ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీలంక అధ్యక్షునితో... సంయుక్త పత్రికా సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 05 APR 2025 1:51PM by PIB Hyderabad

గౌరవనీయ అధ్యక్షులు దిసనాయకే గారు, ఇరు దేశాల ప్రతినిధులు, మీడియా మిత్రులారా, నమస్కారం!

 

ఆయుబోవన్!

 

వణక్కం!

 

ఈరోజు అధ్యక్షులు దిసనాయకే చేతుల మీదుగా ‘శ్రీలంక మిత్ర విభూషణ’ పురస్కారాన్ని పొందడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఈ పురస్కారం నాతో పాటు 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం. భారత్ - శ్రీలంక ప్రజల మధ్య చారిత్రక సంబంధాలు, స్నేహ బంధానికి ఇది ప్రతీక.

ఈ పురస్కారాన్ని అందించిన అధ్యక్షునికి, శ్రీలంక ప్రభుత్వానికి, ఈ దేశ ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

 

మిత్రులారా,

ప్రధానమంత్రిగా, నేను నాల్గోసారి శ్రీలంకలో పర్యటిస్తున్నాను. 2019లో నా చివరి పర్యటన చాలా సున్నితమైన సమయంలో జరిగింది. ఆ సమయంలో శ్రీలంక పురోగమిస్తుందని, మరింత బలంగా ముందడుగు వేస్తుందని నేను దృఢ విశ్వాసంతో ఉన్నాను.

 

శ్రీలంక ప్రజల ధైర్యం, సహనాన్ని నేను ప్రశంసిస్తున్నాను. నేడు శ్రీలంక తిరిగి పురోగతి మార్గంలోకి రావడం సంతోషంగా ఉంది. నిజమైన స్నేహపూర్వక పొరుగు దేశంగా భారత్ తన విధులను నిర్వర్తించినందుకు గర్వంగా ఉంది. 2019 ఉగ్రవాద దాడి, కోవిడ్ మహమ్మారి, ఇటీవలి ఆర్థిక సంక్షోభం వంటి ప్రతి క్లిష్ట సమయంలోనూ శ్రీలంక ప్రజలకు భారత్ సదా అండగా నిలిచింది.

 

గొప్ప తమిళ సాధువు తిరువళ్లువర్ మాటలు ఈ సందర్భంలో నాకు గుర్తుకు వస్తున్నాయి. ఆయన ఇలా అన్నారు:

 

సేయర్ కారియా యావుల్

 

నాట్ పిన్

 

ఆడు పుల్

 

విన్నైక్కారియా యావుల్ కాపు

 

దీని అర్థం, సవాళ్లు, శత్రువుల వంటి భయంకర నేపథ్యంలో నిజమైన స్నేహితుడు, అతని స్నేహం అనే కవచం కంటే బలమైన భరోసా మరొకటి లేదు.

 

మిత్రులారా,

దిసనాయకే అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తన తొలి విదేశీ పర్యటనకు భారత్‌ను ఎంచుకున్నారు. ఆయన తొలి విదేశీ అతిథిగా వ్యవహరించే అవకాశం నాకు లభించింది. ఇది మన మధ్య గల బలమైన ప్రత్యేక సంబంధాలకు నిదర్శనం.

పొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యం, 'మహాసాగర్' విజన్ అనే మా రెండు విధానాల్లోనూ శ్రీలంకకు ప్రత్యేక స్థానం ఉంది. అధ్యక్షులు దిసనాయకే భారత్ పర్యటన అనంతరం గత నాలుగు నెలల్లో, మేం మా పరస్పర సహకారంలో గణనీయమైన పురోగతిని సాధించాం.

 

సాంపూర్ సౌర విద్యుత్ ప్లాంట్ శ్రీలంక ఇంధన భద్రత సాధించడంలో సహాయపడుతుంది. బహుళ-ఉత్పత్తి పైప్‌లైన్‌ నిర్మాణం, ట్రింకోమలీ ఇంధన కేంద్ర అభివృద్ధి కోసం కుదిరిన ఒప్పందం శ్రీలంక ప్రజలందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది. ఇరు దేశాల మధ్య గ్రిడ్ ఇంటర్-కనెక్టివిటీ ఒప్పందం శ్రీలంక విద్యుత్‌ ఎగుమతికి అవకాశాలను కల్పిస్తుంది.

 

శ్రీలంకలోని ఆధ్యాత్మిక ప్రదేశాల్లో 5వేల సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థను ఈరోజు ప్రారంభించడం నాకు సంతోషం కలిగించింది. శ్రీలంక యూనిక్ డిజిటల్ ఐడెంటిటీ ప్రాజెక్టుకు భారత్ మద్దతు ఉంటుంది.

 

మిత్రులారా,

'సబ్ కా సాథ్ సబ్ కా వికాస్' అనే దార్శనికతను భారత్ స్వీకరించింది. మా భాగస్వామ్య దేశాల ప్రాధాన్యాలను కూడా మేం విలువైనవిగా భావిస్తాం.

 

గత 6 నెలల్లోనే, మేం 100 మిలియన్ డాలర్లకు పైగా రుణాలను గ్రాంట్లుగా మార్చాం. మా ద్వైపాక్షిక 'రుణ పునర్నిర్మాణ ఒప్పందం' శ్రీలంక ప్రజలకు తక్షణ సహాయం, ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ రోజు మనం వడ్డీ రేట్లను తగ్గించాలని కూడా నిర్ణయించుకున్నాం. ఇది నేటికీ శ్రీలంక ప్రజలకు భారత్ దన్నుగా నిలుస్తుందని సూచిస్తుంది.

 

తూర్పు ప్రావిన్సుల సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం, సుమారు 2.4 బిలియన్ శ్రీలంక రూపాయల మద్దతు ప్యాకేజీని అందించనున్నాం. ఈ రోజు మనం రైతుల సంక్షేమం కోసం శ్రీలంకలో అతిపెద్ద గిడ్డంగిని కూడా ప్రారంభించాం.

 

రేపు ‘మహో-ఒమంతై’ రైల్వే లైన్‌ను ప్రారంభించనున్నాం. ‘మహో-అనురాధపుర’ సెక్షన్‌లో సిగ్నలింగ్ వ్యవస్థకు శంకుస్థాపన చేయనున్నాం. కంకేసతురై రేవు ఆధునీకరణ పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి.

 

శ్రీలంకలోని భారత సంతతికి చెందిన తమిళుల కోసం 10వేల గృహాల నిర్మాణ పనులు త్వరలోనే పూర్తికానున్నాయి. అదనంగా 700 మంది శ్రీలంక సిబ్బందికి శిక్షణ అందించనున్నాం. వారిలో పార్లమెంటు సభ్యులు, న్యాయవ్యవస్థకు చెందిన సిబ్బంది, పారిశ్రామికవేత్తలు, మీడియా సిబ్బంది, అలాగే యువ నాయకులు సైతం ఉంటారు.

మిత్రులారా,

మేం ఉమ్మడి భద్రతా ప్రయోజనాలను కలిగి ఉన్నామని విశ్వసిస్తున్నాం. ఇరు దేశాల భద్రతా ప్రయోజనాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి.

 

భారత ప్రయోజనాల విషయంలో సానుకూలంగా స్పందిస్తున్న అధ్యక్షులు దిసనాయకేకు కృతజ్ఞతలు. రక్షణ సహకారం ఒప్పందాన్ని మేం స్వాగతిస్తున్నాం. కొలంబో భద్రతా సమావేశం, హిందూ మహాసముద్రంలో భద్రతా సహకారంపై కూడా మేం కలిసి పనిచేయనున్నాం

 

మిత్రులారా,

భారత్ - శ్రీలంక మధ్య శతాబ్దాల నాటి ఆధ్యాత్మిక సంబంధాలు ఉన్నాయి.

 

నా స్వస్థలం గుజరాత్‌లోని ఆరావళి ప్రాంతంలో 1960లో లభించిన బుద్ధుని పవిత్ర అవశేషాలను ప్రజల సందర్శన కోసం శ్రీలంకకు పంపుతున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉంది.

 

ట్రింకోమలీలోని తిరుకోనేశ్వరం ఆలయ పునరుద్ధరణకు భారత్ సహాయం అందిస్తుంది. అనురాధపుర మహాబోధి ఆలయ సముదాయంలో పవిత్ర నగరం, నువారా ఎలియాలోని సీతా ఎలియా ఆలయ నిర్మాణంలో కూడా భారత్ మద్దతు ఉంటుంది.

 

మిత్రులారా,

మత్స్యకారుల జీవనోపాధికి సంబంధించిన అంశాలపై కూడా మేం చర్చించాం. ఈ విషయంలో మానవతా దృక్పథంతో ముందుకు సాగాలని మేం నిర్ణయించాం. తమిళ జాలర్లను వెంటనే విడుదల చేయాలని, వారి పడవలను విడిచిపెట్టాలని అభ్యర్థించాను.

 

శ్రీలంక పునర్నిర్మాణం, సయోధ్య గురించి కూడా మేం చర్చించాం. అధ్యక్షులు దిసనాయకే తన సమ్మిళిత విధానాన్ని నాకు వివరించారు. శ్రీలంక ప్రభుత్వం తమిళ ప్రజల ఆకాంక్షలను, శ్రీలంక రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడం, ప్రొవిన్సియల్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించడం పట్ల తన నిబద్ధతను నెరవేరుస్తుందని మేం ఆశిస్తున్నాం.

 

మిత్రులారా,

భారత్ - శ్రీలంక సంబంధాలు పరస్పర విశ్వాసం, సద్భావనపై ఆధారపడి ఉన్నాయి. ఇరుదేశాల ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడానికి మేం కలిసి పనిచేయడం కొనసాగిస్తాం.

 

నాకు ఆత్మీయ స్వాగతం పలికిన అధ్యక్షులు దిసనాయకేకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. రాబోయే కాలంలో మన భాగస్వామ్యాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తామని నేను విశ్వసిస్తున్నాను.

 

ధన్యవాదాలు!

 

*******


(Release ID: 2119738) Visitor Counter : 18