సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఈశాన్య భారతాన్ని శక్తిమంతం చేస్తూ.. యువతకు ఎన్ఎఫ్డీసీ ఉచిత నివాస వీఎఫ్ఎక్స్,యానిమేషన్ శిక్షణ
3D యానిమేషన్, వీఎఫ్ఎక్స్ లో 8 నెలల ఉచిత నివాస శిక్షణ; పూర్తి ఖర్చు ప్రభుత్వానిదే.. స్కిల్ ప్రోగ్రామ్‌కు 100 మంది ఎంపిక
దరఖాస్తుకు చివరి తేదీ 15 ఆగస్టు 2025
Posted On:
02 AUG 2025 11:05AM by PIB Hyderabad
ఈశాన్య భారత యువత కోసం ప్రత్యేకంగా 3D యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్)లో భారత ప్రభుత్వ సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎఫ్డీసీ), పూర్తిగా నివాస శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
ఈ శిక్షణ ఈశాన్య భారతంలోని ఎనిమిది రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపురకు చెందిన వ్యక్తులకు అందుబాటులో ఉంటుంది. దరఖాస్తుదారులు 2025 జూన్ నాటికి కనీసం 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఎన్ఎఫ్డీసీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీవెట్) సంయుక్తంగా జారీ చేసే సర్టిఫికేట్ లభిస్తుంది.
కనీస అర్హతగా 10+2 పాస్, లేదా 10వ తరగతి పాస్ తోపాటు సంబంధిత రంగంలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ కోసం రూ.1,180 (పన్నులు సహా) నామమాత్రపు, మళ్లీ తిరిగి చెల్లించని రిజిస్ట్రేషన్ ఫీజు వర్తిస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఎన్ఎఫ్డీసీ అధికారిక వెబ్సైట్ www.nfdcindia.com ను సందర్శించడం ద్వారా, లేదా నేరుగా రిజిస్ట్రేషన్ పోర్టల్ https://skill.nfdcindia.com/Specialproject ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ 15 ఆగస్టు, 2025. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా సహాయం కావలసినపుడు, అభ్యర్థులు skillindia@nfdcindia.com కు మెయిల్ చేయవచ్చు.
గడువు ముగిసిన తర్వాత, మొత్తం 100 మందిని స్క్రీనింగ్, మూల్యాంకన ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తారు. ఆప్టెక్ లిమిటెడ్, ఎన్ఎఫ్డీసీ శిక్షణ భాగస్వామితో కలిసి నిర్వహించబోయే 8 నెలల నివాస శిక్షణ కార్యక్రమంలో వారు పాల్గొంటారు. ఈ శిక్షణా కార్యక్రమం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్లోని పూర్తిస్థాయి సదుపాయాలు కలిగిన శిక్షణ కేంద్రంలో నిర్వహిస్తారు. ఇది రెండు భాగాలుగా ఉంటుంది: ఆరు నెలల తరగతి ఆధారిత కఠిన శిక్షణ – 3D యానిమేషన్ మరియు వీఎఫ్ఎక్స్ లో నిపుణుల బోధన. రెండు నెలల పరిశ్రమ అనుభవ శిక్షణ – స్టూడియోలలో నేరుగా పనిచేసే అనుభవం. ఈ శిక్షణలో హ్యాండ్స్-ఆన్ లెర్నింగ్ మాడ్యూళ్లు, ఇండస్ట్రీకి అనుగుణమైన ప్రాజెక్టులు, ఫిలిం స్టూడియోలు, కంటెంట్ క్రియేషన్ కంపెనీల్లో వాడే అసలైన వర్క్ ఫ్లో ల పరిచయం ఉంటాయి.
ఎంపికైన ప్రతి అభ్యర్థికి శిక్షణా కాలమంతా వారి అభ్యాసాన్ని మెరుగుపరుచుకునేందుకు అధిక సామర్ధ్యం కలిగిన లాప్ టాప్ ఇస్తారు.
ముఖ్యంగా, ఈ శిక్షణా కార్యక్రమం మొత్తం నివాసం, భోజనం సహా పూర్తిగా ఉచితం. ఎంపికైన అభ్యర్థులపై ఏమాత్రం ఆర్ధిక భారం లేకుండా ఉచిత నివాస సౌకర్యం, రోజుకు మూడుసార్లు భోజనం, శిక్షణా వనరులు, మార్గదర్శక సహాయం అందిస్తారు. ఆర్థికంగా, భౌగోళికంగా వెనుకబడ్డ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన యువతను దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో సమానావకాశాలతో భాగస్వాములయ్యేలా చేయడం ఈ కార్యక్రమ లక్ష్యం.
దేశ ఈశాన్య రాష్ట్రాల్లో సృజనాత్మక ప్రతిభ విస్తృతంగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో వెలుగులోకి రావడం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన ఎన్ఎఫ్డీసీ, ప్రొఫెషనల్ శిక్షణ, నైపుణ్యాల మధ్య ఉన్న ప్రాంతీయ అసమానతలను పరిష్కరించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వ్యూహాత్మకంగా రూపొందించింది. నివాస శిక్షణా కార్యక్రమానికి సంబంధించి ఇది మూడోసారి చేపడుతున్న శిక్షణా కార్యక్రమం. ఈ ప్రాంతం నుంచి నైపుణ్యం గల డిజిటల్ ఆర్టిస్ట్ లు, యానిమేషన్ నిపుణులను తయారు చేయడం దీని లక్ష్యం. ఇందులో పాల్గొనేవారికి మంచి డిమాండ్ కలిగిన సాంకేతిక నైపుణ్యాలను అందించడమే కాక ఉపాధి, వ్యాపారం, దీర్ఘకాలిక ఆర్థిక సాధికారత కల్పించడాన్ని కూడా లక్ష్యంగా పెట్టుకుంది.
భారత ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ఎఫ్డీసీ దేశంలో సినిమా, సృజనాత్మక రంగాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. అర్ధవంతమైన భారతీయ సినిమాల నిర్మాణం, ప్రోత్సహించడం లో ఎన్ఎఫ్డీసీ కీలకంగా వ్యవహరిస్తోంది. శిక్షణ, మూల్యాంకన, సర్టిఫికేషన్, ఉద్యోగ సహకారం వంటి సమస్త పరిష్కారాలను అందిస్తూ, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. యానిమేషన్, ఫిల్మ్ మేకింగ్, వీఎఫ్ఎక్స్, గేమింగ్, డిజిటల్ కంటెంట్ క్రియేషన్, అడ్వర్టైజింగ్ వంటి రంగాల్లో ఎప్పటికప్పుడు మారుతున్న ఎం&ఈ పరిశ్రమ అవసరాలను తీర్చేందుకు రూపొందించిన వ్యవస్థాబద్ధమైన శిక్షణా కార్యక్రమాల అమలులోనూ కీలక పాత్ర పోషిస్తోంది.
***
(Release ID: 2151958)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali-TR
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam