ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బ్రిటన్ గౌరవ కింగ్ ఛార్లెస్ III తో ప్రధానమంత్రి భేటీ

Posted On: 24 JUL 2025 11:00PM by PIB Hyderabad

బ్రిటన్ రాజు గౌరవ ఛార్లెస్ IIIని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కలుసుకొన్నారు. రాజు గారి వేసవి నివాసం శాండ్రింఘమ్ ఎస్టేట్‌లో ఆయనతో ప్రధానమంత్రి సమావేశమయ్యారు.

రాజు గారి ఆరోగ్యం కుదుటపడి, మళ్లీ రాచకార్యాలను నిర్వహించడం మొదలుపెట్టడం సంతోషం  కలిగించిందని ప్రధానమంత్రి అన్సారు. ఆరోగ్యం, సుస్థిర జీవనం.. వీటికి సంబంధించిన అంశాలను గురించి నేతలు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆయుర్వేదం, యోగా ప్రయోజనాలను ప్రపంచం అంతటా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై ఉభయులూ చర్చించారు.

ఇరు దేశాల సంబంధాలు నేతల చర్చలలో ప్రస్తావనకు వచ్చాయి. చరిత్రాత్మక రీతిలో ‘భారత్-బ్రిటన్ సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పదం’ కుదిరినందువల్ల ఇరుపక్షాల భాగస్వామ్యం కొత్త జోరును అందుకోగలదని వారు అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలిక అభివృద్ధి సాధన దిశగా పయనించడంలో భాగంగా పునరుత్పాదక రంగంలో భారత్ వేసిన ముందంజను గురించి రాజు గారికి ప్రధానమంత్రి వివరించారు. వాతావరణ మార్పు, సుస్థిరాభివృద్ధి.. ఈ విషయాల్లో పరస్పరం సహకరించుకోవడానికి, ఉమ్మడి దృష్టికోణంతో ముందుకు పోవడానికి ఉన్న అవకాశాలను కూడా వారు చర్చించారు.

కామన్వెల్త్‌లో బ్రిటన్, భారత్ కలిసికట్టుగా ఏయే విధాలుగా పనిచేయవచ్చనే అంశాన్ని గురించి కూడా గౌరవ రాజు, ప్రధానమంత్రి మాట్లాడుకున్నారు.

పచ్చదనాన్ని పెంచేందుకు అమలుచేస్తున్న కార్యక్రమం ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (తల్లి పేరిట ఒక మొక్కను నాటుదాం)లో చేరినందుకు రాజు గారికి ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఒక మొక్కను రాజు గారికి అందజేశారు. ఈ  మొక్కను రాబోయే శరత్కాలంలో శాండ్రింఘమ్ ఎస్టేట్‌లో నాటుతారు.

గౌరవ రాజు చేసిన అతిథి మర్యాదలకుగాను ప్రధానమంత్రి ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. భారత్‌లో అధికారిక పర్యటనకు రావాల్సిందిగా రాజు గారిని ఆహ్వానించారు.


 

**‌*


(Release ID: 2148313)