ఆర్థిక మంత్రిత్వ శాఖ
సుపరిపాలన సాధన కోసం 2025-26 కేంద్ర బడ్జెట్లో పలు ప్రత్యక్ష పన్ను సంస్కరణల ప్రతిపాదన
Posted On:
01 FEB 2025 12:53PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో 2025-26 కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా పలు ప్రత్యక్ష పన్నుల సంస్కరణలను ఈ బడ్జెట్ లో ప్రతిపాదించారు.
ప్రత్యక్ష పన్ను ప్రతిపాదనల ఉద్దేశాలు ఈ కింది విధంగా ఉన్నాయి:మధ్యతరగతిపై ప్రత్యేక దృష్టితో వ్యక్తిగత ఆదాయ పన్ను సంస్కరణలు: కొత్త విధానంలో మొత్తం ఆదాయం రూ.12 లక్షల వరకు (అంటే పెట్టుబడి లాభాలు వంటి ప్రత్యేక రేటు ఆదాయం మినహా నెలకు రూ.లక్ష సగటు ఆదాయం) ఆదాయపు పన్ను ఉండదు. రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్ కలిపితే వేతన పన్ను చెల్లింపుదారులకు ఈ పరిమితి రూ.12.75 లక్షలు అవుతుంది.
ఇబ్బందులను తగ్గించడానికి టిడిఎస్ / టిసిఎస్ హేతుబద్ధీకరణ: సీనియర్ సిటిజన్లకు వడ్డీపై పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతమున్న రూ .50,000 నుండి రెట్టింపు అంటే రూ.లక్ష కు పెంచాలని ప్రతిపాదించారు. అదేవిధంగా అద్దె ఆదాయంపై టీడీఎస్ వార్షిక పరిమితి రూ.2.40 లక్షలను రూ.6 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు. ఇది టిడిఎస్ వర్తించే లావాదేవీల సంఖ్యను తగ్గిస్తుంది, తద్వారా చిన్న చెల్లింపులు పొందే చిన్న పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుతుంది. అధిక టీడీఎస్ తగ్గింపు నిబంధనలు ఇకపై పాన్ లేని కేసులకు మాత్రమే వర్తిస్తాయి. సరళీకరించిన ఆర్ బి ఐ చెల్లింపుల పథకం (ఎల్ఆర్ఎస్) కింద చెల్లింపులపై వసూలు చేసే ట్యాక్స్ ఎట్ సోర్స్ (టీసీఎస్) రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు. అలాగే, టి సి ఎస్ చెల్లింపు లో ఆలస్యం జరిగితే అప్పటి వరకు స్టేట్‌మెంట్ దాఖలు చేసే తేదీ వరకు ఆ జాప్యాన్ని నేరరహితంగా పరిగణించాలని ప్రతిపాదించారు.
స్వచ్ఛంద చెల్లింపును ప్రోత్సహించడం: ఏదైనా మదింపు సంవత్సరానికి నవీకరించిన ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి కాలపరిమితిని ప్రస్తుత రెండు సంవత్సరాల నుండి నాలుగు సంవత్సరాలకు పొడిగించాలని ప్రతిపాదించారు. క్రిప్టో అసెట్ లావాదేవీకి సంబంధించిన సమాచారాన్ని తప్పనిసరిగా సమర్పించేలా చట్టంలో సవరణలు తీసుకురావాలని ప్రతిపాదించారు. వర్చువల్ డిజిటల్ అసెట్ నిర్వచనాన్ని కూడా ఈ మార్పులతో అనుగుణంగా సర్దుబాటు చేస్తారు.
షరతుల భారాన్ని తగ్గించడం: చిన్న చారిటబుల్ ట్రస్టులు / సంస్థలకు వాటి రిజిస్ట్రేషన్ వ్యవధిని 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలకు పెంచడం ద్వారా షరతుల భారాన్ని తగ్గించే ప్రతిపాదన. అంతేకాక, ఎటువంటి షరతులు లేకుండా, రెండు సొంత ఆస్తుల వార్షిక విలువను సున్నాగా క్లెయిమ్ చేసుకునే ప్రయోజనాన్ని అనుమతించే ప్రతిపాదన. యాభై లక్షల కంటే ఎక్కువ విలువ చేసే నిర్దిష్ట వస్తువుల అమ్మకంపై మూలం వద్ద పన్ను వసూలు చేయరాదని బడ్జెట్ ప్రతిపాదించింది.
