సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
మహా కుంభమేళా ఇతివృత్తంగా ఆకాశవాణి, దూరదర్శన్ సంస్థలు నిర్మించిన పాటలను విడుదల చేసిన కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్
Posted On:
08 JAN 2025 8:28PM by PIB Hyderabad
2025 మహా కుంభమేళా కోసం “మహా కుంభ్ హై..” పేరిట దూరదర్శన్ నిర్మించిన ప్రత్యేక గీతాన్ని కేంద్ర సమాచార, ప్రసారశాఖ, రైల్వే, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ న్యూఢిల్లీ లో ఏర్పాటైన ఒక కార్యక్రమంలో విడుదల చేశారు.
భక్తి, సంప్రదాయం, వేడుకల త్రివేణీ సంగమంగా మహాకుంభ మేళాకు స్వర హారతి
సుప్రసిద్ధ గాయకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత కైలాష్ ఖేర్ పాడిన “మాహా కుంభ్ హై..” పాట, కుంభమేళాతో అల్లుకున్న భక్తి భావం, వేడుకలు, సాంస్కృతిక వైభవాన్ని అద్వితీయంగా చాటుతోంది. మహాకుంభ్ లో ముప్పేటగా అల్లుకుపోయే విశ్వాసం, సంప్రదాయాలు, పండుగ వాతావరణాన్ని ప్రఖ్యాత రచయిత ఆలోక్ శ్రీవాస్తవ రచన ప్రతిబింబిస్తూండగా, మనసులో భక్తి భావాలను పెంపొందించే అద్వితీయ సంగీతాన్ని క్షితిజ్ తారే కూర్చారు.
దేశ సాంస్కృతిక వారసత్వానికి, తరాలు మారినా తరగని ప్రాముఖ్యం గల కుంభమేళాకు వందనాలు అర్పించే ఈ పాట, సాంప్రదాయక బాణీలు, కొంగొత్త వాయిద్య రీతుల మేలుకలయికగా ఉంది.
“మహాకుంభ్ హై..” పాట అధికారిక మ్యూజిక్ వీడియోను ఇప్పుడు దూరదర్శన్ ద్వారానే కాక, సంస్థ డిజిటల్ వేదికలపై కూడా వీక్షించవచ్చు.
ప్రయాగరాజ్ మహాకుంభమేళా కోసం ఆకాశవాణి సిద్ధం చేసిన ప్రత్యేక గీతం విడుదల
“జై మహాకుంభ్ జై మహాకుంభ్, పగ్ పగ్ జయకారా మహాకుంభ్ ...”
ప్రయాగరాజ్ లో జరిగే మహాకుంభ్ కోసం ఆకాశవాణి ప్రత్యేకంగా రూపొందించిన గీతాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి విడుదల చేశారు. చక్కని సంగీతం, రచనల సంగమంగా రూపుదిద్దుకున్న ఈ పాట కుంభమేళా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ధార్మిక ప్రాముఖ్యాన్ని చాటుతోంది.
ప్రయాగరాజ్ పవిత్ర త్రివేణీ సంగమం వద్ద నిర్వహించే మహాకుంభమేళా వైభవానికి ఈ గీతం నమస్సులు అర్పిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఈ సమ్మేళన వైశిష్ఠ్యాన్ని పాట గొప్పగా వ్యక్తీకరిస్తోందన్నది భక్తుల మాట. లక్షలాది భక్తుల దైవస్మరణతో మార్మోగుతున్న ప్రయాగరాజ్ నేల, మహాకుంభ్ ప్రారంభం కోసం గర్వంగా ఉద్విగ్నంగా ఎదురుచూస్తోంది...
సంతోష్ నహర్, రతన్ ప్రసన్నల జోడీ సంగీతం అందించిన ఈ గీతం, రతన్ ప్రసన్న భక్తిపూర్వక గానంతో ప్రాణం పోసుకుంది. చైతన్యానికి ప్రతీకగా నిలిచిన అభినయ్ శ్రీవాస్తవ రచన, దైవంతో మానవుడి ఆధ్యాత్మిక బంధాన్ని తెలియజేస్తోంది.
త్రివేణీ సంగమం వద్ద ఆచరించే పవిత్ర స్నానం, ఆత్మలను శుద్ధి చేసే శక్తిగలదని, ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని కలిగించే సాధనమని గీతం గుర్తు చేస్తోంది. అచిరకాలంగా కొనసాగుతున్న మహాకుంభమేళా సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఆకాశవాణి విడుదల చేసిన ఈ గీతం శ్రోతల మనసులను భక్తిభావంతో, గర్వంతో నింపుతోంది.
భారతదేశ సాంస్కృతిక ఔన్నత్యానికి, ఆధ్యాత్మిక వారసత్వానికీ ప్రతీక అయిన ఈ రెండు గీతాలను ఆస్వాదించేందుకు శ్రోతలు, వీక్షకులు ఎదురుచూడొచ్చు.
*****
(Release ID: 2091657)
Visitor Counter : 15
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam