ప్రధాన మంత్రి కార్యాలయం
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన యుగ్మ్ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
29 APR 2025 1:45PM by PIB Hyderabad
కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, డాక్టర్ జితేంద్ర సింగ్, శ్రీ జయంత్ చౌదరి, డాక్టర్ సుకాంత మజుందార్, నా మిత్రుడు శ్రీ రమేష్ వధ్వానీ, డాక్టర్ అజయ్ కేలా, శాస్త్ర, సాంకేతిక, విద్యా రంగాలకు చెందిన సహచరులు, ఇతర విశిష్ట అతిథులు, మహిళలు, ఇంకా పెద్దలారా!
నేడు ప్రభుత్వం, విద్యారంగం, సైన్స్, పరిశోధనతో సంబంధం ఉన్న వివిధ రంగాలకు చెందిన ప్రజలు ఈరోజు ఇక్కడ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ ఐక్యత, ఈ సంగమమే మనం యుగ్మ్ అంటాం. వికసిత భారత్ (అభివృద్ధి చెందిన భారతదేశం) భవిష్యత్ సాంకేతికతకు సంబంధిత భాగస్వాములందరూ సమావేశమై, క్రియాశీలంగా పాల్గొనే వేదికే ఈ యుగ్మ్. భారతదేశ సృజనాత్మక సామర్థ్యాన్ని, డీప్-టెక్ లో దాని పాత్రను పెంచడానికి మనం చేస్తున్న ప్రయత్నాలను ఈ కార్యక్రమం మరింత బలోపేతం చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఈరోజు ఐఐటీ కాన్పూర్, ఐఐటీ బాంబేల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెంట్ సిస్టమ్స్ అండ్ బయోసైన్సెస్, బయోటెక్నాలజీ, ఆరోగ్య, వైద్య రంగాలలో సూపర్ హబ్ లు ప్రారంభమయ్యాయి. ఈ రోజు వాధ్వానీ ఇన్నోవేషన్ నెట్ వర్క్ ను కూడా ప్రారంభించారు. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ సహకారంతో పరిశోధనలను ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ కూడా చేశారు. ఈ చొరవ తీసుకున్న వాధ్వానీ ఫౌండేషన్ కు, మా ఐఐటీలకు, ఇతర భాగస్వాములందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా మిత్రుడు రోమేష్ వాధ్వానీని అభినందిస్తున్నాను. మీ అంకితభావం, చురుకైన కృషి వల్ల ప్రైవేటు, ప్రభుత్వ రంగాలు కలిసి దేశ విద్యావ్యవస్థలో అనేక సానుకూల మార్పులను తీసుకువచ్చాయి.
మిత్రులారా,
మన గ్రంథాలు ఇలా చెబుతున్నాయి. పరం పరోపకారార్థం యో జీవతి స జీవతి - అంటే – ఇతరుల సేవ కోసం, వారి సంక్షేమం కోసం జీవించేవాడే నిజంగా జీవిస్తాడు. అందుకే, మనం విజ్ఞానం, సాంకేతికతను కూడా ఒక సేవామార్గంగా పరిగణిస్తాం. మన దేశంలో వాధ్వాని ఫౌండేషన్ వంటి సంస్థలను చూస్తే... రోమేష్, ఆయన బృందం చేస్తున్న ప్రయత్నాలను చూస్తే, మన దేశంలో విజ్ఞానం, సాంకేతికతను సరైన దిశగా ముందుకు తీసుకెళ్తున్నామన్న ఆనందం, గర్వం కలుగుతుంది. రోమేష్ తన జీవితాన్ని నిరంతర పోరాటం ద్వారా తీర్చిదిద్దుకున్నారు. దానిని సేవకు అంకితం చేశారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఆయన పుట్టిన కొన్ని రోజుల తర్వాతే, విభజన భయానకాలను ఎదుర్కోవలసి వచ్చింది. తన జన్మస్థలాన్ని వదిలివెళ్లాల్సి వచ్చింది. చిన్ననాటి నుంచే పోలియోతో బాధ పడ్డారు. ఆ కఠినమైన పరిస్థితుల నుంచి ఆయన ఒక మహత్తరమైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఇది నిజంగా ఒక అసాధారణమైన, ప్రేరణాత్మక జీవన ప్రయాణం. ఇంతటి విజయాన్ని భారతదేశ విద్యా, పరిశోధనా రంగానికి, భారత యువతకి, భారత భవిష్యత్ వెలుగొందే దిశలో అంకితం చేయడం— నిజంగా ప్రేరణనిచ్చే ఉదాహరణగా నిలుస్తుంది. వధ్వాని ఫౌండేషన్ పాఠశాల విద్య, ఆంగన్వాడీ, వ్యవసాయ సాంకేతికత రంగాల్లో కీలకమైన సేవలందిస్తోంది. వాధ్వాని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏర్పాటు సందర్భంగా నేను గతంలో మీతో కలిశాను. రాబోయే రోజుల్లో వాధ్వాని ఫౌండేషన్ ఇలాంటి అనేక కీలక మైలురాళ్లు సాధిస్తుందని నాకు పూర్తి నమ్మకముంది. మీ సంస్థకు, మీ కార్యక్రమాలకు నా శుభాకాంక్షలు ఎప్పుడూ ఉంటాయి.
మిత్రులారా,
ఏ దేశ భవిష్యత్ అయినా ఆ దేశ యువతపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే మన యువతను వారి భవిష్యత్తు కోసం, అలాగే భారతదేశ ఉజ్వల భవిష్యత్తు కోసం సన్నద్ధం చేయడం అత్యంత అవసరం. ఈ కార్యక్రమంలో దేశ విద్యా వ్యవస్థ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే 21వ శతాబ్ద అవసరాలను తీర్చగలిగే విధంగా మన దేశ విద్యా వ్యవస్థను ఆధునీకరిస్తున్నాం. విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త జాతీయ విద్యా విధానాన్ని దేశంలో ప్రవేశపెట్టాం. ఈ కొత్త విద్యా విధానం ప్రారంభమైనప్పటి నుంచి, భారత విద్యా వ్యవస్థలో గొప్ప మార్పులు కనిపిస్తున్నాయి. జాతీయ పాఠ్య ప్రణాళిక, అభ్యాస-బోధన సామగ్రి, ఒకటి నుంచి ఏడవ తరగతుల కోసం కొత్త పాఠ్యపుస్తకాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. పిఎం ఈ-విద్య, దీక్ష వేదికల క్రింద అనే ఒక దేశం –ఒక డిజిటల్ విద్యా మౌలిక సదుపాయాన్ని (వన్ నేషన్, వన్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) రూపొందించాం. ఈ మౌలిక సదుపాయాలు కృత్రిమ మేధ ఆధారితంగా ఉండి, విస్తరించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. దీని ద్వారా 30 కంటే ఎక్కువ భారతీయ భాషలలోనూ, ఏడు విదేశీ భాషలలోనూ పాఠ్యపుస్తకాలను తయారు చేస్తున్నారు. జాతీయ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా విద్యార్థులు ఒకే సమయంలో అనేక విషయాలను అధ్యయనం చేయడం మరింత సులభమైంది. దీంతో ఇప్పుడు భారతదేశంలో విద్యార్థులు ఆధునిక విద్యను అందుకుంటున్నారు, వారి కోసం కొత్త ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. భారత్ అభివృద్ధి లక్ష్యాలవైపు వేగంగా ముందుకెళ్లేందుకు దేశ పరిశోధనా వ్యవస్థను బలోపేతం చేయడం కూడా అత్యంత అవసరం. గత దశాబ్దంలో ఈ దిశగా గణనీయమైన పురోగతి సాధించాం. అవసరమైన వనరులు కూడా పెరిగాయి. 2013–14లో పరిశోధన, అభివృద్ధి పై స్థూల వ్యయం కేవలం రూ. 60,000 కోట్లే ఉండేది. ఇప్పుడు మేము దాన్ని రూ. 1.25 లక్షల కోట్లకు అంటే రెండు రెట్లకు మించి పెంచాం. దేశవ్యాప్తంగా అనేక ఆధునిక పరిశోధనా పార్కులు ఏర్పాటయ్యాయి. సుమారు 6,000 ఉన్నత విద్యా సంస్థల్లో పరిశోధన, అభివృద్ధి విభాగాలు ఏర్పాటు అయ్యాయి. ఈ ప్రయత్నాల వల్ల దేశంలో ఆవిష్కరణ సంస్కృతి వేగంగా పెరుగుతోంది. 2014లో భారతదేశంలో సుమారు 40,000 పేటెంట్లు దాఖలయ్యాయి. ఇప్పుడు ఆ సంఖ్య 80,000కు మించి చేరింది. ఇది మన మేధో సంపత్తి వ్యవస్థ నుంచి యువతకు ఎంత మద్దతు లభిస్తోందో స్పష్టంగా తెలియచేస్తుంది. పరిశోధనా సంస్కృతిని మరింతగా ప్రోత్సహించేందుకు రూ. 50,000 కోట్ల బడ్జెట్‌తో జాతీయ పరిశోధనా ఫౌండేషన్ కూడా ఏర్పాటు అయింది. ‘వన్ నేషన్, వన్ సబ్‌స్క్రిప్షన్’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి యువత అవసరాలు బాగా అర్థమవుతున్నాయన్న విశ్వాసం కలిగింది. ఈ పథకం ద్వారా ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రపంచ స్థాయి పరిశోధనా జర్నల్స్ సులభంగా అందుబాటులోకి వస్తున్నాయి. ప్రతిభావంతులైన విద్యార్థులు తమ కెరీర్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడంలో ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొనకూడదనే ఉద్దేశంతో ప్రధానమంత్రి పరిశోధన ఫెలోషిప్ కూడా అందుబాటులో ఉంది.
మిత్రులారా,
ఈ ప్రయత్నాల ఫలితంగా, నేటి యువత కేవలం పరిశోధన-అభివృద్ధి రంగంలో రాణించడమే కాకుండా, నిజానికి వారే పరిశోధ-అభివృద్ధి కర్తలుగా మారారు. అంటే భవిష్యత్తు కోసం వారు సంసిద్ధులై, ఆధునికతను సొంతం చేసుకుంటున్నారు. వివిధ రంగాల్లోని పరిశోధనల్లో భారత్ దూసుకెళ్తోంది. గత ఏడాది, భారత్ ప్రపంచంలోనే అతి పొడవైన హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్‌ను ప్రారంభించింది. ఈ 422 మీటర్ల హైపర్‌లూప్‌ను భారతీయ రైల్వే సహకారంతో ఐఐటీ మద్రాస్ విద్యార్థులు అభివృద్ధి చేశారు. బెంగళూరులోని ఐఐఎస్‌సీ శాస్త్రవేత్తలు నానోస్కేల్ వద్ద కాంతిని నియంత్రించగల సాంకేతికతను అభివృద్ధి చేశారు. అదే సంస్థలోని పరిశోధకులు 'బ్రెయిన్ ఆన్ ఎ చిప్' సాంకేతికతను కూడా అభివృద్ధి చేశారు. అంటే ఇది ఒకే మాలిక్యులర్ ఫిల్మ్‌లో 16 వేలకు పైగా కండక్షన్ స్టేట్స్‌లో డేటాను నిల్వ చేయగల, ప్రాసెస్ చేయగల సామర్థ్యం. కొన్ని వారాల క్రితమే, మనదేశం సొంతంగా మొదటి స్వదేశీ ఎమ్ఆర్ఐ యంత్రాన్ని కూడా అభివృద్ధి చేసింది. మన విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న అనేక విప్లవాత్మక పరిశోధన-అభివృద్ధి రంగ విజయాలకు ఇవి కొన్ని నిదర్శనాలు. ఇది ‘వికసిత్ భారత్’ యువతలోని సంసిద్ధత, ఆధునికత, పరివర్తనాత్మకతల శక్తిని సూచిస్తుంది.
