ప్రధాన మంత్రి కార్యాలయం
అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలాన్ని సందర్శించి.. సహాయ, ఉపశమన చర్యలను సమీక్షించిన ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె.మిశ్రా
సివిల్ ఆసుపత్రిలో బాధితులు, వారి కుటుంబాలను కలిసిన డాక్టర్ పి.కె.మిశ్రా
బాధితుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం
Posted On:
15 JUN 2025 8:09PM by PIB Hyderabad
ఇటీవల జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించి సహాయ, ఉపశమన చర్యలు, దర్యాప్తు విషయంలో ప్రస్తుత పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె.మిశ్రా ఈరోజు అహ్మదాబాద్ సందర్శించారు. బాధితులకు, వారి కుటుంబాలకు సత్వర ఉపశమనం, పూర్తి సహాయాన్ని అందించాలని.. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన ఆదేశాన్ని అమలు పరిచేవిధంగా ఆయన పర్యటన సాగింది.
మేఘని నగర్‌లోని బీజే వైద్య కళాశాల సమీపంలోని ప్రమాద స్థలానికి వెళ్లిన ఆయన అక్కడే సమీక్ష నిర్వహించారు. సంఘటనల వరుస క్రమాన్ని, ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన తీరు గురించి రాష్ట్ర ప్రభుత్వం, విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ(ఏఏఐబీ), భారత విమానాశ్రయాల అథారిటీ సీనియర్ అధికారులు ఆయనకు వివరించారు.
దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను అహ్మదాబాద్‌లోని సివిల్ ఆసుపత్రిలో కలిశారు. ఇక్కడ డీఎన్ఏ నమూనా సరిపోలికను గమనించారు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సానుభూతితో పూర్తి సహాయం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన బాధితులతో కూడా ఆయన మాట్లాడారు. వారి చికిత్స, మళ్లీ మాములు స్థితిలోకి రావటానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆసుపత్రి అధికారులను ఆదేశించారు.
గాంధీనగర్‌లోని ఫోరెన్సిక్ ప్రయోగశాలలో (ఎఫ్ఎస్ఎల్) డీఎన్ఏ నమూనాలకు సంబంధించి సమీక్ష చేశారు. శాస్త్రీయంగా కచ్చితమైన పద్ధతులు అనుసరిస్తూ గుర్తింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయవలసిన అవసరాన్ని ఆయన ప్రధానంగా చెప్పారు.
అహ్మదాబాద్‌లోని సర్క్యూట్ హౌస్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి ఆయన ఆధ్యక్షత వహించారు. ప్రసుతం కొనసాగుతోన్న ఉపశమన, సహాయ చర్యలతో పాటు దర్యాప్తు గురించి ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల.. ఏఏఐపీ, భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ సీనియర్ అధికారులతో చర్చించారు. ఏఏఐబీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ప్రమాదానికి గురైన విమానం అమెరికాలో తయారైనది కాబట్టి యూఎస్ నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (ఎన్‌టీఎస్‌బీ) అంతర్జాతీయ ప్రోటోకాల్‌లకు అనుగుణంగా సమాంతర దర్యాప్తును నిర్వహిస్తోంది. ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్‌డీఆర్), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్)ను లభ్యమయ్యాయని, అవి సురక్షితంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
బాధిత కుటుంబాలకు వీలైనంత సహాయం అందించాలన్న ప్రధాని మోదీ హామీకి అనుగుణంగా ఈ ప్రమాదం విషయంలో పనిచేస్తోన్న అన్ని సంస్థలు సమన్వయంతో ముందుకు సాగాలని డాక్టర్ మిశ్రా మరోసారి తెలిపారు. ప్రధానమంత్రికి సలహాదారు శ్రీ తరుణ్ కపూర్, పీఎంఓ ఉప కార్యదర్శి శ్రీ మంగేష్ గిల్దియాల్‌లు ప్రధాన కార్యదర్శి వెంట ఉన్నారు.
***
(Release ID: 2138942)
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada