హోం మంత్రిత్వ శాఖ
'రాజ్యాంగ హత్యాదినం' సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథి పాల్గొన్న కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా
* రాజ్యాంగానికి వ్యతిరేకంగా నియంతృత్వ పోకడలతో భవిష్యత్తులో ఎవరూ అత్యవసర పరిస్థితిని విధించలేని విధంగా ఈ రోజును గుర్తుంచుకోవటం చాలా ముఖ్యం: అమిత్ షా
* రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని విధించారని ప్రకటించటం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తి మొత్తాన్ని అప్పటి ప్రధాని నాశనం చేశారు: అమిత్ షా
* అత్యవసర పరిస్థితిని గుర్తుంచుకోవడం అంటే కేవలం చరిత్ర తెలుసుకోవడం కాదు.. అదొక హెచ్చరిక: అమిత్ షా
* అత్యవసర పరిస్థితి సమయంలో దేశం మూగబోయింది.. కోర్టులు చెవిటిగా మారాయి.. రచయితల కలాలు మౌనంగా మారాయి: అమిత్ షా
* దేశ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని ప్రపంచ మొత్తానికి తెలుసు. కానీ అప్పటి ప్రధానమంత్రి పీఠానికి ముప్పు ఉంది కాబట్టే అత్యవసర పరిస్థితి విధించారు: అమిత్ షా
* అత్యవసర పరిస్థితిలో నిర్బంధం, కుబుంబ నియంత్రణ, కూల్చివేత ఘటనలు మొత్తం దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టించాయి. ఇలాంటి పరిస్థితులు ప్రపంచంలో మరెక్కడా కనిపించవు: అమిత్ షా
* అత్యవసర పరిస్థితి సమయంలో 'దేశం కంటే పార్టీ పెద్ద, పార్టీ కంటే కుటుంబం పెద్ద, కుటుంబం కంటే వ్యక్తులు పెద్ద, జాతీయ ప్రయోజనం కంటే అధికారం పెద్ద' అనే ఆలోచన ఉ
Posted On:
25 JUN 2025 7:59PM by PIB Hyderabad
'రాజ్యాంగ హత్యాదినం' సందర్భంగా ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ, రైల్వే, సమాచార ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా.. ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖ గుప్తా, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి మాట్లాడుతూ.. సాధారణంగా జీవితంలో చెడు సంఘటనలను మరచిపోవాలన్నది సరైన భావనే అయినప్పటికీ సామాజిక జీవితం, దేశానికి సంంధించిన విషయాల్లో మాత్రం చెడు సంఘటనలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలన్నారు. తద్వారా దేశంలోని యువతీ యువకులు సంస్కారవంతులుగా, వ్యవస్థీకృతంగా, దేశాన్ని రక్షించుకునేందుకు సిద్ధంగా ఉండేవారుగా తయారవుతారని తెలిపారు. అలాంటి చెడు పరిస్థితులు మళ్లీ ఎప్పుడూ పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరారు. ఈ ఆలోచనతోనే ప్రతి సంవత్సరం జూన్ 25ని 'రాజ్యాంగ హత్యాదినం'గా నిర్వహించుకోవాలని ప్రధాని మోదీ నిర్ణయించారని అన్నారు. దీనికి అనుగుణంగానే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. అత్యవసర పరిస్థితి సమయంలో దేశాన్ని జైలుగా, దేశాన్ని మూగదిగా, కోర్టులను చెవిటిగా మార్చిన తీరు.. రచయితల కలాలను మౌనంగా ఉంచిన తీరును దృష్టిలో ఉంచుకొని లోతుగా ఆలోచించిన తర్వాతే ఈ రోజును 'రాజ్యాంగ హత్యాదినం'గా జరుపుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితి కాలంలో జరిగిన సంఘటనల గురించి ఇది యువతకు అవగాహన తీసుకొస్తుంది. అత్యవసర పరిస్థితిని గుర్తుంచుకోవడం అంటే కేవలం చరిత్ర తెలుసుకోవడం మాత్రమే కాదని అదొక హెచ్చరిక అని ఆయన అన్నారు.
1975 జూన్ 24 రాత్రి అత్యవసర పరిస్థితి విధించారని, నియంతృత్వ పోకడలను అమలు చేసేందుకు ఒక ఆర్డినెన్స్ జారీ చేశారని కేంద్ర హోంమంత్రి గుర్తు చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఇతర రాజ్యాంగ నిర్మాతలు సుదీర్ఘ చర్చలు, సంప్రదింపుల తర్వాత రూపొందించిన రాజ్యాంగాన్ని సమర్థవంతంగా పక్కన బెట్టి.. రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని విధించారు అనే ప్రకటనతో మొత్తం రాజ్యాంగ స్ఫూర్తిని నాశనం చేశారు. ఒక్క ప్రకటనతో రాజ్యాంగ భావనను నాశనం చేశారు. 1965 జూన్ 12న రెండు ముఖ్యమైన ఘటనలు- అలహాబాద్ హైకోర్టు ప్రధానమంత్రి ఎన్నికను చెల్లదని చెప్పటం, ఆమెను ఆరు సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించటం జరిగాయని అన్నారు. దేశం ఒక దిగ్భ్రాంతికర పరిస్థితి చూసింది. అయితే తర్వాత ఈ ఉత్తర్వుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అదే జూన్ 12న గుజరాత్‌లో జనతా మోర్చా విజయాన్ని సాధిస్తూ.. కాంగ్రెస్ పాలనకు ముగింపు పలికి జనతా పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించింది. ఈ పరిణామాలతో భయపడి జూన్ 25న అత్యవసర పరిస్థితి విధించారు. జాతీయ భద్రతకు ముప్పు ఉందన్న కారణం చెప్పినప్పటికీ.. ప్రధానమంత్రి పదవికే నిజంగా ముప్పు ఉందని ప్రపంచం మొత్తానికి తెలుసని ఆయన పేర్కొన్నారు.
జయప్రకాష్ నారాయణ్ నినాదమైన "సంపూర్ణ క్రాంతి" మొత్తం దేశాన్నే మార్చేసిందని అమిత్ షా అన్నారు. గుజరాత్‌లో ప్రారంభమైన ఈ ఉద్యమం బీహార్‌కు చేరుకుంది. గుజరాత్‌లో ప్రభుత్వం కూలిపోవటంతో ఎన్నికలు జరిగి అప్పటి పాలక పార్టీ అధికారం కోల్పోయింది. తదనంతరం అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇది అప్పటి ప్రధానమంత్రికి ఒక ప్రధాన హెచ్చరికగా పనిచేసింది.
అత్యవసర పరిస్థితిని విధించడం ద్వారా స్టే ఇచ్చిన కోర్టులను, వార్తాపత్రికలను, అఖిల భారత రేడియోను గొంతు ముగబోయేలా చేశారని హోం మంత్రి అన్నారు. దాదాపు 1,10,000 మంది సామాజిక, రాజకీయ కార్యకర్తలు జైలుకు వెళ్లారు. ఎటువంటి ఎజెండా ఇవ్వకుండా ఉదయం 4 గంటలకు క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అత్యవసర పరిస్థితి సమయంలో ఏర్పడిన పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించిన షా కమిషన్.. నిర్బంధం, బలవంతపు కుటుంబ నియంత్రణ, కూల్చివేతలు దేశవ్యాప్తంగా భయానక వాతావరణాన్ని సృష్టించాయని, ఇలా ప్రపంచలో మరెక్కడా జరగలేదని తెలిపిందని అన్నారు. వార్తాపత్రిక కార్యాలయాలు మూసివేతకు గురయ్యాయి. 253 మంది జర్నలిస్టులను అరెస్టు చేశారు. 29 మంది విదేశీ పాత్రికేయులను దేశం నుంచి బహిష్కరించారు. అనేక వార్తాపత్రికలు ముఖ్యంగా ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, జనసత్తా తమ సంపాదకీయాలను ఖాళీగా ఉంచి అత్యవసర పరిస్థతిపై నిరసన వ్యక్తం చేశాయి. వాటి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పార్లమెంటరీ కార్యకలాపాలు సెన్సార్‌కు గురయ్యాయి. న్యాయవ్యవస్థ సమర్థవంతంగా నియంత్రణలోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య హక్కులు పూర్తిగా అణచివేతకు గురయ్యాయి.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మారకుండా అడ్డుకున్నారని హోం మంత్రి అన్నారు. గాయకుడు కిషోర్ కుమార్, నటుడు మనోజ్ కుమార్ చిత్రాలను నిషేధించారు. దూరదర్శన్‌లో రాకుండా నటుడు దేవ్ ఆనంద్‌ను నిషేధించారు. ఆంధి, కిస్సా కుర్సి కా చిత్రాలను కూడా నిషేధించినట్లు పేర్కొన్నారు.
అత్యవసర పరిస్థితి తర్వాత జరిగిన ఎన్నికల్లో దేశంలో తొలిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం పూర్తి మెజారిటీతో ఏర్పడిందని కేంద్ర హోంమంత్రి అన్నారు. భవిష్యత్తులో ఎవరూ ఈ దేశ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి నియంతృత్వ పోకడలతో ప్రవర్తించకూడదంటే ఆ రోజును గుర్తుంచుకోవటం ముఖ్యమని వ్యాఖ్యానించారు. అత్యవసర పరిస్థితి సమయంలో.. దేశం కంటే పార్టీ పెద్ద, పార్టీ కంటే కుటుంబం పెద్ద, కుటుంబం కంటే వ్యక్తులు పెద్ద, జాతీయ ప్రయోజనాల కంటే అధికారం ముఖ్యమనే మనస్తత్వం ఉండేదని అన్నారు. దీనికి విరుద్ధంగా నేడు ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో ‘దేశమే ప్రథమం’ అనే ఆలోచన ప్రజల హృదయాల్లో లోతుగా నాటుకుపోతోందని వివరించారు. 19 నెలలు జైలులో గడిపిన వేలాది మంది ప్రజాస్వామ్య యోధుల పోరాటం కారణంగా ఈ మార్పు సాధ్యమైందని పేర్కొన్నారు. నేడు ప్రధాని మోదీ నాయకత్వంలో 140 కోట్ల మంది భారతీయులు 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగంలోనూ అగ్రస్థానంలోకి తీసుకెళ్లే నిబద్ధతతో పనిచేస్తున్నారని.. ఆ లక్ష్యం వైపు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నరని వ్యాఖ్యానించారు.
***
(Release ID: 2139838)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam