ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవ్కార్ మహామంత్ర దివస్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 09 APR 2025 12:22PM by PIB Hyderabad

 జై జినేంద్ర,

మనస్సు ప్రశాంతంగా ఉంది. మనస్సు స్థిరంగా ఉంది. శాంతి మాత్రమే ఉంది. అద్భుతమైన అనుభూతి. మాటలకు చాలనిది - ఆలోచనలకు అతీతమైనది - నవ్కార్ మహామంత్రం ఇంకా మనస్సులో మార్మోగుతోంది. నమో అరిహంతాణం. నమో సిద్ధాణం. నమో ఆయర్యాణం. నమో ఉవజ్ఝాయాణం. నమో లోయే సవ్వసాహుణం. ఒకే స్వరం, ఒకే ప్రవాహం, ఒకే శక్తి, ఎలాటి హెచ్చుతగ్గులూ లేవు. కేవలం స్థిరత్వం మాత్రమే. అంతా సమభావమే. అలాంటి చైతన్యం, ఒకే విధమైన లయ, అంతర్గతంగా ఒకే విధమైన కాంతి. నవ్కార్ మహామంత్రం ఆధ్యాత్మిక శక్తిని నేను ఇప్పటికీ అనుభూతి చెందుతున్నాను. కొన్నేళ్ల క్రితం బెంగళూరులో ఇలాంటి సామూహిక మంత్రోచ్ఛారణకు సాక్షిగా ఉన్నాను. ఈ రోజు తిరిగి నాకు అదే స్థాయిలో అదే అనుభూతి కలిగింది. ఈ సారి లక్షలాది పవిత్రాత్మలు ఒకే చైతన్యంతో కలిశాయి. ఒకే మాటలు కలసి పలికాయి. ఒకే శక్తి కలసి మేల్కొంది.  భారత్‌లోనే కాదు - విదేశాల్లోనూ కూడా. ఇది నిజంగా అపూర్వమైన సంఘటన.

శ్రావకులు, శ్రావికలు, సోదరులు,  సోదరీమణులారా,

ఈ శరీరం గుజరాత్‌లో జన్మించింది. ప్రతి వాడలో జైనమత ప్రభావం కనిపించే గుజరాత్‌ లో  చిన్నప్పటి నుంచే నాకు జైన ఆచార్యుల సత్సాంగత్యం లభించింది.

మిత్రులారా,

నవ్కార్ మహామంత్రం ఒక మంత్రం మాత్రమే కాదు, ఇది మన విశ్వాసానికి మూలం. ఇది మన జీవన మౌలిక స్వరం. దీని ప్రాముఖ్యత కేవలం ఆధ్యాత్మిక పరమైనది మాత్రమే కాదు.ఇది మనతో మొదలై సమాజం వరకు అందరికీ మార్గాన్ని చూపుతుంది. ఇది ప్రజల నుంచి ప్రపంచం వరకు సాగే ఒక యాత్ర. ఈ మంత్రంలో ప్రతి పదం మాత్రమే కాదు - ప్రతి అక్షరం కూడా ఒక మంత్రమే.నవ్కార్ మహామంత్రం జపించినప్పుడు పంచ పరమేష్ఠికి నమస్కరిస్తాం. పంచ పరమేష్ఠి అంటే ఎవరు? అరిహంత్ - కేవలం జ్ఞానాన్ని మాత్రమే పొందినవారు, మహానుభావులకు జ్ఞానోదయం కలిగించేవారు, 12 దైవిక లక్షణాలను కలిగి ఉన్నవారు. సిద్ధ - 8 కర్మలను ధ్వంసం చేసి, మోక్షాన్ని పొందినవారు. వారు 8 స్వచ్ఛమైన లక్షణాలను కలిగి ఉంటారు. ఆచార్య - మహావ్రతాన్ని పాటించే మార్గదర్శకులు.  వారి వ్యక్తిత్వం 36 గుణాలతో నిండి ఉంటుంది. ఉపాధ్యాయ - మోక్ష మార్గంలో ఉన్న జ్ఞానాన్ని ఉపదేశాలుగా మలచినవారు. వారికి 25 గుణాలు ఉన్నాయి. సాధు - తపోయజ్ఞంలో తమను తాము పరీక్షించుకునేవారు. మోక్షం పొందే దిశగా అడుగులు వేసే వారు 27మహా గుణాలు కలిగి ఉంటారు.

