ప్రధాన మంత్రి కార్యాలయం
కేరళలోని తిరువనంతపురంలో విజింజామ్ అంతర్జాతీయ ఓడరేవును జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
Posted On:
02 MAY 2025 2:06PM by PIB Hyderabad
కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ జీ, ముఖ్యమంత్రి శ్రీ పి. విజయన్ జీ, నా కేంద్ర మంత్రివర్గ సహచరులు, వేదికపై ఉన్న ఇతర ప్రముఖులు, కేరళకు చెందిన నా సోదర సోదరీమణులారా...
ఎల్లవర్క్కుమ్ ఎండే నమస్కారం. ఒరిక్కల్ కూడి శ్రీ అనంతపద్మనాభండే మణ్ణిలేక్క వరాన్ సాధిచ్చదిల్ ఎనిక్క అతియాయ్ సంతోష్ముండ్!
మిత్రులారా...
ఈరోజు భగవాన్ ఆదిశంకరాచార్య జయంతి. మూడేళ్ల కిందట సెప్టెంబరులో ఆదిశంకరాచార్యుల పవిత్ర జన్మస్థలాన్ని సందర్శించే భాగ్యం నాకు కలిగింది. నా పార్లమెంటరీ నియోజకవర్గమైన కాశీలోని విశ్వనాథ్ ధామ్ కాంప్లెక్సులో ఆదిశంకరాచార్యుల భారీ విగ్రహం ఏర్పాటు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఉత్తరాఖండ్లోని పవిత్ర కేదారనాథ్ ధామ్ లో ఆది శంకరాచార్యుల దివ్య విగ్రహాన్ని ఆవిష్కరించే అదృష్టం కూడా నాకు దక్కింది. ఈరోజుకు మరో ప్రత్యేకత ఉంది. దేవభూమి ఉత్తరాఖండ్ లో కేదారనాథ్ ఆలయ ద్వారాలు భక్తుల కోసం తెరచుకునే విశేష దినమిది. కేరళను దాటి ఆదిశంకరాచార్యులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో మఠాలను స్థాపించి దేశాన్ని జాగరూకం చేశారు. ఈ పవిత్ర దినాన నేను ఆయనకు వినమ్రపూర్వకంగా నమస్కరిస్తున్నాను.
మిత్రులారా...
ఓవైపు అపారమైన అవకాశాలను అందించే విస్తారమైన సముద్రం, మరోవైపు అబ్బురపరిచే ప్రకృతి సౌందర్యం.. వీటి నడుమ ఇప్పుడు విజింజామ్ డీప్ వాటర్ సీ పోర్ట్ నవయుగ అభివృద్ధికి సంకేతంగా నిలుస్తోంది. ఈ ఘనత సాధించినందుకు కేరళ ప్రజలతోపాటు యావద్దేశానికి నా అభినందనలు.
మిత్రులారా...
విజింజామ్ డీప్ వాటర్ సీ పోర్టును రూ. 8,800 కోట్లతో అభివృద్ధి చేశాం. సరకు రవాణాలో భిన్న కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న ఈ ఓడరేవు సామర్థ్యం మున్ముందు మూడు రెట్లు పెరుగుతుంది. దీంతో ప్రపంచంలోని అతిపెద్ద సరుకు రవాణా నౌకలు సులువుగా ఇక్కడికి రావడానికి వీలు కలుగుతుంది. ఇప్పటిదాకా దేశ సరకు రవాణా కార్యకలాపాల్లో (ఒక నౌక నుంచి మరో నౌకకు సరకు మార్చడం వంటివి) 75% విదేశీ ఓడరేవుల్లోనే జరిగేవి. దీంతో దేశం గణనీయంగా ఆదాయాన్ని కోల్పేయేది. ఈ పరిస్థితి మారుబోతోంది. ఇప్పుడు మన డబ్బు మనకే ఉపయోగపడుతుంది. ఇప్పుడు బయటవాళ్ళకు చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి ఉండదు కాబట్టి ఇకపై ఆ నిధులు కేరళ, విజింజామ్ ప్రజలకు కొత్త ఆర్థిక అవకాశాలను తెచ్చిపెడతాయి.
మిత్రులారా...
బానిసత్వానికి ముందు వేల సంవత్సరాల పాటు మనమెంతో సుభిక్షంగా ఉండేవాళ్ళం. ఒక దశలో ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ప్రధాన వాటా భారత్ దే. ఆ కాలంలో మన నౌకావాణిజ్య సత్తా, మన ఓడరేవు నగరాల్లో ఆర్థిక కార్యకలాపాలు దేశాన్ని ఇతర దేశాలకు భిన్నంగా నిలిపాయి. ఇందులో కేరళది ముఖ్య భూమిక. కేరళ నుంచి అరేబియా సముద్రం మీదుగా అనేక దేశాలతో మనం వాణిజ్య సంబంధాలు కొనసాగించాం. కేరళ నుంచి నౌకలు వివిధ దేశాలకు సరుకును రవాణా చేసేవి. మన ప్రబల ఆర్ధిక సామర్ధ్యంతో ఈ మార్గాన్ని మరింతగా తీర్చిదిద్దడానికి కేంద్రం కట్టుబడి ఉంది. మన సముద్ర తీర రాష్ట్రాలు, ఓడరేవు నగరాలు అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాధనకు కీలక కేంద్రాలుగా మారతాయి. నేను ఇప్పుడే పోర్టు అంతా కలియ తిరిగి వచ్చాను, అదానీ కేరళలో ఇంత గొప్ప పోర్టును నిర్మించడం ద్వారా గుజరాత్ లో చేయని పనిని కేరళలో చేశాడని అక్కడి ప్రజలు తెలుసుకున్నప్పుడు, ఆయన గుజరాత్ ప్రజల కోపాన్ని చవిచూసేందుకు సిద్ధంగా ఉండక తప్పదు. నేను కూడా మా ముఖ్యమంత్రికి చెప్పాలనుకుంటున్నా...మీరు ఇండి కూటమికి చాలా బలమైన స్తంభం. శశి థరూర్ కూడా ఇక్కడే ఉన్నారు. ఈ కార్యక్రమం చాలామందికి రాత్రుళ్ళు నిద్ర లేకుండా చేస్తుంది. నా మాటలు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్లాయి అనుకుంటా.
మిత్రులారా...
మౌలిక సదుపాయాలు, వ్యాపార నిర్వహణలో సౌలభ్యం... ఈ రెండూ కలిసికట్టుగా అడుగేస్తే ఓడరేవులు ప్రధాన పాత్రను పోషించే ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో ప్రయోజనం పొందుతుంది. గత పదేళ్లకు పైగా భారత ప్రభుత్వం అనుసరిస్తున్న ఓడరేవులు-జలమార్గాల సంబంధిత విధానానికి ఇదే అంశం నమూనాగా నిలిచింది. పారిశ్రామిక కార్యకలాపాలు, రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ‘సాగర్ మాల' ప్రాజెక్టు’లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఓడరేవులకు సంబంధించిన మౌలిక సదుపాయాల స్థాయిని పెంచింది. ఓడరేవులతో ముడిపడిన సంధాన సదుపాయాలను బలోపేతం చేసింది. ‘పీఎం గతిశక్తి’లో భాగంగా నిరంతరాయ సంధానాన్ని సమకూర్చే ఉద్దేశంతో జలమార్గాలు, రైలుమార్గాలు, హైవేలు, వాయుమార్గాలను శరవేగంగా ఏకీకృతం చేస్తున్నాం. వ్యాపార నిర్వహణలో సౌలభ్యాన్ని సమకూర్చడానికి చేసిన ఈ సంస్కరణలతో ఓడరేవులు, మౌలికసదుపాయాల రంగాల్లోకి పెట్టుబడులు మరింత పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం భారతీయ నావికులకు సంబంధించిన నియమనిబంధనలను కూడా సవరించింది. దీంతో గొప్ప ఫలితాలు లభించాయి. 2014లో భారతీయ నావికుల సంఖ్య 1.25 లక్షల కంటే తక్కువే. ఇవాళ ఈ సంఖ్య 3.25 లక్షలకు మించింది. నావికుల సంఖ్య పరంగా చూస్తే ప్రస్తుతం ప్రపంచంలోని అగ్రగామి మూడు దేశాల సరసన భారత్ చేరింది.
మిత్రులారా...
దశాబ్దం క్రితం ఓడరేవులలో నౌకలు ఎంతకాలం ఎదురుచూసేవో ఈ రంగంతో సంబంధమున్న వాళ్లందరికీ తెలుసు. ముఖ్యంగా సరకును దింపడానికి ఎక్కువ సమయం పట్టేది. ఈ జాప్యం వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, మొత్తంమీద ఆర్థికవ్యవస్థనే ప్రభావితం చేసేది. ప్రస్తుతం ఈ పరిస్థితి మారింది. గత పది సంవత్సరాల్లో భారత్ లోని ప్రధాన ఓడరేవుల్లో టర్నరౌండ్ సమయం 30 శాతం తగ్గింది. దీంతో కార్యనిర్వహణ సామర్థ్యం మెరుగైంది. ఓడరేవుల సామర్థ్యం పెరిగినందువల్ల భారత్ ప్రస్తుతం తక్కువ సమయంలో ఎక్కువ సరకును హ్యాండిల్ చేయగలుగుతోంది. ఇది దేశ ఆధునిక వస్తు రవాణా వ్యవస్థ (లాజిస్టిక్స్) సామర్ధ్యంతో పాటు వాణిజ్య సామర్ధ్యాన్ని కూడా బలోపేతం చేస్తోందని ఆయన వివరించారు.
మిత్రులారా...
దశాబ్దాల తరబడి కనబరుస్తూ వచ్చిన దూరదృష్టి, ప్రయత్నాల ఫలితమే నౌకావాణిజ్య రంగంలో భారత్ దక్కిన ఈ విజయం. గత పది సంవత్సరాల్లో భారత్ ఓడరేవుల సామర్థ్యాన్ని రెట్టింపైంది. జాతీయ జలమార్గాలను ఎనిమిదింతలు విస్తరించింది. ప్రస్తుతం మన దేశంలోని రెండు ఓడరేవులు ప్రపంచ అగ్రగామి 30 ఓడరేవుల్లో స్థానం సంపాదించాయి. లాజిస్టిక్స్ పనితీరు సూచీలో ఇండియా స్థానం కూడా మెరుగుపడింది. దీనికి తోడు, భారత్ ఇప్పుడు ప్రపంచంలో నౌకానిర్మాణంలో అగ్రగామి 20 దేశాల సరసన నిలిచింది. దేశంలో మౌలిక సదుపాయాల వ్యవస్థను పటిష్ఠపరచిన తరువాత, ఇక ప్రపంచ వాణిజ్యంలో భారత్ వ్యూహాత్మక స్థితిపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. నౌకావాణిజ్యంలో అమృత్ కాల దార్శనికతను అవలంబిస్తాం. ఇది అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించడానికి అనుసరించాల్సిన నౌకావాణిజ్య వ్యూహ రూపురేఖలను వివరిస్తుంది. భారత, మధ్య ప్రాచ్య, ఐరోపా ఆర్థిక నడవా’ను ఏర్పాటు చేయడానికి అనేక ప్రధాన దేశాలతో కలసి పనిచేస్తామని జీ-20 శిఖరాగ్ర సదస్సులో భారత్ చెప్పిన విషయాన్ని మీరు జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఈ కారిడార్లో కేరళ పోషిస్తున్న పాత్ర కీలకం. ఇది కేరళ రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుంది.
మిత్రులారా...
భారత నౌకా వాణిజ్య రంగాన్ని కొత్త శిఖరాలకు చేర్చడంలో ప్రైవేటు రంగం కీలక పాత్ర పోషిస్తోంది. ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యం కింద గత పదేళ్లలో వేలాది కోట్ల పెట్టుబడులు పెట్టాం. దీంతో భారత ఓడరేవులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే కాదు, భవిష్యత్తుకు అనుగుణంగా సిద్ధం చేశాం. ప్రైవేటు రంగ భాగస్వామ్యం వినూత్నతను, సామర్థ్యాన్ని పెంచాయి.
మన నౌకా మంత్రి అది కూడా.. మనప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఒక కమ్యూనిస్ట్ మంత్రి తన ప్రసంగంలో అదానీ అంటూ ప్రైవేట్ గురించి మాట్లాడుతున్న విషయంపై మీడియా వర్గాలు దృష్టి సారించి ఉండవచ్చు. ఇది మారుతున్న భారత దేశం. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
మిత్రులారా...
కొచ్చిలో నౌకానిర్మాణం, మరమ్మతు క్లస్టర్ ఏర్పాటు దిశగా భారత్ ముందడుగు వేస్తోంది. ఈ క్లస్టర్ నిర్మాణం పూర్తైతే అనేక నూతన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కేరళలోని స్థానికులు, యువతకు ఇదెంతో లబ్ది చేకూరుస్తుంది.
మిత్రులారా...
నౌకా నిర్మాణ సామర్థ్యాలను పెంచుకునేందుకు దేశం ఇప్పుడు ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకుంటోంది. భారత్లోనే పెద్ద నౌకల నిర్మాణం జరిగేలా ప్రోత్సహించేందుకు ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది తయారీ రంగానికి గట్టి ప్రోత్సాహాన్ని అందిస్తుంది. అంతేకాదు ఎంఎస్ఎమ్ఈలకు ప్రత్యక్ష ప్రయోజనాలను కలగజేస్తుంది. పెద్ద సంఖ్యలో ఉపాధి, సంస్థలను నెలకొల్పే అవకాశాలను సృష్టిస్తుంది.
మిత్రులారా...
తగిన స్థాయిలో మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చి, వాణిజ్యం విస్తరించి, సామాన్య ప్రజల ప్రాథమిక అవసరాలు తీరినప్పుడే నిజమైన అభివృద్ధి జరిగినట్లు. గత 10 ఏళ్లలో రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలలోనే కాక నౌకాశ్రయాల్లో మౌలికాభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో కేరళ ప్రజలకు తెలుసు. ఏళ్ల తరబడి నిలిచిపోయిన కొల్లం బైపాస్, అలప్పుజ బైపాస్ వంటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. కేరళకు ఆధునిక వందే భారత్ రైళ్లను అందించాం.
మిత్రులారా...
కేరళ అభివృద్ధి దేశ సమగ్ర వృద్ధికి దోహదం చేస్తుందనే సూత్రాన్ని భారత ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తోంది. సహకార సమాఖ్య స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తోంది. గత దశాబ్దకాలంగా కీలకమైన సామాజిక అంశాల్లో కేరళ పురోగతిని సాధించేలా చూసుకుంది. జల్ జీవన్ మిషన్, ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం వంటి పలు పథకాల ప్రయోజనాలను కేరళవాసులు పొందగలిగారు.
మిత్రులారా...
మత్య్సకారుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం. నీలి విప్లవం, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేరళకు వందల కోట్ల విలువైన ప్రాజెక్టులు మంజూరయ్యాయి. పొన్నాని, పుతియప్పతో వంటి ఫిషింగ్ హార్బర్ల ఆధునికీకరించాం. కేరళలోని వేలాది మంది మత్స్యకార సోదర సోదరీమణులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చాం. తద్వారా వారికి వందల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందుతోంది.
మిత్రులారా...
సామరస్యం, సహనానికి కేరళ పుట్టినిల్లు. వందల సంవత్సరాల క్రితమే ప్రపంచంలోని పురాతన చర్చిలలో ఒకటైన సెయింట్ థామస్ చర్చిని ఇక్కడ నిర్మించారు. కొద్ది రోజుల క్రితం పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూయడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను కలచివేసిన విషయం మీకు తెలుసు. భారత్ తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన అంతిమయాత్రకు హాజరై నివాళులు అర్పించారు. కేరళకు చెందిన మా సహచర మంత్రి జార్జ్ కురియన్ కూడా ఆమె వెంట వెళ్లారు. నేను కూడా పవిత్ర ప్రాంతమైన కేరళ నుంచి శోకసంద్రంలో మునిగిన వారందరికీ మరోసారి నా సంతాపాన్ని తెలియజేస్తున్నా.
మిత్రులారా...
పోప్ ఫ్రాన్సిస్ సేవా స్ఫూర్తితో ఉండేవారు. క్రైస్తవ సంప్రదాయాల్లో ప్రతి ఒక్కరికి తగిన స్థానం ఉండేలా ఎంతో కృషి చేశారు. ఆయన సేవలను ప్రపంచం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది. పోప్ ఫ్రాన్సిస్ ను కలిసే అవకాశం లభించడం నా అదృష్టం. పలు అంశాలపై ఆయనతో చర్చించే అవకాశం దక్కింది. ఆయన నాపై ఎంతో ఆప్యాయత కనబరచిన విషయాన్ని నేను గుర్తించా. మానవత్వం, సేవ, శాంతి విషయంలో మా మధ్య ఎన్నో సంభాషణలు జరిగాయి. అవి ఎల్లవేళలా నాకు స్ఫూర్తినిస్తాయి.
మిత్రులారా...
ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.. ప్రపంచ నౌకా వాణిజ్యంలోనూ, వేలాది ఉద్యోగాల కల్పనలోను కేరళను ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్ధేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి తమ ప్రభుత్వం పనిచేస్తుంది. పనిచేస్తోన్న కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు. కేరళ ప్రజల సామర్థ్యాలతో భారత నౌకా వాణిజ్య రంగం సరికొత్త శిఖరాలకు చేరుకుంటుందన్న విశ్వాసం నాకుంది.
నముక్కు ఓరుమిచ్ ఓరు వికసిత్ కేరళం పడత్తుయర్తం, జై కేరళం... జై భారత్!
కృతజ్ఞతలు.
***
(Release ID: 2126558)
Visitor Counter : 4