ఆర్థిక మంత్రిత్వ శాఖ
పారిశ్రామిక రంగం: వాణిజ్య సంస్కరణల రూపురేఖలు
విద్యుత్, నిర్మాణ రంగాల్లో భారీ వృద్ధితో ఆర్థిక సంవత్సరం 2025లో పారిశ్రామిక రంగం 6.2 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా: ఆర్థిక సర్వే 2024-25
వృద్ధి చోదకాలుగా ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా వంటి వినియోగదారు కేంద్రీకృత రంగాలు
గృహ నిర్మాణం, పట్టణ - గ్రామీణ మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ కార్యక్రమాలతో ఉక్కు పరిశ్రమకు పెరుగుతున్న డిమాండ్
ఎలక్ట్రానిక్ వస్తువుల దేశీయ ఉత్పత్తితో ఆర్థిక సంవత్సరం 2015 నుంచి 2024 వరకు 17.5 శాతంగా గణనీయమైన సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు
15 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటుతో వేగంగా ముందుకుపోతున్న వైద్య పరికరాల పరిశ్రమ
ఆధునిక తయారీని, పరిశ్రమ 4.0ను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. ఆధునిక నూతన తయారీ- సత్వర పరిర్తన నిలయాల (సమర్థ్) ఉద్యోగ్ కేంద్రాల ఏర్పాటుకు బాసట
పేటెంట్ నమోదుల్లో అంతర్జాతీయంగా 10 అగ్రగామి దేశాల్లో ఆరో ర్యాంకులో భారత్
Posted On:
31 JAN 2025 2:07PM by PIB Hyderabad
జీడీపీ తొలి ముందస్తు అంచనాల ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక రంగం 6.2 శాతం వృద్ధి సాధిస్తుందని ఆర్థిక సర్వే 2024-25 అంచనా వేసింది. విద్యుత్, నిర్మాణ రంగాలు భారీ వృద్ధితో పారిశ్రామిక రంగానికి చోదకాలుగా నిలుస్తాయని పేర్కొన్నది. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంటులో భారత ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. పరిశోధన - అభివృద్ధిలో పెట్టుబడులు, ఆవిష్కరణలను పెంపొందిస్తూ.. వృద్ధిని మెరుగుపరచడంతోపాటు చిన్న తయారీదారులను ప్రధాన స్రవంతిలో భాగం చేయడం వివిధ రంగాల్లో వృద్ధికి చోదకంగా నిలుస్తుందని ఆర్థిక సర్వే వెల్లడించింది.
ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా వంటి వినియోగదారు కేంద్రీకృత రంగాలు వృద్ధికి చోదకాలుగా నిలిచాయని కూడా సర్వే పేర్కొన్నది. భారీ ఆర్థిక వ్యవస్థలుగా భారత్, చైనా ఎదుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా తయారీ రంగంలో 2.8 శాతం వాటాతో... ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పారిశ్రామిక వైవిధ్యం నుంచి భారత్ గణనీయమైన లబ్ధిని పొందవచ్చని ఆర్థిక సర్వే ఆశాభావం వ్యక్తం చేసింది.
ప్రధాన ఉత్పాదక పరిశ్రమలు
-
సిమెంటు
చైనా తర్వాత భారత్ రెండో అతిపెద్ద సిమెంటు ఉత్పత్తిదారుగా ఉందని సర్వే పేర్కొన్నది. హైవేలు, రైల్వేలు, గృహ నిర్మాణ పథకాలతోపాటు గ్రామీణాభివృద్ధి, పారిశ్రామిక వృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించడం సిమెంటుకు డిమాండ్ ను గణనీయంగా పెంచుతుందని సర్వే అంచనా వేసింది.
-
ఉక్కు పరిశ్రమ
2025 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - నవంబర్ లో దేశ ముడి ఉక్కు ఉత్పత్తిలో 3.3 శాతం, తయారైన ఉక్కు ఉత్పత్తిలో 4.6 శాతం వృద్ధి నమోదైందని సర్వే వెల్లడించింది. కొనసాగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులు, ప్రజా మౌలిక సదుపాయాలపై పెరుగుతున్న వ్యయం మొదలైనవన్నీ ఉక్కు రంగంలో నిరంతర వృద్ధిని ప్రేరేపిస్తున్నాయి. గృహ నిర్మాణం, పట్టణ - గ్రామీణ మౌలిక సదుపాయాలకు సంబంధించి ప్రభుత్వ కార్యక్రమాలు ఈ రంగంలో డిమాండ్ పెరగడానికి దోహదపడుతున్నాయని కూడా సర్వే తెలిపింది.
-
మూలధన వస్తువులు (క్యాపిటల్ గూడ్స్)
ఆధునిక తయారీని, పరిశ్రమ 4.0ను ప్రభుత్వం క్రియాశీలకంగా ప్రోత్సహిస్తోంది. తద్వారా, నవోన్మేష ఆధునిక తయారీ- సత్వర పరివర్తన నిలయాలు (సమర్థ్)గా ఉద్యోగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి తోడ్పాటు అందిస్తోంది.
-
ఆటోమొబైల్ పరిశ్రమ
2024 ఆర్థిక సంవత్సరంలో ఆటోమొబైల్ పరిశ్రమ దేశీయ విక్రయాల్లో 12.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ రంగంలో వృద్ధికి గల అవకాశాలను గుర్తించిన ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని ఏడాది పాటు పొడిగించింది.
-
ఎలక్ట్రానిక్ పరిశ్రమ
ఎలక్ట్రానిక్ వస్తువుల దేశీయ ఉత్పత్తి 17.5 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటుతో.. 2015 ఆర్థిక సంవత్సరంలో రూ.1.90 లక్షల కోట్ల నుంచి 2024 ఆర్థిక సంవత్సరంలో 9.52 లక్షల కోట్లకు గణనీయంగా పెరిగిందని ఆర్థిక సర్వే పేర్కొన్నది. మౌలిక సదుపాయాల అభివృద్ది, సులభతర వాణిజ్యంతో పాటు మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలు.. వివిధ ప్రోత్సాహకాలు దేశీయ తయారీకి ఊతమిచ్చి విదేశీ పెట్టుబడులను ఆకర్షించిందని సర్వే పేర్కొన్నది.
-
వస్త్ర పరిశ్రమ
ఉపాధి కల్పనలో వస్త్ర పరిశ్రమ ప్రధాన పాత్ర పోషిస్తుందని, భారత తయారీ జీవీఏలో దీని వాటా దాదాపు 11 శాతంగా ఉందని ఆర్థిక సర్వే పేర్కొన్నది. జనపనార ప్రధాన ఉత్పత్తిదారుల్లో ఒకటిగా ఉన్న భారత్.. పత్తి, పట్టు, తయారు చేసిన ఫైబర్ ఉత్పత్తుల్లో ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో ఉందని తెలిపింది.
-
ఫార్మా రంగం
పరిమాణం పరంగా భారత ఫార్మా పరిశ్రమ ప్రపంచంలో మూడో స్థానంలో ఉందని సర్వే తెలిపింది. జనరిక్ ఔషధాలు, క్రియాశీల ఔషధ పదార్థాలు (బల్క్ డ్రగ్స్), ప్రిస్కిప్షన్ లేకుండా కొనుగోలు చేయగల (ఓటీసీ) మందులు, టీకాలు, ఏకరూప జీవాధార ఔషధాలు (బయోసిమిలర్లు), జీవాధార ఔషధాల (బయోలాజిక్స్)తో వివిధ రకాల ఉత్పత్తులను ఈ పరిశ్రమ అందిస్తోంది. తద్వారా అంతర్జాతీయ స్థాయిని అందుకుంటోంది. ఫార్మా రంగంలో వార్షిక టర్నోవర్ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 4.17 లక్షల కోట్లుగా ఉందని, గత ఐదేళ్లుగా 10.1 శాతం సగటు వృద్ధిని నమోదు చేస్తోందని కూడా సర్వే తెలిపింది. అంతేకాకుండా 15 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటుతో వైద్య పరికరాల తయారీ రంగం కూడా దేశంలో వేగంగా పురోగమిస్తోందని సర్వే పేర్కొన్నది.
పరిశోధన – అభివృద్ధి ఆకాంక్షల నడుమ ఆశాజనకంగా ఆవిష్కరణలు
భారత్ లో మేధో సంపత్తి హక్కుల రక్షణకు సంబంధించి బలమైన వ్యవస్థ ఉందని ఆర్థిక సర్వే తెలిపింది. ప్రపంచ మేధో సంపత్తి హక్కుల సంస్థ – 2022 నివేదిక ప్రకారం.. అంతర్జాతీయంగా పేటెంటు నమోదుల్లో అగ్రస్థానంలో ఉన్న 10 దేశాల్లో భారత్ ఆరో ర్యాంకు సాధించింది. జాతీయ మేధోసంపత్తి హక్కుల విధానం-2016 ద్వారా పేటెంట్లు, డిజైన్లు, కాపీ రైట్లు, ట్రేడ్ మార్కులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ, నియంత్రణలను ప్రభుత్వం సరళీకరించిందని సర్వే పేర్కొన్నది. పేటెంట్ (సవరణ) నిబంధనలు-2024 పేటెంట్ ప్రక్రియ, నమోదు, నిర్వహణలను మరింత సులభతరం చేసిందని కూడా సర్వే వెల్లడించింది.
ప్రభుత్వం, ప్రైవేటు రంగం, నైపుణ్యాభివృద్ధి వ్యవస్థ, విద్యా వ్యవస్థ, పరిశోధనాభివృద్ధి సంస్థల మధ్య సమన్వయాన్ని సాధించడమే కాకుండా.. తయారీ రంగంలో భారత్ ను మేటిగా నిలిపే లక్ష్యంతో ఆర్థిక ఆకాంక్షాపరులకు సానుకూల వాతావరణాన్ని సృష్టించినట్టు ఆర్థిక సర్వే ఆశావహ దృక్పథాన్ని వ్యక్తం చేసింది.
***
(Release ID: 2098068)
Visitor Counter : 35