మంత్రిమండలి
azadi ka amrit mahotsav

గృహ వినియోగ ఎల్‌పీజీలో నష్టాల భర్తీకి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు రూ.30,000 కోట్లు.. ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 08 AUG 2025 4:02PM by PIB Hyderabad

దేశంలో గృహ వినియోగానికి సంబంధించిన ఎల్‌పీజీ అమ్మకాల్లో అండర్-రికవరీలను ఎదుర్కొన్న మూడు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఐఓసీఎల్, బీపీసీఎల, హెచ్‌పీసీఎల్)లకు రూ.30,000 కోట్ల మేరకు నష్టపరిహారాన్ని ఇచ్చేందుకు ప్రధానమంత్రి శ్రీ  నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ)లకు నష్టపరిహారాన్ని అందించే పనిని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ పూర్తి చేస్తుంది. ఈ పరిహారాన్ని 12 విడతలుగా చెల్లిస్తారు.

క్రమబద్ధీకరించిన ధరలకు ప్రభుత్వ రంగ ఓఎంసీలైన ఐఓసీఎల్, బీపీసీఎల, హెచ్‌పీసీఎల్‌లు ఎల్‌పీజీ సిలిండర్లను ఇళ్లలోవాడే వినియోగదారులకు సరఫరా చేస్తున్నాయి.

ఎల్‌పీజీ అంతర్జాతీయ ధరలు 2024-25లో అధిక స్థాయుల్లో కొనసాగాయి. ఇప్పటికి కూడా అవి అధికంగానే ఉంటున్నాయి. ఏమైనా, ఎల్‌పీజీ అంతర్జాతీయ ధరల ప్రభావం వినియోగదారులపై పడకుండా చూడడానికి ధరలలో పెరుగుదలను వినియోగదారులకు బదలాయించలేదు. దీంతో మూడు ఓఎంసీలు చెప్పుకోదగ్గ స్థాయుల్లో నష్టాలు చవిచూశాయి. ప్రభుత్వ రంగ ఓఎంసీలు నష్టాల బాటన సాగుతున్నప్పటికీ కూడా దేశంలో ఎల్‌పీజీని తక్కువ ధరలకే సరఫరా చేయడాన్ని కొనసాగించే దిశగా చర్యలు తీసుకున్నాయి.

ముడిచమురుతో పాటు ఎల్‌పీజీని కొనుగోలు చేయడం, రుణాలను తిరిగి చెల్లించడం, మూలధన వ్యయాన్ని రూపొందించుకున్న ప్రణాళికల ప్రకారమే కొనసాగించడం వంటి కీలక అవసరాలను ఓఎంసీలు నెరవేర్చుకొనేందుకు ఈ నష్టపరిహారం అవకాశాన్ని కల్పిస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా గృహ వినియోగం కోసం ఎల్‌పీజీ సిలిండర్లను అంతరాయం లేకుండా సరఫరా చేయడానికి వీలవుతుంది.

ఈ నిర్ణయం ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల ఆర్థిక పుష్టిని సంరక్షిస్తూనే, ప్రపంచ ఇంధన మార్కెట్లలో చోటుచేసుకొనే అనిశ్చితుల ప్రభావం వినియోగదారులపై పడకుండా వారిని కాపాడతామన్న ప్రభుత్వ నిబద్ధతను స్పష్టం చేస్తోంది. పీఎం ఉజ్వల యోజన వంటి ప్రధాన పథకాలు సహా గృహసంబంధిత ఎల్‌పీజీ వినియోగదారులందరికి స్వచ్ఛమైన వంటింటి ఇంధనాన్ని విరివిగా అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశాన్ని కూడా ఈ చర్య పునరుద్ఘాటిస్తోంది.  ‌


 

***


(Release ID: 2154185)