ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో వివిధ ప్రగతి పనుల ప్రారంభం.. శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 30 MAR 2025 6:05PM by PIB Hyderabad

భారత్‌ మాతా కీ... జై!
భారత్‌ మాతా కీ... జై!
భారత్‌ మాతా కీ... జై!
ఛత్తీస్‌గఢ్‌ మహతారీ కీ... జై! (జై ఛత్తీస్‌గఢ్‌!)
రతన్‌పూర్‌ వాలీ మాతా మహామాయా కీ... జై!
కర్మా మాయా కీ... జై! బాబా గురు ఘాజీదాస్‌ కీ... జై!

మీకందరికీ హృదయపూర్వకంగా జై.. జోహార్‌! (వందనం)
(సభికులనుద్దేశించి స్థానిక భాషలో ప్రధాని అభివాదం)

   వేదికను అలంకరించిన ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ శ్రీ రమణ్‌ డేకా, ప్రజాదరణగల చురుకైన ముఖ్యమంత్రి శ్రీ విష్ణుదేవ్‌ సాయి, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ మనోహర్‌ లాల్‌, ఈ ప్రాంత ఎంపీ-కేంద్ర మంత్రి శ్రీ తోఖన్ సాహు, ఛత్తీస్‌గఢ్ శాసనసభాపతి-నా ప్రియ మిత్రులు శ్రీ రమణ్ సింగ్, ఉప ముఖ్యమంత్రి శ్రీ విజయ్ శర్మ, శ్రీ అరుణ్ సాహు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు... దూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన నా సోదరీసోదరులారా!

   ఇది కొత్త సంవత్సరాది శుభదినం... అలాగే, మాతా మాహామాయ కొలువుదీరిన ఈ గడ్డపై నవరాత్రి వేడుకల తొలిరోజు... కౌసల్య మాతకు ఛత్తీస్‌గఢ్‌ పుట్టిల్లు... ఇన్ని విశిష్టతల నడుమ ఇదొక పవిత్ర సందర్భం. దైవాంశ సంభూత నారీశక్తిని చాటే ఈ తొమ్మిది రోజుల వేడుకలు ఛత్తీస్‌గఢ్‌కు ప్రత్యేకం. ఈ శుభ సందర్భంలో తొలిరోజు ఉత్సవానికి హాజరు కావడం నిజంగా నా అదృష్టం. కొద్ది రోజుల కిందటే భక్త శిరోమణి మాతా కర్మ గౌరవార్థం ఒక తపాలా బిళ్లను ఆవిష్కరించాం. ఇన్ని విశేషాల నడుమ మీకందరికీ నా హృదయపూర్వక అభినందనలు.

మిత్రులారా!

   ఈ నవరాత్రి వేడుకలు శ్రీరామ నవమి పర్వదినంతో సమాప్తమవుతాయి. శ్రీరామునిపై ఛత్తీస్‌గఢ్ భక్తిప్రపత్తులు అమేయం. మన ‘రామనామి సమాజం’ (ఒక తెగ) పూర్తిగా శ్రీరాముని దివ్య నామాంకితం. ఆ రాముని పురిటిగడ్డ మీది ప్రజలతోపాటు సభికులందరికీ, నా మిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు... జై శ్రీ రామ్!

మిత్రులారా!

   ఈ శుభదినాన మోహభట్ట స్వయంభూ శివలింగ మహాదేవుని ఆశీస్సులతో ఛత్తీస్‌గఢ్ ప్రగతిని మరింత వేగిరపరచే అవకాశం నాకు లభించింది. ఇందులో భాగంగా ఇప్పుడే రూ.33,700 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసుకున్నాం. నిరుపేదల కోసం గృహ నిర్మాణం, పాఠశాలలు, రోడ్లు, రైల్వేలు, విద్యుత్, గ్యాస్ పైప్‌లైన్‌ వంటి అనేక కార్యక్రమాలు ఈ ప్రాజెక్టులలో అంతర్భాగంగా ఉన్నాయి. ఇవన్నీ రాష్ట్ర ప్రజల జీవన నాణ్యతను గణనీయంగా పెంచడమేగాక యువత కోసం కొత్త ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తాయి. ఇలాంటి అనేక అభివృద్ధి ప్రాజెక్టులు అందుబాటులోకి రావడంపై మిమ్మల్ని మనసారా అభినందిస్తున్నాను.

మిత్రులారా!

   మన సంప్రదాయం ప్రకారం ఎవరికైనా ఆశ్రయమివ్వడం ఎంతో ఔదార్యం నిండిన కార్యం. అయితే, సొంత గూడు కోసం తపించే వ్యక్తి కల నెరవేర్చడాన్ని మించిన ఆనందం మరేముంటుంది! ఈ రోజు నవరాత్రి మాత్రమేగాక కొత్త ఏడాది శుభ సందర్భంగా రాష్ట్రంలోని 3 లక్షల పేద కుటుంబాలు తమ స్వగృహ ప్రవేశం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని క్షణాలకు  ముందే ముగ్గురు లబ్ధిదారులతో ముచ్చటించే అవకాశం నాకు లభించింది. ఆ సమయంలో వారి వదనాల్లో ఉప్పొంగిన ఆనంద తరంగం నాకు దృగ్గోచరమైంది. వారిలో ఒక మహిళ తన భావోద్వేగాన్ని అణచుకోలేకపోవడం నన్ను పులకింపజేసింది. ఈ కుటుంబాల... అంటే- 3 లక్షల మంది పేదల జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలైన సందర్భంగా నిండు మనసుతో శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ పేద కుటుంబాలకు సురక్షితంగా తలదాచుకునే గూడు కల్పించడం మీ అందరి సహకారంతోనే సాకారమైంది. మోదీపై మీ నమ్మకానికి నేను ఇలా చెబుతున్నాను. గత ప్రభుత్వ హయాంలో ఛత్తీస్‌గఢ్‌లోని లక్షలాది కుటుంబాల పక్కా ఇంటి కల ఫైళ్లలోనే సమాధి అయింది. మా ప్రభుత్వం ఏర్పడితే ఈ కలను సాకారం చేస్తామని మాటిచ్చాం... తదనుగుణంగా శ్రీ విష్ణు దేవ్ సారథ్యంలో ఏర్పడిన ప్రభుత్వం తన తొలి మంత్రిమండలి సమావేశంలోనే 18 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. అందులో 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తికావడం, వీటిలో అధికశాతం గిరిజన ప్రాంతాల్లోనివి కావడం నాకెంతో సంతోషం కలిగించింది. బస్తర్, సుర్గుజా నుంచి వచ్చిన చాలా కుటుంబాలకు ఇవాళ పక్కా ఇళ్లు సమకూరాయి. గాలివీస్తే కొట్టుకుపోయే పూరిళ్లలో తరతరాలుగా వారనుభవించిన కష్టానష్టాలు తీరిపోవడాన్ని బట్టి ఈ గృహనిర్మాణానికి ఎంతటి ప్రాధాన్యం ఉన్నదో ఊహించుకోవచ్చు. ఈ మార్పు ప్రభావం ఎలాంటిదో గ్రహించలేని వారికోసం నేనొక ఉదాహరణతో వివరిస్తాను. మీరు రైలు లేదా బస్సులో సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నారనుకోండి... గమ్యం చేరేదాకా సీటు దొరుకుతుందో లేదోనని ఆలోచిస్తూ నిలుచునే ఉన్నారనుకోండి. ఇంతలో ఓ ఊరివద్ద ఎవరో దిగిపోగా, మీకు సీటు లభిస్తే ఆ క్షణంలో మీకు కలిగే ఉపశమనం.. మీ ఆనందం అపరిమిత స్థాయిలో ఉంటాయా.. లేదా! అదే తరహాలో మురికివాడల్లో లేదా గుడిసెలలో జీవితంలో అధికశాతం గడిచిపోతుంటే కునారిల్లే కుటుంబాల వ్యథను ఒకసారి ఊహించుకోండి. అలాంటి దుస్థితి నుంచి నేడు పక్కా ఇళ్లలోకి మారినప్పుడు వారి ఆనందానికి అవధులుంటాయా? కాబట్టే, పేదల వదనాల్లో కనిపించే సంతోషం నాలో సరికొత్త శక్తి నింపి, నా దేశవాసుల కోసం నిర్విరామ కృషిపై నా సంకల్పానికి మరింత ఉత్తేజమిస్తుంది.

మిత్రులారా!

   ఈ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసినా, లబ్ధిదారుల నిర్ణయం మేరకే ప్రతి ఇంటికీ రూపమిచ్చారు. ఇవి మీ కలల నివాసాలు... మా ప్రభుత్వం ఇళ్ల నిర్మాణ బాధ్యతను స్వీకరించడమే కాకుండా వాటిలో నివసించే వారి జీవిత శ్రేయస్సును కూడా కాంక్షిస్తుంది. అందుకే మరుగుదొడ్లు, విద్యుత్, ఉజ్వల గ్యాస్ కనెక్షన్‌, కొళాయి కనెక్షన్ వంటి ప్రాథమిక సౌకర్యాలన్నిటినీ సమకూర్చింది. నేడిక్కడ తల్లులు, సోదరీమణులు పెద్ద సంఖ్యలో హాజరైన నేపథ్యంలో... ఈ పక్కా ఇళ్లలో అధికశాతం వారి పేరిటే నమోదు చేయడం హర్షణీయం. ఈ విధంగా వేలాది సోదరీమణులు తొలిసారి కుటుంబ ఆస్తికి చట్టబద్ధ యజమానులుగా హక్కు పొందారు. నా ప్రియమైన తల్లులు, సోదరీమణులారా! మీ హృదయాల్లో ఉప్పొంగిన సంతోషం, మీ వదనాల్లో విరిసిన చిరునవ్వులు.. నిండు మనసుతో మీరిచ్చే ఆశీస్సులే నాకు అపార సంపదలు.

మిత్రులారా!

   లక్షలాది ఇళ్ల నిర్మాణం ఫలితంగా మరొక కీలక ముందంజ కూడా పడుతుంది. ఎలాగంటే- ఈ ఇళ్లను నిర్మించేదెవరు? మన తాపీ పనివారు, కార్మికులే! నిర్మాణ సామగ్రి ఎక్కడి నుంచి వస్తుంది? ఢిల్లీ లేదా ముంబయి వంటి నగరాల నుంచి కాకుండా స్థానిక మార్కెట్ల నుంచే లభిస్తుంది! పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం మన మేస్త్రీలకు, నిపుణ కార్మికులకు, గ్రామీణులకు ఉపాధినిస్తుంది. నిర్మాణ సామగ్రి సరఫరా చేసే స్థానిక చిన్న దుకాణదారులకూ ఎంతో ప్రయోజనం కలుగుతుంది. దీనికితోడు సామగ్రి రవాణా ద్వారా ట్రక్కులు, ఇతరత్రా వాహనదారులకూ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఏతావాతా... లక్షలాది ఇళ్ల నిర్మాణంతో  ఛత్తీస్‌గఢ్ అంతటా నిలువనీడ కల్పన సహా విస్తృత ఉపాధి సృష్టి సాధ్యమైంది.

మిత్రులారా!

   ఈ రాష్ట్ర ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని బీజేపీ ప్రభుత్వం కచ్చితంగా నెరవేరుస్తోంది. ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ... ఈ మూడంచెల ప్రక్రియలో మీరు తిరుగులేని మద్దతివ్వడం నిజంగా ప్రశంసనీయమని ముఖ్యమంత్రి ఇప్పుడే ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో మీ నమ్మకానికి, ఆశీర్వాదాలకు... ఇవాళ మీ సమక్షంలో నిలబడి, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను.

మిత్రులారా!

   వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులంతా ఇప్పుడిక్కడ ఉన్నారు. మా ప్రభుత్వం హామీలను ఎంత త్వరగా నెరవేరుస్తుందో మీరే స్వయంగా చూస్తున్నారు. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్ మహిళలకిచ్చిన వాగ్దానాన్ని మేం సాకారం చేశారు. వరి పండించే రైతులు రెండేళ్ల బోనస్‌ అందుకున్నారు. అంతేకాకుండా పెరిగిన కనీస మద్దతు ధరతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు  చేసింది. దీనివల్ల లక్షలాది రైతు కుటుంబాలకు రూ.వేల కోట్లలో లబ్ధి చేకూరింది. ఇక గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నియామక పరీక్షలు అవినీతిమయంగా మారాయి. ఈ కుంభకోణాలపై సమగ్ర దర్యాప్తు నిర్వహణకు బీజేపీ ప్రభుత్వం ఆదేశించింది. అదే సమయంలో నియామక పరీక్షలు పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తామని భరోసా ఇస్తున్నాం. నిజాయితీతో కూడిన ఈ కృషి బీజేపీపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేసింది. కాబట్టే, అసెంబ్లీతోపాటు లోక్‌సభ ఎన్నికల తర్వాత, పౌర ఎన్నికలలోనూ మా పార్టీ విజయం సాధించింది. ఇవాళ ఛత్తీస్‌గఢ్ అంతటా మా పార్టీ జెండా రెపరెపలాడుతోంది. ఈ రాష్ట్ర ప్రజలు మా ప్రభుత్వ దార్శనికత, కార్యక్రమాలను మనసారా ఆశీర్వదిస్తున్నారు.

మిత్రులారా!

   ఛత్తీస్‌గఢ్ ఇటీవలే 25వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించుకుంది... ఇది ఈ రాష్ట్ర రజతోత్సవ సంవత్సరం. యాదృచ్చికంగా ఈ ఏడాదిలోనే అటల్ జీ శతాబ్ది వేడుకలు కూడా నిర్వహించుకుంటున్నాం. ఆయన వారసత్వాన్ని గౌరవిస్తూ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 2025ను  ‘అటల్ నిర్మాణ్ వర్ష్‌’గా నిర్వహిస్తుంది. మా నిబద్ధత ఇప్పుడు విస్పష్టం- ఈ రాష్ట్రానికి మేం రూపమిచ్చాం... ఇకపై మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతాం. నేడు ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన ప్రతి మౌలిక సదుపాయాల ప్రాజెక్టు ఈ సంకల్పానికి తిరుగులేని ఉదాహరణ.

మిత్రులారా!

   ప్రగతి ఫలితాలు ప్రతి ఒక్కరికీ చేరేలా చూడటమే లక్ష్యంగా ఛత్తీస్‌గఢ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరిచారు. కానీ, కాంగ్రెస్ పాలనలో ఇక్కడ ప్రగతి పడకేసింది... అక్కడక్కడా కొన్ని పనులు చేపట్టినా, అంతటా అవినీతే అలముకుంది. కాంగ్రెస్ పార్టీ మీ శ్రేయస్సును ఎన్నడూ పట్టించుకున్నది లేదు... కానీ, మేమిప్పుడు మీ సౌకర్యాలు, మీ పిల్లల భవిష్యత్తు, మీ జీవన నాణ్యత వగైరాలకు ప్రాధాన్యమిస్తూ అన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ఆ మేరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ మా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. ఇక్కడ ఒక యువతి చాలా సేపటినుంచి ఓ పెయింటింగ్‌ పట్టుకుని ఉండటం గమనించాను... ఆమె పేరు, చిరునామా తెలుసుకోవాల్సిందిగా భద్రత సిబ్బందిని కోరుతున్నాను. తల్లీ... నీకు నేనొక లేఖ రాస్తాను... (సిబ్బందినుద్దేశించి) మీలో ఎవరైనా ఆమె వద్ద నుంచి పెయింటింగ్‌ తీసుకుని, నాకు చేరేలా చూడండి. కృతజ్ఞతలు బిడ్డా... అనేకానేక ధన్యవాదాలు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను నేడు ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. రహదారులన్నీ బాగుపడుతూ, మారుమూల గిరిజన గ్రామాలకూ ప్రగతి విస్తరిస్తోంది. తొలిసారిగా రైలు మార్గాలు కొత్త ప్రాంతాలతో అనుసంధానం అవుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడే నేనొక కొత్త రైలును జెండా ఊపి సాగనంపాను. అలాగే మొదటిసారిగా ఈ ప్రాంతాల్లో విద్యుత్‌ వెలుగులు ప్రసరిస్తున్నాయి... కొళాయి ద్వారా నీరందే కల సాకారమమైంది. మునుపెన్నడూ ఎరుగని రీతిలో పలు ప్రాంతాలు మొబైల్‌ టవర్లతో సంధానం కాగలిగాయి. కొత్త పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు నిర్మాణంలో ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌ పూర్తిగా మారిపోతూ, రాష్ట్ర భవిష్యత్తు ఉజ్వలంగా లిఖితమవుతోంది.

