ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు.. క్యూబా అధ్యక్షునితో ప్రధాన మంత్రి భేటీ

Posted On: 07 JUL 2025 5:19AM by PIB Hyderabad

బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా, క్యూబా అధ్యక్షుడు గౌరవ మిగ్వెల్ డియాజ్-కానెల్ బెర్మూడెజ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. 2023లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు క్యూబా ప్రత్యేక ఆహ్వానితురాలుగా ఉన్నప్పుడు కూడా, క్యూబా అధ్యక్షుడు శ్రీ  డియాజ్-కానెల్‌ బెర్మూడెజ్‌తో ప్రధానమంత్రి భేటీ అయ్యారు.

నేతలిద్దరూ ఆర్థిక సహకారం, అభివృద్ధి ప్రధాన భాగస్వామ్యం, ఫిన్‌టెక్, సామర్థ్యాలను పెంచుకోవడం, సైన్స్-టెక్నాలజీ, విపత్తుల నిర్వహణతో పాటు ఆరోగ్యసంరక్షణ రంగాల్లో ఇరు దేశాల సంబంధాలను సమీక్షించారు. డిజిటల్ రంగంలో భారత్ ప్రావీణ్యాన్ని క్యూబా అధ్యక్షుడు శ్రీ  డియాజ్-కానెల్‌ బెర్మూడెజ్‌ ప్రస్తావిస్తూ, భారతదేశం ప్రవేశపెట్టిన యూపీఐ, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ల పట్ల తమ దేశం ఆసక్తితో ఉందన్నారు. ఆయుర్వేదానికి క్యూబా గుర్తింపును ఇవ్వడాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. క్యూబాలో ప్రజారోగ్య సంరక్షక వ్యవస్థలో ఆయుర్వేదను ఒక భాగంగా చేసినందుకు శ్రీ మోదీ హర్షం ప్రకటించారు. భారతీయ ఫార్మాకోపియాకు కూడా క్యూబా గుర్తింపును ఇవ్వాలంటూ ఒక ప్రతిపాదనను ప్రధానమంత్రి తీసుకువచ్చారు. ఇది జరిగితే భారతదేశ జనరిక్ మందులు ప్రజోపయోగానికి చేరువ కాగలుగుతాయని ఆయన అన్నారు.

 అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆందోళనకరంగా ఉంటున్న అంశాలపై కలసి పనిచేయడానికి నేతలిద్దరూ అంగీకరించారు. ఈ అంశాల్లో ఆరోగ్యం, మహమ్మారులతో పాటు వాతావరణ మార్పు వంటివి ఉన్నాయి. అనేక రంగాల్లో ఇరు దేశాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న సహకారాన్ని వారు ప్రశంసించారు.

 

***


(Release ID: 2142856)