ప్రధాన మంత్రి కార్యాలయం
వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటుపై భారత్, ఫిలిప్పీన్స్ ప్రకటన
Posted On:
05 AUG 2025 5:23PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఫిలిప్పీన్స్ రిపబ్లిక్ అధ్యక్షుడు శ్రీ ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్ 2025 ఆగస్టు 4 నుంచి భారత్ పర్యటనలో ఉన్నారు. ఆగస్టు 8వ తేదీ వరకు ఈ పర్యటన కొనసాగుతుంది. అధ్యక్షుడు మార్కోస్ వెంట ప్రథమ మహిళ శ్రీమతి లూయిస్ అరనెటా మార్కోస్ తో పాటు ఫిలిప్పీన్స్ కు చెందిన పలువురు క్యాబినెట్ మంత్రులతో కూడిన ఉన్నత స్థాయి అధికార, ఉన్నత స్థాయి వ్యాపార ప్రతినిధి వర్గాలు కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నాయి.
2. ఆగస్టు 5, 2025 న, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు శ్రీ మార్కోస్ కు రాష్ట్రపతి భవన్ వద్ద అధికార లాంచనాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన రాజ్ ఘాట్ ను సందర్శించి మహాత్మాగాంధీకి పుష్పాంజలి సమర్పించారు. ఆ తరువాత ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం నేతల సమక్షంలో ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన విందుకు అధ్యక్షుడు మార్కోస్ హాజరయ్యారు. భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముతో కూడా ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు భేటీ అయ్యారు. మార్కోస్ గౌరవార్థం రాష్ట్రపతి విందు ఇచ్చారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఆయనను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ పర్యటనలో అధ్యక్షుడు మార్కోస్ బెంగళూరును సందర్శించనున్నారు.
3. ప్రధాని మోదీ, అధ్యక్షుడు మార్కోస్ మధ్య చర్చలలో ప్రస్తావనకు వచ్చిన అంశాలు :
(ఏ) భారత్-ఫిలిప్పీన్స్ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవం.
(బి) పరస్పర గౌరవం, విశ్వాసం, నాగరిక సంబంధాలు, భాగస్వామ్య విలువలు, సంస్కృతి ఆధారంగా భారత్, ఫిలిప్పీన్స్ మధ్య చిరకాల స్నేహాన్ని గుర్తించడం.
(సి) 1949 లో దౌత్య సంబంధాలు ఏర్పడిన నాటి నుంచి వివిధ రంగాలలో నెలకొన్న సంపన్న, ఫలవంతమైన సహకార సంప్రదాయాన్ని కొనసాగించడం.
(డి) 1952 జూలై 11న కుదిరిన మైత్రీ ఒప్పందం, 2000 నవంబర్ 28న సంతకం చేసిన విధాన సంప్రదింపుల అవగాహన ఒప్పందం, 2007 అక్టోబర్ 5న సంతకం చేసిన ద్వైపాక్షిక సహకార సంయుక్త కమిషన్ ఏర్పాటు ఒప్పందం, అదే రోజున ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకార యంత్రాంగం ఏర్పాటు ప్రకటనల మౌలిక ప్రాముఖ్యతను గుర్తించి ముందుకు వెళ్ళడం.
(ఇ) రెండు దేశాల మధ్య చారిత్రక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ముందుకు సాగడం.
(ఎఫ్) ద్వైపాక్షిక సంబంధాలను మరింత సమగ్రంగా అభివృద్ధి చేయడం వల్ల రెండు దేశాల్లోనూ, మొత్తంగా ఈ ప్రాంతం లో పురోగతి, అభివృద్ధి జరుగుతుందని అంగీకారం.
(జి) ద్వైపాక్షిక భాగస్వామ్యానికి మెరుగైన, వ్యూహాత్మక దిశను, దీర్ఘకాలిక నిబద్ధతను అందించేందుకు అంగీకారం. రాబోయే సంవత్సరాలలో రాజకీయ, రక్షణ, భద్రత, సముద్ర వ్యవహారాలు, సైన్స్, సాంకేతిక, వాతావరణ మార్పు, అంతరిక్ష సహకారం, వాణిజ్యం, పెట్టుబడి, పారిశ్రామిక సహకారం, కనెక్టివిటీ, ఆరోగ్యం, ఔషధ ఉత్పత్తులు, వ్యవసాయం, డిజిటల్ సాంకేతికత, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, అభివృద్ధిలో సహకారం, సాంస్కృతిక, సృజనాత్మక రంగాలు, పర్యాటకం, ప్రజల మధ్య సంబంధాలు వంటి అనేక రంగాలలో సహకారాన్ని మరింత క్రియాశీలకంగా పెంపొందించుకోవాలని నిర్ణయం.
(హెచ్) స్వేచ్ఛాయుత, బహిరంగ, పారదర్శక, నిబంధనల ఆధారిత, సమ్మిళిత, సంపన్న, సుస్థిర ఇండో-పసిఫిక్ ప్రాంతం పట్ల భాగస్వామ్య ఆసక్తి, ఆసియాన్ కేంద్రీకరణకు బలమైన మద్దతు పునరుద్ఘాటన.
రెండు దేశాల ప్రకటన
4. భారత్, ఫిలిప్పీన్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు.
5. వ్యూహాత్మక భాగస్వామ్యం... రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ సహకారానికి పూర్తి సామర్థ్యాన్ని అందించే దిశగా ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది.
6. వ్యూహాత్మక భాగస్వామ్యం రెండు దేశాలతో పాటు విస్తృత ప్రాంతంలో నిరంతర శాంతి, సుస్థిరత, అభివృద్ధి కోసం ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి పరస్పర నిబద్ధతపై ఆధారపడి ఉంటుంది. భవిష్యత్ ఆధారిత పరస్పర ప్రయోజనకరమైన సహకారాన్ని పెంపొందించడానికి రెండు దేశాలకు పునాదిగా పనిచేస్తుంది.
7. భారత్-ఫిలిప్పీన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం 2025 ఆగస్టు 5న ఇరు దేశాలు ఆమోదించిన కార్యాచరణ ప్రణాళిక (2025-2029) ఆధారంగా పని చేస్తుంది.
8. భారత్- ఫిలిప్పీన్స్ భాగస్వామ్యానికి మరింత చైతన్యం కల్పించే లక్ష్యంతో ఇద్దరు నాయకులు కింద పేర్కొన్న అంశాలపై అంగీకారానికి వచ్చారు.
9.(ఏ) రాజకీయ సహకారం
• ద్వైపాక్షిక సహకారంపై సంయుక్త కమిషన్ (జేఎల్బీసీ), విధానపరమైన సంప్రదింపులు, వ్యూహాత్మక చర్చలు సహా పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ద్వైపాక్షిక, బహుపాక్షిక, బహుళపాక్షిక అంశాలపై నిరంతర ఉన్నత స్థాయి పర్యటనలు, చర్చల ద్వారా రాజకీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం.
• ప్రస్తుతమున్న ఒప్పందాలు, అవగాహనా ఒప్పందాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా, సంప్రదింపుల ద్వారా ఒప్పందాలు, ఎంఒయులను త్వరగా ఖరారు చేయడం ద్వారా వివిధ రంగాలు, స్థాయులలో సహకారాన్ని మరింత పెంపొందించడం.
• వాణిజ్యం, పెట్టుబడులు, ఉగ్రవాద నిరోధం, పర్యాటకం, ఆరోగ్యం, వైద్యం, వ్యవసాయం, ఫైనాన్షియల్ టెక్నాలజీపై సంయుక్త అధ్యయన బృందాలు (జాయింట్ వర్కింగ్ గ్రూప్స్ -జేడబ్ల్యూజీ) సహా వివిధ ద్వైపాక్షిక సంస్థాగత యంత్రాంగాల ద్వారా చర్చలను విస్తృతపరచడం.
• రెండు దేశాల యువ నాయకుల పరస్పర పర్యటనలను ప్రోత్సహించడం ద్వారా ఇరు దేశాల చట్టసభల మధ్య సమన్వయాన్ని , పరస్పర అవగాహనను మరింత బలోపేతం చేయడం.
(బి) రక్షణ, భద్రత, సముద్ర సంబంధ సహకారం
• 2006 ఫిబ్రవరి 4న భారత్, ఫిలిప్పీన్స్ మధ్య కుదిరిన రక్షణ సహకార ఒప్పందంలో సాధించిన పురోగతికి గుర్తింపు
• రక్షణ పారిశ్రామిక సహకారం, రక్షణ సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన, శిక్షణ, పరస్పర మార్పిడి, సామర్థ్య పెంపుపై దృష్టి సారించి, రక్షణ సహకారంపై చర్చల కోసం జాయింట్ డిఫెన్స్ కోపరేషన్ కమిటీ (జెడిసిసి), జాయింట్ డిఫెన్స్ ఇండస్ట్రీ అండ్ లాజిస్టిక్స్ కమిటీ (జెడిఐఎల్సి) వంటి సంస్థాగత యంత్రాంగాలను క్రమం తప్పకుండా సమావేశపరచడం.
• రెండు దేశాల మధ్య సైనిక శిక్షణ కార్యకలాపాలను, సేవా విభాగాల మధ్య పరస్పర చర్యలను సంస్థాగతం చేయడం, త్రివిధ దళాల సహకారంపై మరింత దృష్టి పెట్టడం.
• రెండు దేశాల అభివృద్ధి అవసరాలు, తీర దేశాలు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని సముద్ర దేశాలుగా తమ హక్కులు, స్వేచ్ఛలను సాధించడంలో సముద్రాలు, మహాసముద్రాల కీలక పాత్రను గుర్తించడం.
• సముద్ర సంబంధిత అంశాలపై కార్యకలాపాలను సంస్థాగతం చేయడంతో పాటు రెండు దేశాల మధ్య లోతైన సముద్ర భాగస్వామ్యాన్ని ప్రశంసించారు. 2024 డిసెంబర్ 11-13 తేదీల్లో మనీలాలో తొలిసారిగా నిర్వహించిన భారత్–ఫిలిప్పీన్స్ వార్షిక నౌకా వాణిజ్య సమావేశం ద్వారా ఏర్పడిన సానుకూల వాతావరణాన్ని కొనసాగించే ప్రయత్నంగా తదుపరి సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సంసిద్ధత పట్ల ఫిలిప్పీన్స్ హర్షం వ్యక్తం చేసింది.
• అంతర్జాతీయ, ప్రాంతీయ సముద్ర సవాళ్లపై అభిప్రాయాలను, సముద్ర సహకారాన్ని మరింత పెంచుకోవడంపై ఉత్తమ పద్ధతులను పంచుకోవడం, మహాసముద్రాలు, సముద్రాలు, సముద్ర వనరులను శాంతియుతంగా, సుస్థిరంగా, సమానంగా ఉపయోగించడంపై సముద్ర సంస్థలు, చట్టాలను అమలు చేసే సంస్థలు, సముద్ర సంబంధ శాస్త్ర, పరిశోధన సంస్థల మధ్య సమన్వయాన్ని, నైపుణ్యాన్ని ప్రోత్సహించడం.
• రెండు దేశాలకు చెందిన తగిన ఏజెన్సీల ద్వారా ఉత్తమ పద్ధతులు, ఇంటెలిజెన్స్, సాంకేతిక మద్దతు, నిపుణుల మార్పిడి, కార్యశాలలు, పారిశ్రామిక సహాయాన్ని పంచుకోవడం.
• నౌకాదళాలు, కోస్టుగార్డుల మధ్య సముద్ర పరిధిపై అవగాహన (మారిటైమ్ డొమైన్ అవేర్నెస్- ఎండిఏ), నౌకా నిర్మాణం, సముద్ర కనెక్టివిటీ, తీరరేఖ పర్యవేక్షణ, మానవతా సహాయం, విపత్తు సహాయ చర్యలు, కాలుష్య నియంత్రణ, గాలింపు, రక్షణ వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా సముద్ర భద్రతా రంగంలో పరస్పర సహకారాన్ని మెరుగుపరచడం.
• రక్షణ పరికరాలను సంయుక్తంగా అభివృద్ధి, ఉత్పత్తిచేయడం, రక్షణ ఉత్పత్తిలో స్వావలంబన లక్ష్యాన్ని సాధించడం, రక్షణ పరిశోధన, అభివృద్ధిలోనూ, సుస్థిర సరఫరా వ్యవస్థ ఏర్పాటులోనూ పెట్టుబడులను, ఉమ్మడి చొరవలను ప్రోత్సహించడం.
• హైడ్రోగ్రాఫిక్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, మొత్తం సముద్ర భద్రతకు దోహదపడే సురక్షితమైన, సమర్థవంతమైన నౌకాయానాన్ని అందించేందుకు జాయింట్ ఓషనోగ్రాఫిక్ రీసెర్చ్ సర్వేలను నిర్వహించడం సహా హైడ్రోగ్రఫీ రంగంలో సహకారాన్ని విస్తరించడం.
• ఆసియాన్-ఇండియా మారిటైమ్ ఎక్సర్ సైజ్ అండ్ ఎక్సర్సైజ్ మిలాన్, ఫిలిప్పీన్స్ మారిటైమ్ కోఆపరేటివ్ యాక్టివిటీస్ (ఎంసీఏ)లతో సహా బహుళపక్ష విన్యాసాల్లో పాల్గొనేందుకు కృషి చేయడం;
• ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కార్యకలాపాలు (పికెఒ), సరఫరా మార్గాల నిర్వహణ, సైనిక ఆరోగ్యం, అంతర్జాతీయ, ప్రాంతీయ భద్రతా వాతావరణం, సముద్ర భద్రత, సైబర్ భద్రత, క్లిష్టమైన సాంకేతిక సమస్యలు వంటి సంప్రదాయ, సంప్రదాయేతర భద్రతా ఆందోళనలు, అలాగే కీలకమైన సమాచార మౌలిక సదుపాయాల రక్షణ, ఆర్థిక విషయాలపై భద్రత సంబంధిత ఆందోళనలపై క్రమం తప్పకుండా చర్చలు, కార్యాచరణ, ఉత్తమ పధ్ధతుల మార్పిడి ద్వారా భద్రతా సహకారాన్ని మరింత పెంపొందించడం.
*ఉగ్రవాద వ్యతిరేక సంయుక్త అధ్యయన బృందాన్ని తరచూ సమావేశపరచడం ద్వారా ఉగ్రవాదం పై ఉమ్మడి పోరును బలోపేతం చేయాలి. (i) ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం, తీవ్రవాదం వైపు ప్రేరేపించడం, మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలు, కొత్త, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా సైబర్ బెదిరింపులు, ఉగ్రవాద ప్రయోజనాల కోసం ఇంటర్నెట్ దుర్వినియోగం, ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం, అంతర్జాతీయ ఆర్థిక నేరాలు, అక్రమ ఆర్థిక బదిలీలు, మనీ లాండరింగ్ వంటి అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడం. (ii) ఉగ్రవాద నిర్మూలనకు సమాచారం, ఉత్తమ పద్ధతులు పంచుకోవడం, సామర్థ్యాన్ని పెంపొందించడం, బహుళపక్ష వేదికలపై సహకరించుకోవడం. (iii) ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం ఉపేక్షించని విధానాన్ని ప్రోత్సహించడం.
• విధానపరమైన చర్చలు, సామర్థ్య పెంపు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్షియల్ టెక్నాలజీ, డిజిటల్ ఎకానమీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఫోరెన్సిక్స్, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సిఈఆర్టీ) సహకారం, కీలకమైన సమాచార మౌలిక సదుపాయాల రక్షణ, డిజిటల్ నైపుణ్యాలపై సామర్థ్యాన్ని పెంపొందించడం వంటి వాటిపై ఉత్తమ పద్ధతులు, నైపుణ్యాల మార్పిడితో సహా సైబర్ రంగంలో సహకారాన్ని పెంపొందించడం.
(సి) ఆర్థిక, వాణిజ్య, పెట్టుబడుల సహకారం
• భారత్, ఫిలిప్పీన్స్ భాగస్వామ్యానికి కీలక చోదకశక్తిగా వ్యాపార, వాణిజ్య సంబంధాలను పెంపొందించడం. ఈ మేరకు ద్వైపాక్షిక వాణిజ్య, పెట్టుబడుల సహకారాన్ని బలోపేతం చేయడం. మరిన్ని ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకోవడం.
• 2024-25లో సుమారు 3.3 బిలియన్ డాలర్లకు చేరుకున్న ద్వైపాక్షిక వాణిజ్యంలో స్థిరమైన పెరుగుదలను స్వాగతిస్తూ, ఆ వృద్ధిని కొనసాగించాలని, పరస్పర అవసర వస్తువుల ఉత్పత్తి, సేవల పరిధిని విస్తరించాలని నిర్ణయించారు.
• రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత ప్రోత్సహించేందుకు ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ (పీటీఏ) చర్చలను త్వరితగతిన ముగించాలని నిర్ణయించారు. ద్వైపాక్షిక పెట్టుబడులను సులభతరం చేయడానికి ఇరు దేశాలు మరింత సహకరించుకుంటాయి.
• వాణిజ్యం, పెట్టుబడిని ప్రోత్సహించాలని, మార్కెట్ లభ్యత సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, అంతర్జాతీయ సరఫరా మార్గాలతో మెరుగైన అనుసంధానం అవసరమని అంగీకరించారు. ముఖ్యంగా పునర్వినియోగ విద్యుత్, కీలక ఖనిజాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, డిజిటల్ సాంకేతికతలు, కృత్రిమ మేధ, రోబోటిక్స్, ఐసీటీ, బయోటెక్నాలజీ, సృజనాత్మక పరిశ్రమలు, స్టార్టప్‌లు, నిర్మాణం, మౌలిక సదుపాయాలు, ఇనుము, ఉక్కు, నౌకా నిర్మాణం - మరమ్మత్తు, వ్యవసాయం, పర్యాటకం వంటి కొత్త రంగాలలో సహకార విస్తరణకు బలమైన పునాది వేయడం కోసం రెండు దేశాల సంబంధిత మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారుల మధ్య ఇప్పటికే ఉన్న వ్యవస్థల కింద సహా నిరంతర సమావేశాలు, పరస్పర మార్పిడులను ప్రోత్సహించాలని నిర్ణయించారు.
• మౌలిక సదుపాయాల అభివృద్ధి, కనెక్టివిటీ, రవాణా ప్రాజెక్టుల అమలులో భాగస్వామ్యాన్ని విస్తరిస్తారు.
• సరళీకృత కస్టమ్స్ విధానాల ద్వారా మెరుగైన వాణిజ్య సౌలభ్యం కోసం జాయింట్ కస్టమ్స్ కోపరేషన్ కమిటీ సమావేశాలకు వీలు కల్పిస్తారు.
• రెండు దేశాలు అందించే అవకాశాలను అన్వేషించేందుకు వ్యాపార ప్రతినిధి బృందాల మార్పిడి, బిజినెస్ టూ బిజినెస్ సంబంధాల విస్తరణ, వాణిజ్య ప్రదర్శనలు, వ్యాపార సమ్మేళనాలు మొదలైనవాటి ద్వారా వ్యాపార, పారిశ్రామిక ప్రతినిధులను ప్రోత్సహిస్తారు.
• అంతర్జాతీయ, ప్రాంతీయ వాణిజ్యాన్ని పెంపొందించడానికి ఇరు దేశాల ప్రభుత్వాలతో పాటు వాటి అంతర్జాతీయ, ఆర్థిక సంస్థల మధ్య కూడా మరింత సహకారం, సమన్వయాన్ని పెంపొందిస్తారు.
• ఆసియాన్-ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ (ఏఐటీఐజీఏ) సమీక్షను మరింత సమర్థవంతంగా, వినియోగదారులకు సౌలభ్యంగా, సరళంగా, వ్యాపారాలకు అనుకూలంగా వేగవంతం చేస్తారు.
• ప్రతి దేశంలో సంబంధిత చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ఆరోగ్య సంరక్షణ, ఫార్మాస్యూటికల్స్ రంగాలలో సహకారాన్ని పెంపొందిస్తారు. మెరుగైన ఆరోగ్య ఫలితాలకు మద్దతు ఇస్తారు. సామర్థ్య పెంపు, విజ్ఞాన భాగస్వామ్యం, ఉమ్మడి పరిశోధన కార్యక్రమాల ద్వారా ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేస్తారు.
• శిక్షణ, నిపుణుల మార్పిడి ద్వారా సహా ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్య రంగాల్లో సహకారాన్ని పెంపొందిస్తారు.
* భారత ప్రభుత్వం అందించే గ్రాంట్ సహాయం కింద క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్టుల (క్యూఐపీ) అమలు ద్వారా ఫిలిప్పీన్స్ దేశంలోని స్థానిక అభివృద్ధి ప్రాధాన్యతలకు మద్దతు ఇస్తారు.
(డి) శాస్త్ర, సాంకేతికపరిజ్ఞాన రంగాల్లో సహకారం
• సైన్స్, టెక్నాలజీ రంగాల్లో సహకార కార్యక్రమం సహా ఉమ్మడి పరిశోధన, అభివృద్ధి, ఎస్టీఐ సమాచారం, శాస్త్రవేత్తల మార్పిడి, పరస్పర అంగీకార ప్రాధాన్య రంగాలలో సామర్థ్యాన్ని పెంపొందించే కార్యకలాపాల ద్వారా 2025- 28 కాలానికి సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ (ఎస్టీఐ) లో సహకార విస్తరణకు రెండు దేశాల సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కలసి పనిచేస్తాయి.
• అంతరిక్ష శాస్త్రం, సాంకేతికత అన్వయింపు సహా అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం వినియోగించడంలో సహకరించుకోవాలని నిర్ణయించారు. ఇందులో విద్యా సంస్థలు, పరిశోధన, అభివృద్ధి సంస్థలు, పరిశ్రమలు, ఆవిష్కరణ రంగాల పాత్రను స్వాగతించారు.
• అణు ఇంధనాన్ని శాంతియుతంగా వినియోగించే విషయంలో కూడా రెండు దేశాలు మరింత సహకరించుకుంటాయి.
• ఎడ్యు-టెక్, మెడ్-టెక్ పై సమాచారం, ఉత్తమ పద్ధతులను పంచుకోవడం ద్వారా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగంలో సహకారాన్ని బలోపేతం చేస్తారు.
• వరి సాగు, వ్యవసాయ పరిశోధన, సుస్థిరమైన చేపల వేట, ఆక్వాకల్చర్ అభివృద్ధిలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం సహా వ్యవసాయ రంగంలో సహకారాన్ని మరింత విస్తరిస్తారు.
(ఇ) అనుసంధానత
*భారత్, ఫిలిప్పీన్స్ మధ్య భౌతిక, డిజిటల్, ఆర్థిక అనుసంధానాలతో సహా అన్ని రకాల కనెక్టివిటీని పెంచడం.
• సైబర్ భద్రత, గోప్యతను దృష్టిలో పెట్టుకొని ఇ-గవర్నెన్స్, ఆర్థిక సమ్మిళితం, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సహకారాన్ని బలోపేతం చేయడం.
• నౌకాశ్రయాల మధ్య కనెక్షన్లను విస్తరించడం ద్వారా ప్రాంతీయ సముద్ర అనుసంధానతను బలోపేతం చేయడం.
• రెండు దేశాల మధ్య నేరుగా విమాన సౌకర్యం ఏర్పాటు ద్వారా విమాన అనుసంధానతను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా, రాబోయే నెలల్లో రెండు రాజధానుల మధ్య నేరుగా విమాన సేవలు ప్రారంభం కానుండడం పట్ల ఇద్దరు నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
(ఎఫ్) కాన్సులర్ సహకారం
• ప్రజల పరస్పర ప్రయాణాలను సులభతరం చేయాలని నిర్ణయించారు. భారత పర్యాటకులకు ఫిలిప్పీన్స్ వీసా రహిత ప్రవేశం కల్పించడాన్ని, అలాగే ఫిలిప్పీన్స్ పౌరులకు భారత్ ఉచితంగా ఈ-టూరిస్ట్ వీసాను అందించడాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు.
• జాయింట్ కాన్సులర్ కన్సల్టేషన్ సమావేశాన్ని క్రమం తప్పకుండా నిర్వహించాలని నిర్ణయించారు.
(జి) పరస్పర న్యాయ, న్యాయవ్యవస్థల సహకారం
• క్రిమినల్ వ్యవహారాలపై పరస్పర న్యాయ సహాయ ఒప్పందం, శిక్ష పడిన వ్యక్తుల బదిలీ ఒప్పందం ఒక కొలిక్కి రావడాన్ని ఇద్దరు నాయకులు స్వాగతించారు.
(హెచ్) సాంస్కృతికం, పర్యాటకం, ప్రజల మధ్య సంబంధాలు
• విస్తరించిన సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంతో సహా మెరుగైన పరస్పర చర్యల ద్వారా ఇరు దేశాల మధ్య ప్రజల మధ్య బంధాలను, సాంస్కృతిక సంబంధాలను, పరస్పర రాకపోకలను, భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేస్తారు.
• ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ అందించే స్కాలర్ షిప్ కోర్సుల్లో పాల్గొనడం ద్వారా మరింత సాంస్కృతిక మార్పిడిని పెంపొందిస్తారు.
• టూరిజంపై సంయుక్త అధ్యయన బృందం సమావేశాన్ని క్రమం తప్పకుండా నిర్వహించడంతో పాటు రెండు దేశాల్లోని పర్యాటక సంస్థలు, పర్యాటక నిపుణులు ఆతిథ్య రంగం మధ్య మార్పిడిని, చర్చలను ప్రోత్సహిస్తారు.
• విద్యార్థులు, మీడియా ప్రతినిధుల పరస్పర మార్పిడులను సులభతరం చేయడంతో పాటు, మేధో సంస్థలు, విద్యాసంస్థల మధ్య పరస్పర సంబంధాలను ప్రోత్సహించాలని నిర్ణయించారు.
• భారత సాంకేతిక, ఆర్థిక సహకార కార్యక్రమం (ఐటీఈసీ) తో సహా, శిక్షణ, సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాల్లో సహకారాన్ని సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని అంగీకరించారు.
(ఐ) ప్రాంతీయ, బహుపాక్షిక, అంతర్జాతీయ సహకారం
• రెండు దేశాలకు పరస్పర ప్రయోజనాలు అలాగే ఇద్దరికీ ఆందోళన కలిగించే అంతర్జాతీయ అంశాలపై - ఉదాహరణకు, ఉమ్మడి వనరుల విషయంలో ఒక చట్టపరమైన విధానం, ఉగ్రవాద నిరోధం, వాతావరణ మార్పు, సుస్ధిర అభివృద్ధి - వంటి విషయాలలోఐక్యరాజ్యసమితి, దాని ప్రత్యేక సంస్థలు సహా బహుళపక్ష, ప్రాంతీయ వేదికలలో సన్నిహితంగా సహకరించుకోవాలని నిర్ణయించారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత, శాశ్వతేతర కేటగిరీల్లో చర్చల ద్వారా సంస్కరణలు, విస్తరణకు చురుగ్గా మద్దతు ఇవ్వాలని అంగీకరించారు.
• స్వేచ్ఛాయుత, బహిరంగ, పారదర్శక, నిబంధనల ఆధారిత వాణిజ్య వ్యవస్థకు భాగస్వామ్య నిబద్ధతను పునరుద్ఘాటించిన రెండు దేశాలు, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడానికి, వాణిజ్య సౌలభ్యాన్ని ప్రోత్సహించడానికి, ఆర్థిక అభివృద్ధికి వాణిజ్యం దోహదం చేసేలా చూడటానికి ద్వైపాక్షిక, ప్రాంతీయ, బహుళపక్ష వేదికలలో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశాయి.
• అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి, గ్లోబల్ - బయోఫ్యూయెల్స్ అలయన్స్, మిషన్- లైఫ్ స్టయిల్ ఫర్ ఎన్విరాన్మెంట్ (ఎల్ఐఎఫ్ఇ) వంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పథకాల ద్వారా అందుబాటులో ఉన్న ఉత్తమ సైన్స్, సాంకేతిక పరిజ్ఞానాల ఆధారంగా వాతావరణ మార్పులను పరిష్కరించడానికి సమష్టి ప్రపంచ ప్రయత్నాలకు రెండు దేశాలు పిలుపునిచ్చాయి.
• ఫిలిప్పీన్స్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఫండ్ ఫర్ రెస్పాన్స్ టు లాస్ అండ్ డ్యామేజ్ బోర్డు నుంచి సహకార అవకాశాలను అన్వేషించేందుకు అంగీకరించారు.
• ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ద్వారా జరుగుతున్న సంరక్షణ ప్రయత్నాలను అభినందించారు.
• 1982 ఐక్యరాజ్యసమితి సముద్ర హక్కుల ఒప్పందం (యుఎన్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ -యూఎన్సీఎల్ఓఎస్) కింద దేశాల హక్కులు, బాధ్యతలపై అంతర్జాతీయ చట్టానికి పూర్తి గౌరవాన్ని, కట్టుబాటును పునరుద్ఘాటించారు. అలాగే సముద్ర హక్కుల భౌగోళిక, వాస్తవ పరిమితులతో సహా దాని వివాద పరిష్కార యంత్రాంగాలు, సముద్ర పర్యావరణాన్ని రక్షించడం, సంరక్షించడం, అలాగే నావిగేషన్, ఓవర్ ఫ్లైట్ స్వేచ్ఛ పట్ల నిబద్ధతను పునరుద్ఘాటించారు. ముఖ్యంగా యూఎన్సీఎల్ఓఎస్ యు.ఎన్.సి.ఎల్.ఒ.ఎస్ లో ప్రతిబింబించినట్లుగా అంతర్జాతీయ చట్టం సూత్రాల ఆధారంగా అంతరాయం లేని వాణిజ్యం అవసరాన్ని అంగీకరించారు.
• 2016లో దక్షిణ చైనా సముద్రంపై వచ్చిన తుదితీర్పు - బైండింగ్ అర్బిట్రేషన్ అవార్డ్ - ను ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణిస్తూ, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా వివాదాలను శాంతియుతంగా పరిష్కరించేందుకు ఇది బలమైన పునాది అని పేర్కొన్నారు.
• దక్షిణ చైనా సముద్రంలో నెలకొన్న పరిస్థితిపై, ముఖ్యంగా ప్రాంతీయ శాంతి, సుస్థిరతపై ప్రభావం చూపే నిర్బంధ, దౌర్జన్య చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, సంబంధిత పక్షాలు స్వీయ నియంత్రణ పాటించాలని, వివాదాలను శాంతియుతంగా, సానుకూలంగా పరిష్కరించేందుకు కట్టుబడి ఉండాలని ఉండాలని పిలుపునిచ్చారు.
• ఆసియాన్-భారత్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సంయుక్తంగా బలపరచేందుకు, తరచూ శిఖరాగ్ర స్థాయి సమావేశాలు సహా ఆసియాన్ పరిధిలో భాగస్వామ్యం, సహకారాన్ని మరింత లోతుగా విస్తరించేందుకు మద్దతు ప్రకటించారు. ప్రాంతీయ స్వరూపం వేగంగా మారుతున్న పరిస్థితుల్లో, ఆసియాన్ కేంద్ర భూమిక పట్ల భారతదేశం చూపుతున్న నిరంతర కట్టుబాటును, అలాగే ఆసియాన్ ఆధ్వర్యంలో నడిచే వ్యవస్థలలో భారత్ చురుకైన భాగస్వామ్యాన్ని, సహకారాన్ని ఫిలిప్పీన్స్ ప్రశంసించింది.
• ఇండో-పసిఫిక్ పట్ల ఆసియాన్ దృక్పథం (ఏఒఐపీ), ఇండో-పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ మధ్య సహకారాన్ని పెంపొందించడం ద్వారా ప్రాంతంలో శాంతి, సుస్థిరత, అభివృద్ధి కోసం, ఏఒఐపీ పై సహకారానికి సంబంధించి ఆసియాన్ -ఇండియా సంయుక్త ప్రకటన కింద సహకారాన్ని అన్వేషించాలని నిర్ణయించారు.
*వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ సమ్మిట్ (వీఓజీఎస్ఎస్) ద్వారా గ్లోబల్ సౌత్ కు సంబంధించిన అంశాలపై బహుళపక్ష వేదికల్లో సహకారం కొనసాగుతుందని ప్రకటించారు. ఈ మేరకు ఇప్పటి వరకు నిర్వహించిన మూడు వీవోజీఎస్ఎస్ లలో ఫిలిప్పీన్స్ క్రియాశీలక భాగస్వామ్యాన్ని భారత్ అభినందించింది.
10. 1952 జూలై 11 న భారత్, ఫిలిప్పీన్స్ ప్రభుత్వాల మధ్య స్నేహపూర్వక ఒప్పందం మౌలికమైన, స్థిరమైన స్ఫూర్తికి కట్టుబడి, ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ముందుకు సాగాలనే ధృఢ సంకల్పాన్ని రెండు దేశాలు వ్యక్తం చేశాయి.
***
(Release ID: 2152837)
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada