రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రయాణికుల భద్రత కోసం రైలు కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్న రైల్వే శాఖ


మెరుగైన భద్రత కోసం 74,000 కోచ్‌లు, 15,000 రైలింజనులలో సీసీటీవీ కెమెరాలు.
ప్రతి కోచ్‌లో 4 సీసీటీవీ కెమెరాలు.. రైలింజనులలో 6 కెమెరాలు ఏర్పాటు చేయనున్న రైల్వే శాఖ

100 కిలోమీటర్లకు పైగా వేగం.. తక్కువ వెలుతురులోనూ అధిక నాణ్యత గల సీసీటీవీ ఫుటేజ్ పొందే ఏర్పాటు

Posted On: 13 JUL 2025 4:02PM by PIB Hyderabad

ప్రయోగాత్మకంగా ప్రయాణికుల కోచ్‌లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు సానుకూల ఫలితాలను ఇచ్చిన క్రమంలో, రైల్వే శాఖ అన్ని రైలు కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ చర్య ప్రయాణికుల భద్రతను గణనీయంగా మెరుగుపరుస్తుంది. దొంగలు, నేరపూరిత ముఠాలు అమాయక ప్రయాణికులపై దాడులకు తెగిస్తున్నారు. ఈ కెమెరాలతో అటువంటి ఘటనలు గణనీయంగా తగ్గుతాయి. ప్రయాణికుల గోప్యత పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూనే తలుపుల దగ్గర, సాధారణంగా ఎక్కువ కదలికలు ఉండే ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు.              

రైలింజనులు, కోచ్‌లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు పురోగతిని కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్, సహాయ మంత్రి శ్రీ రవ్‌నీత్ సింగ్ బిటూ సమీక్షించారు. ఈనెల 12న నిర్వహించిన ఈ సమావేశంలో రైల్వే బోర్డు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

౩౬౦ డిగ్రీల సమగ్ర కవరేజ్

నార్తర్న్ రైల్వే పరిధిలోని రైలింజనులు, కోచ్‌లలో ట్రయల్స్ విజయవంతమైనట్లు రైల్వే అధికారులు తెలిపారు. తాజాగా మొత్తం 74,000 కోచ్‌లు, 15,000 రైలింజనులలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు కోసం కేంద్ర రైల్వే మంత్రి అనుమతి ఇచ్చారు. ప్రతి రైల్వే కోచ్‌లో 4 డోమ్ రకం సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. వీటిలో ప్రతి ప్రవేశ మార్గంలో 2 కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి రైలింజనులో 6 కెమెరాలు ఉంటాయి. ఇందులో రైలింజను ముందర, వెనక, రెండు ప్రక్కలా ఒక్కో కెమెరా ఏర్పాటు చేస్తారు. రైలింజను ప్రతి క్యాబ్ (ముందు, వెనక) 1 డోమ్ సీసీటీవీ కెమెరా, 2 డెస్క్ మౌంటెడ్ మైక్రోఫోన్‌లను అమర్చనున్నారు.

ఆధునిక సమస్యల కోసం అత్యాధునిక నిఘా

ఈ సీసీటీవీ కెమెరాలు అత్యాధునిక ప్రత్యేకతలను కలిగి ఉంటాయనీ, ఎస్‌క్యూటీసీ ధ్రువీకరణ పొందినవిగా అధికారులు తెలిపారు. అత్యుత్తమ శ్రేణి పరికరాలను అమర్చుతున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి స్పష్టం చేశారు. 100 కిలోమీటర్లకు పైగా వేగం, తక్కువ వెలుతురు వంటి పరిస్థితుల్లోనూ.. నడుస్తున్న రైళ్లలో అధిక నాణ్యత గల ఫుటేజ్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆయన రైల్వే అధికారులను కోరారు. ఇండియాఏఐ మిషన్ సహకారంతో సీసీటీవీ కెమెరాల ద్వారా సంగ్రహించిన డేటాపై కృత్రిమ మేధస్సును వినియోగించే మార్గాలను అన్వేషించాలని కేంద్ర రైల్వే మంత్రి అధికారులకు సూచించారు.

డేటా భద్రతకు ప్రాధాన్యం

కోచ్‌లలో సాధారణంగా కదలికలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కెమెరాలను అమర్చడం ద్వారా ప్రయాణికుల భద్రత, రక్షణను మెరుగుపరచవచ్చు. గోప్యతను కాపాడుతూనే, ఈ కెమెరాలు దుండగులను గుర్తించడంలో సహాయపడతాయి. భారతీయ రైల్వేల ఈ ఆధునికీకరణ ప్రయత్నాలు సురక్షితమైన, భద్రమైన, ప్రయాణికుల హితమైన ప్రయాణ అనుభవం పట్ల రైల్వే శాఖ నిబద్ధతకు నిదర్శనం.


 

***


(Release ID: 2144407)