ప్రధాన మంత్రి కార్యాలయం
మధ్యప్రదేశ్‌లోని ఆనంద్‌పూర్ ధామ్ సభలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
· “వారసత్వ సహిత పురోగమనం’ తారకమంత్రంగా నవ భారత్ ముందడుగు” · “రుషులు.. జ్ఞానులు.. సాధువులకు మన దేశం పుట్టినిల్లు- సమాజం క్లిష్ట దశలో ఉన్నపుడల్లా వీరిలో ఎవరో ఒక మహనీయుడు ఈ నేలపై అవతరించి సమాజానికి మార్గనిర్దేశం చేస్తుంటారు” · “పేదలు.. అణగారిన వర్గాల సముద్ధరణ సంకల్పానికి ప్రతీక ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’ మంత్రం.. ఈ సేవా స్ఫూర్తే ప్రభుత్వ విధానాలకు... నిబద్ధతకు నిదర్శనం” · “భారత్ వంటి దేశంలో సంస్కృతి మన జాతి ప్రతిష్ఠతో ముడిపడి ఉండటమే కాదు.. మన సామర్థ్యాన్ని బలోపేతం చేసేదీ ఆ సంస్కృతే”
Posted On:
11 APR 2025 6:04PM by PIB Hyderabad
భారత సాంస్కృతిక-ఆధ్యాత్మిక వారసత్వాలను ఇనుమడింపజేయడంపై తన నిబద్ధతకు అనుగుణంగా ప్రధానమంత్రి ఈ రోజు మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్ జిల్లా ఇసాగఢ్ తాలూకాలోగల ఆనంద్‌పూర్ ధామ్‌ను సందర్శించారు. అనంతరం గురూజీ మహారాజ్ ఆలయంలో దర్శనం-పూజలు కూడా చేశారు. ఆ క్షేత్రంలోని ఆలయ సముదాయాన్ని సందర్శించారు. అనంతరం సభనుద్దేశించి ప్రసంగిస్తూ- ఢిల్లీ, హర్యానా, పంజాబ్ సహా దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులను తొలుత స్వాగతించారు. శ్రీ ఆనంద్‌పూర్ ధామ్ సందర్శన భాగ్యం లభించడం తన అదృష్టమని హర్షం వ్యక్తం చేశారు. గురూజీ మహారాజ్ ఆలయంలో ప్రార్థనానుభవాన్ని పంచుకుంటూ తన హృదయం ఆనందంతో నిండిపోయిందని ప్రకటించారు.
సాధువుల తపోఫలంతో ఈ నేల పవిత్రత ఇనుమడించిందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. అలాగే పరోపకారం ఈ గడ్డపై ఒక విశిష్ట సంప్రదాయంగా మారిందని, సేవా సంకల్పం మానవాళి సంక్షేమానికి మార్గం సుగమం చేస్తున్నదని పేర్కొన్నారు. అశోక్ నగర్‌లోకి తొంగి చూడాలన్నా దుఃఖం భయపడుతుందన్న సాధు వచనాన్ని ఈ సందర్భంగా ఉటంకించారు. బైశాఖి వేడుకలతోపాటు శ్రీ గురూజీ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడంపై ఆయన ఆనందం వెలిబుచ్చారు. ప్రథమ పదషాహి శ్రీశ్రీ 108వ స్వామి శ్రీ అద్వైతానంద్ మహారాజ్ సహా ఇతర పదషాహి సాధువులందరికీ శిరసాభివందనం అర్పించారు. ద్వితీయ పదషాహి గారి 1936నాటి మహాసమాధి, 1964లో తృతీయ పదషాహి నిజరూప శివైక్యాన్ని గుర్తుచేస్తూ నేటి చారిత్రక ప్రాముఖ్యాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ పూజ్య గురువులకు నివాళి అర్పించడంతోపాటు మాతా జగేశ్వరి దేవి, మాతా బీజాసన్, మాతా జానకి కరీల మాతా ధామ్‌లకు వందనమాచరించారు. బైశాఖి, శ్రీ గురు మహారాజ్ జీ జయంతి ఉత్సవాల నేపథ్యంలో అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
“రుషులు, జ్ఞానులు, సాధువులకు మన దేశం పుట్టినిల్లు. సమాజం క్లిష్ట దశలో ఉన్నపుడల్లా ఎవరో ఒక మహనీయుడు ఈ నేలపై అవతరించి సమాజానికి మార్గనిర్దేశం చేస్తుంటారు” అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. పూజ్య స్వామి శ్రీ అద్వైతానంద్ మహారాజ్ జీవితం ఈ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆది శంకరాచార్య వంటి ఆచార్యుడు అద్వైత తత్వశాస్త్రం నిగూఢ జ్ఞానాన్ని విశదీకరించిన కాలాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే వలసపాలన సమయంలో సమాజానికి ఈ జ్ఞానంతో సంబంధాలు తెగిపోవడం మొదలైందని పేర్కొన్నారు. కానీ, అదే సమయంలో అద్వైత సిద్ధాంతంతో దేశంలో ఆత్మ చైతన్యం తెచ్చేందుకు రుషులు అవతరించారని చెప్పారు. అటువంటి మహనీయులలో పూజ్య శ్రీ అద్వైతానంద్ మహారాజ్ సామాన్యులందరికీ అద్వైత జ్ఞానాన్ని సరళరీతిలో అందుబాటులోకి తెచ్చి, నాటి వారసత్వాన్ని ముందుకు నడిపించారని స్పష్టం చేశారు.
నేటి ప్రపంచంలో భౌతిక పురోగమనం నడుమ యుద్ధాలు, సంఘర్షణలు, నైతిక విలువల క్షీణత వంటి అంతర్జాతీయ ఆందోళనకర అంశాలను శ్రీ మోదీ ఉటంకించారు. ఈ సవాళ్లకు మూల కారణం “నేను-ఇతరులు” అనే స్వార్థపూరిత విభజన ధోరణేనన్నారు. ఇది మానవాళిని పరస్పరం దూరం చేస్తుందని చెప్పారు. “ఈ సమస్యలకు పరిష్కారం అద్వైత తత్వశాస్త్రంలో ఉంది.. అది ద్వంద్వ స్వభావాన్ని ఎంతమాత్రం ప్రబోధించదు” అని ఆయన స్పష్టం చేశారు. అద్వైతమంటే ప్రతి జీవిలో దైవత్వాన్ని చూడటం, యావత్ సృష్టిని దైవిక అభివ్యక్తిగా గ్రహించడంపై నమ్మకమని వివరించారు. ఈ సిద్ధాంతాన్ని పరమహంస దయాళ్ మహారాజ్- “నీవే నేను-నేనే నీవు” అంటూ అత్యద్భుతంగా సరళీకరించారని ఉటంకించారు. “నాది-నీది” అనే వ్యత్యాసాన్ని రూపుమాపే ఈ ఆలోచనలోని విశిష్టతను విశ్వవ్యాప్తంగా అనుసరిస్తే అన్నిరకాల వివాదాలు, విభేదాలు పరిష్కారం కాగలవని స్పష్టం చేశారు.
ప్రథమ పదషాహి శ్రీ పరమహంస దయాళ్ మహారాజ్ బోధనలపై నాలుగో పదషాహి స్వామి శ్రీ విచార పూర్ణానంద్ మహారాజ్తో లోగడ తాను చర్చించడాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. అలాగే ఆనంద్‌పూర్ ధామ్ సేవా కార్యక్రమాల గురించి కూడా వివరించారు. ఈ ధామ్‌లో రూపుదిద్దుకున్న ఐదు విశిష్ట ధ్యాన సూత్రాలను ఆయన ప్రముఖంగా ఉటంకిస్తూ- వాటిలో నిస్వార్థ సేవ ఒకటని పేర్కొన్నారు. మానవాళి సేవలో నారాయణ సేవను చూసే భారతీయ సంస్కృతికి పునాది వంటి ఈ నిస్వార్థ సేవా స్ఫూర్తిని ఆయన ప్రస్తావించారు. ఈ సంస్కృతిని ఆనంద్‌పూర్ ట్రస్ట్ అంకితభావంతో కొనసాగించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ఈ ట్రస్టు వివిధ ఆస్పత్రుల నిర్వహణ ద్వారా వేలాది రోగులకు చికిత్స సదుపాయం కల్పించడమేగాక ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నదని తెలిపారు. గో సంక్షేమం లక్ష్యంగా ఆధునిక గోశాల ఏర్పాటు చేసిందని, నవతరానికి రూపుదిద్దే పాఠశాలలను నిర్వహిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. మానవాళి సంక్షేమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు ఆనంద్‌పూర్ ధామ్ విశేషంగా కృషి చేసిందని ఆయన ప్రశంసించారు. ఈ మేరకు వేలాది ఎకరాల బంజరును పచ్చని పంటల సిరుల భూమిగా మార్చడంలో ఆశ్రమవాసుల కఠోర శ్రమను గుర్తుచేశారు. ఇప్పటిదాకా ఆశ్రమ కార్యక్రమాల ద్వారా నాటిన వేలాది మొక్కలు వృక్షాలుగా ఎదిగి, నిస్వార్థ సామాజిక ప్రయోజనాలకు ఉపయోగపడుతున్నాయని వివరించారు.
అలాగే “ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ సేవా స్ఫూర్తికి ప్రాధాన్యం ఉంటుంది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ప్రతి పేదకూ ఆహారభద్రత కల్పించడంలో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పోషిస్తున్న పాత్రను ఈ సందర్భంగా ఉదాహరించారు. అదే తరహాలో ఆయుష్మాన్ భారత్ పథకం కూడా పేదలు, వృద్ధుల ఆరోగ్య సంరక్షణ చింతనుంచి విముక్తం చేసిందని, సురక్షిత గృహాల ద్వారా ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ పేదలకు నిలువ నీడ కల్పిస్తున్నదని గుర్తుచేశారు. ఇక గ్రామాల్లో సురక్షిత నీటి సరఫరా సమస్యను జల్ జీవన్ మిషన్ పరిష్కరిస్తోందని పేర్కొన్నారు. రికార్డు సంఖ్యలో కొత్త ఎయిమ్స్, ‘ఐఐటీ’లు, ‘ఐఐఎం’ల ఏర్పాటుతో పేద పిల్లల కలల సాకారానికి చేయూత లభిస్తున్నదని చెప్పారు. దేశవ్యాప్తంగా ‘అమ్మ పేరిట ఓ మొక్క’ కార్యక్రమం కింద కోట్లాది మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వం తన నిబద్ధత చాటుకుంటున్నదని ప్రధాని పునరుద్ఘాటించారు. ఈ భారీ విజయాలకు కారణం సేవా స్ఫూర్తేనని వ్యాఖ్యానించారు. ‘సబ్‌కా సాథ్-సబ్‌కా వికాస్’ మంత్ర నిర్దేశంతో పేదలు, అణగారిన వర్గాల సముద్ధరణపై ప్రభుత్వం సంకల్పం పూనిందని ఆయన పునరుద్ఘాటించారు. “ప్రభుత్వ విధానాలు, నిబద్ధతకు ఈ సేవా స్ఫూర్తే మూలం” అని ఆయన స్పష్టం చేశారు.
సేవా సంకల్పం స్వీకరిస్తే, అది ఇతరులకు ప్రయోజనం చేకూర్చడమేగాక స్వీయ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతూ, మన దృక్పథాన్ని విస్తృతం చేస్తుందని ప్రధానమంత్రి వివరించారు. అంతేకాకుండా సమాజం, దేశం, ఒక్కమాటలో చెబితే- యావత్ మానవాళి శ్రేయస్సుకు దోహదం చేసే విస్తృతాంశాలతో మనను సంధానిస్తుందని తెలిపారు. సేవా నిమగ్నుల అంకిత భావాన్ని ప్రశంసిస్తూ, నిస్వార్థ సేవా కార్యక్రమాల ద్వారా కష్టాలను అధిగమించడం వ్యక్తి రెండో స్వభావం కాగలదని స్పష్టం చేశారు. సేవ ఒక ఆధ్యాత్మిక ఉపకరణమని, అది పవిత్ర గంగాస్నానంతో సమానం కాబట్టి, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అందులో నిమగ్నం కావాలని సూచించారు. దేశ శ్రేయస్సు దిశగా అశోక్ నగర్, ఆనంద్‌పూర్ ధామ్ వంటి ప్రాంతాల కృషిని ప్రస్తావిస్తూ అటువంటి ప్రదేశాలను చక్కగా తీర్చిదిద్దడం ఒక బాధ్యతని అభివర్ణించారు. అందునా ఈ ప్రాంతాల కళ, సంస్కృతి, సహజ సౌందర్యం సుసంపన్న వారసత్వానికి ప్రతీకలని, వారసత్వ సహిత ప్రగతికి దోహదపడటంలో వాటికి అపార సామర్థ్యం ఉందని స్పష్టం చేశారు. దీన్ని గుర్తించిన కారణంగానే మధ్యప్రదేశ్, అశోక్ నగర్‌లలో పురోగమనం ఇనుమడించేలా చేపట్టిన కృషిని ప్రధాని వివరించారు. ఇందులో భాగంగా చందేరి చేనేత కళ ప్రగతి దిశగా చందేరి చీరలకు భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్ సాధించామని తెలిపారు. అలాగే ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధిని వేగిరపరచడం లక్ష్యంగా ప్రాణ్‌పూర్‌లో క్రాఫ్ట్ హ్యాండ్లూమ్ టూరిజం విలేజ్ ఏర్పాటు చేశామని చెప్పారు. మరోవైపు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘ఉజ్జయిని సింహస్థ’ (కుంభమేళా) నిర్వహణకు సన్నాహాలు ప్రారంభించిందని ఆయన పేర్కొన్నారు.
ఇటీవలి శ్రీరామ నవమి వేడుకలను ప్రస్తావిస్తూ- “రామ వన గమన పథం” (శ్రీరాముని అరణ్యవాస పయనం)లో అధికశాతం మధ్యప్రదేశ్ గుండా వెళ్తుందని పేర్కొన్నారు. ఈ రాష్ట్రానికి ఇదొక అద్భుత, ప్రత్యేకమైన గుర్తింపు కాగా, దీన్ని ప్రతిబింబించే కార్యక్రమాలు ఆ విశిష్టతను మరింత అపురూపం చేస్తాయని శ్రీ మోదీ తెలిపారు.
భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా రూపొందాలన్న జాతి మహా సంకల్పాన్ని ప్రధానమంత్రి పునరుద్ధాటిస్తూ, దీన్ని సాకారం చేయగలమని సంపూర్ణ ఆత్మవిశ్వాసం ప్రకటించారు. ఈ పయనంలో భాగంగా భారత ప్రాచీన సంస్కృతి పరిరక్షణ అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు. పురోగమన పథంలో పయనిస్తూ అనేక దేశాలు తమ సంప్రదాయాలతో సంబంధాన్ని కోల్పోవడం వాస్తవమైనా, భారత్ తన వారసత్వాన్ని కాపాడుకోవడం అవశ్యమని పేర్కొన్నారు. “భారత సంస్కృతి దాని ప్రతిష్ఠతో ముడిపడినది మాత్రమే కాదు... మన సామర్థ్యాన్ని బలోపేతం చేసేదీ ఆ సంస్కృతే”నని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో ఆనంద్‌పూర్ ధామ్ ట్రస్ట్ గణనీయంగా కృషి చేసిందని ప్రధానమంత్రి ప్రశంసించారు. ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు వికసిత భారత్ దార్శనికతకు సరికొత్త శక్తినివ్వగలవని విశ్వాసం వెలిబుచ్చారు. బైశాఖి పర్వదినంతోపాటు శ్రీ గురు మహారాజ్ జయంతి వేడుకల సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన తన ప్రసంగం ముగించారు.
మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగుభాయ్ పటేల్, ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్, కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం
ఆనంద్‌పూర్ ధామ్ ఆధ్యాత్మిక, సామాజిక ప్రయోజనాలు లక్ష్యంగా రూపుదిద్దుకున్న ధార్మిక సంస్థ. ఇది 315 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు కాగా, ఇక్కడి అత్యాధునిక గోశాలలో 500కుపైగా గోవులు ఆశ్రయం పొందుతున్నాయి. ఈ ప్రాంగణంలో వ్యవసాయ కార్యకలాపాలు కూడా కొనసాగుతుంటాయి. అంతేగాక సామాజిక సేవలో భాగంగా సుఖ్‌పూర్ గ్రామంలో ఒక ధార్మిక ఆస్పత్రి, సుఖ్‌పూర్తోపాటు ఆనంద్‌పూర్‌లో పాఠశాలలు సహా దేశవ్యాప్తంగా వివిధ సత్సంగ్ కేంద్రాలను కూడా ఈ ట్రస్టు నిర్వహిస్తోంది.
****
(Release ID: 2121165)
|