 

మిత్రులారా,

నవ్కార్ మహామంత్రాన్ని జపించినప్పుడు, మనం 108 దైవ గుణాలకు నమస్కరిస్తాం. మానవాళి సంక్షేమాన్ని గుర్తుంచుకుంటాం. ఈ మంత్రం మనకు తెలియజేస్తుంది – జ్ఞానం, కర్మలు జీవిత దిశను నిర్దేశిస్తాయి. గురువు వెలుగు చూపుతారు. మార్గం మన అంతరంగం నుంచి ఉద్భవిస్తుంది. నవ్కార్ మహామంత్రం చెబుతుంది -  నిన్ను నువ్వు నమ్ము. నీ సొంత ప్రయాణం ప్రారంభించు. శత్రువు బయట కాదు, శత్రువు లోపలే ఉంది. ప్రతికూల ఆలోచనలు, అపనమ్మకం, ద్వేషం, స్వార్థం – ఇవే శత్రువులు. వీటిని జయించడమే నిజమైన విజయం. అందుకే జైనమతం మనల్ని మనం జయించడానికి ప్రేరేపిస్తుంది తప్ప బయటి ప్రపంచాన్ని కాదు. మనల్ని మనం జయించుకున్నప్పుడు మనం అరిహంత్ అవుతాం. కాబట్టి, నవ్కార్ మహామంత్రం ఒక ఆదేశం కాదు, అది ఒక మార్గం. మనిషిని లోపలి నుంచి శుద్ధి చేసే మార్గం. ఇది  వ్యక్తికి సామరస్య మార్గాన్ని చూపుతుంది.

మిత్రులారా,

నవ్కార్ మహామంత్రం నిజంగా మానవ ధ్యానం, సాధన,  స్వీయ శుద్ధికి దోహదపడే మంత్రం.  ఈ మంత్రం ప్రపంచ శ్రేయస్సుకు సంబంధించిన దృక్కోణం కలిగి ఉంది. భారతదేశంలోని ఇతర శ్రుతి-స్మృతి సంప్రదాయాల మాదిరిగానే ఈ శాశ్వత మహామంత్రం మొదట శతాబ్దాల పాటు మౌఖికంగా, తర్వాత శిలా లేఖనాల ద్వారా, చివరికి ప్రాకృత పత్రాల ద్వారా తరతరాలుగా మనకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంది. ఇప్పటికీ మనకు దారి చూపుతూనే ఉంది. నవ్కార్ మహామంత్రం పంచ పరమేష్ఠి ఆరాధనతో పాటు సరైన జ్ఞానం కూడా. ఇది నిజమైన విశ్వాసం, సదాచారం, ఇంకా అంతా కంటే మోక్షాన్ని అందించే మార్గం.

 

జీవితంలో తొమ్మిది మూలాలు ఉన్నాయని మనకు తెలుసు.  ఈ తొమ్మిది మూలాలు జీవితాన్ని పరిపూర్ణత వైపు నడిపిస్తాయి. కాబట్టి, మన సంస్కృతిలో 9 కి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. జైనమతంలో నవ్కార్ మహామంత్రం తొమ్మిది మూలాలు, తొమ్మిది ధర్మాలతో ఉంది. ఇతర సంప్రదాయాల్లో నవ నిధులు, నవ ద్వారాలు, నవగ్రహాలు, నవదుర్గలు, నవవిధ భక్తి— ఇలా ప్రతిచోటా తొమ్మిది కనిపిస్తుంది.
 

ప్రతి సంస్కృతిలో, ప్రతి సాధనలో జపం కూడా 9 సార్లు లేదా 27, 54, 108 సార్లు, అంటే 9 గుణకాలలో చేస్తారు. ఎందువల్ల? ఎందుకంటే 9 పరిపూర్ణతకు చిహ్నం. 9 తర్వాత అంతా పునరావృతం అవుతుంది. 9ని దేనితోనైనా గుణిస్తే, సమాధానం మూలం మళ్లీ 9. ఇది గణితం మాత్రమే కాదు, గణితం కూడా కాదు. ఇది తత్త్వం. మనం పరిపూర్ణత సాధించినప్పుడు మన మనసు, మన మెదడు స్థిరత్వం సంతరించుకుంటాయి. కొత్త విషయాలపై కోరిక ఉండదు. అభివృద్ధి చెందినా మనం మన మూలం నుంచి దూరంగా కదలం. ఇదే నవ్కార్ మహామంత్ర సారాంశం.

 

మిత్రులారా,

నవ్కార్ మహామంత్ర తత్త్వం అభివృద్ధి చెందిన భారత దేశ దార్శనికతతో ముడిపడి ఉంది.  నేను ఎర్రకోట నుంచి చెప్పాను - అభివృద్ధి చెందిన భారత్ అంటే అభివృద్ధి మాత్రమే కాదు, వారసత్వం కూడా! అది ఆగి పోదు. దానికి విరామం లేదు. శిఖరాలను తాకుతుంది. కానీ  తన మూలాల నుంచి ఎంతమాత్రం దూరం కాదు. అభివృద్ధి చెందిన భారతదేశం తన సంస్కృతిని చూసి గర్వపడుతుంది. అందుకే మన తీర్థంకరుల బోధనలను పరిరక్షిస్తాం. భగవాన్ మహావీర్ 2550వ నిర్వాణ మహోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకొన్నాం. నేడు విదేశాల నుంచి తిరిగి వచ్చిన పురాతన విగ్రహాలలో మన తీర్థంకరుల విగ్రహాలు కూడా ఉన్నాయి. గతంలో అపహరణకు గురైన 20 పైగా తీర్థంకరుల విగ్రహాలు విదేశాల నుంచి తిరిగి రావడం మీరంతా గర్వించే విషయం.

మిత్రులారా,

 

భారతదేశానికి ప్రత్యేకమైన గుర్తింపును అందించడంలో జైనమతం పాత్ర అమూల్యమైనది.  దాన్ని సంరక్షించడానికి మేం కట్టుబడి ఉన్నాం. మీలో ఎంతమంది కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించి ఉంటారో నాకు తెలియదు. సందర్శించి ఉంటే మీరు కొత్త పార్లమెంట్ భవనం ఇప్పుడు ప్రజాస్వామ్య దేవాలయంగా మారిందని గమనిస్తారు. మందిరంగా మారింది. జైన మతం ప్రభావం అక్కడ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. శార్దూల్ ద్వార్ నుంచి లోపలికి ప్రవేశించగానే ఆర్కిటెక్చర్ గ్యాలరీలో సమ్మద్ శిఖర్ కనిపిస్తుంది. లోక్ సభ ప్రవేశ ద్వారం వద్ద తీర్థంకరుడి విగ్రహం ఉంది, ఈ విగ్రహం ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చింది. కాన్స్టిట్యూషన్ గ్యాలరీ పైకప్పుపై మహావీర్ అద్భుతమైన పెయింటింగ్ ఉంది. దక్షిణ భవనంలోని గోడపై 24మంది తీర్థంకరులు అందరూ కలిసే కనిపిస్తారు. మరి కొంతమంది వెలుగులోకి రావడానికి సమయం పడుతుంది, అది చాలా నిరీక్షణ తర్వాత వస్తుంది – కానీ బలంగా వస్తుంది. ఈ తత్వాలు మన ప్రజాస్వామ్యానికి దిశానిర్దేశం చేస్తాయి, సరైన మార్గాన్ని చూపుతాయి. ప్రాచీన ఆగమ గ్రంధాలలో జైనమతానికి నిర్వచనాలు చాలా సంక్షిప్త సూత్రాలలో ఉన్నాయి. వత్తు సహవో దమ్మో, చరితం ఖలూ ధమ్మో, జీవన్ రఖ్నమ్ ధమ్మో వంటి ఈ విలువలను అనుసరిస్తూ సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అనే మంత్రంతో మా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.

 

మిత్రులారా,

జైన సాహిత్యం భారతదేశ మేధో వైభవానికి వెన్నెముక. ఈ జ్ఞానాన్ని పరిరక్షించుకోవడం మన కర్తవ్యం. అందుకే ప్రాకృత, పాళీ భాషలకు ప్రాచీన భాషల హోదా ఇచ్చాం. ఇప్పుడైతే జైన సాహిత్యంపై మరింతగా పరిశోధనలు చేయడం సాధ్యపడుతుంది.

మిత్రులారా,

భాష మనుగడ సాగిస్తేనే జ్ఞానం మనుగడ సాగిస్తుంది. భాష పెరిగితే జ్ఞానం విస్తరిస్తుంది. మీకు తెలుసా, మన దేశంలో వందల సంవత్సరాల నాటి జైన లిఖిత ప్రతులు ఉన్నాయి. ప్రతి పేజీ చరిత్రకు అద్దం పడుతుంది. అదొక జ్ఞాన సముద్రం. "సమయ ధర్మ ముదహరే ముని" - మతం సమానత్వంలో ఉంది. “జో సయం జహ వెస్సిజ్జ తేనో భవై బందగో” – జ్ఞానాన్ని దుర్వినియోగం చేసేవాడు నశించిపోతాడు. “కామో కసాయో ఖవే జో, సో ముణి – పావకమ్మ జయో” – కోరికలను,  ఇష్టాలను జయించినవాడే నిజమైన ముని.

కానీ, మిత్రులారా,

 

దురదృష్టవశాత్తు, అనేక ముఖ్యమైన గ్రంథాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. అందుకే మేం  “జ్ఞాన్ భారత్ మిషన్” ప్రారంభించబోతున్నాం.  ఈ ఏడాది బడ్జెట్‌లో దీనిని ప్రకటించాం. దేశంలో కోట్లాది లిఖిత ప్రతులపై సర్వే  చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రాచీన వారసత్వాన్ని డిజిటల్ రూపంలోకి మార్చడం ద్వారా, ప్రాచీనతను ఆధునికతతో అనుసంధానిస్తాం. ఇది బడ్జెట్‌లో చాలా కీలకమైన ప్రకటన. ఇందుకు మీరు మరింత గర్వపడాలి. కానీ మీ దృష్టి రూ.12 లక్షల ఆదాయపు పన్ను మినహాయింపు వైపుకే వెళ్లిందేమో. తెలివైనవారికి సూచన చాలు!

 

మిత్రులారా,

మేం ప్రారంభించిన ఈ మిషన్ నిజంగా ఒక అమృత సంకల్పం! నూతన భారతదేశం కృత్రిమ మేధ ద్వారా అవకాశాలను అన్వేషించి,  ఆధ్యాత్మికత ద్వారా ప్రపంచానికి మార్గం చూపుతుంది.

మిత్రులారా,

 

నాకు తెలిసిన, నేను అర్థం చేసుకున్నంత వరకు, జైన మతం చాలా శాస్త్రీయమైనది,  ఇంకా చాలా సున్నితమైనది. యుద్ధం, ఉగ్రవాదం లేదా పర్యావరణ సమస్యలు వంటి అనేక పరిస్థితులను నేడు ప్రపంచం ఎదుర్కొంటోంది, ఇటువంటి సవాళ్లకు జైన మతం ప్రాథమిక సూత్రాలలో పరిష్కారం ఉంది. ఇది జైన సంప్రదాయానికి చిహ్నంగా రాసింది - "పరాస్పరోగ్రహో జీవితం" అంటే ప్రపంచంలోని అన్ని జీవులు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. అందువల్ల  జైన సంప్రదాయం చిన్న హింసను కూడా నిషేధిస్తుంది. పర్యావరణ పరిరక్షణకు, పరస్పర సామరస్యానికి, శాంతికి ఇదొక ఉత్తమ సందేశం. జైనమతంలోని 5 ప్రధాన సూత్రాల గురించి మనందరికీ తెలుసు. కానీ మరో ప్రధాన సూత్రం ఉంది - అదే అనేకాంతవాదం. అనేకాంతవాద తత్వం నేటి యుగంలో మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. మనం అఖండవాదాన్ని నమ్ముకుంటే యుద్ధం, సంఘర్షణల పరిస్థితి ఉండదు. అప్పుడు ప్రజలు ఇతరుల భావాలను,  వారి దృక్పథాన్ని కూడా అర్థం చేసుకుంటారు. ఈ రోజు ప్రపంచం మొత్తం అనేకాంతవాద తత్వాన్ని ఎక్కువగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నా. 

 

మిత్రులారా,

నేడు భారత్ పట్ల ప్రపంచ విశ్వాసం బలపడుతోంది. మన ప్రయత్నాలు, మన ఫలితాలు, స్వయం ప్రేరణగా మారుతున్నాయి. ప్రపంచ సంస్థలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి. ఎందుకంటే భారత్ అభివృద్ధి పరంగా ముందంజలో ఉంది. పురోగమిస్తున్న మన ప్రత్యేకత కారణంగా ఇతరులు పురోగమించేందుకు మార్గాలు తెరుచుకుంటాయి. ఇదే జైనమత స్ఫూర్తి. పరస్పరోపగ్రహ జీవనం! అంటే జీవితం పరస్పర సహకారంతో మాత్రమే నడుస్తుంది. ఈ ఆలోచన కారణంగానే, భారత్ పట్ల ప్రపంచ అంచనాలు కూడా పెరిగాయి. అందుకు తగ్గట్లుగానే మనం మన ప్రయత్నాలను కూడా ముమ్మరం చేశాం. వాతావరణ మార్పు నేడు అతిపెద్ద సంక్షోభంగా పరిణమించింది. సుస్థిరమైన జీవనశైలి మాత్రమే దీనికి పరిష్కారం కాగలదు. అందుకే భారత్ మిషన్ లైఫ్‌ను ప్రారంభించింది. మిషన్ లైఫ్ అంటే 'పర్యావరణహిత జీవనశైలి'తో కూడిన జీవితం. జైన సమాజం శతాబ్దాలుగా ఈ విధంగానే జీవిస్తోంది. నిరాడంబరత, నిగ్రహం, సుస్థిరతలు మీ జీవితానికి ఆధారం. జైన మత – అపరిగ్రహ దీని గురించే చెబుతుంది, అయితే ఇప్పుడు దీన్ని విశ్వవ్యాప్తం చేయాల్సి ఉంది. మీరు ఎక్కడ ఉన్నా, ప్రపంచంలోని ఏ మూలలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, కచ్చితంగా మిషన్ లైఫ్ గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను.

 

మిత్రులారా,

నేటి ప్రపంచం సమాచార ఆధారితమైనది. జ్ఞానభాండాగారంగా మన ముందు ఆవిష్కృతమవుతోంది. కానీ, న విజ్జా విణ్ణాణం కరోతి కించి! అంటే వివేకం లేని జ్ఞానం కేవలం భారం మాత్రమే, దానికి విలువ లేదు. వివేకం, జ్ఞానం రెండింటి ద్వారా మాత్రమే సరైన మార్గం లభిస్తుందని జైన మతం మనకు బోధిస్తుంది. ఈ రెండింటి సమతుల్యత మన యువతకు చాలా ముఖ్యం. సాంకేతికత ఉన్నచోట, స్పర్శ కూడా ఉండాలి. నైపుణ్యం ఉన్నచోట, ఆత్మ కూడా ఉండాలి. నవకార్ మహామంత్రం ఈ వివేకానికి మూలం కాగలదు. నవతరానికి ఈ మంత్రం కేవలం జపం చేసే మంత్రం కాదు, ఇది ఒక దిశానిర్దేశం.

మిత్రులారా,

ఈరోజు, ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలంతా కలిసి నవకార్ మహామంత్రాన్ని జపిస్తున్నప్పుడు, ఈ గదిలోనే కాదు, ఎక్కడ ఉన్నా, మనమంతా ఈ 9 సంకల్పాలను మనతో తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను.

మొదటి సంకల్పం - నీటిని ఆదా చేయాలనే సంకల్పం. తీర్థయాత్రల్లో భాగంగా మీలో చాలామంది మహుడి క్షేత్రాన్ని దర్శించే ఉంటారు. బుద్ధిసాగర్ జీ మహారాజ్ సుమారు 100 సంవత్సరాల క్రితం చెప్పిన ఒక విషయం అక్కడ రాసి ఉంది. "కిరాణా దుకాణాల్లో నీటిని అమ్మే రోజులు వస్తాయి..." అని బుద్ధిసాగర్ మహారాజ్ జీ 100 ఏళ్ల క్రితమే చెప్పారు. ఆయన ఊహించిన ఆ భవిష్యత్తులోనే నేడు మనం జీవిస్తున్నాం. తాగడానికి కిరాణా దుకాణాల నుంచి నీటిని కొంటున్నాం. ఇప్పటికైనా మనం ప్రతి చుక్క నీటి విలువను అర్థం చేసుకోవాలి. ప్రతి నీటి చుక్కను కాపాడుకోవడం మన విధి.

 

రెండో సంకల్పం- తల్లి పేరు మీద ఒక చెట్టు నాటడం (ఏక్ పేడ్ మా కే నామ్). గడిచిన కొన్ని నెలల్లోనే, దేశంలో 100 కోట్లకు పైగా చెట్లను నాటారు. ఇప్పుడు ప్రతి వ్యక్తి తన తల్లి పేరు మీద ఒక చెట్టును నాటాలి, తల్లి ఆశీర్వాదంతో దానిని పెంచాలి. గుజరాత్ భూమికి సేవ చేసే అవకాశం మీరు నాకు ఇచ్చినప్పుడు నేను ఒక ప్రయోగం చేపట్టాను. తరంగా జీలో నేను తీర్థంకర్ అడవిని సృష్టించాను. తరంగా జీ నిర్జన స్థితిలో ఉంది. యాత్రికులు వచ్చినప్పుడు వారు కూర్చోవడానికి అక్కడ స్థలం లభిస్తుంది. మన 24 మంది తీర్థంకరులు కూర్చుని ధ్యానం చేసిన వృక్షాలన్నింటినీ కనుగొని ఈ తీర్థంకర్ అడవిలో నాటాలని నేను కోరుకున్నాను. సాధ్యమైనంత ప్రయత్నం చేసినా, దురదృష్టవశాత్తు, 16 వృక్షాలను మాత్రమే సేకరించి ఈ అడవిలో నాటగలిగాను. ఇప్పటికీ నాకు ఇంకా ఎనిమిది వృక్షాలు లభించలేదు. తీర్థంకరులు ధ్యానం చేసిన వృక్షాలు అంతరించిపోతే మనకు బాధగా ఉంటుంది కదా, అందుకే ప్రతి తీర్థంకరుడు కూర్చున్న వృక్షాన్ని వెతికి పట్టుకుని నేను ఈ అడవిలో నాటుతాను.. నా తల్లి పేరు మీద ఆ వృక్షాలను ఇక్కడ నాటుతాను అని మీరు కూడా నిర్ణయించుకోండి.

 

మూడో సంకల్పం- పరిశుభ్రతా లక్ష్యం. పరిశుభ్రతలో సూక్ష్మమైన అహింసా సూత్రం దాగి ఉంది, అది హింస నుంచి స్వేచ్ఛను అందిస్తుంది. మన ప్రతి వీధి, ప్రతి ప్రాంతం, ప్రతి నగరం శుభ్రంగా ఉండాలి, ప్రతి వ్యక్తి దానికి సహకరించాలి, మీరూ సహకరిస్తారు కదా?

నాల్గో సంకల్పం – వోకల్ ఫర్ లోకల్ (స్థానికతను వినిపించండి). ఒక పని చేయండి. ముఖ్యంగా యువతీ యువకులు, నా మిత్రులు, ఆడబిడ్డలంతా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మీరు మీ ఇంట్లో ఉపయోగించే వస్తువులైన బ్రష్, దువ్వెన, వంటి వాటిలో ఎన్ని వస్తువులు విదేశాల్లో తయారైనవో రాసి చూసుకోండి. మీ జీవితంలో ఎన్ని విదేశీ విషయాలు ప్రవేశించాయో చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీరంతా ఈ వారం నేను మూడింటిని తగ్గిస్తాను, వచ్చే వారానికి ఐదింటిని తగ్గిస్తాను, క్రమంగా ప్రతిరోజూ తొమ్మిదింటిని తగ్గిస్తాను అలా ఒక్కొక్కటిగా విదేశీ వస్తువులన్నింటినీ తగ్గిస్తూనే ఉంటాను, నేను నవకార్ మంత్రాన్ని పఠిస్తూనే ఉంటాను అని నిర్ణయించుకోండి.

 

మిత్రులారా,

నేను వోకల్ ఫర్ లోకల్ అని చెప్పినప్పుడు, భారత్‌లో తయారై భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే ఉత్పత్తులను మాత్రమే మనం కొనాలనుకుంటున్నాం. మనం మన స్థానికతను ప్రపంచస్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలి. భారతీయుడి చెమట సువాసన, భారత మట్టి సువాసన నిండిన ఉత్పత్తులను మనం కొనుగోలు చేయాలి. ఇతరులు కూడా వాటినే కొనుగోలు చేసేలా మనం ప్రోత్సహించాలి.

 

ఐదో సంకల్పం - దేశ దర్శనం. మీరు ప్రపంచమంతా పర్యటించవచ్చు, కానీ మొదట భారతదేశాన్ని గురించి తెలుసుకోండి, మీ భారతదేశాన్ని దర్శించండి. మన దేశంలోని ప్రతి రాష్ట్రం, ప్రతి సంస్కృతి, ప్రతి మూల, ప్రతి సంప్రదాయం అద్భుతమైంది.. అమూల్యమైంది. మనం చూడల్సింది ఇదే, కానీ మనం దీనినే చూడడం లేదు. ప్రపంచమంతా దీనిని చూడటానికి వస్తే, మనమే వారు ఎందుకు వస్తున్నారని ప్రశ్నిస్తుంటాం. మన పిల్లల గొప్పతనాన్ని మన ఇంట్లో మనమే గుర్తించకపోతే, వారికి బయట గుర్తింపు ఎలా లభించగలదు.

ఆరో సంకల్పం- ప్రాకృతిక వ్యవసాయం చేయడం. ‘ఒక జీవి జీవనం మరొక జీవిని చంపేదిగా ఉండకూడదు’ అని జైనమతం బోధిస్తుంది. మనం నేల తల్లిని రసాయనాల నుంచి విముక్తి చేయాలి. మనం రైతులకు అండగా నిలబడాలి. ప్రతి గ్రామానికి ప్రాకృతిక వ్యవసాయమనే మంత్రాన్ని తీసుకెళ్లాలి.

ఏడో సంకల్పం- ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోండి. ఆహారంలో భారతీయ సంప్రదాయాలు తిరిగి రావాలి. చిరుధాన్యాలతో కూడిన భోజనాన్ని వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి. ఊబకాయాన్ని దూరంగా ఉంచడానికి ఆహారంలో 10శాతం నూనెను తగ్గించాలి! ఈ లెక్కలన్నీ మీకు తెలిసినవే, వీటి ద్వారా డబ్బు ఆదా అవుతుందీ అలాగే శ్రమ కూడా తగ్గుతుంది.

 

మిత్రులారా,

జైన సంప్రదాయం ఇలా చెబుతోంది – ‘తపేణం తణు మాన్సం హోయి.. అంటే తపస్సు, స్వీయ నిగ్రహం శరీరాన్ని ఆరోగ్యంగా, మనస్సును ప్రశాంతంగా చేస్తాయి. దీని కోసం యోగా, క్రీడలు మంచి మాధ్యమాలు.

ఎనిమిదో సంకల్పం యోగా, క్రీడలను జీవితంలో భాగం చేసుకోవడం. ఇల్లు, కార్యాలయం, పాఠశాల, ఉద్యానవనం, ఇలా మనం ఉండే చోటు ఏదైనా, మనం ఆటలు ఆడటం, యోగా చేయడం మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి.

తొమ్మిదో సంకల్పం పేదలకు సహాయం చేయడం. ఒకరికి చేయి అందించి సాయపడడం, ఒకరికి అన్నం పెట్టి కడుపు నింపడం నిజమైన సేవ.

 

మిత్రులారా,

ఈ నూతన సంకల్పాలు మనకు కొత్త శక్తిని ఇస్తాయి, ఇది నా హామీ. మన నవతరం సరికొత్త దిశను పొందుతుంది. మన సమాజంలో శాంతి, సామరస్యం, కరుణ పెరుగుతాయి. నేను కచ్చితంగా ఒక విషయం చెప్పగలను, నేను ఈ నూతన సంకల్పాల్లో ఏదైనా నా సొంత ప్రయోజనం కోసం చెప్పి ఉంటే, దానిని చేయవద్దు. నా పార్టీ ప్రయోజనం కోసం చెప్పినా, దానిని మీరు చేయవద్దు. ఇప్పుడు మీరు ఎటువంటి ఆంక్షలకు కట్టుబడి ఉండకూడదు. మహారాజ్ సాహిబ్‌లంతా ఇప్పుడు నేను చెప్పేది వింటున్నారు, ఈ మాటలు మీ నోటి నుంచి వస్తే, వాటి బలం మరింత పెరుగుతుంది, అందుకే మీరంతా వీటిని బోధించాలని నేను కోరుతున్నాను.

మిత్రులారా,

మన రత్నత్రయం, దశలక్షణ్, సోలా కారణ్, పర్యుషాన్ మొదలైన పండుగలు మన స్వయం సంక్షేమానికి మార్గం సుగమం చేస్తాయి. ఈ విశ్వ నవకార్ మహామంత్రం నేటి ప్రపంచంలో నిరంతరం ఆనందం, శాంతి, శ్రేయస్సును పెంపొందిస్తుంది. నాకు మన ఆచార్యులు భగవంతులపై పూర్తి నమ్మకం ఉంది, అందువల్ల నాకు మీ పట్ల కూడా విశ్వాసం ఉంది. ఈ రోజు నేను సంతోషంగా ఉన్నాను, ఆ ఆనందాన్ని నేను మీకు వ్యక్తపరచాలనుకుంటున్నాను, ఎందుకంటే గతంలో సైతం నాకు ఈ విషయాలతో అనుబంధం ఉంది. ఈ కార్యక్రమంలో నాలుగు వర్గాలు కలిసికట్టుగా పాల్గొనడం సంతోషంగా ఉంది. మీరంతా లేచి నిలబడి చప్పట్లతో అందించిన గౌరవం మోదీకి చెందాల్సినది కాదు, నేను ఈ గౌరవాన్ని ఈ కార్యక్రమం కోసం కలిసి వచ్చిన నాలుగు వర్గాల ప్రజల పాదాలకు అంకింత చేస్తున్నాను. ఈ కార్యక్రమం మన స్ఫూర్తి, మన ఐక్యత, మన సంఘీభావం, మన ఐక్యతా శక్తి, మన ఐక్యత గుర్తింపుల భావనగా మారింది. ఈ విధంగా మనం మన దేశ ఐక్యతా సందేశాన్ని తీసుకోవాలి. భారత్ మాతా కీ జై అని చెప్పే ప్రతి ఒక్కరితో మనం కలిసి ఉండాలి. అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణం కోసం ఇదే శక్తినిస్తుంది, ఇది దాని పునాదిని బలోపేతం చేస్తుంది.

 

మిత్రులారా,

ఈరోజు మనం దేశంలోని అనేక ప్రదేశాల్లోని ఆచార్యులు భగవంతుల ఆశీస్సులు పొందుతున్నందుకు అదృష్టవంతులం. ఈ ప్రపంచస్థాయి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మొత్తం జైన కుటుంబానికి నేను నమస్కరిస్తున్నాను. దేశవిదేశాల్లో సమావేశమైన మా ఆచార్య భగవంతులు, మారా సాహిబ్, ముని మహారాజ్, శ్రావకులు, శ్రావికలకు నేను సగౌరవంగా నమస్కరిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జెఐటిఓని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నవకార్ మంత్రం కంటే జెఐటీఓకి ఎక్కువ చప్పట్లు వస్తున్నాయి.

జెఐటిఓ అపెక్స్ చైర్మన్ పృథ్వీరాజ్ కొఠారి గారికి, అధ్యక్షులు విజయ్ భండారి గారికి, గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వీ గారికి, దేశవిదేశాల నుంచి తరలివచ్చిన జెఐటిఓ అధికారులు, ప్రముఖులందరికీ ఈ చారిత్రాత్మక కార్యక్రమ సందర్భంగా శుభాకాంక్షలు. ధన్యవాదాలు.

జై జినేంద్ర.

జై జినేంద్ర.

జై జినేంద్ర.

గమనిక – ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం.

 

***


(Release ID: 2120750) Visitor Counter : 23