WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

భారతదేశ సృజనాధారిత ఆర్థిక వ్యవస్థ- 2030 నాటికి వినియోగదారుల వ్యయంలో 1 ట్రిలియన్ డాలర్లకు పైగా ప్రభావాన్ని చూపుతుందని అంచనా: వేవ్స్ 2025లో నివేదిక విడుదల చేయనున్న బీసీజీ

 నాడు పోస్టు చేయడమైనది: 02 MAY 2025 2:33PM |   Location: PIB Hyderabad

భారత సృజనాధారిత ఆర్థిక వ్యవస్థ పెరుగుతుండడంతో దేశ డిజిటల్ రంగం కూడా గణనీయమైన మార్పులు చెందుతోంది. "ఫ్రమ్ కంటెంట్ టు కామర్స్: మ్యాపింగ్ ఇండియాస్ క్రియేటర్ ఎకానమీ" అనే పేరుతో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) ఈ నెల 3వ తేదీన ఒక నివేదికను ముంబయిలోని వేవ్స్ 2025లో విడుదల చేయనున్నది. భారతదేశ క్రియేటర్లు ప్రస్తుతం ఏటా 350 బిలియన్ డాలర్లకు పైగా వినియోగదారులు చేసే ఖర్చుపై ప్రభావం చూపుతున్నారని వెల్లడించింది. ఈ సంఖ్య 2030 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లను అధిగమించే అవకాశం ఉంది. 

డిజిటల్ సృజనకారుడు అంటే ఒక్కొక్కరికి వెయ్యి మందికి పైగా ఫాలోవర్లు ఉంటారని నిర్ధారిస్తూ, భారతదేశంలో 2 నుంచి 2.5 మిలియన్ల మంది యాక్టివ్ డిజిటల్ సృజనకారులు ఉన్నారని నివేదిక ప్రముఖంగా ప్రస్తావించనున్నది. ప్రమాణాలు ఎలా ఉన్నా, వారిలో 8 నుంచి 10 శాతం మంది మాత్రమే ప్రస్తుతం తమ కంటెంట్‌ పై సమర్థవంతంగా డబ్బు ఆర్జిస్తున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రంగంలో ఇంకా అన్వేషించని అవకాశాలను అందిపుచ్చుకుంటోందని నివేదిక వెల్లడించనున్నది. డిజిటల్ క్రియేటర్ ప్రత్యక్ష ఆదాయం నేడు 20 నుంచి 25 బిలియన్ డాలర్లని అంచనా వేస్తే, దశాబ్దం చివరి నాటికి అది 100 నుంచి 125 బిలియన్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు.

నివేదికలో కొన్ని కీలకమైన అంశాలు:

  • సృజనకారులు 30 శాతానికి పైగా వినియోగదారుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నారు. ఇది 350 నుంచి 400 బిలియన్ డాలర్లు ఉంటుంది.

  • స్వల్ప కాల వ్యవధి వీడియో కంటెంట్ ఇప్పటికీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. కామెడీ, సినిమాలు, రోజువారీ ధారావాహికలు, ఫ్యాషన్ వంటి విభాగాల వైపే ఎక్కువగా వినియోగదారులు ఆకర్షితులవుతున్నారు. 

  • వేగవంతమైన కంటెంట్ ప్రొడక్షన్, ఎక్కువ సృజనాత్మక స్వేచ్ఛ, వైవిధ్యభరితమైన వినియోగదారుల అవసరాలు, ఫలితాల ఆధారిత లక్ష్యాల వంటి అంశాలలో పెరిగిన ప్రాధాన్యతలను బట్టి బ్రాండ్ వ్యూహాలు అభివృద్ధి చెందుతున్నాయి.

  • ఆదాయ నమూనాలు వైవిధ్యంగా విస్తరిస్తున్నాయి. వర్చువల్ గిఫ్టింగ్, లైవ్ కామర్స్, సబ్‌స్క్రిప్షన్‌లు పెంచే వ్యూహాల వంటి వినియోగదారుల పెట్టుబడులకు సంబంధించిన అంశాలు బాగా ఆదరణ పొందుతున్నాయి.

  • రాబోయే సంవత్సరాల్లో బ్రాండ్లు, క్రియేటర్ మార్కెటింగ్‌లో తమ పెట్టుబడులను 1.5 నుండి 3 రెట్లు పెంచుకుంటాయని భావిస్తున్నారు. ఇది విస్తృతమైన డిజిటల్ క్రియేటర్ వ్యవస్థ ద్వారా మార్కెటింగ్, వాణిజ్యంలో కీలకమైన మార్పును సూచిస్తుంది.

ముంబయిలో 3వ తేదీన జరిగే వేవ్స్ 2025 సందర్భంగా బీసీజీ నివేదిక అధికారికంగా విడుదల అవుతుంది. ఏఐ, సోషల్ మీడియా, ఏవీజీసీ రంగం, చలనచిత్రాల రంగంలో వేగంగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఈ మెగా ఈవెంట్ వేవ్స్ 2025 లో జరిగే చర్చలు, డిజిటల్ మీడియా రంగంలో భారత్ విస్తరిస్తున్న తీరును ప్రతిబింబిస్తాయి.

 

* * *


రిలీజ్ ఐడి: 2126311   |   Visitor Counter: 96