ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆగస్టు 2న వారణాసిలో ప్రధాని పర్యటన


· వారణాసిలో దాదాపు రూ.2200 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

· ప్రాజెక్టులతో మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య రక్షణ, పర్యాటకం, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక వారసత్వం తదితర రంగాలకు ఊతం

· స్మార్ట్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు కింద వివిధ పనులకు శంకుస్థాపన, భూగర్భ విద్యుత్ మౌలిక సదుపాయాలు

· సాంస్కృతిక ప్రాధాన్యమున్న జల వనరుల సంరక్షణ లక్ష్యంగా.. వివిధ కుండ్‌లలో నీటి శుద్ధి, నిర్వహణ పనులకు శంకుస్థాపన

· 20వ విడత పీఎం-కిసాన్ నిధులను విడుదల చేయనున్న ప్రధాని.. 9.7 కోట్ల కుటుంబాలకు రూ. 20,500 కోట్ల బదిలీ

· ప్రారంభించినప్పటి నుంచి పీఎం-కిసాన్ ద్వారా మొత్తం రూ. 3.90 లక్షల కోట్ల పంపిణీ

Posted On: 31 JUL 2025 6:59PM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో దాదాపు రూ. 2200 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆగస్టు 2న ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆయన సభనుద్దేశించి ప్రసంగిస్తారు.

వారణాసిలో సమగ్ర పట్టణాభివృద్ధి, సాంస్కృతిక పునరుజ్జీవనం, మెరుగైన రవాణా సదుపాయం, జీవన ప్రమాణాలను పెంపొందించడం లక్ష్యంగా.. మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య రక్షణ, పర్యాటకం, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక వారసత్వం వంటి వివిధ రంగాల్లో ఈ ప్రాజెక్టులు ఉపయోగపడతాయి.

వారణాసిలో రోడ్డు రవాణాను మెరుగుపరచడం లక్ష్యంగా.. పలు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. వారణాసి - భదోహి రహదారి, ఛితౌని- షూల్ టంకేశ్వర్ రహదారి విస్తరణ పనులనూ, మోహన్ సరాయ్ – అదల్‌పురా రోడ్డులో రద్దీని తగ్గించడం కోసం హర్‌దత్‌పూర్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జిని ఆయన ప్రారంభిస్తారు. దల్మండి, లహర్తారా-కొట్వా, గంగాపూర్, బాబత్‌పూర్ వంటి వివిధ గ్రామీణ, పట్టణ కారిడార్‌లలో సమగ్ర రహదారి విస్తరణ, అభివృద్ధి పనులకు, అలాగే లెవెల్ క్రాసింగ్ 22సీ, ఖలీస్‌పూర్ యార్డ్ వద్ద రైల్వే ఓవర్‌బ్రిడ్జిలకు ఆయన శంకుస్థాపన చేస్తారు.

ఈ ప్రాంతంలో విద్యుత్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేలా.. స్మార్ట్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు కింద వివిధ పనులకు రూ. 880 కోట్లకు పైగా వ్యయంతో భూగర్భంలో విద్యుత్ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు.

పర్యాటకానికి ఊతమిచ్చేలా.. నదీతీరాల్లోని 8 కచ్చా ఘాట్లు, కాళికా ధామ్‌లో అభివృద్ధి పనులు, రంగీల్ దాస్ కుటియా, శివపూర్ వద్ద చెరువు, ఘాట్ సుందరీకరణ, దుర్గాకుండ్ పునరుద్ధరణ, నీటి శుద్దీకరణ పనులను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. కర్దమేశ్వర మహాదేవ్ ఆలయ పునరుద్ధరణ పనులు, అనేక స్వాతంత్ర్య సమరయోధుల జన్మస్థలమైన కార్ఖియాన్ అభివృద్ధి, సారనాథ్, రిషి మాండ్వి, రాంనగర్ జోన్లలో సిటీ ఫెసిలిటీ కేంద్రాలు, లామాహిలోని మున్షీ ప్రేమ్‌చంద్ పూర్వీకుల ఇంటి పునరుద్ధరణ, దానిని మ్యూజియంగా తీర్చిదిద్దడం తదితర పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. కాంచన్‌పూర్‌లో ఓ అర్బన్ మియావాకి ఫారెస్ట్ అభివృద్ధికీ, అలాగే షహీద్ ఉద్యాన్, 21 ఇతర పార్కుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు.

సాంస్కృతిక ప్రాధాన్యం ఉన్న ముఖ్య జల వనరులను సంరక్షణ కోసం.. రామ్‌కుండ్, మందాకిని, సంకుల్‌ధార, తదితర కుండ్‌లలో నీటి శుద్ధి, నిర్వహణ పనులకూ.. వాటితోపాటు నాలుగు తేలియాడే పూజా వేదికల ఏర్పాటుకూ ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సదుపాయం కల్పించడం కోసం జల్ జీవన్ మిషన్ కింద 47 గ్రామీణ తాగునీటి పథకాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.

అందరికీ అత్యుత్తమ విద్యను అందించాలన్న లక్ష్యాన్ని బలోపేతం చేసే దిశగా మున్సిపల్ సరిహద్దుల్లో ఉన్న 53 పాఠశాల భవనాల పునరుద్ధరణ పనులను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. కొత్త జిల్లా గ్రంథాలయ నిర్మాణంతోపాటు జఖిని, లాల్‌పూర్‌లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పునరుద్ధరణ సహా అనేక విద్యా ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారు.

మహామన పండిత మదన్ మోహన మాలవ్య క్యాన్సర్ సెంటర్, హోమీ భాభా క్యాన్సర్ ఆస్పత్రిలో రోబోటిక్ సర్జరీ, సీటీ స్కాన్ సదుపాయాలు సహా అధునాతన వైద్య పరికరాలతో చికిత్స కేంద్రాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఇది ఆరోగ్య మౌలిక సదుపాయాలకు ఎంతగానో ఊతమిస్తుంది. హోమియోపతి కళాశాల, ఆస్పత్రికి కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు. అంతేకాకుండా, ఓ జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని, అనుబంధంగా శునకాల సంరక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు.

వారణాసిలో ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేలా.. డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ స్టేడియంలో సింథటిక్ హాకీ క్రీడా వేదికను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఇవే కాకుండా రాంనగర్‌లోని ప్రాదేశిక సాయుధ రక్షక భట నిలయం (పీఏసీ)లో 300 మంది సామర్థ్యం గల హాలును ప్రారంభించడంతోపాటు క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూఆర్‌టీ) బ్యారక్‌లకు శంకుస్థాపన చేస్తారు.

పీఎం-కిసాన్ 20వ విడతను కూడా ప్రధానమంత్రి విడుదల చేస్తారు. రైతు సంక్షేమం దిశగా ఇదొక ముఖ్యమైన ముందడుగు. దేశవ్యాప్తంగా 9.7 కోట్లకు పైగా రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.20,500 కోట్లకు పైగా నేరుగా బదిలీ చేస్తారు. దీంతో ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి చేసిన మొత్తం చెల్లింపులు రూ. 3.90 లక్షల కోట్లు దాటినట్లు అవుతుంది.

కాశీ సంసద్ ప్రతియోగిత కింద.. స్కెచింగ్, చిత్రలేఖనం, ఫొటోగ్రఫీ, ఖేల్ కూద్ ప్రతియోగిత, జ్ఞాన ప్రతియోగిత, రోజ్‌గార్ మేళా సహా వివిధ కార్యక్రమాలు, పోటీల కోసం నమోదు పోర్టలును కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. వివిధ దివ్యాంగజనుల, వృద్ధులకు 7,400 కు పైగా సహాయక పరికరాలను ప్రధానమంత్రి పంపిణీ చేస్తారు.  

 

***


(Release ID: 2151180)