మిత్రులారా!

   దేశంలో 100 శాతం రైలుమార్గాలు విస్తరించిన రాష్ట్రాల జాబితాలో ఛత్తీస్‌గఢ్ ఇప్పుడు స్థానం పొందింది... నిజంగా ఇదొక అద్భుత విజయం. ప్రస్తుతం, రాష్ట్రంలో దాదాపు రూ.40,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల పనులు సాగుతున్నాయి. దీంతోపాటు రాష్ట్ర రైల్వే మౌలిక సదుపాయాల కోసం ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌ ప్రత్యేకంగా రూ.7,000 కోట్లు కేటాయించింది. ఈ పరిణామాలతో ఛత్తీస్‌గఢ్‌లోని వివిధ ప్రాంతాల్లో రైళ్ల అనుసంధానం గణనీయంగా పెరగడమేగాక పొరుగు రాష్ట్రాలతో సంబంధాలు మెరుగవుతాయి.

మిత్రులారా!

   ప్రగతి వైపు పయనానికి ఆర్థిక వనరులతోపాటు సత్సంకల్పం కూడా అవశ్యం. ఆ మేరకు ఆలోచనలు-ఆచరణలో నిజాయితీ లేకపోతే- కాంగ్రెస్ పాలనలో మనం చూసిన రీతిలో ఎంతపెద్ద ఖజానా అయినా ఖాళీకాక తప్పదు. ఇదంతా కాంగ్రెస్ హయాంలో మనం చూశాం.. అవినీతి, అధికార దుర్వినియోగం ఫలితంగా గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి దూరమయ్యాయి. బొగ్గును ఉదాహరణగా తీసుకోండి- ఛత్తీస్‌గఢ్ బొగ్గు నిల్వలు సమృద్ధం... కానీ, రాష్ట్ర  అవసరాలు తీర్చగలిగే స్థాయిలో విద్యుత్తు లభ్యంకాక ఇబ్బందులు పడుతోంది. కాంగ్రెస్ పాలనలో విద్యుత్ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై శ్రద్ధ కొరవడింది. తద్విరుద్ధంగా మా ప్రభుత్వం ఇప్పుడు ఇంధన సరఫరాకు భరోసా ఇస్తూ కొత్త విద్యుత్ ప్లాంట్లను వేగంగా నిర్మిస్తోంది.

మిత్రులారా!

   సౌర విద్యుదుత్పాదనకూ మేమెంతో కృషి చేస్తున్నాం. ఆ మేరకు మోదీ ప్రారంభించిన ఒక అద్భుత పథకం గురించి మీకిప్పుడు వివరిస్తాను. దీనివల్ల మీ విద్యుత్ బిల్లు భారం తగ్గుతుంది. ఇంట్లోనే విద్యుదుత్పాదనతో బిల్లు తగ్గడమే కాకుండా ఆదాయార్జన వెసులుబాటు కూడా కలుగుతుంది. దీని పేరే “ప్రధానమంత్రి ఉచిత గృహ సౌరవిద్యుత్‌ పథకం (పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన). ఈ పథకం కింద ప్రతి ఇంటి కప్పుపై సౌర ఫలకాల ఏర్పాటు కోసం మా ప్రభుత్వం రూ.70–80 వేలదాకా ఆర్థిక సహాయం అందిస్తుంది. రాష్ట్రంలో 2 లక్షలకుపైగా కుటుంబాలు ఇప్పటికే ఈ పథకం కింద నమోదు చేసుకున్నాయి. మరింత పెద్ద సంఖ్యలో  మీరంతా ఈ పథకం ప్రయోజనం పొందాలని కోరుతున్నాను.

మిత్రులారా!

   సుపరిపాలన, దార్శనికతకు మరొక ఉదాహరణ గ్యాస్ పైప్‌లైన్ల నిర్మాణం. ఛత్తీస్‌గఢ్ నలుచెరగులా భూ పరివేష్టిత రాష్ట్రం. సముద్రానికి దూరం కావడంతో గ్యాస్ సరఫరా కీలక సమస్యగా మారింది. గత ప్రభుత్వం గ్యాస్ మౌలిక సదుపాయాలలో తగినంత పెట్టుబడి పెట్ట లేదు. దీంతో భారీ వ్యయంతో కూడిన రవాణా విధానాలపై ఆధారపడాల్సి వచ్చింది. ఈ సమస్యను మేమిప్పుడు ప్రత్యక్షంగా పరిష్కరిస్తున్నాం. మా ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌లో వేగంగా గ్యాస్ పైప్‌లైన్లు వేస్తోంది... దీంతో, ట్రక్కుల ద్వారా పెట్రోలియం ఉత్పత్తుల రవాణాపై పరాధీనత తగ్గుతుంది. తద్వారా ఇంధనం, సంబంధిత ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి. అంతేగాక గ్యాస్ పైప్‌లైన్ల వల్ల సంపీడన సహజవాయువు (సీఎన్‌జీ)తో లభ్యత పెరిగి, వాహనాలకు పరిశుభ్ర, సరస ప్రత్యామ్నాయాన్నిస్తుంది. అలాగే పైపుల ద్వారా ఇళ్లకు వంట గ్యాస్‌ నేరుగా సరఫరా అవుతుంది. పైపుల ద్వారా వంటగదికి నీరు ప్రవహిస్తున్న తరహాలోనే ఇప్పుడు గ్యాస్ కూడా సరఫరా అవుతుంది. ప్రస్తుతం 2 లక్షలకుపైగా ఇళ్లను పైపుల ద్వారా నేరుగా గ్యాస్ సరఫరాతో అనుసంధానించేందుకు కృషి చేస్తున్నాం. నివాసాలకు ప్రయోజనం మాట అటుంచితే గ్యాస్ లభ్యతతో ఛత్తీస్‌గఢ్‌లో కొత్త పరిశ్రమలకు మార్గం సుగమమై, వేలాది కొత్త ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి.

మిత్రులారా!

   గడచిన దశాబ్దాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల విధానాలు ఛత్తీస్‌గఢ్‌ సహా అనేక రాష్ట్రాల్లో నక్సలిజం విస్తరణకు ఆజ్యం పోశాయి. వెనుకబడిన, ప్రగతికి దూరమైన ప్రాంతాలన్నిటా నక్సలిజం వేళ్లూనుకుని, ఊడలు దింపింది. అయినప్పటికీ, 60 ఏళ్లు దేశాన్నేలిన ఆ పార్టీ చేసిందేమిటి? సమస్యల పరిష్కారానికి బదులు, తీవ్రవాద పీడిత జిల్లాలను వెనుకబడినవిగా ప్రకటించి చేతులు దులిపేసుకుంది. ఫలితంగా అన్ని తరాల యువతనూ మనం నష్టపోయాం.  అనేకమంది తల్లులు తమ పుత్రుల హృదయ విదారక మరణశోకాన్ని భరించాల్సి వచ్చింది. లెక్కలేనంత మంది సోదరీమణులు తమ సోదరుల కోసం కన్నీరుమున్నీరవుతున్నారు.

మిత్రులారా!

   గత ప్రభుత్వాల ఉదాసీనత సంక్షోభాన్ని మరింత తీవ్రం చేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని వివిధ జిల్లాల్లో అత్యంత వెనుకబడిన గిరిజన కుటుంబాలెలా ఇబ్బంది పడుతున్నాయో మీరంతా ప్రత్యక్షంగా చూసే ఉంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం వారిని ఏనాడూ పట్టించుకున్నది లేదు... కానీ,  మేం పట్టించుకున్నాం. స్వచ్ఛ భారత్ అభియాన్‌ను ప్రారంభించడం ద్వారా పేద గిరిజన కుటుంబాలకు సముచిత పారిశుధ్య సదుపాయాలు కల్పించాం. ఆయుష్మాన్ భారత్ యోజనకు శ్రీకారం చుట్టడం ద్వారా వారి ఆరోగ్య సంరక్షణ అవసరాలకు ప్రాధాన్యం లభించింది. దీనికింద నేడు రూ.5 లక్షల విలువైన ఉచిత చికిత్సను అందిస్తున్నాం. అలాగే 80 శాతం  తగ్గింపుతో పేదలకు మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ మేరకు ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాల ద్వారా అవసరమైన మందులు వారికి లభిస్తున్నాయి.

మిత్రులారా!

   సామాజిక న్యాయం సాధించింది తామేనని గొప్పలు చెప్పినవారే దశాబ్దాలుగా గిరిజన సమాజాన్ని నిర్లక్ష్యం చేశారు. అందుకే నేనేమంటున్నానంటే- ఎవరూ పట్టించుకోని వారికి మోదీ అండగా నిలుస్తాడు. ఆ మేరకు ‘ధర్తీ ఆబా జన్‌జాతి ఉత్కర్ష్ అభియాన్’ వంటి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా గిరిజన సమాజాభ్యున్నతికి మేం చురుగ్గా పనిచేస్తున్నాం. దీనికింద గిరిజనం అభివృద్ధికి రూ.80,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నాం. తద్వారా ఛత్తీస్‌గఢ్‌లోని దాదాపు 7,000 గిరిజన గ్రామాలకు ప్రయోజనం కలుగుతోంది. అంతేగాక గిరిజన సమాజంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అత్యంత వెనుకబడిన వర్గాలున్నాయని మేం గుర్తించాం. ఈ వర్గాల కోసం తొలిసారిగా మా ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ప్రధానమంత్రి జన్మన్ యోజన’ను ప్రవేశపెట్టింది. దీనికింద ఛత్తీస్‌గఢ్‌లోని 18 జిల్లాల్లోగల 2,000కుపైగా ప్రదేశాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. తదనుగుణంగా దేశంలోని గిరిజన ప్రాంతాల్లో 5,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ఆమోదముద్ర పడింది. వీటిలో సగం.. అంటే- దాదాపు 2,500 కిలోమీటర్ల మేర ఒక్క ఛత్తీస్‌గఢ్‌లోనే నిర్మితమవుతాయి. ఇక ఇక్కడి కుటుంబాలు అనేకం ఈ పథకం ద్వారానే పక్కా ఇళ్లు పొందాయి. ఇలా ఇంటింటికీ అభివృద్ధిని చేరువ చేయడం ద్వారా మేం తెస్తున్న ప్రగతిశీల మార్పు ఇదే!

మిత్రులారా!

   ద్వంద్వ సారథ్య ప్రభుత్వ పాలనలో నేడు ఛత్తీస్‌గఢ్ వేగంగా రూపాంతరం చెందుతోంది. సుక్మా జిల్లాలోని ఒక ఆరోగ్య కేంద్రం జాతీయ నాణ్యత ధ్రువీకరణ పత్రం పొందడం ఈ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. దంతేవాడలో ఒక ఆరోగ్య కేంద్రం ఏళ్ల తరబడి శిథిలావస్థలో ఉండగా, అక్కడ కార్యకలాపాల పునఃప్రారంభం కొత్త ఆశలు చిగురింపజేసింది. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో శాశ్వత శాంతిసహిత నవశకానికి ఈ చర్యలన్నీ బాటలు వేస్తున్నాయి. నిరుడు డిసెంబర్‌ నాటి నా ‘మన్ కీ బాత్’ కార్యక్రమం సందర్భంగా- ‘బస్తర్ ఒలింపిక్స్’ గురించి నేను ప్రస్తావించాను. వేలాది యువత ఈ కార్యక్రమంలో ఎంత ఉత్సాహంతో పాల్గొన్నారో మీరు వినే ఉంటారు. ఛత్తీస్‌గఢ్‌లో ఆశావహ పరిణామాలకు వారి ఈ భాగస్వామ్యమే సుస్పష్ట నిదర్శనం.

మిత్రులారా!

   ఛత్తీస్‌గఢ్ యువత ఉజ్వల భవితను నేనిప్పుడే చూడగలుగుతున్నాను. రాష్ట్రంలో కొత్త విద్యా విధానం అమలు కావడం ప్రశంసనీయం. దేశవ్యాప్తంగా 12,000కుపైగా అత్యాధునిక ప్రధానమంత్రి శ్రీ (పీఎం శ్రీ) పాఠశాలలు ఏర్పాటయ్యాయి. వాటిలో దాదాపు 350 ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇవన్నీ ఆదర్శ పాఠశాలలుగా పనిచేస్తూ యావత్‌ రాష్ట్ర విద్యా వ్యవస్థను ఉన్నతీకరిస్తాయి. ఏకలవ్య ఆదర్శ పాఠశాలలు ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో అద్భుతంగా ముందంజ వేస్తున్నాయి. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోని అనేక పాఠశాలలు పునఃప్రారంభమై పిల్లలకు కొత్త అభ్యసన అవకాశాలను అందుబాటులోకి తెచ్చాయి. ఛత్తీస్‌గఢ్‌లో విద్యా సమీక్ష కేంద్రం కూడా ప్రారంభమైంది. రాష్ట్ర విద్యా రంగంలో మరో కీలక ఘట్టానికి ఇదొక సూచిక. ఈ కార్యక్రమంతో విద్యానాణ్యత మెరుగుపడటంతోపాటు తరగతి గదుల్లో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కూడా ప్రత్యక్ష తోడ్పాటునిస్తుంది.

మిత్రులారా!

   మీకు మేమిచ్చిన మరో వాగ్దానాన్ని కూడా నెరవేర్చాం. ఆ మేరకు కొత్త జాతీయ విద్యా విధానం కింద వైద్య-ఇంజినీరింగ్ కోర్సులు ఇప్పుడు హిందీలో కూడా ప్రారంభమయ్యాయి. దీనివల్ల గ్రామాలు, వెనుకబడిన నేపథ్యాలు, గిరిజన వర్గాల యువత కలల సాకారానికి ఇకపై భాషపరంగా అవరోధం తొలగిపోతుంది.

మిత్రులారా!

   నా మిత్రుడు శ్రీ రమణ్‌ సింగ్ కొన్నేళ్లపాటు శ్రమించి వేసిన బలమైన పునాదిని ప్రస్తుత ప్రభుత్వం మరింత పటిష్ఠం చేస్తోంది. ఈ దృఢమైన పునాదిపై రాబోయే 25 సంవత్సరాలలో, మనం అత్యద్భుత ప్రగతి సౌధాన్ని నిర్మించాలి. ఛత్తీస్‌గఢ్ వనరులు  సమృద్ధం... ఆకాంక్షభరిత యువతరం, వారి అపార సామర్థ్యం రాష్ట్రానికి ఎనలేని సంపద. ఛత్తీస్‌గఢ్ ఆవిర్భావ స్వర్ణోత్సవాల (50 ఏళ్లు) నాటికి దేశంలోని అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా దీన్ని రూపుదిద్దాలనే మా లక్ష్యాన్ని నిస్సందేహంగా చేరుకుంటాం. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ అభివృద్ధి ఫలాలు చేరేలా చూడటంలో శాయశక్తులా కృషి చేయడంపై నా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాను. కొత్త  సంవత్సరారంభంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపన ద్వారా భవిష్యత్‌ ఆకాంక్షలతో నిండిన ఈ సరికొత్త పయనం మొదలు కావడంపై మీకందరికీ మరోసారి నా హృదయపూర్వక అభినందనలు...

అనేకానేక ధన్యవాదాలు!

గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం మాత్రమే!

 

****


(Release ID: 2117069) Visitor Counter : 9