ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రాబోయే ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో 50వేల అటల్ టింకరింగ్‌ ల్యాబ్‌లు


డిజిటల్ రూపంలో భారతీయ భాషా పుస్తకాల సౌలభ్యం కోసం ‘భారతీయ భాషా పుస్తక’ పథకం;

ప్రైవేట్ రంగ సారథ్యంలో పరిశోధన-అభివృద్ధి-ఆవిష్కరణల అమలుకు రూ.20వేల కోట్లు;

‘పిఎం రీసెర్చ్‌ ఫెలోషిప్ స్కీమ్‌’ కింద ఐఐటీలు.. ‘ఐఐఎస్‌సి’లలో సాంకేతిక పరిశోధనల కోసం 10,000 పరిశోధక సభ్యత్వాలు;

“మేక్‌ ఫర్‌ ఇండియా... మేక్‌ ఫర్‌ ది వరల్డ్‌’’ తయారీ రంగం కోసం నిపుణ యువతను సన్నద్ధం చేసే దిశగా 5 జాతీయ అత్యున్నత నైపుణ్య కేంద్రాలు;

విద్యారంగం కోసం రూ.500 కోట్లతో కృత్రిమ మేధ అత్యున్నత నైపుణ్య కేంద్రం

Posted On: 01 FEB 2025 1:09PM by PIB Hyderabad

   ఆవిష్కరణలకు ఊతమిచ్చే వివిధ చర్యలను ఈ రోజు పార్లమెంటులో 2025-26 బడ్జెట్‌ సందర్భంగా కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు.


   భవిష్యత్తరంలో విద్యార్థి దశనుంచే ఆవిష్కరణాసక్తి పెంపు, ఉత్సుకతకు స్ఫూర్తి లక్ష్యంగా దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో రాబోయే ఐదేళ్లలో 50 వేల అటల్‌ టింకరింగ్‌ లేబొరేటరీలను ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. అలాగే ‘భారత్‌నెట్’ ప్రాజెక్ట్ కింద గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బ్రాడ్‌బ్యాండ్ సంధానం కల్పించాలని కూడా కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించింది.


   ఉన్నత విద్యకు సంబంధించిన గణాంకాలను వివరిస్తూ గత పదేళ్లలో దేశంలోని 23 ఐఐటీలలో విద్యార్థుల సంఖ్య 65,000 నుంచి 1.35 లక్షలకు... అంటే- 100 శాతం పెరిగిందని 2025-26 కేంద్ర బడ్జెట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో 2014 తర్వాత ప్రారంభమైన 5 ఐఐటీలలో మరో 6,500 మంది విద్యార్థులకు విద్యనందించేలా అదనపు మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా పాట్నా నగరంలోని ఐఐటీలో హాస్టల్ సహా ఇతర మౌలిక సదుపాయాలను విస్తరించనున్నట్లు వెల్లడించింది.


   విద్యార్థులు పాఠ్యాంశాలను క్షుణ్నంగా అర్థం చేసుకునేందుకు వీలు కల్పించేలా పాఠశాల,  ఉన్నత విద్య స్థాయిలో భారతీయ భాషా పుస్తకాలను డిజిటల్ రూపంలో అందిస్తామని శ్రీమతి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ మేరకు ‘భారతీయ భాషా పుస్తక పథకం’ అమలు చేస్తామని ప్రకటించారు.


   “మేక్ ఫర్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్” కార్యక్రమాల కింద తయారీ రంగం కోసం తగిన నైపుణ్యంగల యువశక్తిని సన్నద్ధం చేయడం కోసం ఐదు జాతీయ అత్యున్నత నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయి నైపుణ్య సంస్థల భాగస్వామ్యంతో ఇవి ఏర్పాటవుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. పాఠ్యాంశాల రూపకల్పన, శిక్షకులకు శిక్షణ, నైపుణ్యాల ధ్రువీకరణ చట్రం, క్రమబద్ధ సమీక్ష తదితర కార్యకలాపాలను ఈ భాగస్వామ్య సంస్థలు నిర్వహిస్తాయని తెలిపారు.


   అలాగే విద్యారంగం కోసం రూ.500 కోట్లతో కృత్రిమ మేధ అత్యున్నత నైపుణ్య కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ప్రకటించింది.

 


   ప్రైవేట్ రంగ సారథ్యంలో పరిశోధన-అభివృద్ధి-ఆవిష్కరణల అమలుకు రూ.20వేల కోట్లు కేటాయిస్తున్న‌ట్లు శ్రీమతి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ సమర్పణ సందర్భంగా ప్రక‌టించారు. అంతేకాకుండా ‘పిఎం రీసెర్చ్ ఫెలోషిప్ స్కీమ్’ కింద ఐఐటీలు, ‘ఐఐఎస్‌సి’లలో సాంకేతిక పరిశోధనల కోసం ఆర్థిక సాయాన్ని మ‌రింత పెంచుతూ 10,000 పరిశోధక సభ్యత్వాలు క‌ల్పిస్తామ‌ని వెల్ల‌డించారు.

 

***


(Release ID: 2098724) Visitor Counter : 42