ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బ్రెజిల్ అధ్యక్షునితో సంయుక్త పత్రికా ప్రకటనలో ప్రధానమంత్రి ప్రకటనకు తెలుగు అనువాదం

Posted On: 09 JUL 2025 12:54AM by PIB Hyderabad

నా స్నేహితుడు, గౌరవ అధ్యక్షులు లూలాకి,
రెండు దేశాల ప్రతినిధులకు,

పాత్రికేయ మిత్రులకు,

నమస్కారం.
‘‘బోవా టార్డే’’!

రియో, బ్రెజీలియాలో ఆత్మీయ స్వాగతం పలికిన నా స్నేహితుడు, అధ్యక్షుడు లూలాకు హ‌ృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమెజాన్ ప్రకృతి సౌందర్యం, మీ ఆత్మీయత మమ్మల్ని మంత్రముగ్ధులను చేశాయి.

బ్రెజిల్ అధ్యక్షుడు ఈ దేశ అత్యున్నత జాతీయ పురస్కారంతో సత్కరించడం నాకు మాత్రమే కాదు.. 140 కోట్ల మంది భారతీయులకు గర్వించే, భావోద్వేగ భరితమైన క్షణం. ఈ గౌరవాన్ని అందించిన అధ్యక్షునికి, బ్రెజిల్ ప్రభుత్వానికి, బ్రెజిల్ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

స్నేహితులారా,

భారత్, బ్రెజిల్‌ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యామనికి ప్రధాన శిల్పి నా స్నేహితుడు లూలానే. మా సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు.
ఆయనతో నిర్వహించిన ప్రతి సమావేశమూ రెండు దేశాల అభివృద్ధి, సంక్షేమానికి మరింత కష్టపడాలని నన్ను ప్రేరేపిస్తుంది. భారత్ పట్ల ఆయనకున్న నిబద్ధతకు, రెండు దేశాల మధ్య ఉన్న స్నేహసంబంధాలకు ఈ గౌరవాన్ని నేను అంకితం చేస్తున్నాను.

స్నేహితులారా,

అన్ని రంగాల్లోనూ సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి ఈ రోజు జరిగిన చర్చల్లో మేం అంగీకరించాం. వచ్చే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 20 బిలియన్ డాలర్లకు పెంచాలని మేం లక్ష్యంగా నిర్దేశించుకున్నాం.

భారతీయులు క్రికెట్‌ను ఎంతగా ఇష్టపడతారో బ్రెజిల్ కూడా ఫుట్‌బాల్‌ను అంతే ప్రేమిస్తుంది. బాల్‌ను బౌండరీకి పంపించడమైనా, గోల్‌లోకి పంపించడమైనా.. మనం ఒకే జట్టులో ఉన్నాం. కాబట్టి 20 బిలియన్ డాలర్ల భాగస్వామ్యాన్ని చేరుకోవడం అంత కష్టమేమీ కాదు. ఇండియా-మెర్కోసుర్ ప్రాధాన్య వాణిజ్య ఒప్పందం (పీటీఏ)ను విస్తరించేందుకు కలసి పనిచేస్తాం.

స్నేహితులారా,

ఇంధన రంగంలో మా సహకారం క్రమంగా వృద్ధి చెందుతోంది. పర్యావరణం, స్వచ్ఛ ఇంధనాలకు మా రెండు దేశాలు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ రంగంలో సహకారాన్ని విస్తరించే ఒప్పందంపై సంతకాలు చేశాం. ఇది హరిత లక్ష్యాలను సాధించడంలో కొత్త దిశను, వేగాన్ని అందిస్తుంది. ఈ ఏడాది నిర్వహించే కాప్-30 సదస్సుకు బ్రెజిల్ ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో అధ్యక్షుడు లూలాకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

రక్షణ రంగంలో రెండు దేశాల మధ్య పెరుగుతున్న సహకారం మా పరస్పర నమ్మకాన్ని తెలియజేస్తుంది. రక్షణ రంగంలోని పరిశ్రమలను అనుసంధానించడానికి, ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు మా ప్రయత్నాలను కొనసాగిస్తాం.
కృత్రిమ మేధ, సూపర్ కంప్యూటర్ల రంగంలో మా భాగస్వామ్యం విస్తరిస్తోంది. ఇది సమ్మిళిత అభివృద్ధి, మానవ కేంద్రక ఆవిష్కరణల్లో మా ఉమ్మడి దృక్పథాన్ని ప్రతిబింబిస్తోంది.

బ్రెజిల్లో యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకురావడంపై రెండు దేశాలు కలసి పనిచేస్తున్నాయి. డిజిటల్ ప్రజా మౌలిక వసతులు, అంతరిక్షం లాంటి రంగాల్లో భారత్‌ అనుభవాన్ని బ్రెజిల్‌తో మేం సంతోషంగా పంచుకుంటాం.

వ్యవసాయం, పశుసంవర్ధకం రంగాల్లో కొన్ని దశాబ్దాలుగా మా మైత్రి కొనసాగుతోంది. వ్యవసాయ పరిశోధన, ఆహార శుద్ధి తరహా రంగాల్లో ప్రస్తుతం మేం కలసి పనిచేస్తున్నాం. ఆరోగ్య రంగంలో సైతం రెండు దేశాలకు ప్రయోజనం కలిగేలా మా సహకారాన్ని విస్తరిస్తున్నాం. ఆయుర్వేద, సంప్రదాయ వైద్యాన్ని బ్రెజిల్లో విస్తరించేందుకు మేం ప్రాధాన్యమిస్తున్నాం.

మిత్రులారా,

మా మైత్రిలో ప్రజాసంబంధాలు చాలా ముఖ్యమైనవి. రెండు దేశాల్లో క్రీడల పట్ల ఉన్న ఆసక్తి కూడా మా బంధాన్ని మరింత బలోపేతం చేస్తోంది. వీసా కౌంటర్ల వద్ద బారులు తీరిన క్యూలు లేకుండా.. భారత్-బ్రెజిల్ మధ్య సంబంధాలు కార్నివాల్లాగా ఉత్సాహభరితంగా, ఫుట్ బాల్లా ఉద్వేగభరితంగా, హృదయాన్ని తాకే సాంబాలా ఉండాలని మేం కోరుకుంటున్నాం. ఇదే స్ఫూర్తితో రెండు దేశాల మధ్య ముఖ్యంగా పర్యాటకం, విద్యార్థులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తల మధ్య ప్రజా సంబంధాలను సులభతరం చేసేందుకు మేం కృషి చేస్తున్నాం.

స్నేహితులారా,

అంతర్జాతీయ స్థాయిలో భారత్, బ్రెజిల్ ఎల్లప్పుడూ సమన్వయంతో పనిచేస్తున్నాయి. రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా, మా సహకారం గ్లోబల్ సౌత్‌కి మాత్రమే కాకుండా, మొత్తం మానవాళికి ప్రయోజనం చేకూరుస్తుంది. గ్లోబల్ సౌత్ ఆందోళనలు, ప్రాధాన్యాలను అంతర్జాతీయ వేదికలపై ముందుకు తీసుకు రావడం మా నైతిక బాద్యత అని మేం బలంగా విశ్వసిస్తున్నాం.

ప్రస్తుత ప్రపంచం ఉద్రిక్తతలు, అనిశ్చితిని ఎదుర్కొంటోంది. నా స్నేహితుడు ఈ విషయాన్ని సమగ్రంగా వివరించారు. కాబట్టి నేను దాన్ని పునరావృతం చేయను. స్థిరత్వం, సమతూకానికి భారత్-బ్రెజిల్ భాగస్వామ్యం ప్రధానాధారంగా నిలుస్తుంది. చర్చలు, దౌత్యం ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవాలని మేం పూర్తిగా అంగీకరిస్తున్నాం.

ఉగ్రవాదాన్ని ఉపేక్షించని, ద్వంద్వ ప్రమాణాలను అనుసరించని ఒకే తరహా విధానాన్ని మేం అనుసరిస్తున్నాం. ఉగ్రవాదంపై పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలకు చోటు లేదనే మా వైఖరిని స్పష్టం చేస్తున్నాం. ఉగ్రవాదాన్ని, దానికి మద్దతు ఇచ్చేవారిని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.

అధ్యక్షా,

1.4 బిలియన్ల మంది భారతీయుల తరఫున ఈ అత్యున్నత జాతీయ గౌరవానికి, మీరందిస్తున్న స్నేహానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మిమ్మల్ని మా దేశాన్ని సందర్శించమని ఆహ్వానిస్తున్నాను.

ధన్యవాదాలు.

‘‘ముయిటో ఆబ్రిగాడో!’’


 

****


(Release ID: 2143545)