ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అంగోలా అధ్యక్షుడితో నేటి సంయుక్త పాత్రికేయ సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన

Posted On: 03 MAY 2025 2:26PM by PIB Hyderabad

గౌరవనీయ అధ్యక్షులు లొరెన్సూ,

ఉభయ దేశాల ప్రతినిధులు,

పాత్రికేయ మిత్రబృందం సహా... అందరికీ,

నమస్కారం!

బే విందో!

గౌరవనీయ అధ్యక్షులు లొరెన్సూ సహా ఆయన ప్రతినిధి బృందానికి భారత్‌ తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. ఇదొక చారిత్రక క్షణం... 38 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత అంగోలా అధ్యక్షుడు భారత పర్యటనకు వచ్చారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలకు కొత్త దిశ, దశలను నిర్దేశించడంతోపాటు మరింత ఊపునిస్తూ భారత్‌-ఆఫ్రికా భాగస్వామ్యాన్ని పటిష్ఠం చేస్తుంది.

మిత్రులారా!

ఈ ఏడాది మనం భారత్‌-అంగోలా దౌత్య సంబంధాల 40వ వార్షికోత్సవం నిర్వహించుకుంటున్నాం. అయితే, ఈ ద్వైపాక్షిక బంధం ఈనాటిది కాదు... ఎంతో ప్రాచీనమేగాక లోతైనది కూడా. అంగోలా స్వేచ్ఛ కోసం పోరాడుతున్న వేళ భారత్‌ అచంచల విశ్వాసం, స్నేహభావనతో అక్కడి ప్రజలకు తోడునీడగా నిలిచింది.

మిత్రులారా!

ఉభయ దేశాల నడుమ నేడు వివిధ రంగాలలో సన్నిహిత సహకారం కొనసాగుతోంది. అంగోలా నుంచి అధిక స్థాయిలో  చమురు-గ్యాస్ కొనుగోలు చేసే దేశాల్లో భారత్‌ ఒకటి. ఈ నేపథ్యంలో ఇంధన భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని మేం నిర్ణయించుకున్నాం. అలాగే అంగోలా సాయుధ దళాల ఆధునికీకరణ కోసం 200 మిలియన్‌ డాలర్ల విలువైన దశలవారీ రక్షణ రుణం అభ్యర్థనకు భారత్‌ ఆమోదం తెలపడం నాకెంతో సంతోషంగా ఉంది. రక్షణ వేదికలు, సామగ్రి మరమ్మతు, సమగ్ర పరిశీలన వంటి అంశాలపైనా మేమిప్పుడు చర్చించుకున్నాం. అంగోలా సాయుధ దళాలకు భారత్‌ సదా సంతోషంతో శిక్షణ సహకారం అందిస్తుంది.

మా రెండు దేశాల ప్రగతి భాగస్వామ్యం మరింత ఇనుమడించేలా సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాలు (డిపిఐ), అంతరిక్ష పరిజ్ఞానం, సామర్థ్య వికాసం వంటి అంశాల్లో అంగోలాతో మా సామర్థ్యాలను పంచుకుంటాం. అదేవిధంగా ఆరోగ్య సంరక్షణ, వజ్రాల ప్రాసెసింగ్, ఎరువులు, కీలక ఖనిజ రంగాల్లో మా సంబంధాల బలోపేతానికి మేమివాళ నిర్ణయం తీసుకున్నాం. అంగోలాలో యోగా, బాలీవుడ్కుగల ప్రజాదరణ మన రెండు దేశాల లోతైన సాంస్కృతిక బంధానికి ప్రతిబింబం. ఈ నేపపథ్యంలో ఉభయ దేశాల ప్రజల మధ్య సంబంధాల బలోపేతానికి  వీలుగా యువజన ఆదానప్రదాన కార్యక్రమానికి నాంది పలకాలని కూడా మేం నిర్ణయించాం.

మిత్రులారా!

అంతర్జాతీయ సౌర కూటమిలో చేరికపై అంగోలా నిర్ణయం మాకెంతో హర్షణీయం. అదేవిధంగా భారత్‌ చేపట్టిన ‘కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’, ‘బిగ్ క్యాట్ అలయన్స్’, ‘గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్‌’ వంటి వినూత్న కార్యక్రమాల్లోనూ భాగస్వామ్యానికి అంగోలాను మేం ఆహ్వానిస్తున్నాం.

మిత్రులారా!

ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పు అనే వాస్తవంపై మేమిద్దరం ఏకాభిప్రాయంతో ఉన్నాం. ఇటీవల పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి సందర్భంగా అమాయక జన ప్రాణనష్టంపై సంతాపం ప్రకటించిన అధ్యక్షుడు లొరెన్సూతోపాటు అంగోలా ప్రజలకు నా కృతజ్ఞతలు. ఉగ్రవాదులు, వారికి మద్దతిచ్చే శక్తులపై దృఢమైన, నిర్ణయాత్మక చర్యలకు మేం కట్టుబడి ఉన్నాం. సరిహద్దు ఉగ్రవాదంపై మా పోరాటానికి అంగోలా మద్దతు పలకడంపై కృతజ్ఞతలు తెలుపుతున్నాం.

మిత్రులారా!

ఆఫ్రికా సమాఖ్య (ఏయూ)కు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో 140 కోట్ల మంది భారతీయుల తరఫున  అంగోలాకు నా శుభాకాంక్షలు. భారత్‌ ‘జి-20’కి అధ్యక్షత వహించిన సమయంలో ‘ఏయూ’కు ఈ కూటమిలో శాశ్వత సభ్యత్వం లభించడం మాకెంతో గర్వకారణం. వలస పాలనను పారదోలడంలో భారత్‌, ఆఫ్రికా దేశాలు సంయుక్తంగా నిరసన గళం వినిపించాయి. ఈ ప్రక్రియలో పరస్పర స్ఫూర్తితో ముందడుగు వేశాం. ఆ క్రమంలో నేడు వర్ధమాన దేశాల ప్రయోజనాలు, ఆశలు, అంచనాలు, ఆకాంక్షల సాకారానికి చేయూతనివ్వడంలో మా ఐక్యత కొనసాగుతుంది.

గడచిన దశాబ్దంలో ఆఫ్రికా దేశాలతో మా సహకారం మరింత విస్తృతమైంది. పరస్పర వాణిజ్యం విలువ దాదాపు 100 బిలియన్‌ డాలర్ల స్థాయిని అందుకుంది. రక్షణ రంగ సహకారం, సముద్ర భద్రత రంగాల్లోనూ విశేష పురోగతి కనిపిస్తోంది.

   భారత్‌-ఆఫ్రికా మధ్య గత నెలలో ‘ఎక్యూమ్‌’ పేరిట తొలి నావికాదళ సంయుక్త సముద్ర విన్యాసాలు నిర్వహించాం. గడచిన దశాబ్ద కాలంలో ఆఫ్రికా అంతటా 17 కొత్త రాయబార కార్యాలయాలను మేం ప్రారంభించాం. ఆఫ్రికా కోసం 12 బిలియన్లకుపైగా విలువైన దశలవారీ రుణాలు కేటాయించాం. అంతేకాకుండా ఆఫ్రికా దేశాలకు 700 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయం కూడా అందించాం. ఇక 8 ఆఫ్రికా దేశాలలో వృత్తి శిక్షణ కేంద్రాలు ప్రారంభించగా, ‘డిపిఐ’ కల్పనలో 5 ఆఫ్రికా దేశాలకు సహకరిస్తున్నాం. విపత్తు సమయాల్లో ఆఫ్రికా ప్రజలతో భుజం కలిపి ‘తొలి ప్రతిస్పందకులు’గా పనిచేసే అవకాశం మాకు లభించింది.

భారత్‌-ఆఫ్రికా సమాఖ్య ప్రగతి భాగస్వాములు మాత్రమేగాక వర్ధమాన దేశాలకు మూలస్తంభాలుగా నిలుస్తున్నాయి. అంగోలా నేతృత్వాన భారత్‌, ఆఫ్రికా సమాఖ్య మధ్య సంబంధాలు మరింత ఉన్నత స్థాయికి చేరగలవన్నది నా ప్రగాఢ విశ్వాసం.

అధ్యక్ష మహోదయా!

మా దేశంలోకి మీతోపాటు మీ ప్రతినిధి బృందానికి మరోసారి సౌహార్ద్ర స్వాగతం పలుకుతున్నాను.

మీకందరికీ అనేకానేక ధన్యవాదాలు.

ఆబ్రిగాదో

గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది సమీప స్వేచ్ఛానువాదం మాత్రమే!

 

***


(Release ID: 2126653) Visitor Counter : 9