మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఫిబ్రవరి 10న ఉదయం 11 గం.లకు డీడీ సహా వివిధ వేదికల ద్వారా దేశం నలుమూలలకు చెందిన విద్యార్థులతో ముచ్చటించనున్న ప్రధానమంత్రి

అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 36 మంది విద్యార్థులతో పరీక్షా పే చర్చలో నేరుగా సంభాషించనున్న ప్రధానమంత్రి

పీపీసీ 2025లో మానసిక ఆరోగ్యం నుంచి టెక్నాలజీ వరకు విద్యార్థులకు మార్గనిర్దేశం చేయనున్న భిన్నరంగాలకు చెందిన ప్రముఖులు

దేశవ్యాప్తంగా పాల్గొననున్న 5 కోట్ల మందితో పీపీసీ 2025 సరికొత్త రికార్డు

Posted On: 06 FEB 2025 12:08PM by PIB Hyderabad

ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న పరీక్షా పే చర్చ 2025 (పీపీసీ 2025) కార్యక్రమం ఫిబ్రవరి 10 న ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సంభాషిస్తారు. పరీక్షలకు సన్నద్ధం కావడం, ఒత్తిడిని ఎదుర్కోవడం, వ్యక్తిగత వృద్ధికి సంబంధించిన అంశాలపై తన ఆలోచనలను పంచుకుంటారు.



ఈ ఏడాది రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 36 మంది విద్యార్థులను ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనేందుకు ఎంపిక చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు, సైనిక్ పాఠశాలలు, ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలు, సీబీఎస్ఈ, నవోదయ విద్యాలయాల నుంచి వారిని ఎంపిక చేశారు. వారిలో కొందరు ప్రేరణ పాఠశాల కార్యక్రమం పూర్వ విద్యార్థులు, కళా ఉత్సవ్, వీర్ గాథ విజేతలు సైతం ఉన్నారు. వీరు ప్రధానమంత్రితో ప్రత్యక్షంగా సంభాషిస్తారు. ఈ ఏడాది నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం భారతదేశ వైవిధ్యానికి, సంఘటితత్వానికి ప్రతిరూపంగా నిలవనుంది.

ఈ ఏడాది పీపీసీ 2025 కొత్త రూపును సంతరించుకొంది. దీనిలో భాగంగా ఎనిమిది ధారావాహికలను ప్రసారం చేస్తారు. మొదటి ఎపిసోడ్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సంభాషణను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేలా దూరదర్శన్, స్వయం, స్వయం ప్రభ, పీఎంఓ యూట్యూబ్ ఛానల్, విద్యా మంత్రిత్వ శాఖ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సామాజిక మాధ్యమ ఛానళ్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.

ఇప్పడు పీపీసీ జన చైతన్యం కలిగించే కార్యక్రమంగా మారడంతో చిన్నారుల శారీరక, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను నిపుణుల సాయంతో పరిష్కరిస్తున్నారు. దీని ప్రకారం, పీపీసీ 2025లో ఏడు ధారావాహికల్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ అనుభవాలను, జ్ఞానాన్ని విద్యార్థులతో పంచుకుంటారు. జీవితం, అభ్యాసాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను వారికి వివరిస్తారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనే విద్యార్థులను అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన వివిధ విద్యాసంస్థలు, జాతీయ స్థాయి పాఠశాల పోటీల ద్వారా ఎంపిక చేశారు. ఈ ధారావాహికల్లో ప్రధానంగా దృష్టి సారించే అంశాలు:

క్రీడలు, క్రమశిక్షణ: లక్ష్య నిర్దేశం, నిలకడగా ఉండటం, క్రమశిక్షణ ద్వారా ఒత్తిడిని ఎదుర్కోవడం గురించి ఎంసీ మేరీ కోమ్, అవనీ లేఖరా, సుహాస్ యతిరాజ్ మాట్లాడతారు.

మానసిక ఆరోగ్యం: మానసిక సంక్షేమం, స్వీయ వ్యక్తీకరణ ప్రాధాన్యం గురించి దీపికా పదుకొణే చర్చిస్తారు.

పోషకాహారం: చదువులో రాణించేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నాణ్యమైన నిద్ర ప్రాధాన్యం గురించి సోనాలి సబ్రేవాల్, రుజుతా దివేకర్ వివరిస్తారు. ఫుడ్ ఫార్మర్‌గా ప్రసిద్ధికెక్కిన రేవంత్ హిమత్‌సింగ్కా ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి వివరిస్తారు.

 సాంకేతికత, ఆర్థికం: మెరుగైన విద్యాభ్యాసం, ఆర్థిక అంశాలపై అవగాహనకు టెక్నాలజీ వినియోగాన్ని గౌరవ్ చౌధరి(టెక్నికల్ గురూజి), రాధికా గుప్తా వివరిస్తారు.

సృజనాత్మకత, సానుకూల దృక్పథం: ప్రతికూల ఆలోచనలు విడిచిపెట్టి, సానుకూల మనస్తత్వాన్ని పెంపొందిచుకొనేలా విక్రాంత్ మాసే, భూమి ఫెడ్నేకర్ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపుతారు.

ధ్యానం, మానసిక ప్రశాంతత: విద్యార్థుల్లో మానసిక స్పష్టత, ఏకాగ్రతను పెంచేందుకు ధ్యానానికి సంబంధించిన ఆచరణాత్మక చిట్కాలను సద్గురు పంచుకుంటారు.

విజయగాథలు: యూపీఎస్సీ, ఐఐటీ-జేఈఈ, క్లాట్, సీబీఎస్ఈ, ఎన్‌డీఏ, ఐసీఎస్ఈ తదితర పరీక్షల్లో టాపర్లుగా నిలిచినవారు, గతంలో జరిగిన పీపీసీ కార్యక్రమంలో పాల్గొన్నవారు పరీక్షా పే చర్చ పరీక్షలకు సన్నద్ధమవడంలో వారిని ఎలా ప్రభావితం చేసిందో వివరిస్తారు.

2018లో ప్రారంభమైననాటి నుంచి పరీక్షా పే చర్చ జాతీయ స్థాయి ఉద్యమంగా రూపాంతరం చెందింది. ఈ ఏడాది చేపడుతున్న ఈ కార్యక్రమం గత ఎడిషన్ల రికార్డులు బద్దలు కొడుతోంది. 5 కోట్ల మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొననుండటంతో మరింత ప్రభావవంతంగా మారనుంది.

అన్ని నేపథ్యాలకు చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా విద్యా మంత్రిత్వశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. యువ మేధను ప్రోత్సహించి, చదువులో విజయం, వ్యక్తిగతంగా వృద్ధి సాధించే పరివర్తనాత్మక కార్యక్రమంగా పరీక్షా పే చర్చను మార్చింది.

తాజా సమాచారం, కార్యక్రమ వివరాలు, ప్రత్యేక సమాచారం కోసం విద్యా మంత్రిత్వ శాఖ, సమాచార, ప్రసార శాఖ సామాజిక మాధ్యమ ఖాతాలను అనుసరించండి.


 

*****

 


(Release ID: 2100592) Visitor Counter : 49