సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

1100 అంతర్జాతీయ పోటీదారులు సహా 85,000 దాటిన వేవ్స్ ‘క్రియేట్ ఇన్ ఇండియా’ పోటీ దరఖాస్తులు


2025, మే 1 నుంచి 4 వరకూ ముంబయి వేదికగా జరిగే వేవ్స్ ‘క్రియేటోస్పియర్’లో 32 పోటీల్లో ఫైనలిస్టులుగా నిలిచిన 750 మంది భాగస్వామ్యం

Posted On: 01 APR 2025 3:54PM by PIB Hyderabad


ఈ ఏడాది మే 1 నుంచి 4 వరకు ముంబయి జియో వరల్డ్ సెంటర్ లో జరిగే ప్రపంచ దృశ్య-శ్రవణ, వినోదరంగ సదస్సు-వేవ్స్ లో భాగంగా ప్రారంభించిన క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ (సీఐసీ) తొలి సీజన్.. 1,100 అంతర్జాతీయ పోటీదారులు సహా, మొత్తం 85,000 దరఖాస్తుల ఘనత సాధించింది. 32 విలక్షణ విభాగాలకు చెందిన పోటీల్లో పాల్గొని, కఠినమైన వడపోతల అనంతరం ఫైనలిస్టులుగా నిలిచిన 750 మందికి వారి వ్యక్తిగత పోటీల ఫలితాన్ని, నైపుణ్యాన్ని పరిశ్రమ ప్రముఖుల ఎదుట ప్రదర్శించే అవకాశం దక్కుతుంది. పోటీలో పాల్గొంటున్నవారికి ఎంచుకున్న రంగంలో వ్యాపారవేత్తలతో నెట్వర్కింగ్ అవకాశాలు, పిచ్చింగ్ సెషన్లే కాక, మాస్టర్ క్లాసుల ద్వారా అంతర్జాతీయ నిపుణులనుంచి నేరుగా నేర్చుకునే అవకాశం, పానెల్ చర్చలు, సదస్సులు, సమావేశాల్లో పాల్గొనే అపురూపమైన అవకాశం దక్కుతుంది. క్రియేట్ ఇన్ ఇండియా పోటీల్లో విజేతలుగా నిలిచినవారిని ముంబయిలో జరిగే వేడుకలో ‘వేవ్స్ క్రియేటర్ అవార్డ్స్’ పురస్కారంతో సత్కరిస్తారు.

సృజనాత్మక ప్రపంచంలో భారీ పాదం మోపిన ఈ పోటీలు కొత్త ఆలోచనలకి వేదికగా నిలుస్తూ దేశ, విదేశాల పోటీదార్ల భాగస్వామ్యాన్ని చవి చూస్తున్నాయి, అంతర్జాతీయ స్థాయిలో సృజనాత్మతకి కొత్త చిరునామాగా ఆవిర్భవిస్తున్నాయి. ఉత్సాహభరితమైన రీల్ మేకింగ్ పోటీ, పరిష్కారానికి ప్రాముఖ్యాన్నిచ్చే ట్రూత్ టెల్ హ్యాకథాన్, నూతన ధోరణులకు పెద్దపీట వేసే యంగ్ ఫిలిం మేకర్స్ పోటీ, ఊహాత్మక శక్తికి జేజేలు పలికే కామిక్స్ క్రియేటర్ ఛాంపియన్షిప్ వంటి 32 విలక్షణమైన పోటీలు కలిగిన సీఐసీ, సృజనకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశాన్ని కల్పిస్తోంది.  ఏఐ అవతార్ క్రియేటర్ ఛాలెంజ్, వామ్! యానిమే పోటీ, ఈ-స్పోర్ట్స్ టోర్నమెంట్, ట్రైలర్ తయారీ పోటీ, థీమ్ మ్యూజిక్ పోటీ, ఎక్స్ ఆర్ క్రియేటర్ హ్యాకథాన్ వంటి అత్యున్నత సాంకేతిక పోటీ సహా కొత్త తరం కథకులు, డిజైనర్లు, డిజిటల్ ఆవిష్కర్తల కెరీర్లకు ఊపందించే వేదికగా సీఐసీ సత్తా చాటుతోంది.

విభిన్న విభాగాలు, తరాలు, దేశాల ఎల్లలు చెరిపేస్తూ పోటీదార్లను ఏకం చేస్తూ, భారతదేశ సృజనాత్మకతని వేడుక చేసుకునే సీఐసీ కార్యక్రమం, కథన రీతుల్లో, డిజిటల్ వ్యక్తీకరణలో నూతన పోకడలను స్వాగతిస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. తొలి సీజన్ పునాది బలంతో భవిష్యత్తు సీజన్లలో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకుని, సృజనకారులకు సాధికారతను కల్పించే వేదికగా, సాంస్కృతిక రంగానికి దిక్సూచిగా నిలువగలదని చెప్పవచ్చు.  

   వేవ్స్ గురించి:

మీడియా, వినోద రంగాల్లో మైలురాయి వంటి తొలి వేవ్స్ సదస్సు (ప్రపంచ ఆడియో విజువల్, ఎంటర్టైన్మెంట్ సమిట్) ను భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ ఏడాది మే 1 నుంచి  4 వ తేదీ వరకూ ముంబయిలో నిర్వహిస్తారు.


మీరు పరిశ్రమలో సేవలందిస్తున్న నిపుణులైనా, సృజనకారులైనా, ఆవిష్కర్తలయినా, మీకు ప్రపంచ స్థాయి మీడియా, వినోద రంగాల్లో పని చేస్తున్న ఇతరులతో కలిసి పని చేసేందుకు, అనుసంధానమై మరింత తోడ్పాటును అందించేందుకు సదస్సు అవకాశాలను కల్పిస్తుంది.

కంటెంట్ సృష్టి, మేధోపరమైన హక్కులు, సాంకేతిక సృజనలో అగ్రగామి దేశంగా భారత్ స్థానాన్ని సుస్థిరం చేసేందుకు వేవ్స్ సదస్సు దోహదపడుతుంది. ప్రసార విభాగాలు, ప్రింట్ మీడియా, టెలివిజన్, రేడియో, సినిమాలు, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, శబ్ద గ్రహణ-సంగీత రంగాలు, అడ్వర్టైజింగ్, డిజిటల్ మీడియా, సామాజిక మాధ్యమాలు, జెనరేటివ్ ఏఐ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఎక్స్టెండెడ్ రియాలిటీ తదితర రంగాల్లోని పరిశ్రమలపై సదస్సు దృష్టి కేంద్రీకరిస్తుంది.

 

మీ సందేహాలు, ప్రశ్నలకు జవాబులు ఇక్కడ 

 పీఐబీ టీం వేవ్స్  తాజా ప్రకటనల ద్వారా అప్ డేటెడ్ గా నిలవండి


వేవ్స్  సదస్సులో పాల్గొనేందుకు ఇప్పుడే  మీ పేర్లను నమోదు చేసుకోండి!

 

***


(Release ID: 2117364) Visitor Counter : 17