ప్రధాన మంత్రి కార్యాలయం
స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ముఖ్య ప్రకటనలు
Posted On:
15 AUG 2025 10:32AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన పన్నెండో స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సందర్భంగా.. భవిష్యత్ భారత పురోగమనంలో తదుపరి అధ్యాయానికి ఎర్రకోటను వేదికగా ఎంచుకున్నారు. దేశం- భవిష్యత్తులోకి అడుగు పెట్టడమే కాదు... ఉరకలేసేందుకు సిద్ధంగా ఉందని సంకేతాలిచ్చేలా.. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వరుసగా పలు సాహసోపేతమైన ప్రకటనలు చేశారు.
భారతదేశపు మొదటి సెమీకండక్టర్ చిప్ తయారీ నుంచి జెట్ ఇంజిన్ల రూపకల్పన వరకు, పదిరెట్లు కానున్న అణు విద్యుత్తు ఉత్పత్తి నుంచి రూ. లక్ష కోట్లతో యువతకు ఉపాధి కల్పన వరకు.. ఆయన స్పష్టమైన సందేశాన్నిచ్చారు. భారత్ తన భవితను స్వయంగా నిర్మించుకుంటుంది. తన మార్గాన్ని తానే నిర్దేశించుకుంటుంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడమే లక్ష్యంగా ముందుకురుకుతుంది.
ముఖ్య ప్రకటనలు:
1. సెమీకండక్టర్లు: దశాబ్దాల వెనుకబాటు నుంచి యుద్ధ ప్రాతిపదికన పురోగతి వరకు...
యాభై అరవై ఏళ్ల కిందటే సెమీ కండక్టర్ కర్మాగారాల ఏర్పాటు ప్రయత్నాలను నీరుగార్చి వాటిని ‘పుట్టగానే చంపేశారని’, మరోవైపు వేరే దేశాలు విశేష పురోగతి సాధించాయని శ్రీ మోదీ గుర్తుచేశారు. భారత్ ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన కృషి చేస్తోందని, ఈ ఏడాది చివరి నాటికి దేశం మొదటి ‘మేడిన్ ఇండియా చిప్’ను విడుదల చేస్తుందని ప్రధానమంత్రి ప్రకటించారు.
2. 2047 నాటికి పదిరెట్లకు పెరగనున్న అణు విద్యుదుత్పత్తి సామర్థ్యం
రాబోయే రెండు దశాబ్దాల్లో అణు విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పది రెట్లు పెంచాలన్న భారత్ లక్ష్యానికి అనుగుణంగా 10 కొత్త అణు రియాక్టర్ల ఏర్పాటు కోసం పనులు జరుగుతున్నాయి.
3. జీఎస్టీ సంస్కరణలు – దీపావళి కానుక
దీపావళి నాడు సమగ్ర జీఎస్టీ సంస్కరణలను ప్రభుత్వం వెల్లడించబోతోంది. అత్యవసర వస్తువులపై పన్నులు తగ్గుతాయి. ఎంఎస్ఎంఈలు, స్థానిక వర్తకులు, వినియోగదారులకు ఉపశమనం లభిస్తుంది.
4. సంస్కరణల టాస్క్‌ఫోర్స్
సమగ్ర సంస్కరణల దిశగా ఓ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటును ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు. దీని లక్ష్యాలు: ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, అకారణ జాప్యాన్ని నివారించడం, పాలనను ఆధునికీకరించడం.
5. రూ. లక్ష కోట్లతో ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్‌గార్ యోజన
రూ. లక్ష కోట్ల విలువ చేసే ఓ ప్రధానమైన ఉపాధి పథకాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీని కింద కొత్తగా ఉద్యోగం పొందే యువతకు నెలకు రూ. 15,000 లభిస్తుంది. మూడు కోట్ల మంది భారతీయ యువతకు ప్రయోజనం చేకూర్చడం ఈ పథకం లక్ష్యం. స్వతంత్ర భారత్ నుంచి సమృద్ధ భారత్ దిశగా- ఈ పథకం బలమైన వారధిగా నిలుస్తుంది.
6. హై పవర్డ్ డెమోగ్రఫీ మిషన్
సరిహద్దు ప్రాంతాల్లో చొరబాట్లు, అక్రమ వలసల కారణంగా జనాభా అసమతౌల్యం ప్రమాదాలను ప్రధానమంత్రి మోదీ ఎత్తిచూపారు. ఈ జాతీయ భద్రతా సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగా.. దేశ ప్రజల ఐక్యత, సమగ్రత, హక్కులను కాపాడేందుకు హై పవర్డ్ డెమోగ్రఫీ మిషన్ ను ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
7. ఇంధన స్వాతంత్ర్యం - సముద్ర మంథన్ ప్రారంభం
ఇప్పటికీ దేశ బడ్జెట్‌లో ఎక్కువ భాగం పెట్రోల్, డీజిల్, గ్యాస్ దిగుమతి కోసమే ఖర్చవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేశారు. సౌర, హైడ్రోజన్, జల, అణుశక్తి విస్తరణలతోపాటు సముద్ర వనరులను ఉపయోగించుకోవడం కోసం నేషనల్ డీప్ వాటర్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్‌ను ప్రారంభించినట్టు ఆయన ప్రకటించారు.
8. భారత్‌లో జెట్ ఇంజిన్ల తయారీ - దేశవ్యాప్త సవాలు
మన శాస్త్రవేత్తలు, యువత దీనిని నేరుగా సవాలుగా స్వీకరించాలని కోరుతూ ప్రధానమంత్రి మోదీ నాటకీయంగా ఓ ప్రకటన చేశారు. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్లను, డిజిటల్ చెల్లింపుల కోసం యూపీఐని తయారు చేసుకున్న విధంగానే సొంతంగా జెట్ ఇంజిన్లను కూడా స్వయంగా అభివృద్ధి చేసుకోవాలని ప్రకటించారు.
***
(Release ID: 2156769)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Nepali
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam