్ఛగా కలియదిరగవచ్చన్నారు.
శుభాంభు శుక్లాతో ప్రధాని తన మాటామంతీని కొనసాగిస్తూ, అంతరిక్ష యానంలో ఎదురయ్యే భౌతిక, మానసిక ప్రభావాలను ప్రస్తావించారు. క్యాప్సుల్‌లో తగినంత చోటు ఉందా? అని శ్రీ మోదీ వాకబు చేశారు. విశాలంగా లేకపోయినా, కొంత జాగా అయితే ఉందని శుక్లా బదులిచ్చారు. ఒక ఫైటర్ జెట్ లోని కాక్‌పిట్ కంటే క్యాప్సుల్ మరింత సౌకర్యవంతంగా ఉండి ఉంటుందనుకుంటా! అని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘‘అది అంతకన్నా బాగుంది, సర్’’ అంటూ శుక్లా నిజం చెప్పారు.
రోదసిలోకి చేరుకోగానే శారీరకంగా కలిగే మార్పులను ప్రధానికి శుక్లా వివరించారు. గుండె కొట్టుకునే తీరు చెప్పుకోదగ్గ స్థాయికి నెమ్మదిస్తుందని, శరీరంలో అనేక సర్దుబాట్లు చోటుచేసుకుంటాయన్నారు. ఏమైనా, నాలుగైదు రోజుల లోపల, మనిషి దేహం ఆ స్థితులకు అలవాటు పడిపోతుందన్నారు. భూమి మీదకు తిరిగివచ్చాక, మానవ దేహం మళ్లీ ఒకే విధమైన మార్పులకు లోనవుతుందని శుక్లా చెప్పారు. ఒక వ్యక్తి శరీర పటుత్వం స్థాయి ఎలా ఉన్నప్పటికీ కూడా నడవాలంటే మొదట్లో కష్టంగా ఉంటుందన్నారు. తన స్వీయ అనుభవాన్నే వెల్లడిస్తూ, తనకు ఒంట్లో బాగానే ఉన్నట్లు అనిపించినా, మొదట నడిచేటప్పుడు మాత్రం తడబాటుకు గురయ్యానని, ఇతరులు తనకు చేదోడుగా నిలవాల్సివచ్చిందన్నారు. నడక ఎవరూ నేర్పించనక్కరలేనిదే అయినప్పటికీ, జరిగిందేమిటో మెదడు తిరిగి అర్థం చేసుకుని కొత్త వాతావరణాన్ని ఇముడ్చుకోవడానికి కొంత సమయం పడుతుందన్నారు. అంతరిక్షంలోకి ప్రయాణించడమంటే దానికి ఒక్క శారీరక శిక్షణే కాకుండా మానసికంగా కూడా సర్దుబాటు చేసుకోవలసి వస్తుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ మాటలతో శుక్లా అంగీకరించారు. శరీరానికి, కండరాలకు బలం ఉన్నా, మెదడు కొత్త పరిసరాలను గ్రహించుకొని ముందుకు నడవడానికి, ఇతరత్రా పనులను సాధారణ పద్ధతిలో పూర్తి చేయడానికి కొంత పుంజుకోవాల్సి వస్తుందని శుక్లా అన్నారు.
స్పేస్ మిషన్ల (అంతరిక్ష సాహసయాత్రల) కాలపరిమితి అంశాన్ని శ్రీ మోదీ చర్చిస్తూ, అంతరిక్ష యాత్రికులు దీర్ఘకాలం పాటు రోదసిలో ఎంత కాలం ఉన్నారో చెప్పండని అడిగారు. దీనికి శ్రీ శుక్లా.. ప్రస్తుతం, మనుషులు ఒక పర్యాయంలో ఎనిమిది నెలల వరకు రోదసిలో గడుపుతున్నారని, ఈ కీలక చరిత్రాత్మక ఘట్టానికి ఇప్పటి మిషన్‌లోనే నాందీప్రస్తావన జరిగిందన్నారు. శుక్లా తన మిషన్‌లో కలుసుకున్న ఇతర వ్యోమగాముల సంగతులను ప్రధాని తెలుసుకోదల్చారు. వారిలో కొందరు డిసెంబరులో తిరిగి రానున్నారని శుక్లా తెలిపారు.
అంతరిక్ష కేంద్రంలో పెసలు, మెంతులు పండించడానికి శుభాంశు శుక్లా చేసిన ప్రయోగాలకున్న ప్రాముఖ్యం గురించి చెప్పాలని కూడా శ్రీ మోదీ అడిగారు. చాలా మందికి కొన్ని ఘటనలను గురించి తెలియనే తెలియదని శ్రీ శుక్లా చెబుతూ, తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అతి కొద్ది జాగానే ఉండడం, సామగ్రిని పంపడానికి దండిగా డబ్బు ఖర్చుపెట్టాల్సి రావడం వల్ల అంతరిక్ష కేంద్రాల్లో భోజన ఏర్పాట్లు ఒక పెద్ద సవాలుగా మారినట్లు ఆయన ప్రధానంగా చెప్పారు. ఇందువల్ల, అతి తక్కువ చోటులోనే అత్యధిక కెలోరీలు, పోషకాలను అందించే సామగ్రిని పంపించడానికి శ్రద్ధ తీసుకున్నారన్నారు. ప్రస్తుతం అనేక ప్రయోగాలు జరుగుతున్నాయని, అంతరిక్షంలో కొన్ని తినదగ్గ పదార్థాలను పండించడం ఎంతో తేలికైన పని అన్నారు. చిన్న పళ్లెంలో గింజలు వేసి కాసిన్ని నీళ్లను పోసి ఉంచితే చాలు.. ఎనిమిది రోజుల లోపల మొలకలు రావడం మొదలైందని, ఈ ప్రయోగానికి స్వయంగా తానే ప్రత్యక్ష సాక్షినని శుక్లా తెలిపారు. భారత అద్వితీయ వ్యావసాయక నవకల్పనలు ఇక సూక్ష్మ గురుత్వం కలిగిన పరిశోధన వేదికల వరకు చేరుకొంటున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి ప్రయోగాలతో ఆహార సురక్షకు సంబంధించిన సవాళ్లకు పరిష్కారాలను కనుగొనే దిశగా చేజిక్కే సామర్థ్యాన్ని గురించి ఆయన ప్రస్తావించారు. ఈ సామర్థ్యంతో ఒక్క అంతరిక్ష యాత్రికులకే కాకుండా, భూమి మీద ఆదరణకు నోచుకోని వర్గాల వారికి కూడా ప్రయోజనం కలుగుతుందన్నారు.
భారతదేశానికి చెందిన ఒక వ్యోమగామిని కలుసుకున్నాక అంతర్జాతీయ వ్యోమగాములు ఎలా ప్రతిస్పందించారు? అని శుక్లాను ప్రధాని అడిగారు. దీనికి శుక్లా బదులిస్తూ, గత ఏడాది కాలానికి పైగా తాను వెళ్లిన ప్రతి చోటా ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తంచేశారని, తనను కలుసుకున్నందుకు వారిలో ఉత్సాహం, ఉత్తేజం పెల్లుబికాయన్నారు. వారు భారత రోదసీ కార్యక్రమాలపై తరచు ప్రశ్నలు వేస్తూవచ్చారని, మన దేశం సాధిస్తున్న ప్రగతి పరంగా చాలా విషయాలు వారికి తెలుసని శుక్లా వివరించారు. చాలా మంది ముఖ్యంగా ‘గగన్‌యాన్ మిషన్’పై ఎడతెగని ఆసక్తి కనబరిచారని, ఆ మిషన్ ఎప్పటికి ఒక కొలిక్కి వస్తుందంటూ ఆరా తీసేవారని శుక్లా అన్నారు. శుక్లాతో పాటు రోదసీ యాత్రలో పాల్గొన్న తోటి యాత్రికులయితే సంతకం చేసిన పత్రాలను తమకు ఇవ్వాలంటూ అభ్యర్థించారని, ఆ ప్రయోగ ఘట్టానికి తమను కూడా ఆహ్వానించాల్సిందని, భారత్ అంతరిక్ష వాహనంలో తాము ప్రయాణిస్తామన్న కోరికను కూడా వారు వెలిబుచ్చారని శుక్లా తెలిపారు.
శుక్లాను ఒక మేధావి అని ఇతరులు ఎందుకు అన్నారో శ్రీ మోదీ తెలుసుకోగోరారు. తనను గురించి ప్రజలు అలా మాట్లాడి, తన పట్ల వారి దయను చాటిచెప్పారండీ అంటూ శుక్లా వినయంగా బదులిచ్చారు. వారు అందించిన ప్రశంసల ఖ్యాతి అంతా తాను తీసుకున్న కఠిన శిక్షణకే దక్కుతుందని శుక్లా చెప్పారు. మొదట భారతీయ వైమానిక దళంలోను, ఆ తరువాత స్పేస్ పైలట్‌గాను శిక్షణను శుక్లా పూర్తి చేశారు. మొదట్లో విద్యాపరమైన అధ్యయనం కనీస స్థాయిలోనే ఉండొచ్చని శుక్లా అనుకున్నారు. అయితే ఆ మార్గంలో ముందుకు సాగిపోవాలంటే అందుకు ఎన్నో అంశాలను నేర్చుకోవాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. స్పేస్ పైలట్ కావడం అంటే అది.. ఒక ఇంజినీరింగ్ కోర్సులో మాస్టర్స్ డిగ్రీని సంపాదించడం లాంటిది.. అని ఆయన వివరించారు. భారతీయ శాస్త్రవేత్తల దగ్గర ఏళ్ల తరబడి శిక్షణను పొందిన తరువాత, ఈ సాహసయాత్రకు ఇక తాను సర్వసన్నద్ధుడిని అయ్యానన్న అభిప్రాయం ఆయనకు కలిగింది.
శుక్లాకు ఇంతకు ముందు తాను ఇచ్చిన ‘‘హోం వర్క్’’లో పురోగతి ఎంత మేరకు ఉందో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సమీక్షించారు. ‘చక్కని ప్రగతి చోటుచేసుకుంద’ని శుక్లా వివరించారు. తనకు అప్పగించిన పనులు నిజానికి చాలా ముఖ్యమైనవి అని, తన యాత్రే చైతన్యాన్ని పెంచడానికి ఉద్దేశించిన యాత్ర అని ఆయన అన్నారు. సాహసయాత్ర ఫలప్రదం కావడంతో పాటు, బృందం సురక్షితంగా తిరిగివచ్చిందని, ఇది అంతం కాదు.. ఆరంభం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని ఈ సందర్భంలో కలగజేసుకుంటూ, ఇది తొలి అడుగే సుమా! అని పునరుద్ఘాటించారు. శుక్లా తనూ గొంతు కలుపుతూ, ‘‘అవును సర్, ఇది తొలి అడుగే’’ అన్నారు. ఈ కార్యక్రమం కీలక లక్ష్యం వీలయినన్ని అంశాల్ని నేర్చుకోవడమూ, నేర్చుకున్న ఆ విషయాలను తిరిగి భూగ్రహానికి చేరుకొని లోతుగా పరిశీలించడమూ అని శుక్లా అన్నారు.
ఇండియాలో వ్యోమగాముల భారీ సమూహాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతయినా ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అలాంటి సాహస యాత్రల కోసం 40-50 మంది సన్నద్ధులుగా ఉండాలని ఆయన సూచించారు. ఇంత కాలం, చాలా కొద్ది మంది బాలలే తామూ అంతరిక్ష యాత్రికులం అవ్వాలని అనుకుని ఉండవచ్చు, అయితే శుక్లా చేసిన యాత్ర మరింత మందిలో ఈ ఆసక్తిని, నమ్మకాన్ని కలిగించేందుకు అవకాశం ఉందని ప్రధాని అన్నారు.
శుక్లా తన బాల్యాన్ని నెమరు వేసుకున్నారు. రాకేశ్ శర్మ 1984లో అంతరిక్షంలోకి అడుగిడిన సంగతిని శుక్లా గుర్తుతెచ్చుకున్నారు. అప్పట్లో వ్యోమగామి కావాలన్న ఆలోచన తనకు రానే లేదని శుక్లా చెప్పారు దీనికి కారణం అప్పట్లో ఒక జాతీయ కార్యక్రమం అనేది లేకపోవడమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఏమైనా, ఇటీవలి తన సాహసయాత్రలో, తాను మూడు సందర్భాల్లో బాలలతో మాట్లాడినట్లు శుక్లా వివరించారు. ఒకసారి ఒక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలోనూ, రెండు సార్లు రేడియోలోనూ మాట్లాడానన్నారు. ఈ మూడు కార్యక్రమాల్లోనూ తాను మాట్లాడిన చిన్నారుల్లో కనీసం ఒక్కరు ‘‘సర్, నేను కూడా రోదసి లోకి వెళ్లాలంటే ఏం చేయాలో చెబుతారా?’’ అని తనను అడిగారని శుక్లా వెల్లడించారు. తాను చేసిన ఈ పని దేశానికి సంబంధించినంతవరకు ఒక పెద్ద విజయమని శుక్లా తెలిపారు. నేటి భారతం కలలు కనడంతోనే సరిపెట్టుకోనక్కర్లేదు. నింగిలోకి వెళ్లడం అయ్యే పనే..అందుకు మార్గాలున్నాయి.. రోదసీ యాత్రికుడుగా మారడం కుదిరేదే అని భారత పౌరులకు తెలిసిపోయిందని శుక్లా వివరించారు. ‘‘ఆకాశ వీధిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం ఒక గొప్ప అవకాశం, మరి ఇప్పుడిది మరింత మంది ఈ కీలక మలుపును చేరుకొనేలా వారికి సాయపడటం నా బాధ్యతగా మారిపోయింది’’ అని శుక్లా తేల్చిచెప్పారు.
భారత్ ఎదుట రెండు ప్రధాన సాహస యాత్రలున్నాయి.. వాటిలో ఒకటి గగన్‌యాన్, రెండోది అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడం.. అని ప్రధాని అన్నారు. త్వరలో చేపట్టబోయే ఈ ప్రయత్నాల్లో శ్రీ శుక్లాకున్న అనుభవం గొప్పగా ఉపయోగపడగలదని శ్రీ మోదీ అన్నారు.
ఈ మాటలతో శ్రీ శుక్లా ఏకీభవించారు. ఇది ప్రత్యేకించి ప్రధానమంత్రి శ్రీ మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ నిరంతర నిబద్ధతను దృష్టిలో పెట్టుకొంటే దేశానికి ఒక పెద్ద అవకాశమని శ్రీ శుక్లా అన్నారు. ‘చంద్రయాన్-2’ విజయవంతం కాకపోవడం వంటి వైఫల్యాలు ఎదురైనప్పటికీ కూడా, కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కావలసిన బడ్జెటరీ తోడ్పాటును అందిస్తూనే ఉందని, దీంతో ‘చంద్రయాన్-3’ సఫలమైందని ఆయన గుర్తుచేశారు. వైఫల్యాలు ఎదురైనా, ఈ విధంగా మద్దతును అందిస్తుండడాన్ని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని, ఇది అంతరిక్ష రంగంలో ఒక నాయకత్వ పాత్రను చేజిక్కించుకోవడంలో భారత్‌కున్న సామర్థ్యానికి అద్దం పడుతోందని శ్రీ శుక్లా అన్నారు. నాయకత్వ స్థానాన్ని అందుకోగల సత్తా మన దేశానికి ఉందని, ఇండియా సారథ్యంలో ఇతర దేశాల భాగస్వామ్యంతో అంతరిక్షంలో ఒక కేంద్రాన్ని నెలకొల్పడం అంటూ జరిగితే అది ఒక శక్తిమంతమైన సాధనంగా మారుతుందని శ్రీ శుక్లా అన్నారు.
అంతరిక్ష రంగానికి సంబంధించిన తయారీ రంగంలో స్వయంసమృద్ధిని సాధించాలంటూ స్వాతంత్ర్య దినోత్సవం ప్రసంగంలో ప్రధాని చెప్పిన మాటలను కూడా శ్రీ శుక్లా ప్రస్తావించారు. ఈ అంశాలన్నీ ఒకదానితో మరొకటి పెనవేసుకొని ఉన్నాయని శ్రీ శుక్లా అన్నారు. గగన్‌యాన్ ప్రాజెక్టు, అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు చంద్రునిపై దిగడం.. వీటికి సంబంధించిన దూరదృష్టి ఒక విశాలమైన, మహత్వాకాంక్షతో కూడిన కలకు ప్రతిరూపం అని శ్రీ శుక్లా అభివర్ణించారు. స్వయంసమృద్ధిని ఊతంగా భారత్ తీసుకొందంటే ఈ లక్ష్యాలను చేరుకోగలుగుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు.
***
(Release ID: 2158036)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam