ప్రధాన మంత్రి కార్యాలయం
ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానితో భేటీ అయిన ప్రధానమంత్రి
Posted On:
04 JUL 2025 11:51PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని రెడ్ హౌస్‌లో ట్రినిడాడ్ టొబాగో రిపబ్లిక్ ప్రధానమంత్రి గౌరవ కమ్లా ప్రెసాద్ బిసెసాతో భేటీ అయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో ఘన విజయం సాధించి రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆమెకు అభినందనలు తెలిపారు. తనకు అపూర్వ స్వాగతం పలికినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, ఔషధాలు, డిజిటల్ పరివర్తన, యూపీఐ, సామర్థ్యాలను మెరుగుపరచడం, సంస్కృతి, క్రీడలు, ప్రజల అనుసంధానత సహా అనేక రంగాల్లో పరస్పర సహకారంపై ఇరువురు నేతలు చర్చించారు. ఇరుదేశాల భాగస్వామ్యంలో అభివృద్ధిపరమైన సహకారం ఒక కీలక భాగం.. ట్రినిడాడ్ టొబాగోలో భారత ప్రధానమంత్రి చారిత్రక పర్యటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను తిరిగి బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి బిసేసా పేర్కొన్నారు.
ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై ఇరువురు నేతలు వారి అభిప్రాయాలను పంచుకున్నారు. వాతావరణ మార్పు, విపత్తు నిర్వహణ, సైబర్ భద్రత వంటి సమకాలీన సవాళ్లను ఎదుర్కోవడానికి మరింత సహకారం అవసరమని వారు పిలుపునిచ్చారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత ప్రజలకు టీ అండ్ టీ అందించిన బలమైన మద్దతు, సంఘీభావాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. అన్ని ఉగ్రవాద రూపాలు, వ్యక్తీకరణలపై పోరాడటం పట్ల తమ నిబద్ధతను ఇరువురు నేతలూ పునరుద్ఘాటించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య మరింత సంఘీభావం కోసం, భారత్-సీఏఆర్ఐసీఓఎమ్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేయడానికి వారు అంగీకరించారు.
చర్చల అనంతరం ఫార్మసీ, సత్వర ప్రభావం గల ప్రాజెక్టులు, సంస్కృతి, క్రీడలు, దౌత్యపరమైన శిక్షణ, హిందీ.. భారతీయ అధ్యయనాల కోసం ఐసీసీఆర్ అధ్యయన కేంద్రాలకు సంబంధించిన ఆరు అవగాహన ఒప్పందాలను మార్చుకున్నారు. టీ అండ్ టీలో భారత సంతతికి చెందిన ఆరో తరం ప్రజలకు ఓసీఐ కార్డు అందించడం సహా ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచే దిశగా పలు ప్రకటనలు చేశారు. కుదిరిన ఒప్పందాల జాబితాను ఇక్కడ చూడవచ్చు.
ప్రధానమంత్రి కమ్లా ప్రెసాద్ బిసెసాను భారత్‌లో పర్యటించాలని ప్రధానమంత్రి ఆహ్వానించగా.. ఆమె దానికి అంగీకరించారు. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో భారత ప్రధానమంత్రి చారిత్రక పర్యటన ఇరు దేశాల మధ్య ప్రత్యేక సంబంధాలకు ఊతమిచ్చింది.
***
(Release ID: 2142476)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam