ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పారిశ్రామిక వస్తువులపై 7 కస్టమ్స్ సుంకం రేట్ల తొలగింపుపై కేంద్ర బడ్జెట్ 2025-26 ప్రతిపాదన


కేన్సర్‌ సహా అరుదైన ప్రాణాంతక వ్యాధులకు వాడే 36 రకాల మందులు ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుంచి మినహాయింపు;

విద్యుత్‌ రవాణా పెంపు: విద్యుత్‌ వాహన బ్యాటరీల తయారీ దిశగా 35 అదనపు మూలధన వస్తువులపై ప్రాథమిక కస్టమ్స్‌ సుంకం మినహాయింపు;

ఎగుమతులకు ప్రోత్సాహం... వాణిజ్య సౌలభ్య కల్పన... సామాన్యులకు ఉపశమనం సహా దేశీయ తయారీ రంగం-విలువ జోడింపునకు మద్దతు;

Posted On: 01 FEB 2025 12:55PM by PIB Hyderabad

   దేశంలో సుంకాల స్వరూపం హేతుబద్ధీకరణ, సుంకం విధింపులో విలోమ వ్యత్యాసాల పరిష్కారానికి ప్రతిపాదించినట్లు కేంద్ర ఆర్థిక-కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌ ఇవాళ పార్లమెంటులో సమర్పించిన 2025-26 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు. అలాగే దేశీయ తయారీ రంగంతోపాటు విలువ జోడింపునకు మద్దతు సహా ఎగుమతులకు ప్రోత్సాహం, వాణిజ్య సౌలభ్య కల్పన, సామాన్య ప్రజలకు ఉపశమనాన్ని కూడా దృష్టిలో ఉంచుకున్నట్లు తెలిపారు.

   గత సంవత్సరం (2024) జూలై నెల నాటి బడ్జెట్‌లో కస్టమ్స్ సుంకాల స్వరూపంపై సమీక్షకు ఇచ్చిన హామీకి అనుగుణంగా అప్పట్లో తొలగించిన 7 కస్టమ్స్‌ సుంకం రేట్లకు అదనంగా ఇప్పుడు పారిశ్రామిక వస్తువుల కోసం 7 సుంకం రేట్లను తొలగించాలని ప్రతిపాదించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇకపై ‘సున్నా’ రేటు సహా 8 సుంకం రేట్లు మాత్రమే మిగిలి ఉంటాయన్నారు. అంతేకాకుండా ఒకటికన్నా ఎక్కువ సెస్ లేదా సర్‌ఛార్జ్ విధించరాదని కూడా ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు. దీనివల్ల సెస్‌ పరిధిలోగల 82 టారిఫ్ లైన్లపై సామాజిక  సంక్షేమ సర్‌ఛార్జ్‌కీ మినహాయింపు వర్తిస్తుంది.


 

 

మందులు/ఔషధాలపై దిగుమతిపై ఉపశమనం

   వివిధ రంగాలవారీ బడ్జెట్‌ ప్రతిపాదనలలో ప్రాణాంతక, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల పీడితులకు భారీ ఉపశమనం లభించింది. ఈ మేరకు 36 ప్రాణరక్షక మందులను ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుంచి పూర్తిగా మినహాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇందులో భాగంగా 5 శాతం రాయితీగల కస్టమ్స్ సుంకం జాబితాలోని 6 ప్రాణరక్షక ఔషధాలను కూడా చేర్చాలని బడ్జెట్‌ ప్రతిపాదించింది. అలాగే పైన పేర్కొన్న వాటి తయారీకి ఉపయోగించే బల్క్ ఔషధాలపైనా పూర్తి మినహాయింపు, సుంకంలో రాయితీ కూడా వర్తిస్తాయి.

   వివిధ కంపెనీలు నిర్వహించే రోగి సహాయక కార్యక్రమాల కింద నిర్దిష్ట మందుల, ఔషధాలను ఉచితంగా పంపిణీ చేసే పక్షంలో వాటికి ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుంచి పూర్తిగా మినహాయింపు లభిస్తుంది. ఈ జాబితాలో 13 కొత్త రోగి సహాయక కార్యక్రమాలు సహా 37 మందులను కూడా జోడిస్తున్నట్లు బడ్జెట్ ప్రకటించింది.

 

 


దేశీయ తయారీ రంగం-విలువ జోడింపులకు మద్దతు

   విద్యుత్‌ వాహన బ్యాటరీల తయారీకి వాడే 35 అదనపు మూలధన వస్తువులు సహా మొబైల్‌ ఫోన్‌ బ్యాటరీల తయారీకి వాడే మరో 28 మూలధన వస్తువులను మినహాయింపు జాబితాలో చేర్చాలని బడ్జెట్‌ ప్రతిపాదించింది. “దీనివల్ల మొబైల్ ఫోన్లు, విద్యుత్‌ వాహనాల లిథియం-అయాన్ బ్యాటరీల దేశీయ తయారీ ఇనుమడిస్తుంది” అని ఆర్థికశాఖ మంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు.

   కోబాల్ట్ పౌడర్, వ్యర్థాలపై, లిథియం-అయాన్ బ్యాటరీ తుక్కు, సీసం, జింక్ సహా మరో 12 కీలక ఖనిజాలపైనా ప్రాథమిక కస్టమ్స్ సుంకం (బిసిడి) పూర్తి మినహాయింపును బడ్జెట్ ప్రకటించింది. తద్వారా తయారీ రంగానికి వాటి లభ్యత పెరగడంతోపాటు మన యువతరానికి మరిన్ని ఉద్యోగావకాశాలు అందివస్తాయని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. జూలై 2024 నాటి బడ్జెట్‌లో ‘బిసిడి’ నుంచి పూర్తి మినహాయింపు ప్రకటించిన 25 కీలక ఖనిజాలకు ఇవి  అదనమని వివరించారు
.
   ‘ఆగ్రో, మెడికల్, జియో టెక్స్‌టైల్స్’ వంటి సాంకేతిక వస్త్ర ఉత్పత్తులను పోటీపడదగిన ధరలతో దేశీయంగా తయారు చేయడాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో సుంకం నుంచి పూర్తి మినహాయింపు పొందిన వస్త్ర యంత్రాల జాబితాలో మరో రెండు రకాల ‘షటిల్-లెస్ లూమ్‌’ (కండెలు లేని మగ్గం)లను జోడించాలని బడ్జెట్ ప్రతిపాదించింది. “తొమ్మిది టారిఫ్ లైన్ల పరిధిలోకి వచ్చే అల్లిక వస్త్రాలపై ‘బిసిడి’ రేటును 10 శాతం లేదా 20 శాతం నుండి 20 శాతం లేదా కిలోకు రూ.115, ఏది ఎక్కువైతే ఆ స్థాయికి” సవరించడాన్ని బడ్జెట్‌లో ప్రతిపాదిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో వెల్లడించారు.

   ‘మేక్ ఇన్ ఇండియా’ విధానం మేరకు ‘ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లే (ఐఎఫ్‌పిడి)పై ‘బిసిడి’ 10 శాతం నుంచి 20 శాతానికి పెంచడంతోపాటు ‘ఓపెన్ సెల్’ ఇతర భాగాలపై 5 శాతానికి తగ్గింపును బడ్జెట్ ప్రతిపాదించింది. దీనివల్ల సుంకం స్వరూపంలో విలోమ వ్యత్యాసాన్ని సరిదిద్దే వీలుంటుందని మంత్రి తెలిపారు.

   నౌకా నిర్మాణం సుదీర్ఘ కాలం పడుతుంది కాబట్టి- ముడి పదార్థాలు, విడి భాగాలు, వినియోగ వస్తువులు లేదా ఓడల తయారీ సంబంధిత భాగాలపై ‘బిసిడి’ మినహాయింపును మరో పదేళ్లు కొనసాగించాలని బడ్జెట్ ప్రతిపాదించింది. దీంతోపాటు పాత ఓడల విచ్ఛిన్నం (షిప్‌ బ్రేకింగ్‌) పరిశ్రమలో మరింత పోటీతత్వం నింపే దిశగా ఈ మినహాయింపును దానికీ వర్తింపజేయాలని పేర్కొంది.

   క్యారియర్ గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్‌లపై ‘బిసిడి’ని 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలని కూడా బడ్జెట్ ప్రతిపాదించింది. దీంతో అవి నాన్-క్యారియర్ గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్‌లతో సమాన స్థాయికి చేరుతాయి కాబట్టి, వర్గీకరణలో వివాదాలకు తావుండదని ఆర్థికశాఖ మంత్రి చెప్పారు.

ఎగుమతులకు ప్రోత్సాహం

   ఎగుమతులను ప్రోత్సహించే దిశగానూ బడ్జెట్‌ కొన్ని పన్ను ప్రతిపాదనలు చేసింది. ఈ మేరకు హస్తకళా ఉత్పత్తుల ఎగుమతికి మరింత సౌలభ్యం కల్పిస్తూ అందుకు అనుమతించే గడువును 6 నెలల నుంచి ఏడాదికి పెంచింది. అవసరమైతే దీన్ని మరో మూడు నెలలు పొడిగించేందుకూ వెసులుబాటు కల్పించింది. మరోవైపు సుంకం రహిత ముడి పదార్థాలు పొందే జాబితాలో మరో 9 హస్తకళా ఉత్పత్తులను చేరుస్తున్నట్లు ప్రకటించింది.

   చర్మశుద్ధి పరిశ్రమలో చిన్న సంస్థలకు ఎగుమతుల సౌలభ్యం దిశగా ‘క్రస్ట్‌ లెదర్‌’ను 20 శాతం ఎగుమతి సుంకం నుంచి మినహాయించాలని బడ్జెట్ ప్రతిపాదించింది. అయితే, దేశీయ తయారీ, విలువ జోడింపును ప్రోత్సహించేలా, ఉపాధి సృష్టికి వీలుగా ‘వెట్‌ బ్లూ లెదర్‌’ దిగుమతిపై ‘బిసిడి’ని పూర్తిగా మినహాయిస్తున్నట్లు ప్రకటించింది.

   అంతర్జాతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల మార్కెట్లో భారత్‌ పోటీతత్వం పెంపు లక్ష్యంగా  వాటి అనలాగ్ ఉత్పత్తుల తయారీలో వాడే ఘనీభవించిన ఫిష్ పేస్ట్ (సురిమి)పై ‘బిసిడి’ని 30 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించింది. అలాగే చేపలు-రొయ్యల మేత తయారీకి చేపల హైడ్రోలైజేట్ మీద ‘బిసిడి’ని 15 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ కూడా ప్రకటించింది.

   విమానాలు, నౌకల కోసం దేశీయ ‘ఎంఆర్‌ఒ’ల ఏర్పాటును ప్రోత్సహించే దిశగా 2024 జూలై నాటి బడ్జెట్లో మరమ్మతుల కోసం దిగుమతి చేసుకునే విదేశీ మూల వస్తువుల ఎగుమతికి కాల పరిమితిని ప్రభుత్వం పొడిగించింది. దీనికి అనుగుణంగా వ్యవధిని తాజా బడ్జెట్‌లో 6 నెలల నుంచి ఏడాది వరకు, అవసరమైతే మరో ఏడాది పాటు పొడిగించే వెసులుబాటు కూడా కల్పించింది. మరోవైపు రైల్వే వస్తువుల కోసం అదే విధానాన్ని వర్తింజేయాలని 2025-26 బడ్జెట్‌ ప్రతిపాదించింది.

వాణిజ్య సదుపాయం-వ్యాపార సౌలభ్యం

   అనిశ్చితి, వాణిజ్య వ్యయంపై తాత్కాలిక మదింపు ఖరారుకు ప్రస్తుతం అమలులోగల కస్టమ్స్‌ చట్టం-1962 ఎలాంటి కాలపరిమితి నిర్ణయించలేదు. ఈ నేపథ్యంలో వాణిజ్య సౌలభ్యాన్ని పోత్సహించే దిశగా రెండేళ్ల కాలపరిమితి ఇవ్వాలని ప్రస్తుత బడ్జెట్‌ ప్రతిపాదించింది. అంతేగాక తాత్కాలిక మదింపు ఖరారును ఈ కాల పరిమితికి మించి మరో ఏడాది కూడా పొడిగించే వెసులుబాటు కల్పించింది.

   వస్తువులకు అనుమతులు లభించాక ఎగుమతి/దిగుమతిదారులు ఎలాంటి జరిమానా, లేదా వడ్డీతో సుంకాల చెల్లింపు వంటివి లేకుండా స్వచ్ఛందంగా భౌతిక వాస్తవాలను ప్రకటించే వీలు కల్పిస్తూ కొత్త నిబంధన చేర్చాలని బడ్జెట్‌ ప్రతిపాదించింది. తద్వారా “స్వచ్ఛందంగా నిబంధనల అనుసరణకు వారు మొగ్గుచూపుతారు. అయితే, సంబంధిత ప్రభుత్వ విభాగం అప్పటికే ఆడిట్ లేదా దర్యాప్తు చర్యలు చేపట్టిన సందర్భాల్లో ఇది వర్తించదు” అని శ్రీమతి సీతారామన్ స్పష్టం చేశారు.

   దిగుమతి చేసుకున్న ముడి పదార్థాల అంతిమ వినియోగంపై ప్రస్తుత 6 నెలల గడువును ఏడాది వరకూ పెంచుతూ నిబంధనల సవరణకు బడ్జెట్‌ ప్రతిపాదించింది. దీనివల్ల పరిశ్రమలు తమ దిగుమతుల సద్వినియోగానికి మెరుగైన ప్రణాళిక రూపొందించుకునే వీలు కలుగుతుంది. దీంతోపాటు సరఫరాలో అనిశ్చితి, వ్యయం దృష్ట్యా కార్యకలాపాలు సరళంగా సాగే వీలుంటుంది. అలాగే ఇలాంటి దిగుమతిదారులు ఇప్పుడు నెలవారీగా కాకుండా మూడు నెలలకు ఒకసారి నివేదికలు దాఖలు చేస్తే సరిపోతుంది.

 

***


(Release ID: 2098809) Visitor Counter : 12