ప్రధాన మంత్రి కార్యాలయం
చిలీ అధ్యక్షుడితో సంయుక్త విలేకరుల సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ పత్రికా ప్రకటన
Posted On:
01 APR 2025 8:23PM by PIB Hyderabad
మాననీయ అధ్యక్షులు బోరిక్,
రెండు దేశాల ప్రతినిధి బృందాలు,
మాధ్యమాల ప్రతినిధులు.. మిత్రులారా!
నమస్కారం! హోలా! (అభివందనం)
అధ్యక్షుడు బోరిక్ తొలిసారి భారత పర్యటనకు వచ్చారు. ఈ దేశంపై ఆయనకుగల ఆప్తమిత్ర భావం, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఆయన నిబద్ధత నిజంగా అత్యద్భుతం. అందుకే, ఆయనకు నా హృదయపూర్వక నా అభినందనలు తెలుపుతూ వారితోపాటు విశిష్ట ప్రతినిధి బృందాన్ని మనసారా స్వాగతిస్తున్నాను.
మిత్రులారా!
భారత దేశానికి లాటిన్ అమెరికా ప్రాంతంలో చిలీ ఒక సన్నిహిత మిత్రదేశం మాత్రమేగాక అమూల్య భాగస్వామి. ఈ నేపథ్యంలో నేటి మా సమావేశం సందర్భంగా రాబోయే దశాబ్దంలో రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయగల అనేక కొత్త కార్యక్రమాలపై లోతుగా చర్చించాం.
ఇందులో భాగంగా పరస్పర వాణిజ్యం-పెట్టుబడుల విస్తరణను మేం స్వాగతిస్తున్నాం. మరోవైపు సహకార విస్తృతి దిశగా సద్వినియోగం చేసుకోవాల్సిన అవకాశాలు చాలా ఉన్నాయని ఏకాభిప్రాయానికి వచ్చాం. అలాగే పరస్పర ప్రయోజనకర సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలకు శ్రీకారం చుట్టాలని మా బృందాలను ఆదేశించాం.
కీలక ఖనిజాల రంగంలో భాగస్వామ్యాలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం. సుస్థిర సరఫరా-విలువ వ్యవస్థల రూపకల్పనకు కృషి చేస్తాం. వ్యవసాయంలో మా బలాల పరస్పర సద్వినియోగం ద్వారా ఆహార భద్రత పెంచేందుకు సంయుక్తంగా ముందడుగు వేస్తాం.
సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, రైల్వేలు, అంతరిక్షం సహా మరిన్ని రంగాలలో తనకుగల సానుకూల అనుభవాలను చిలీతో పంచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉంది.
చిలీని అంటార్కిటికాకు సింహద్వారంగా మేం పరిగణిస్తాం. ఈ నేపథ్యంలో ఈ కీలక ప్రాంతంలో సహకార బలోపేతంపై నేటి ఆసక్తి వ్యక్తీకరణ ఒడంబడికను మేం స్వాగతిస్తున్నాం.
చిలీ ఆరోగ్య భద్రతకు మద్దతివ్వడంలో భారత్ ఏనాటినుంచో విశ్వసనీయ భాగస్వామి. ఈ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని మేం నిర్ణయించాం. ఆరోగ్యకర జీవనశైలిలో భాగంగా చిలీ ప్రజలు యోగాను స్వీకరించడం హర్షదాయకం. ఆ మేరకు నవంబరు 4ను జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం ఎంతో స్ఫూర్తిదాయకం. అలాగే చిలీలో ఆయుర్వేదంతోపాటు సంప్రదాయ వైద్యం రంగంలో సహకార విస్తృతికిగల అవకాశాలపైనా మేం చర్చించాం.
ఉభయ పక్షాల మధ్య వేళ్లూనుకున్న పరస్పర విశ్వాసానికి రక్షణ రంగంలో సహకారం ఒక ప్రతీక. ఈ రంగంలో పరస్పర అవసరాల మేరకు రక్షణ పారిశ్రామిక తయారీ-సరఫరా వ్యవస్థల ఏర్పాటుపై ముందడుగు వేస్తాం. వ్యవస్థీకృత నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాదం వంటి సార్వత్రిక సవాళ్ల నిరోధం, నియంత్రణపై రెండు దేశాల సంస్థల మధ్య సహకారాన్ని విస్తృతం చేస్తాం.
అన్నిరకాల అంతర్జాతీయ ఉద్రిక్తతలు, వివాదాల పరిష్కారానికి చర్చలే ఉత్తమ మార్గమన్నది భారత్-చిలీల ఏకాభిప్రాయం. అలాగే ప్రపంచ సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలంటే ఐక్యరాజ్య సమితి భద్రత మండలి తదితర అంతర్జాతీయ సంస్థలలో సంస్కరణలు అవశ్యమని ఏకగ్రీవంగా ప్రకటిస్తున్నాం. ప్రపంచ శాంతి, స్థిరత్వాలకు మా సమష్టి తోడ్పాటును కొనసాగిస్తాం.
మిత్రులారా!
ప్రపంచ పటంలో భారత్-చిలీ చెరొక చివరన ఉండటంతోపాటు మహా సముద్ర జలాలతో వేరు చేయబడినప్పటికీ, మన రెండు దేశాల మధ్య ఇప్పటికీ కొన్ని ప్రత్యేక సహజ సారూప్యాలున్నాయి.
భారత్‌లో హిమాలయాలు, చిలీలో ఆండీస్ పర్వతాలు వేల ఏళ్లుగా రెండు దేశాల జనజీవన శైలికి రూపకర్తలుగా కీలకపాత్ర పోషించాయి. పసిఫిక్ మహాసముద్ర తరంగాలు చిలీ తీరాలను ఎంత శక్తిమంతంగా తాకుతాయో అంతే శక్తియుతంగా హిందూ మహాసముద్ర కెరటాలు భారత తీరాన్ని హత్తుకుంటాయి. రెండు దేశాలూ ఇలా ప్రకృతితో అనుసంధానితం కావడమేగాక ఈ వైవిధ్య స్వీకరణ ద్వారా మన సంస్కృతుల్లోనూ ఆ సామీప్యం దృగ్గోచరమవుతుంది.
ప్రపంచ ప్రసిద్ధుడైన చిలీ కవి, నోబెల్ పురస్కార గ్రహీత గాబ్రియేలా మిస్త్రాల్ భారతీయులైన విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్, అరవిందో ఘోష్ వంటివారి ఆలోచనలనుంచి స్ఫూర్తిపొందారు. అదేవిధంగా చిలీ సాహిత్యానికి భారత్‌లో విశేషాదరణ ఉంది. భారతీయ సినిమాలు, వంటకాలు, శాస్త్రీయ నృత్యరీతులపై చిలీ ప్రజలలో పెరుగుతున్న ఆసక్తి మన రెండు దేశాల సాంస్కృతిక సంబంధాలకు నిలువెత్తు నిదర్శనం.
చిలీని తమ సొంత ఇల్లుగా పరిగణించే భారతీయ సంతతి ప్రజలు సుమారు నాలుగు వేల మంది నేడు మన ఉమ్మడి వారసత్వ సంరక్షకులుగా నిలిచారు. వారందరి సంరక్షణ, మద్దతు బాధ్యతను స్వీకరించిన అధ్యక్షుడు బోరిక్తోపాటు ఆయన ప్రభుత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
సాంస్కృతిక ఆదానప్రదాన కార్యక్రమంపై రెండు దేశాలూ ఈ రోజు ఏకాభిప్రాయానికి రావడం మాకెంతో హర్షదాయకం. అలాగే వీసా ప్రక్రియ పరస్పర సరళీకరణపైనా మేం చర్చించాం. దీంతోపాటు ఉభయ దేశాల విద్యార్థుల ఆదానప్రదానానికీ కృషి చేస్తాం.
అధ్యక్ష మహోదయా!
మా దేశానికి మీ రాక మన సంబంధాలలో సరికొత్త శక్తిని, నవ్యోత్తేజాన్ని నింపింది. ద్వైపాక్షిక సంబంధాలతోపాటు యావత్ లాటిన్ అమెరికా ప్రాంతంలో మన సహకారానికి ఇదొక నవ్య ప్రేరణ, దిశను నిర్దేశిస్తుంది.
భారత్‌లో మీ పర్యటన ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
అనేకానేక ధన్యవాదాలు!
గ్రేషియాస్! (కృతజ్ఞతలు)
గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం మాత్రమే.
***
(Release ID: 2117640)
|