మిత్రులారా,
భారత విశ్వవిద్యాలయ ప్రాంగణాలు నూతన ఆవిష్కరణల కేంద్రాలుగా మారుతున్నాయి. ఇక్కడ యువశక్తి అద్భుతమైన ఆవిష్కరణలతో ముందుకు సాగుతోంది. ఇటీవల, ఉన్నత విద్య ప్రభావ ర్యాంకింగ్స్‌లో, 125 దేశాలకు చెందిన 2 వేల విద్యాసంస్థలకు గానూ, భారత్ నుంచి 90కి పైగా విశ్వవిద్యాలయాలు స్థానం సంపాదించి ప్రపంచస్థాయి గుర్తింపును సాధించాయి. 2014 క్యూఎస్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి కేవలం 9 సంస్థలు, విశ్వవిద్యాలయాలు మాత్రమే ఈ జాబితాలో చోటు సాధించగా, 2025లో వాటి సంఖ్య 46 కి పెరిగింది. ప్రపంచంలోని ప్రముఖ 500 ఉన్నత విద్యా సంస్థల సరసన చోటు సాధించిన భారతీయ విద్యాసంస్థల సంఖ్య సైతం గత 10 ఏళ్లలో గణనీయంగా పెరిగింది. ఇప్పుడు, భారతీయ విద్యాసంస్థలు విదేశాల్లో క్యాంపస్‌లను ప్రారంభిస్తున్నాయి. అబుదాబిలో ఐఐటీ ఢిల్లీ, టాంజానియాలో ఐఐటీ మద్రాస్ ఇప్పటికే క్యాంపస్‌లను ప్రారంభించగా, దుబాయ్‌లో ఐఐఎమ్ అహ్మదాబాద్ క్యాంపస్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మన దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యాసంస్థలు సైతం భారత్‌కు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గల ప్రముఖ విశ్వవిద్యాలయాలు వారి క్యాంపస్‌లను భారత్‌లో ప్రారంభించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఇది విద్యను, విజ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడానికి వీలు కల్పించడంతో పాటు, పరిశోధనలో సహకారాన్ని అలాగే విద్యార్థులకు విభిన్న సంస్కృతుల పట్ల అమూల్యమైన అవగాహనను పెంపొందిస్తుంది.
మిత్రులారా,
ప్రతిభ, వ్యక్తిత్వం అలాగే సాంకేతికత అనే మూడు శక్తులు భారత భవిష్యత్తును మారుస్తాయి. దీనికి మద్దతుగా, చిన్నప్పటి నుంచే పిల్లలకు అవసరమైన అవగాహనను మనం కల్పిస్తున్నాం. ఇప్పుడే, మా సహచరులు ధర్మేంద్ర గారు మాట్లాడుతూ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ వంటి కార్యక్రమాల గురించి వివరించారు. ఇప్పటివరకు, దేశవ్యాప్తంగా 10 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు స్థాపించాం. మరో 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను ప్రారంభం గురించి బడ్జెట్‌లో ప్రకటించాం. విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రధానమంత్రి విద్యా లక్ష్మీ యోజనను సైతం ప్రారంభించాం. విద్యార్థులు తమ అభ్యాసాన్ని ఆచరణాత్మక అనుభవంగా మార్చుకునేలా 7 వేలకు పైగా సంస్థల్లో ఇంటర్న్‌షిప్ విభాగాలను ఏర్పాటు చేశాం. యువతలో కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేయడం కోసం సహాయపడే అన్ని ప్రయత్నాలను కొనసాగిస్తున్నాం. మన యువత వారి ప్రతిభ, వ్యక్తిత్వం అలాగే సాంకేతికత అనే బలంతో భారత్‌ను విజయం దిశగా ముందుకు నడిపిస్తున్నారు.
మిత్రులారా,
‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించడానికి మనం 25 ఏళ్ల గడువును నిర్దేశించుకున్నాం. సమయం పరిమితం.. లక్ష్యాలు ప్రతిష్టాత్మకమైనవి. ప్రస్తుత పరిస్థితి కారణంగా నేను దీని గురించి మాట్లాడడం లేదు కానీ, ఆలోచన నుంచి నమూనా అలాగే నమూనా నుంచి ఉత్పత్తి వేగంగా జరగడం చాలా ముఖ్యం. మనం ప్రయోగశాల నుంచి మార్కెట్‌కు దూరాన్ని తగ్గించినప్పుడు, పరిశోధన ఫలితాలు ప్రజలను వేగంగా చేరుతాయి. ఇది పరిశోధకులను కూడా ప్రేరేపిస్తుంది. ఎందుకంటే వారు తమ కృషితో ప్రత్యక్ష ప్రభావాన్ని, ప్రతిఫలాలను చూస్తారు. ఇది పరిశోధన, ఆవిష్కరణ, విలువను పెంపొందించడంలో మరింత తోడ్పడుతుంది. ఇది సాకారం అయ్యేందుకు మన మొత్తం పరిశోధన రంగం - విద్యాసంస్థలు, మదుపరులు, పరిశ్రమలు సహా అందరూ మన పరిశోధకులకు అండగా నిలిచి వారికి మార్గనిర్దేశం చేయడం చాలా అవసరం. యువతకు మార్గదర్శకత్వం చేయడం, నిధులు సమకూర్చడం, వారితో కలిసి నూతన పరిష్కారాలను కనుగొనడం ద్వారా ఆయా రంగాల్లోని పరిశోధకులు ముందడుగు వేయగలరు. అందుకే ప్రభుత్వం నిబంధనలను సరళీకృతం చేసి, సత్వర అనుమతులను అందించే ప్రయత్నాలను వేగవంతం చేస్తోంది.
మిత్రులారా,
మనం నిరంతరం ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, అడ్వాన్స్డ్ అనలిటిక్స్, స్పేస్-టెక్, హెల్త్-టెక్ అలాగే సింథటిక్ బయాలజీలను ప్రోత్సహిస్తూ ఉండాలి. నేడు, ఏఐ అభివృద్ధి, వినియోగంలో భారత్ అగ్ర దేశాల సరసన నిలవడం మనం చూస్తున్నాం. ఈ వృద్ధికి మద్దతుగా, ప్రభుత్వం ఇండియా-ఏఐ మిషన్‌ను ప్రారంభించింది. ఇది ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నాణ్యమైన డేటాసెట్‌లు అలాగే అత్యాధునిక పరిశోధన సౌకర్యాలను కల్పించుటలో సహాయపడుతుంది. దేశంలో ఏఐ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సంఖ్య కూడా పెరుగుతోంది. ఇవి దేశంలోని ప్రముఖ సంస్థలు, పరిశ్రమలు, అంకురసంస్థల సహకారంతో ముందుకు సాగుతున్నాయి. "మేక్ ఏఐ ఇన్ ఇండియా" అనే దార్శనికతతో మనం పనిచేస్తున్నాం. "భారత్ కోసం ఏఐ పనిచేయడం" మన లక్ష్యం. ఈ సంవత్సరం బడ్జెట్‌లో, ఐఐటీల్లో సీట్ల సంఖ్యను, సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించాం. ఐఐటీలు, ఎయిమ్స్ వంటి సంస్థల సహకారంతో అనేక మెడిటెక్ అంటే వైద్యం ప్లస్ సాంకేతికత సంబంధిత కోర్సులు ప్రారంభమయ్యాయి. మనం ఈ ప్రయాణాన్ని సకాలంలో పూర్తి చేయాలి. ప్రతి భవిష్యత్ సాంకేతికతలో, ప్రపంచంలోనే భారత్ అత్యుత్తమ స్థానంలో ఉండాలి. వైయుజీఎమ్ వంటి కార్యక్రమాల ద్వారా, మనం ఈ ప్రయత్నాలకు కొత్త శక్తిని అందించగలం. విద్యా మంత్రిత్వ శాఖ, వాధ్వానీ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఇలాంటి కార్యక్రమాలతో దేశ ఆవిష్కరణల స్వరూపాన్ని మార్చగల సామర్థ్యం మనకు ఉంది. నేటి ఈ కార్యక్రమం ఆ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుంది. మరోసారి, వైయుజీఎమ్ కార్యక్రమాన్ని నిర్వహించిన వాధ్వానీ ఫౌండేషన్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా స్నేహితుడు రోమేష్ గారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ధన్యవాదాలు
నమస్కారం!
గమనిక: ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం.
***
(Release ID: 2125322)
Visitor Counter : 6