యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
కార్గిల్‌లో భారత్ విజయానికి 26 ఏళ్లు..ఈ ఘట్టాన్ని స్మరించుకొంటూ రేపు ‘మై భారత్’ యువ వాలంటీర్ల ‘‘కార్గిల్ విజయ్ దివస్ పాదయాత్ర’’
*ద్రాస్‌లో ‘నివాళి నడక’.. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ, శ్రీ సంజయ్ సేథ్‌ల నాయకత్వం
Posted On:
25 JUL 2025 11:12AM by PIB Hyderabad
భారత్ 1999లో కార్గిల్ యుద్ధంలో సాధించిన విజయానికి ఈ నెల 26న ఇరవై ఆరో వార్షికోత్సవం. దీనికి గుర్తుగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ‘మై భారత్’ (మేరా యువ భారత్) రేపు కార్గిల్‌లోని ద్రాస్‌లో ‘‘కార్గిల్ విజయ్ దివస్ పాదయాత్ర’’ను నిర్వహించనుంది.
ఈ పాదయాత్రకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖతో పాటు కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ నాయకత్వం వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేథ్‌తో పాటు 1,000 మందికి పైగా యువజనులు, మాజీ సైనికులు, సాయుధ దళాల సిబ్బంది, అమరవీరుల కుటుంబాలు, పౌర సమాజ సభ్యులు కూడా పాల్గొంటారు.
ఈ పాదయాత్ర 1.5 కి.మీ. మేర సాగనుంది. ఉదయం 7 గంటలకు ద్రాస్‌లోని హింబాస్ పబ్లిక్ హై స్కూల్ మైదానం నుంచి మొదలయ్యే పాదయాత్ర, భీంబెట్‌లోని ప్రభుత్వ ఉన్నత మాధ్యమిక పాఠశాల మైదానానికి చేరుకోవడంతో ముగుస్తుంది.
పాదయాత్ర తరువాత, కేంద్ర మంత్రి 100 మంది యువ వాలంటీర్లతో కలిసి కార్గిల్ యుద్ధ స్మారక కేంద్రానికి వెళ్లి 1999 కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగానికైనా జంకక అమరులైన సైనికులకు పుష్పాంజలి ఘటించడంతో పాటు నివాళి అర్పించనున్నారు.
ఈ సందర్భంగా, ‘శక్తి ఉద్ఘోష్ ఫౌండేషన్’కు చెందిన 26 మంది మహిళా బైకర్లను గౌరవ మంత్రి సత్కరించనున్నారు. ఈ మహిళా బైకర్లు అమర జవాన్లకు నివాళిని అర్పించేందుకు నిర్వహించిన సుదూర మోటర్‌సైకిల్ ర్యాలీని పూర్తి చేసి, యుద్ధ స్మారకానికి చేరుకొంటారు.
‘‘ఏక్ పేడ్ మా కే నామ్’’ (తల్లి పేరిట ఒక మొక్కను నాటుదాం) కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటే పనిని కూడా ఈ పాదయాత్రలో చేపట్టనున్నారు. అంటే దీనిలో దేశభక్తి కర్తవ్యానికి పర్యావరణ చైతన్యాన్ని కూడా జతచేయనున్నారు. దీంతో పాటు, 2047కల్లా వికసిత్ భారత్ గమ్యం వైపు పయనించే క్రమంలో సుస్థిర అభివృద్ధి సాధన పట్ల నిబద్ధతను కూడా చాటిచెప్పనున్నారు.
పాదయాత్ర కంటే ముందు.. వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు, ‘యువా సంవాద్’ (యువజనులు పాల్గొనడానికి వీలుగా చర్చ కార్యక్రమాలు) వంటి వాటిని ‘మై భారత్’ నిర్వహించి, ఈ కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు ఆ ప్రాంతంలోని యువజనులను, స్థానికులను ప్రోత్సహిస్తూ వచ్చింది. పౌరులలో అవగాహనను పెంచడం, పరాక్రమ గాథలను పండుగ చేసుకోవడం, సాయుధ దళాలతో భావోద్వేగభరిత అనుబంధం బలపడేటట్లు చూడడం ముఖ్యోద్దేశాలుగా ఈ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల ద్వారా సేవాభావం, త్యాగం, దేశభక్తి వంటి ఆదర్శాల పట్ల ‘అమృత తరం’ యువతలో, భావి భారత నిర్మాతలలో స్పృహను మరింత పెంచుతున్నారు.
ఈ పాదయాత్ర మరింత భారీదైన ‘వికసిత్ భారత్ పాదయాత్ర కార్యక్రమం’లో ఓ భాగం. దేశ గౌరవాన్ని , పౌరుల భాగస్వామ్యాన్ని పెంచడం, యువజనుల్లో ఏకతా భావనను బలోపేతం చేయడం అనే ధ్యేయాలతో దేశమంతటా సంస్మరణ ప్రధాన కార్యక్రమాలను, భాగస్వామ్య ప్రధాన కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేశ నిర్మాణంలో ప్రజలు భాగస్వామ్యం పంచుకొనేటట్లు చూడాలన్న ప్రధానమంత్రి దృష్టికోణానికి అనుగుణంగా, జాతీయ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు యువతీయువకుల మొదలు వయోవృద్ధుల వరకు ఆసక్తిదారులందరినీ ఈ కార్యక్రమం ఒక చోటుకు తీసుకువస్తుంది. దేశ నిర్మాణంలో పౌరుల, ప్రత్యేకించి యువతరం పోషించాల్సిన పాత్రను మరింత బలపరుస్తుంది.
***
(Release ID: 2148424)