నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వంద గిగావాట్ల సౌర విద్యుత్తు సామర్థ్యం.. భారత్ సాధించిన చరిత్రాత్మక విజయమిది

ఇక ఇండియా ఇంధన స్వాతంత్య్రం, మరింత హరితమయ భవిష్యత్తు దిశగా ముందుకు సాగుతోంది: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

Posted On: 07 FEB 2025 2:17PM by PIB Hyderabad

 

ఇళ్ల పైకప్పు భాగంలో సౌర శక్తి ఫలకాల ఆధారిత విద్యుత్తు ఉత్పాదన రంగంలో భారత్ 4.59 జీడబ్ల్యూ మేర నూతన స్థాపిత సామర్థ్యాన్ని సాధించి 2024లో అసాధారణ వృద్ధిని నమోదు చేసింది. ఇది 2023తో పోలిస్తే, 53 శాతం ఎక్కువ. ఈ వృద్ధి చోటుచేసుకోవడానికి ముఖ్య కారణం ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్‌లీ యోజన’. ఈ పథకాన్ని కిందటి ఏడాది ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా ప్రస్తుతం 9 లక్షల ఇళ్ల పైకప్పుల మీద సోలార్ ప్యానల్స్‌ను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా చాలా కుటుంబాలు కాలుష్యానికి తావు ఉండని ఇంధన వనరుల వైపునకు మొగ్గు చూపేటట్లుగా ఈ పథకం తోడ్పడింది.

 

సౌర విద్యుత్తు ఉత్పాదనలో కూడా భారత్ చెప్పుకోదగ్గ పురోగతిని సాధించింది. 2014లో మన దేశ సోలార్ మాడ్యూల్ ఉత్పత్తి సామర్ధ్యం 2 గిగావాట్లు (జీడబ్ల్యూ) మాత్రమే. గత పదేళ్లలో, ఇది 60 గిగావాట్లకు ఎగబాకింది. దీంతో సౌర తయారీలో ప్రపంచంలో అగ్రగామి దేశాల సరసన ఇండియా నిలిచింది. విధానపరమైన మద్దతు నిరంతరాయంగా అందుతూ ఉండడంతో, 2030కల్లా 100 జీడబ్ల్యూ సోలార్ మాడ్యూల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అందుకొనే దిశలో దేశం పయనిస్తోంది.

 

మన దేశంలో పునరుత్పాదక ఇంధనాన్ని పెంచడానికి కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి మార్గదర్శకత్వంలో కీలక కార్యక్రమాల్ని నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ (ఎమ్ఎన్ఆర్ఈ) చేపడుతూవస్తోంది. ఈ 100 జీడబ్ల్యూ ఉత్పత్తి ఘనవిజయాన్ని అందుకోవడం రేపటి రోజుల్లో ఇంధన రంగంలో మన దేశాన్ని స్వయంసమృద్ధ దేశంగా తీర్చిదిద్దుతూ పునరుత్పాదక ఇంధన రంగంలో ఓ మహత్తర శక్తి భారత్ అని స్పష్టం చేయడంతోపాటు స్వచ్ఛ, స్థిర, చౌక ఇంధనాన్ని లక్షలాది పౌరులకు అందిస్తోంది కూడా.

 

****


(Release ID: 2100730) Visitor Counter : 29