WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

వేవ్స్ 2025: పాత్రికేయ, వినోద, సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రదర్శన

 Posted On: 28 APR 2025 5:21PM |   Location: PIB Hyderabad

వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సదస్సు 2025 – పాత్రికేయ, వినోద, సాంకేతిక రంగాల్లో ప్రపంచంలో ప్రముఖ ఆవిష్కర్తలను ఒక్క చోట చేరుస్తుంది. ఈ కార్యక్రమం మే 1 నుంచి 4 వరకు ముంబయిలోని జియో కన్వెన్షన్ సెంటర్లో జరుగుతుంది. 15,000 చ.మీ.ల విస్తీర్ణంలో వేవ్స్ - 2025ను నిర్వహిస్తున్నారు. ఇది పారిశ్రామిక దిగ్గజాలు, సృష్టికర్తలు, పెట్టుబడిదారులు, అత్యాధునిక సాంకేతిక మార్గదర్శకులు ఒక్క చోట కలుసుకొనే వేదికగా నిలవనుంది. తద్వారా భాగస్వామ్యాలు కుదుర్చుకోవడానికి, అంతర్జాతీయ వినోద రంగంలో భవిష్యత్తు అవకాశాలను అన్వేషించడానికి మార్గం సుగమం చేయనుంది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్, గూగుల్, మెటా, సోనీ, రిలయన్స్, అడోబ్, టాటా, బాలాజీ టెలిఫిలిమ్స్, ధర్మ ప్రొడక్షన్స్, సరెగమ, యష్ రాజ్ ఫిలిమ్స్ లాంటి 100కు పైగా అగ్ర శ్రేణి సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. వీటితో పాటు జెట్ సింథసిస్, డిజిటల్ రేడియో మోండియల్ (డీఆర్ఎం), ఫ్రీ స్ట్రీమ్ టెక్నాలజీస్, న్యూరల్ గ్యారేజ్, ఫ్రాక్టల్ పిక్చర్స్ లాంటి తర్వాతి తరం ఆవిష్కరణ సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వినోద రంగంలో ఆవిష్కరణలు, సృజనాత్మకత, అంతర్జాతీయ సహకారాలకు వేవ్స్ కీలక కేంద్రంగా మారనుంది.

అసాధారణ రీతిలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ప్రధాన కేంద్రంగా భారత్ పెవిలియన్ ఏర్పాటు చేశారు. ఇది 1,470 చ.మీల విస్తీర్ణంలో ఏర్పాటయింది. ‘కళ టు కోడ్’ అనే ఇతివృత్తంతో శక్తిమంతమైన భారత్ వారసత్వాన్ని ఇది తెలియజేస్తుంది. పురాతన మౌఖిక సంప్రదాయాలు, ప్రదర్శన కళల నుంచి అత్యాధునిక సాంకేతిక పురోగతుల వరకు కథ చెప్పే విధానంలో దేశంలో వచ్చిన మార్పులను సందర్శకులు ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. దీనికోసం శ్రుతి, కృతి, దృష్టి, క్రియేటర్స్ లీప్ అనే నాలుగు ప్రయోగాత్మక జోన్లను ఏర్పాటు చేశారు.

భారత్ పెవిలియన్‌కు అదనంగా వేవ్స్-2025లో రాష్ట్రాలకు సైతం ప్రత్యేకంగా పెవిలియన్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గోవా, గుజరాత్, తెలంగాణ, మధ్యప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలు తమ సాంస్కృతిక, సృజనాత్మక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి.

అలాగే, పాత్రికేయ, వినోద రంగంలో అభివృద్ధి చెందుతున్న వ్యాపారులు, ఆవిష్కర్తలకు ఈ పరిశ్రమలోని ప్రపంచ స్థాయి నాయకులు, పెట్టుబడిదారులు, కీలక వాటాదారులతో చర్చించే అవకాశాన్ని ఎంఎస్ఎంఈ పెవిలియన్, స్టార్టప్ బూత్‌లు అందిస్తాయి.

వేవ్స్-2025లో మరో ప్రధాన ఆకర్షణ గేమింగ్ ఎరీనా. ఇది గేమింగ్, ఈ-స్పోర్ట్స్ రంగం సాధిస్తున్న పురోగతిని తెలియజేస్తుంది. ఇక్కడ మైక్రోసాఫ్ట్ &ఎక్స్ బాక్స్, డ్రీమ్ 11, క్రాఫ్టాన్, నజారా, ఎంపీఎల్, జియోగేమ్స్ తదితర ప్రముఖ బ్రాండ్ల ప్రదర్శనలు ఉంటాయి. ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ భవిష్యత్తు గురించి ఈ గేమింగ్ ఎరీనా అవగాహన కల్పిస్తుంది. అలాగే అంతర్జాతీయంగా డిజిటల్ రంగంలో పెరుగుతున్న గేమింగ్ ప్రభావాన్ని తెలియజేస్తుంది.

వేవ్స్-2025 మే 1 నుంచి 4 వరకు జరుగుతుంది. వినోద, పాత్రికేయ, సాంకేతిక రంగాలపై అవగాహన కల్పిస్తూ.. వీటిలో ఉన్న ప్రత్యేక నెట్‌వర్కింగ్ అవకాశాలను వేవ్స్ - 2025 అందిస్తుంది. ఈ ప్రదర్శన మే 1 నుంచి 3 వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరచి ఉంటుంది. 4వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుంది. అసాధారణ స్థాయి, ప్రభావవంతమైన ప్రదర్శనకారులు, ముందుచూపుతో కూడిన దృక్పథంతో వేవ్స్ - 2025 అంతర్జాతీయ పాత్రికేయ ఏకీకరణకు ప్రధాన కేంద్రంగా మారనుంది. సంప్రదాయం, ఆవిష్కరణలు, రెండూ కలసి కథనం, సాంకేతికత, వినోద రంగాల భవిష్యత్తును రూపొందించే ప్రదేశంగా మారనుంది.

  వేవ్స్ గురించి:

పాత్రికేయ, వినోద (ఎం అండ్ ఈ) రంగంలో ముఖ్యమైన కార్యక్రమంగా నిలిచిపోయే ఈ మొదటి విడత వరల్డ్ ఆడియో విజువల్, ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)ను భారత ప్రభుత్వం మహారాష్ట్ర రాజధాని ముంబయిలో మే 1 నుంచి 4 వరకు నిర్వహించనుంది.

ఈ రంగంలో నిపుణులు, పెట్టుబడిదారులు, రూపకర్త, ఆవిష్కర్త, ఇలా మీరెవరైనా సరే.. ఈ సదస్సులో పాల్గొనవచ్చు. పాత్రికేయ, వినోద పరిశ్రమతో అనుసంధానమయ్యేందుకు, సహకారం పెంపొందించుకొనేందుకు, నూతన ఆవిష్కరణలు చేయడానికి, మీ వంతు తోడ్పాటు అందించేందుకు అంతర్జాతీయ వేదికను వేవ్స్ మీకు అందిస్తుంది.

 

***


Release ID: (Release ID: 2125132)   |   Visitor Counter: 7