సులభ వ్యాపారం: అంతర్జాతీయ లావాదేవీల ధరను మూడు సంవత్సరాల కాలానికి నిర్ణయించడానికి, బదిలీ ధరల ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి, ప్రపంచ ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా వార్షిక తనిఖీకి ప్రత్యామ్నాయాన్ని అందించడానికి ఈ పథకాన్ని ఉద్దేశించారు.లిటిగేషన్ తగ్గించడానికి,అంతర్జాతీయ పన్నులలో కచ్చితత్వాన్ని అందించడానికి, సురక్షిత నిబంధనల పరిధిని విస్తరిస్తున్నారు. నాన్ రెసిడెంట్ సెక్యూరిటీల బదిలీపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను రేట్లలో ఏకరూపతను ప్రతిపాదించారు. జాతీయ పొదుపు పథకం (ఎన్ ఎస్ ఎస్ ) ఖాతాల నుంచి వ్యక్తులు 2024 ఆగస్టు 29 లేదా ఆ తర్వాత తీసుకునే మొత్తాలకు పన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఎన్ పి ఎస్ వాత్సల్య ఖాతాలకు కూడా ఇదే విధమైన మినహాయింపును వర్తింప చేస్తారు. అయితే అది మొత్తం పరిమితుల పరిధిలో ఉండాలని పేర్కొన్నారు.
ఉపాధి - పెట్టుబడి:
ఎ. ఎలక్ట్రానిక్ తయారీ పథకాల కోసం పన్ను నిర్ధారితత్వం: భారతదేశంలో ఎలక్ట్రానిక్ తయారీ యూనిట్‌ను స్థాపిస్తున్న లేదా నిర్వహిస్తున్న రెసిడెంట్ కంపెనీకి సేవలు అందించే ప్రవాసుల (నాన్-రెసిడెంట్స్) కోసం ప్రత్యేక పన్ను విధానం (ప్రిసంప్టివ్ టాక్సేషన్ రిజీమ్) అందించాలని ప్రతిపాదించారు. అంతేకాకుండా, నిర్దిష్ట ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్లకు సరఫరా చేయడానికి విడిభాగాలను నిల్వ చేసే వారికి పన్ను హామీ కోసం సురక్షిత వ్యవస్థను ప్రవేశపెడతారు.
బి.ఇన్ ల్యాండ్ వెసెల్స్ కోసం టన్నేజ్ ట్యాక్స్ స్కీమ్: దేశంలో అంతర్గత జల రవాణాను ప్రోత్సహించడానికి ఇండియన్ వెసెల్స్ యాక్ట్, 2021 కింద రిజిస్టర్ అయిన అంతర్గత నౌకలకు ప్రస్తుత టన్నేజ్ ట్యాక్స్ స్కీమ్ ప్రయోజనాలను విస్తరించాలని ప్రతిపాదించారు.
సి.స్టార్టప్ ల చేరిక గడువు పొడిగింపు: భారతీయ స్టార్టప్ వ్యవస్థకు మద్దతుగా, చేరిక (ఇన్కార్పొరేట్) వ్యవధిని 5 సంవత్సరాలు పొడిగించాలని, 01.04.2030 కంటే ముందు చేర్చిన స్టార్టప్ లకు అందుబాటులో ఉన్న ప్రయోజనాన్ని అనుమతించాలని ప్రతిపాదించారు.
డి.అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం (ఐఎఫ్ఎస్సీ): ఐఎఫ్ఎస్సీలో అదనపు వ్యాపార కార్యకలాపాలను ప్రోత్సహించడం, ఆకర్షించడం కోసం, షిప్-లీజింగ్ యూనిట్లు, ఇన్సూరెన్స్ కార్యాలయాలు, గ్లోబల్ కంపెనీల ట్రెజరీ సెంటర్లకు ప్రత్యేక ప్రయోజనాలను అందించడానికి బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేశారు. ఐఎఫ్ఎస్సీలో వ్యాపారం ప్రారంభించి ప్రయోజనాలను పొందడానికి తుది గడువును 5 సంవత్సరాలు అంటే 31.03.2030 వరకు పొడిగించారు.
ఇ.ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి: (ఏఐఎఫ్): మౌలిక సదుపాయాలు, ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టే కేటగిరీ-1, కేటగిరీ-2 ఏఐఎఫ్ లకు సెక్యూరిటీల ద్వారా వచ్చే లాభాలపై పన్ను మినహాయించాలని ప్రతిపాదించారు.
ఎఫ్.సార్వభౌమ (సావరిన్) ,పెన్షన్ ఫండ్స్ కోసం పెట్టుబడి తేదీ పొడిగింపు: మౌలిక సదుపాయాల రంగానికి సావరిన్ వెల్త్ ఫండ్స్ , పెన్షన్ ఫండ్స్ నుండి నిధులను ప్రోత్సహించడానికి పెట్టుబడి పెట్టే తేదీని మరో ఐదేళ్లు, 31.03.2030 వరకు పొడిగించారు.
ఈ ప్రతిపాదిత మార్పుల ఫలితంగా, సుమారు రూ. 1 లక్ష కోట్ల ప్రత్యక్ష పన్ను ఆదాయం ప్రభుత్వం వదులుకోనుందని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగిస్తూ వెల్లడించారు.
*****
(Release ID: 2098781)
Visitor Counter : 55
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Nepali
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam