ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జెనీవాలో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 78వ సదస్సులో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం


వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఈ ఏడాది ఇతివృత్తం ‘ఆరోగ్యంపై ప్రపంచ ఐక్యత (వన్ వరల్డ్ ఫర్ హెల్త్).. అందరికీ ఆరోగ్యంపై భారత దృక్పథాన్ని ఇది ప్రతిధ్వనిస్తుంది: ప్రధాని

సమ్మిళితత్వం, సమగ్ర దృక్పథం, సమన్వయంతోనే భవిష్యత్తులో ఆరోగ్యకరమైన ప్రపంచం సాకారమవుతుంది: ప్రధాని

దుర్బలురను మనమెలా చూస్తున్నామన్నదే ఆరోగ్యకరమైన ప్రపంచానికి ప్రాతిపదిక: ప్రధాని

ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆరోగ్యపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.. భారత విధానాలు అనుసరణీయ, స్పష్టమైన, సుస్థిరమైన నమూనాలుగా నిలుస్తున్నాయి: ప్రధాని

జూన్‌లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం.. ఈ ఏడాది ఇతివృత్తం ‘ప్రపంచ ఐక్యత, అందరికీ ఆరోగ్యం కోసం యోగా (యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్)’: ప్రధాని

అందరినీ కలుపుకొని ముందుకెళ్తూ ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని తీర్చిదిద్దుదాం: ప్రధాని

Posted On: 20 MAY 2025 4:27PM by PIB Hyderabad

జెనీవాలో జరిగిన వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 78వ సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. సమావేశాన్నుద్దేశించి మాట్లాడుతూ, ఈ ఏడాది ఇతివృత్తమైన ‘ఆరోగ్యంపై ప్రపంచ ఐక్యత (వన్ వరల్డ్ ఫర్ హెల్త్)’ను ప్రముఖంగా ప్రస్తావించిన ఆయన సభకు హాజరైన వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యకరమైన ప్రపంచం కోసం భారత లక్ష్యానికి ఇది అనుగుణంగా ఉందన్నారు. 2023 వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సందర్భంగా ‘ఒక భూమి, ఒకే ఆరోగ్యం’ గురించి మాట్లాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సమ్మిళితత్వం, సమగ్ర దృక్పథం, సహకారంపైనే భవిష్యత్ ఆరోగ్యకరమైన ప్రపంచం ఆధారపడి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

భారత ఆరోగ్య సంస్కరణల్లో సమ్మిళితత్వమే కీలకమని స్పష్టం చేసిన శ్రీ మోదీ.. ప్రపంచంలో అతిపెద్ద ఆరోగ్య బీమా పథకమైన ఆయుష్మాన్ భారత్ గురించి వివరించారు. 58 కోట్ల మంది ఈ పథకం పరిధిలో ఉన్నారని, ఉచిత చికిత్స అందిస్తున్నామని తెలిపారు. 70 ఏళ్ల వయస్సు పైబడిన భారతీయులందరికీ వర్తించేలా ఇటీవల ఈ పథకాన్ని విస్తరించారు. పరీక్షల ద్వారా క్యాన్సర్, డయాబెటిస్, రక్తపోటు వంటి వ్యాధులను ముందస్తుగా గుర్తించేలా.. వేలాదిగా ఆరోగ్య కేంద్రాలు, వెల్‌నెస్ సెంటర్లతో దేశంలో విస్తృతమైన వ్యవస్థ ఉందని ప్రధానమంత్రి తెలిపారు. చాలా తక్కువ ధరలకే నాణ్యమైన ఔషధాలను అందిస్తూ వేలాదిగా ప్రభుత్వ ఫార్మసీలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడంలో టెక్నాలజీ పాత్రను వివరిస్తూ.. భారత్ చేపట్టిన డిజిటల్ ప్లాట్ ఫాం,  ప్రత్యేక డిజిటల్ ఆరోగ్య గుర్తింపు వ్యవస్థ వంటి కార్యక్రమాలను శ్రీ మోదీ ప్రస్తావించారు. డిజిటల్ ప్లాట్ ఫాంను గర్భిణులు, చిన్నారులకు వ్యాక్సినేషన్‌ను పర్యవేక్షించేలా రూపొందించగా... ప్రత్యేక డిజిటల్ ఆరోగ్య గుర్తింపు ఏర్పాటు ప్రయోజనాలు, బీమా, రికార్డులు, సమాచారాన్ని ఏకీకృతం చేయడంలో ఉపయోగపడుతుంది. టెలిమెడిసిన్ ద్వారా అందరూ వైద్యులకు దగ్గరయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. 34 కోట్లకుపైగా సంప్రదింపులకు వీలు కల్పించిన భారత ఉచిత టెలిమెడిసిన్ సేవలను ఆయన ప్రశంసించారు. ఆరోగ్యం కోసం ప్రజలకు ఖర్చు విశేషంగా తగ్గిందని, దేశంలో చేపట్టిన ఆరోగ్య కార్యక్రమాల వల్లే ఇది సాధ్యమైందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో ప్రభుత్వ ఆరోగ్య వ్యయం గణనీయంగా పెరిగిందని తెలిపారు.

“అత్యంత దుర్బలురైనవారిని మనమెంత బాగా చూసుకుంటామన్నదానిపైనే ప్రపంచ ఆరోగ్యం ఆధారపడి ఉంది” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఆరోగ్యపరమైన సవాళ్లు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలను ప్రభావితం చేస్తున్నాయన్నారు. భారత విధానాలు అనుసరణీయమైన, స్పష్టమైన, సుస్థిరమైన నమూనాలుగా నిలుస్తున్నాయని స్పష్టం చేశారు. తన అధ్యయనాలను, అత్యుత్తమ విధానాలను ప్రపంచంతో, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు. జూన్ లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రపంచ దేశాలు పాల్గొనాలని ప్రధానమంత్రి కోరారు. యోగాకు భారత్ పుట్టినిల్లని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ‘ప్రపంచ ఐక్యత, అందరికీ ఆరోగ్యం కోసం యోగా (యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్)’ అన్న ఈ ఏడాది యోగా దినోత్సవ ఇతివృత్తాన్ని వివరిస్తూ, అన్ని దేశాలకూ ఆహ్వానం పలికారు.

ఐఎన్‌బీ ఒడంబడికను విజయవంతం చేసినందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు, అన్ని సభ్య దేశాలకు శ్రీ మోదీ అభినందనలు తెలిపారు. గొప్ప అంతర్జాతీయ సహకారంతో భవిష్యత్ విపత్తులను ఎదుర్కొనేలా ఉమ్మడి నిబద్ధతగా ఆయన దీనిని అభివర్ణించారు. అందరినీ కలుపుకొని పోతూ ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, రోగాలు దరిచేరకుండా ఉండాలంటూ వేల ఏళ్ల కిందటే భారత రుషులు చిరస్థాయిలో నిలిచేలా చేసిన ప్రార్థనలను వేదాల నుంచి ఉదహరిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. ఈ లక్ష్యం ప్రపంచాన్ని ఏకం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

 

***


(Release ID: 2130081)