సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
“భవిష్యత్ మాధ్యమం డిజిటల్ రేడియో; అనలాగ్ మాధ్యమం కూడా సమాంతరంగా కొనసాగాలి”: వేవ్స్-2025 వేదికపై చర్చల సారాంశం
మంచి కంటెంట్, సంయుక్త భాగస్వామ్యాలు, వేదికల పరస్పర ప్రోత్సాహం, రేడియో మాధ్యమానికి శుభసూచకాలు · ‘రేడియో రీఇమాజిన్డ్: త్రైవింగ్ ఇన్ ది డిజిటల్ ఏజ్’ అంశంపై వేవ్స్-2025లో అవగాహనాత్మకంగా సాగిన బృంద చర్చ
Posted On:
02 MAY 2025 3:09PM by PIB Hyderabad
వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్-2025 (వేవ్స్)లో భాగంగా ఈ రోజు ‘రేడియో రీఇమాజిన్డ్: త్రైవింగ్ ఇన్ ది డిజిటల్ ఏజ్’ అంశంపై నిర్వహించిన బృంద గోష్ఠి అంతర్జాతీయ స్థాయి నిపుణులను ఒకే వేదికపైకి తేగా, వారందరి ప్రసంగాలు అవగాహనాత్మకంగా సాగాయి.
ఈ బృందంలో వాణిజ్య రేడియో అగ్రగామి జాక్వెలిన్ బియర్‌హోర్స్ట్, డిజిటల్ రేడియో మోండియేల్ (డిఆర్‌ఎం) ఛైర్మన్ రుక్సాండ్రా ఒబ్రేజా, ‘డిఆర్‌ఎం’ వైస్ గ్రూప్ లీడర్ అలెగ్జాండర్ జింక్, ప్రసార భారతి మాజీ సీఈవో-డీప్ టెక్ ఫర్ భారత్ సహ వ్యవస్థాపకులు శశి శేఖర్ వెంపటి, ప్రముఖ ప్రసార సాంకేతిక నిపుణుడు టెడ్ లావెర్టీ వంటి ప్రసిద్ధ నిపుణులు సభ్యులుగా ఉన్నారు. ఈ బృంద గోష్ఠికి ‘రెడ్ ఎఫ్‌ఎం’ డైరెక్టర్-సీవోవో నిషా నారాయణన్ తనదైన నైపుణ్యంతో సంధానకర్తగా వ్యవహరించారు. రేడియో ప్రసార పరిశ్రమను ప్రభావితం చేసే అంశాలపై ఈ చర్చ సాగేలా దృష్టి సారించారు.
భవిష్యత్ మాధ్యమం డిజిటల్ రేడియో; అనలాగ్
మాధ్యమం కూడా సమాంతరంగా కొనసాగాలి
ఈ చర్చల సందర్భంగా- భవిష్యత్తులో డిజిటల్ రేడియో ప్రధాన స్వరూపం దాల్చగలదని జాక్వెలిన్ బియర్‌హోర్స్ట్ అభిప్రాయపడ్డారు. మెరుగైన ధ్వని నాణ్యత, మరింత విశ్వసనీయ ప్రసార సామర్థ్యంతోపాటు ఇది మల్టీమీడియా అంశాలను ఏకీకృతం చేయడంలో ఎంతో ప్రయోజనకరం కాగలగడమే ఇందుకు కారణమని వివరించారు. “కొన్ని సందర్భాల్లో... ముఖ్యంగా సరళ సమాచార ఆదానప్రదానం కోసం అనలాగ్ రేడియో అవసరం ఉంది. అయినప్పటికీ, పరిమిత డిజిటల్ మౌలిక సదుపాయాలుగల ప్రాంతాలలో ప్రస్తుతం డిజిటల్ ప్రసారాలవైపు చోటు చేసుకుంటున్న మార్పు మరింత ముందుకు సాగుతుందని నా భావన” అని ఆమె వివరించారు. అనలాగ్ నుంచి డిజిటల్‌కు మార్పుతో వ్యయం ఆదా కాగలదని కూడా చెప్పారు.
అయితే, ఉగ్ర దాడులతోపాటు వరదల వంటి అత్యవసర విపత్కర పరిస్థితుల్లో డిజిటల్ నెట్‌వర్క్‌లు నిరంతరం పనిచేసే అవకాశం ఉండదని జాక్వెలిన్ బియర్‌హోర్స్ట్, అలెగ్జాండర్ జింక్ అభిప్రాయపడ్డారు. అలాంటి సమయాల్లో అనలాగ్ ప్రసారం ఎంతో కీలకం కాగలదని వారిద్దరూ పేర్కొన్నారు. అలాగే భారత్‌లో 6,00,000 గ్రామాలకు చేరగల అనలాగ్ రేడియో పరిరక్షణ అత్యంత ప్రధానమని ‘డిఆర్‌ఎం’ చైర్‌పర్సన్ రుక్సాండ్రా ఒబ్రేజా కూడా వ్యాఖ్యానించారు. మొత్తం మీద అత్యవసర పరిస్థితుల్లో ప్రసార రేడియో మాధ్యమం నిస్సందేహంగా మరింత ఎక్కువ జనాభాకు చేరుతుందని నిపుణులందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ మేరకు “పాత వ్యవస్థకు అంతరాయం కలగకుండా కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ప్రవేశపెట్టడం ఒక సవాలు కాగలదు” అని రుక్సాండ్రా ఒబ్రేజా అన్నారు.
రేడియో కమ్యూనికేషన్‌లో 5 కొత్త ‘సి’లు
రేడియో ద్వారా సమాచార ఆదానప్రదానంలో కీలకంగా పరిగణించే “కన్సైజ్నెస్, క్లారిటీ, కాన్ఫిడెన్స్, కంట్రోల్, కేపబిలిటీ (సంక్షిప్తత, స్పష్టత, విశ్వసనీయత, నియంత్రణ, సామర్థ్యం) పాతకాలపు 5 ‘సి’-లను జాక్వెలిన్ బియర్‌హోర్స్ట్ ప్రస్తావించారు. అయితే, వర్ధమాన డిజిటల్ రేడియో మౌలిక సదుపాయాల శకంలో అవసరమైన 5 కొత్త ‘సి’లు- “కవరేజ్, కంటెంట్, కన్జ్యూమర్ డివైజెస్, కార్, కమ్యూనికేషన్”తో పాతవాటిని తులనాత్మకంగా పోల్చారు. అలాగే శ్రోతలుగల సముచిత ప్రాంతాలకు రేడియో నెట్‌వర్క్ చేరేవిధంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉందని ఆమె సూచించారు.
ఈ రంగం వృద్ధి దిశగా సమష్టి కృషిలో శ్రోతల సంఖ్యను ఒక ప్రమాణంగా స్వీకరించడం ముఖ్యమైన ముందడుగు. ఈ అంశానికి సంబంధించి టెడ్ లావెటీ మాట్లాడుతూ- గోప్యతకు భంగం కలగకుండా శ్రోతల సంఖ్యను లెక్కించేందుకు ఐరోపాలో ‘రేడియోప్లేయర్, రేడియో ఎఫ్‌ఎం’ వంటి యాప్‌ల వినియోగాన్ని ప్రస్తావించారు. అదే తరహాలో భారత్‌లో రేడియో శ్రోతలు ఎక్కువగాల ప్రాంతాల గుర్తింపు, వారి సంఖ్య లెక్కింపు, విశ్లేషణల కోసం ఇలాంటి కార్యక్రమాలు, యాప్‌లు, నమూనా సర్వేలు, లిజనింగ్ డైరీల వంటి ఉపకరణాలను వినియోగించవచ్చునని ఆయన సలహా ఇచ్చారు.
మంచి కంటెంట్, సంయుక్త భాగస్వామ్యాలు..
వేదికల పరస్పర ప్రోత్సాహం ప్రయోజనకరం
“కంటెంట్ ఈజ్ కింగ్” (సారాంశమే ప్రధానం)- అన్నది ఈ రంగంలో విజయ మంత్రమనే వాస్తవాన్ని నిపుణులందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. అయితే, ప్రైవేట్ ‘ఎఫ్‌ఎం’లు వివిధ రకాల కంటెంట్‌లకు అధిక లైసెన్స్ రుసుము చెల్లించాల్సి వస్తున్నదని నిషా నారాయణన్ అన్నారు. దీనివల్ల తక్కువ లైసెన్స్ రుసుముగల ఇతర కేటగిరీలలో ప్రజాదరణ పొందిన సంగీతాన్ని అవి అధిక శాతం అందించాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రైవేట్ ‘ఎఫ్‌ఎం’ల కోసం కంటెంట్‌లో వైవిధ్యం కనబరచాల్సిన అవసరం ఎంతయినా ఉందని ‘రెడ్ ఎఫ్‌ఎం’ సీవోవో అంగీకరించారు.
ఈ సందర్భంగా ఉత్తమ, ప్రయోజనకర కంటెంట్కుగల విలువను జాక్వెలిన్ బియర్‌హోర్స్ట్ వివరిస్తూ- బ్రిటిష్ డిజిటల్ రేడియో స్టేషన్ ‘అబ్సొల్యూట్ రేడియో’ విజయగాథను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ సంస్థ 70, 80, 90 దశకాల్లో తమ శ్రోతలకు ప్రయోజనం చేకూర్చే వివిధ అవగాహన, ప్రచార కార్యకలాపాలలో పాలుపంచుకుంటూ ఎదగడమేగాక ఆదాయం కూడా ఆర్జించిందని గుర్తుచేశారు.
డిజిటల్ రేడియో శ్రవణ కంటెంట్కు మించి ప్రయోజనం కల్పించాలి. ఆ మేరకు శ్రోతలు, వీక్షకుల సంఖ్య పెరిగేకొద్దీ వారికి ఉపయోగకరమైన దృశ్య, వచన యాప్‌లతో అవి పనిచేయాలని పేర్కొంటూ అలెగ్జాండర్ జింగ్ డిజిటల్ రేడియో సంబంధిత మరో కీలకాంశాన్ని గుర్తుచేశారు.
రేడియో శ్రోతల సంఖ్య విస్తరణకు తోడ్పడే వ్యవస్థ అవసరం కూడా ఉందని టెడ్ లావెర్టీ అభిప్రాయపడ్డారు. ఈ దిశగా తక్కువ ధర పరికరాల తయారీ, ఆండ్రాయిడ్ తరహా సానుకూల వేదికల సౌలభ్యం వంటి కొన్ని మార్గాలను ఆయన సూచించారు. బాహ్య హార్డ్ వేర్ భాగాల లభ్యతసహా కంటెంట్ వైవిధ్యం కూడా ముఖ్యమని, ఇది వివిధ ఉప-సమూహ శ్రోతలకు చేరడానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.
వాతావరణ మార్పు-డిజిటల్ రేడియో
సింగిల్ ఫ్రీక్వెన్సీ నెట్‌వర్క్‌ల ప్రారంభం, మరింత సమర్థ మాడ్యులేషన్ పద్ధతుల వినియోగం వంటి చర్యల ద్వారా డిజిటల్ రేడియో గణనీయమైన విద్యుత్ ఆదా చేయగలదు. అయితే, ‘ఎఫ్‌ఎం’ స్టేషన్ల నిలిపివేత మాత్రం సాధ్యం కాదు. కొన్ని యూరోపియన్ దేశాలు ఇలా ‘ఎఫ్‌ఎం’ స్టేషన్లను పూర్తిగా ఆపివేసి, పూర్తి డిజిటలీకరణకు ప్రయత్నించడాన్ని రుక్సాండ్రా ఒబ్రేజా ప్రస్తావిస్తూ ఇదెంత మాత్రం వాంఛనీయం కాదని స్పష్టం చేశారు. విధానపరమైన చర్యల కోసం ప్రభుత్వాన్ని అభ్యర్థించేందుకు వీలుగా వాణిజ్య రేడియో స్టేషన్ల అవసరాల జాబితా రూపకల్పన ముఖ్యమని ఆమె సూచించారు.
భారత్‌లో రేడియో పరిశ్రమ – వ్యవస్థ బలోపేతానికి అవకాశాలు
ఐరోపాలో ప్రభుత్వాల విధానాలు డిజిటల్ రేడియో పరిధిని ప్రభావితం చేశాయని రుక్సాండ్రా ఒబ్రేజా పేర్కొన్నారు. కార్లు, మొబైల్ ఫోన్లలో రేడియో ఏర్పాటు, మార్కెట్లో రేడియో సెట్‌ల సులభ లభ్యత వంటివి ఈ దిశగా కీలక చర్యలని చెప్పారు. భారత్‌లో డిజిటల్ రేడియో కన్సార్షియం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నిపుణులు అభిప్రాయపడ్డారు.
డిజిటల్ రేడియో పరంగా భారత్‌ను ఒక చోదక శక్తిగా రుక్సాండ్రా ఒబ్రేజా అభివర్ణించారు. డిజిటల్ నుంచి టెరెస్ట్రియల్ రేడియో పరిణామం ఎంత ముఖ్యమో, డిజిటల్ నుంచి మొబైల్ పరిణామం కూడా అంతే ముఖ్యమని చెప్పారు. “ప్రసార భారతి నేడు దాదాపు 90 కోట్ల జనాభాకు చేరువైనందున ఈ రంగంలో భారత్ ఒక బంగారు బాతు వంటిది. దేశంలో కోట్లాది మొబైల్ ఫోన్ వినియోగదారులు ఉండటం దీనికి అదనపు బలం. ఈ సానుకూలతలను సద్వినియోగం చేసుకోవడం అత్యంత కీలకం” అని ఆమె వ్యాఖ్యానించారు.
శశి శేఖర్ వెంపటి మాట్లాడుతూ- రేడియోకు భారత్ అతిపెద్ద మార్కెట్ అని పేర్కొన్నారు. ప్రజా శ్రేయస్సుకు సంబంధించి ఇది అసలు సిసలు మాధ్యమంగా ఆయన అభివర్ణించారు. ఈ రంగం విషయంలో సమన్వయ సహిత ప్రభుత్వ చర్యలు అవసరమని స్పష్టం చేశారు. “రేడియో అమాంతం అదృశ్యమైపోదు. భారత్‌లోని రేడియో వాడకందారులు సమాజంలోని విస్తృత శ్రేణికి చెందినవారు” అంటూ దేశంలో ఈ రంగం ప్రయోజనాలను వివరించారు. విధానపరమైన చర్యల్లో భాగంగా కొన్ని రకాల పరికరాలలో రేడియో ఉండటాన్ని తప్పనిసరి చేస్తూ నిబంధనల క్రమం ఏర్పరచాలన్నారు. ఈ క్రమంలో ఏఐ ఆధారిత ఉపకరణాలు సహా సంప్రదాయ రేడియో వంటి స్తబ్ద పరికరాలు సమాంతరంగా కొనసాగాలని పేర్కొన్నారు.
ప్రభుత్వ విధానాల రూపకల్పనలో వాతావరణ మార్పు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో సంప్రదాయ పరికరాల సంరక్షణ ముఖ్యం. ఆ మేరకు రేడియో పరికరాల తయారీదారులను ప్రోత్సహిస్తూ ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి పథకాలను అమలు చేయాలని టెడ్ లావెర్టీ కోరారు. తద్వారా భారత్‌లో రేడియో ఆవరణ వ్యవస్థ వృద్ధికి చర్యలు చేపట్టాలని సూచించారు.
భారత్‌సహా ఇతర దేశాల్లోనూ డిజిటల్ రేడియో భవిష్యత్ మాధ్యమమని నిపుణులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే పెద్ద నగరాల్లో సార్వత్రిక ప్రసార మౌలిక సదుపాయాలుగల వాణిజ్య స్టేషన్ల మధ్య సంయుక్త భాగస్వామ్యం కోసం ఒక వేదికను ఏర్పాటు చేయాలని కోరారు.
****
(Release ID: 2126314)
|