పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కాశ్మీర్ ఉగ్రదాడి బాధితులను ఆదుకునేలా సత్వర చర్యలు తీసుకుంటున్న పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు


శ్రీనగర్ నుంచి – ఢిల్లీకి రెండు, ముంబయికి రెండు ప్రత్యేక విమానాలు

సాధారణ చార్జిలనే కొనసాగించాలని విమానయాన సంస్థలకు ఆదేశం

Posted On: 23 APR 2025 10:33AM by PIB Hyderabad

కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి విషాదం నేపథ్యంలో బాధితులు, దాడి ప్రభావిత పర్యాటకుల భద్రత కోసం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్ మోహన్ నాయుడు సత్వర చర్యలు చేపట్టారు.

హోం మంత్రితో స్వయంగా మాట్లాడిన ఆయన.. సంబంధిత అధికారులతో సమన్వయంతో పనిచేస్తూ 24 గంటలూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తక్షణ సహాయక చర్యల్లో భాగంగా శ్రీనగర్ నుంచి- ఢిల్లీకి రెండు, ముంబయికి రెండు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. పర్యాటకులను తరలించడం కోసం అదనపు విమానాలనూ సిద్ధం చేశారు.

అన్ని విమానయాన సంస్థలతో అత్యవసర సమావేశం నిర్వహించిన శ్రీ రామ్ మోహన్ నాయుడు చార్జీలు పెంచవద్దని సూచించారు. ఈ కీలకమైన సమయంలో ప్రయాణికులెవరిపైనా భారం పడకుండా ఉండేలా, సాధారణ చార్జీలనే కొనసాగించాలని విమానయాన సంస్థలను ఆయన ఆదేశించారు.

మరణించిన వ్యక్తుల మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక అధికారులతో సమన్వయంతో పనిచేస్తూ పూర్తి సహకారాన్ని అందించాలని శ్రీ రామ్ మోహన్ నాయుడు అన్ని విమానయాన సంస్థలను ఆదేశించారు.

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అత్యంత అప్రమత్తంగా ఉంది. బాధితులకు శక్తివంచన లేకుండా సాయమందించడానికి కట్టుబడి ఉంది.

 

****


(Release ID: 2123721) Visitor Counter : 14