ప్రధాన మంత్రి కార్యాలయం
అరుణోదయ ఈశాన్య పెట్టుబడిదారుల సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
23 MAY 2025 2:03PM by PIB Hyderabad
కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, శ్రీ సుకాంత మజుందార్, మణిపూర్ గవర్నర్ శ్రీ అజయ్ భల్లా, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, సిక్కిం, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాల ముఖ్యమంత్రులు శ్రీ హిమంత బిశ్వ శర్మ, శ్రీ పెమా ఖండు, శ్రీ మాణిక్ సాహా, శ్రీ కాన్రాడ్ సంగ్మా, శ్రీ ప్రేమ్ సింగ్ తమాంగ్, శ్రీ నైఫూ రియో, శ్రీ లాల్‌ధుమా సహా వివిధ పరిశ్రమల అధిపతులు, పెట్టుబడిదారులు, సోదరీసోదరులందరికీ ప్రణామం!
అరుణోదయ ఈశాన్యం పేరిట ఏర్పాటు చేసిన ఈ మహత్తర వేదికపై నుంచి ఇక్కడి ప్రతిష్ఠను, ఆప్యాయతను, ఆదరాన్ని, అన్నింటినీ మించి భవిష్యత్తుపై ఉప్పొంగే అపార ఆత్మవిశ్వాసాన్ని నేను ప్రత్యక్షంగా, సగర్వంగా అనుభూతి చెందుతున్నాను. కొన్ని నెలల కిందట మనం ఇక్కడి భారత్ మండపంలో అష్టలక్ష్మి ఉత్సవం నిర్వహించుకున్నాం. ఈ నేపథ్యంలో ఇవాళ ఈశాన్య భారతంలో పెట్టుబడి పండుగ చేసుకుంటున్నాం. చాలామంది పరిశ్రమాధిపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈశాన్య ప్రాంతంపై ప్రతి ఒక్కరికీగల ఆసక్తి, ఉత్సాహం, కొత్త స్వప్నాలకు ఇది ప్రతిబింబం. ఈ సదస్సు విజయం దిశగా కృషిచేసిన అన్ని మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలకు నా హృదయపూర్వక అభినందనలు. మీరు చేసిన ప్రయత్నాలు ఫలించి ఈ ప్రాంతంలో పెట్టుబడులకు అనువైన అద్భుత వాతావరణం సృష్టించాయి. ఇందుకుగాను వ్యక్తిగతంగానే కాకుండా కేంద్ర ప్రభుత్వం తరపున అరుణోదయ ఈశాన్య పెట్టుబడుల సదస్సు విజయవంతం కావాలని కోరుకుంటూ మీకందరికీ నా శుభాకాంక్షలు.
మిత్రులారా!
భారత్ నేడు ప్రపంచంలో అత్యంత వైవిధ్యభరిత దేశంగా పరిగణనలో ఉంది. అందులో మన ఈశాన్యం అత్యంత వైవిధ్యంతో అలరారే ప్రాంతం. వాణిజ్యం నుంచి సంప్రదాయాల దాకా, వస్త్రాల నుంచి పర్యాటకం వరకూ ఈశాన్యానికిగల వైవిధ్యమే దాని గొప్ప బలం. ఈశాన్యమంటే- జీవ ఆర్థిక వ్యవస్థ, వెదురుకు ప్రతీక.. ఈశాన్యమంటే- తేయాకు ఉత్పత్తి, పెట్రోలియం ప్రతిబింబం.. ఈశాన్యమంటే క్రీడలు-నైపుణ్యానికి నిదర్శనం.. ఈశాన్యమంటే- పర్యావరణ పర్యాటక కూడలిగా ఎదుగుతున్న ప్రాంతం. సేంద్రియ ఉత్పత్తుల సరికొత్త ప్రపంచానికి నిలువెత్తు నిదర్శనం. ఈశాన్యం ఇంధన శక్తికి కేంద్రం... అందుకే, ఈ ప్రాంతం మన అష్టలక్ష్మి (ఎనిమిది రకాల సౌభాగ్యం). ఈ అష్టలక్ష్మి ఆశీస్సులతో- పెట్టుబడులు పెట్టడానికి, సారథ్యం వహించడానికి సిద్ధమని ప్రతి రాష్ట్రం గళమెత్తి చాటుతోంది.
మిత్రులారా!
‘వికసిత భారత్’ సంకల్ప సాకారానికి తూర్పు భారతంలో సమగ్రాభివృద్ధి అత్యంత అవశ్యం. ఈ తూర్పు భారతంలో ఈశాన్యం అత్యంత కీలక భాగం. తూర్పు అంటే మా దృష్టిలో కేవలం దిక్కులలో ఒకటి కాదు. ఇది సాధికారతకు, కార్యాచరణకు, బలోపేతానికి, ప్రగతిశీల మార్పునకు సూచిక. తూర్పు భారతం కోసం ఇది మా ప్రభుత్వ విధానం. ఈ విధానంతోపాటు మేమిస్తున్న ప్రాధాన్యం మన తూర్పు, ఈశాన్య ప్రాంతాల ప్రగతిని కీలక దశకు చేర్చింది.
మిత్రులారా!
ఈశాన్యంలో గత 11 సంవత్సరాల ప్రగతిశీల మార్పు కేవలం అంకెలకు పరిమితం కాదు. ఇది క్షేత్రస్థాయిలో మన అనుభవంలో కనిపించే ప్రగతి. ఈశాన్యంతో మా సంధానం ప్రభుత్వ పథకాలతో ఏర్పరచుకున్నది కాదు... అది హృదయానుగత అనుంబంధం. ఈ మాట విని మీరు ఆశ్చర్యపోవచ్చుగానీ, కేంద్ర మంత్రులు ఈశాన్య ప్రాంతాన్ని 700 దఫాలకుపైగా సందర్శించడం ఇందుకు నిదర్శనం. అయితే, ఈ సందర్శన కేవలం రాకపోకలకు సంబంధించినది కాదు... రాత్రివేళ ఇక్కడ బసచేసి మరీ అన్నిటినీ సమీక్షించడానికి చెందినది. ఈ పర్యటనలలో ప్రజల ఆశలు, ఆకాంక్షలను వారు ప్రత్యక్షంగా గమనించారు. ప్రభుత్వంపై వారి నమ్మకానికి అనుగుణంగా తమ పర్యటనలను ప్రగతి ఆధారిత విధానంగా రూపుదిద్దారు. ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పనను మేం ఇటుకలు-సిమెంటుతో కూడిన నిర్మాణాలు పరిగణించడం లేదు. ఈ ప్రాంతంతో భావోద్వేగ అనుసంధానానికి వాటినొక మాధ్యమంగా తీర్చిదిద్దాం. ‘లుక్ ఈస్ట్’ విధానానికి మించి ‘యాక్ట్ ఈస్ట్’ మంత్రాన్ని అనుసరించాం. ఈ కృషి ఫలాలను నేడు మనం అనుభవిస్తున్నాం. ఒకనాడు ఈశాన్యాన్ని సరిహద్దు ప్రాంతంగా సూచించే పరిస్థితి ఉండగా, నేడు ఇది వృద్ధికి పర్యాయపదంగా మారుతోంది.
మిత్రులారా!
అత్యుత్తమ మౌలిక సదుపాయాలు పర్యాటకాన్ని మరింత ఆకర్షణీయం చేస్తాయి. బలమైన మౌలిక సదుపాయాలున్న ప్రదేశంపై పెట్టుబడిదారుల్లోనూ విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. మెరుగైన రహదారులు, బలమైన విద్యుత్ మౌలిక సదుపాయాలు, సమర్థ రవాణా-ప్రయాణ నెట్‌వర్క్ తదితరాలకు ఏ పరిశ్రమకైనా వెన్నెముక వంటివి అనుసంధనం సజావుగా ఉన్నచోట వాణిజ్యం వృద్ధి చెందుతుంది. ఒక్క మాటలో చెబితే... ఎలాంటి ప్రగతికైనా నాణ్యమైన మౌలిక సదుపాయాలే తొలి అవసరం, పునాది కూడా. అందుకే, ఈశాన్యంలో మౌలిక సదుపాయాల విప్లవానికి మేం శ్రీకారం చుట్టాం. లోగడ చిరకాలం నిర్లక్ష్యానికి గురైన ఈశాన్యం అపార అవకాశాలకు నెలవుగా మారుతోంది. ఈ ప్రాంతంలో అనుసంధాన మౌలిక సదుపాయాల కల్పనకు మేం రూ.లక్షల కోట్లలో పెట్టుబడి పెట్టాం. మీరు అరుణాచల్ ప్రదేశ్ వెళ్తే ‘సెలా టన్నెల్’ వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చూడగలరు. అస్సాంలో భూపేన్ హజారికా వంతెన వంటి మెగా ప్రాజెక్టులు మీకు దర్శనమిస్తాయి. కేవలం ఒక దశాబ్దం వ్యవధిలో ఈ ప్రాంతమంతటా 11,000 కిలోమీటర్ల కొత్త రహదారులను మేం నిర్మించాం. వందల కిలోమీటర్ల కొత్త రైలుమార్గాలు నిర్మించాం. ఇక విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు కాగా- బ్రహ్మపుత్ర, బరాక్ నదులపై జలమార్గాలు సిద్ధమవుతున్నాయి. వందలాది మొబైల్ టవర్లు ఏర్పాటు కావటమే కాకుండా 1,600 కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్, ఈశాన్య గ్యాస్ గ్రిడ్ కూడా సాకారమయ్యాయి. ఇది పరిశ్రమలకు అవసరమైన గ్యాస్ సరఫరాపై భరోసా ఇస్తుంది. సంక్షిప్తంగా- జాతీయ రహదారులు, రైల్వేలు, జలమార్గాలు, ‘ఐ’వేలు- ఇలా ఈశాన్యంలో అనుసంధానం ప్రతి రూపంలో బలోపేతం అవుతోంది. తద్వారా అన్నివిధాలా అనువైన భూమిక సిద్ధమైంది. ఇక మన పరిశ్రమలు ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడమే తరువాయి. ఆ మేరకు తొలి స్పందకులుగా లభించే సానుకూలతను మీరు కోల్పోకూడదని నేను ఆకాంక్షిస్తున్నాను.
మిత్రులారా!
ఈశాన్య ప్రాంత వాణిజ్య సామర్థ్యం రాబోయే దశాబ్దంలో అనేక రెట్లు ఇనుమడిస్తుంది. ప్రస్తుతం భారత్-ఆసియాన్ మధ్య వాణిజ్య పరిమాణం దాదాపు 125 బిలియన్ డాలర్లు కాగా- త్వరలోనే ఇది 200 బిలియన్ల స్థాయిని అధిగమించగలదు. తద్వారా ఈశాన్య ప్రాంతం ఈ వాణిజ్యానికి బలమైన వారధిగా రూపొందుతుంది. ఇది ఆసియాన్‌కు ప్రవేశ ద్వారం... ఈ దృక్కోణానికి మద్దతుగా అవసరమైన మౌలిక సదుపాయాలను మేం వేగంగా కల్పిస్తున్నాం. భారత్-మయన్మార్-థాయిలాండ్ త్రైపాక్షిక రహదారి మయన్మార్ ద్వారా థాయిలాండ్‌కు ప్రత్యక్ష అనుసంధానం కల్పిస్తుంది. థాయిలాండ్, వియత్నాం, లావోస్ వంటి దేశాలతో భారత్‌కు సంధాన సౌలభ్యం కలుగుతుంది. కోల్‌కతా ఓడరేవును మయన్మార్‌లోని సిట్వే రేవుతో అనుసంధానించడంతోపాటు మిజోరం మీదుగా మిగిలిన ఈశాన్య రాష్ట్రాలను మరింతగా కలిపే కలడాన్ మల్టీమోడల్ ట్రాన్సిట్ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. పశ్చిమ బెంగాల్, మిజోరం మధ్య దూరాన్ని గణనీయంగా తగ్గించే ఈ మార్గం పరిశ్రమలకు, వాణిజ్యానికి ఒక గొప్ప వరం కాగలదు.
మిత్రులారా!
గువహటి, ఇంఫాల్, అగర్తల వంటి నగరాలు నేడు బహుళ రవాణా సాధన కూడళ్లుగా రూపొందుతున్నాయి. మేఘాలయ, మిజోరంలలో ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లు ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్యానికి సరికొత్త ప్రోత్సాహాన్నిస్తున్నాయి. ఈ కృషితో ఇండో-పసిఫిక్ దేశాలతో వాణిజ్యంలో ఈశాన్య ప్రాంతం కొత్త పేరుగా మారుమోగనుంది. అంటే- ఈశాన్య ప్రాంతంలో ఆకాశమే హద్దుగా అపార అవకాశాలు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి.
****
(Release ID: 2130903)