వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎరువుల నాణ్యత నిర్ధారణ ప్రచారం ప్రారంభంపై రాష్ట్రాలకు సూచనలు


నాణ్యత లేని ఎరువులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

ప్రచార నిర్వహణ ద్వారా చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులకు లేఖ రాసిన కేంద్ర మంత్రి

నకిలీ, నాణ్యత లేని వ్యవసాయ ముడిసరుకు సమస్యను మూలాల నుంచి తొలగించాలని ప్రధానంగా ప్రస్తావించిన శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

Posted On: 13 JUL 2025 1:11PM by PIB Hyderabad

నకిలీ, నాసిరకం ఎరువుల సమస్యపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా నకిలీ ఎరువుల అమ్మకాలు, రాయితీ ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, బలవంతపు ట్యాగింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడం లక్ష్యంగా ఈ లేఖ రాశారు.

భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక వంటిదని పేర్కొన్న కేంద్ర మంత్రి.. రైతులకు సుస్థిర ఆదాయం అందించడం కోసం వారికి సరైన సమయంలో, సరసమైన ధరలకు ప్రామాణిక నాణ్యత గల నాణ్యమైన ఎరువులు అందించడం చాలా అవసరమని లేఖలో స్పష్టం చేశారు.

నిత్యావసర వస్తువుల చట్టం-1955 కింద.. ఎరువుల (నియంత్రణ) ఉత్తర్వు-1985 ప్రకారం నకిలీ, నాసిరకం ఎరువుల అమ్మకం నిషేధించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాష్ట్రాలకు పలు ఆదేశాలను జారీ చేశారు:

1.  అవసరానికి అనుగుణంగా అన్ని ప్రాంతాల్లో ఎరువులు సరిపడా అందుబాటులో ఉండేలా చూసుకోవడం రాష్ట్రాల బాధ్యత. దీని కోసం బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరకు విక్రయం, రాయితీ ఎరువుల మళ్లింపు వంటి కార్యకలాపాలపై రాష్ట్రాలు గట్టి నిఘా ఉంచాలి. అలాంటి కార్యకలాపాలపై సత్వరం చర్యలు తీసుకోవాలి.

2. ఎరువుల ఉత్పత్తి, అమ్మకాలను నిరంతరం పర్యవేక్షించాలి. నమూనా సేకరణ, పరీక్షల నిర్వహణ ద్వారా నకిలీ, నాసిరకం ఉత్పత్తులపై కఠినమైన నియంత్రణను నిర్వహించాలి.

3. సంప్రదాయిక ఎరువులతో పాటు నానో-ఎరువులు, బయో-స్టిమ్యులెంట్ ఉత్పత్తుల బలవంతపు ట్యాగింగ్‌ వెంటనే ఆపాలి.

4.   దోషులపై లైసెన్స్‌ రద్దు, ఎఫ్‌ఐఆర్‌ నమోదు వంటి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి. దోషులకు తగిన శిక్ష పడేందుకు వీలుగా విచారణ సమర్థంగా జరిగేలా చూడాలి.

5. రైతులు/రైతు సంఘాలు ఈ పర్యవేక్షణలో పాలుపంచుకునేలా అభిప్రాయ, సమాచార వ్యవస్థలను రూపొందించాలి. నిజమైన, నకిలీ ఉత్పత్తులను గుర్తించగలిగేలా రైతులకు అగాహన కల్పించేందుకు ప్రత్యేక కృషి జరగాలని రాష్ట్రాలను ఆదేశించారు.

నకిలీ, నాసిరకం వ్యవసాయ ముడి సరకుల సమస్యను మూలాల నుంచి తొలగించేందుకు పైన పేర్కొన్న ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించాలని కేంద్ర మంత్రి అన్ని రాష్ట్రాలనూ కోరారు. రైతుల ప్రయోజనం కోసం రాష్ట్ర స్థాయిలో ఈ పనిని నిరంతరం పర్యవేక్షించడం ద్వారా ప్రభావవంతమైన, సుస్థిరమైన పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.


 

***


(Release ID: 2144409)