ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆంధ్ర ప్రదేశ్‌లోని విశాఖపట్నంలో అభివృద్ది పనుల ప్రారంభ కార్యక్రమం: ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం

Posted On: 08 JAN 2025 8:10PM by PIB Hyderabad

భారత్ మాతా కీ జై.
భారత్ మాతా కీ జై.
భారత్ మాతా కీ జై.

ఆంధ్ర ప్రదేశ్ గవర్నరు సయ్యద్ అబ్దుల్ నజీర్ జీ,  రాష్ట్ర జనప్రియ ముఖ్యమంత్రి, నా మిత్రుడూ శ్రీ చంద్రబాబు నాయుడు జీ, నటుడు, రాజకీయ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జీ, కేంద్ర ప్రభుత్వంలో నా సహచరులు, రాష్ట్ర ప్రభుత్వంలోని నా మంత్రులు, అందరు ఎంపీలు, ఇతర ఎమ్మెల్యేలు, గౌరవనీయులైన పౌరులు, సోదరులూ, సోదరీమణులారా,

ఆంధ్ర ప్రజల ప్రేమ, అభిమానానికి నా కృత‌జ్ఞత‌లు.

నా అభిమానాన్ని చూపించే అవకాశం ఇప్పుడు లభించింది. (ఈ మాటలను ప్రధాని తెలుగులో పలికారు.)

ముందుగా, నేను సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామికి శిరసు వంచి ప్రణామం చేస్తున్నాను.

మిత్రులారా,

మీ ఆశీస్సులతో, 60 సంవత్సరాల్లో మొట్టమొదటి సారిగా,  దేశం ఒక ప్రభుత్వాన్ని మూడోసారి కూడా ఎన్నుకుంది . ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో నా మొదటి ఆధికారిక కార్యక్రమమిది. మీరు నాకందించిన అద్భుత స్వాగత సత్కారాలు, మీరు చూపించిన గౌరవం, దారి పొడవునా మీరిచ్చిన ఆశీర్వాదాలు నన్ను ఉప్పొంగిపోయేలా చేశాయి. ఈ రోజు, చంద్రబాబు గారి ఉపన్యాసంలో, అన్ని ముఖ్యాంశాలనూ ప్రస్తావించారు. ఆయన పలికిన పలుకుల్లో ప్రతి ఒక్క మాట వెనుకా ఉన్న భావాన్నీ, ఉద్వేగాన్నీ నేను గౌరవిస్తున్నాను. ఈ లక్ష్యాల్ని మనం తప్పక సాధిస్తామని నేను ఆంధ్ర ప్రదేశ్ ప్రజలతోపాటూ దేశ ప్రజలకు కూడా హామీనిస్తున్నాను.

మిత్రులారా,
మన ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం సంభావ్యతలు, అవకాశాల రాష్ట్రం, అంతేకాదు శక్తియుక్తులకూ, వృద్దికీ ఆలవాలం. ఆంధ్రాలోని ఈ సాధ్యతలు సాకారం అయ్యాయీ అంటే గనక ఆంధ్రా అభివృద్ధి చెందుతుంది, అది జరిగినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. అందువల్ల, ఆంధ్రాను అభివృద్ధి చేయాలన్నదే మా విజన్. ఆంధ్రా ప్రజలకు సేవ చేస్తామనేది మా వాగ్దానం. ఆంధ్ర ప్రదేశ్ 2047కల్లా సుమారు 2.5 ట్రిలియన్ డాలర్ల  విలువైన ఆర్థిక వ్యవస్థగా మారాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకొంది. ఈ విజన్‌కు కార్యరూపాన్ని ఇవ్వడానికి చంద్రబాబు గారి ప్రభుత్వం ‘‘స్వర్ణ ఆంధ్ర@2047’’ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. కేంద్రంలో ఎన్‌డీయే ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రం పెట్టుకొన్న ప్రతి ఒక్క లక్ష్యాన్నీ సాధించడానికి ఆంధ్ర ప్రదేశ్‌తో భుజం భుజం కలిపి పనిచేస్తోంది. ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలతో తాను అమలుచేస్తున్న పథకాల్లో ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక ప్రాధాన్యాన్ని కట్టబెడుతోంది.  ఈ రోజు, రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ఇక్కడ శంకుస్థాపనలు చేయడంతోపాటు ప్రారంభాలు కూడా జరిపాం. ఈ ప్రాజెక్టులు ఆంధ్ర ప్రదేశ్ అభివృద్దిని కొత్త శిఖరాలకు చేరుస్తాయి. ఈ అభివృద్ధి ప్రాజెక్టులకు గాను ఆంధ్ర ప్రదేశ్‌కు, పూర్తి దేశానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,
ఆంధ్ర ప్రదేశ్‌లో నవకల్పన స్వభావం ఎక్కువ ఉన్న కారణంగా ఈ రాష్ట్రం ఐటీకి, టెక్నాలజీకీ ఒక ప్రధాన కూడలి (మేజర్ హబ్)గా ఉంటోంది. ఇక, సరికొత్త భావితరం టెక్నాలజీలకు ఒక కేంద్రంగా కూడా ఆంధ్ర మారే తరుణం ఆసన్నమైంది. ఇప్పుడు అభివృద్ధిపరుస్తున్న సాంకేతికతల విషయానికి వస్తే, మనం వాటిలో ఆరంభ స్థాయి నుంచే నాయకత్వం వహించే విధంగా దూసుకుపోదాం. ప్రస్తుతం, గ్రీన్ హైడ్రోజన్ ఒక వినూత్న రంగంగా రూపొందుతోంది. 2023లో, మన దేశం జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషనును ప్రారంభించింది. 2030కల్లా 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌‌ను ఉత్పత్తి చేయాలనేది మన లక్ష్యం. ఆరంభ దశలో, రెండు గ్రీన్ హైడ్రోజన్‌ హబ్స్‌ను ఏర్పాటు చేస్తారు. వాటిలో ఒక హబ్‌ మన విశాఖపట్నంలో ఉంటుంది. రాబోయే కాలంలో, ఆ తరహా భారీ గ్రీన్ హైడ్రోజన్‌‌ ఉత్పాదక కేంద్రాన్ని కలిగి ఉండే ప్రపంచ నగరాలు కొన్నిటిలో విశాఖపట్నం కూడా ఒకటి కానుంది.  ఈ గ్రీన్ హైడ్రోజన్‌ హబ్ ఎన్నో ఉద్యోగ అవకాశాల్ని అందిస్తుంది. దీనికి అదనంగా, ఆంధ్ర ప్రదేశ్‌లో తయారీ రంగానికి అనుబంధంగా ఒక విస్తారిత వ్యవస్థ (మాన్యుఫాక్చరింగ్ ఇకోసిస్టమ్) కూడా రూపుదిద్దుకొంటుంది.

మిత్రులారా,
ఈ రోజు, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసే అవకాశం నాకు లభించింది. ఈ తరహా పార్కును దేశంలో మూడు రాష్ట్రాలలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్ ఒకటి. ఈ పార్కులో తయారీకీ, పరిశోధనలకూ శ్రేష్ఠతరమైన మౌలిక సదుపాయాలు అమరుతాయి. దీంతో పెట్టుబడిదారుల్లో ఉత్సాహం పుంజుకొని, ఇక్కడి ఫార్మాస్యూటికల్ కంపెనీలకు మేలు కలుగుతుంది.

మిత్రులారా,
మా ప్రభుత్వం పట్టణీకరణను ఒక అవకాశంగా తీసుకొంటోంది. మేం ఆంధ్ర రాష్ట్రాన్ని నవతరం పట్టణీకరణకు ఒక నమూనాగా మలచాలని కోరుకుంటున్నాం. ఈ భావనను సాకారం చేయడానికి, ఈ రోజు కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతానికి- దీనినే క్రిస్ సిటీ అని కూడా అంటున్నారు- దీనికి శంకుస్థాపన చేశాం. ఈ స్మార్ట్ సిటీ చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగం కానుంది. ఇది ఆంధ్రాకు వేల కోట్ల రూపాయల పెట్టుబడిని తీసుకువచ్చి, లక్షల సంఖ్యలో పరిశ్రమల సంబంధిత ఉద్యోగాలను కల్పిస్తుంది.

మిత్రులారా,
శ్రీ సిటీ రావడంతో ఆంధ్ర ప్రదేశ్ ఇప్పటికే తయారీ కూడలి (మాన్యుఫాక్చరింగ్ హబ్)గా మారి, లాభాలను అందుకొంటోంది. దేశ పారిశ్రామిక, తయారీ రంగాల్లో అగ్రగామి రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్‌ను తీర్చిదిద్దాలనేదే మా ప్రయత్నం. తయారీని ప్రోత్సహించడానికి, మా ప్రభుత్వం పీల్ఐ వంటి పథకాలను అమలుచేస్తోంది. వీటి ఫలితంగా, ప్రస్తుతం, మన దేశం అనేక ఉత్పాదనల తయారీలో ప్రపంచంలోనే అగ్రగామి దేశాల్లో ఒక దేశంగా ఉంది.

మిత్రులారా,
ఈ రోజు, నూతన విశాఖపట్నం నగరంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కేంద్రానికి కూడా పునాదిరాయి వేస్తున్నాం. ఇది ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి చాలా ముఖ్య ఘట్టం. ఒక ప్రత్యేక రైల్వే జోన్ కావాలన్న డిమాండు చాలా కాలంగా ఉంటూ వచ్చింది, మరి ఈ రోజు, ఈ కలను నెరవేరుస్తున్నాం. సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌కు ప్రధాన కేంద్రమంటూ ఏర్పాటైతే ఈ ప్రాంతమంతటా వ్యవసాయ కార్యకలాపాలు, వ్యాపార కార్యకలాపాలు  విస్తరించడంతోపాటూ స్థానిక ఆర్థిక వ్యవస్థలోనూ వృద్ధికి కొత్త అవకాశాలు అందివస్తాయి. ఈ రోజు వేల కోట్ల రూపాయల విలువైన సంధాన సంబంధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు కూడా చేపట్టాం. రైల్వే రంగంలో, విద్యుదీకరణ పనులు 100 శాతం పూర్తి అయిన రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్ కూడా ఒక రాష్ట్రంగా ఉంది. ఆంధ్ర ప్రదేశ్‌లో 70కి పైగా రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా అభివృద్ధి పరుస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలకు ప్రయాణ సౌలభ్యాన్ని కల్పించడానికి, 7 వందే భారత్ రై
ళ్లనూ, అమృత్ భారత్ రైళ్లనూ నడుపుతున్నారు.

మిత్రులారా,
ఆంధ్ర లో ఈ మౌలిక సదుపాయాల కల్పన విప్లవం మెరుగైన సంధానం (కనెక్టివిటీ), బాగు పరచిన సదుపాయాలు తోడై, రాష్ట్ర పూర్తి ముఖచిత్రం రూపు రేఖలను మార్చివేయనుంది. దీంతో జీవన సౌలభ్యమూ, వ్యాపార నిర్వహణపరమైన సౌలభ్యమూ వృద్ది చెందుతాయి. ఇది ఆంధ్ర రాష్ట్రం 2.5 ట్రిలియన డాలర్ల విలువైన ఆర్థిక వ్యవస్థగా రూపొందేందుకు పునాది వేయనుంది.

మిత్రులారా,
శతాబ్దాల తరబడి, విశాఖపట్నమూ, ఆంధ్ర ప్రదేశ్ తీరప్రాంతమూ భారతదేశ వ్యాపారానికి ప్రవేశద్వారంగా నిలిచాయి. ఈ రోజుకు కూడా, విశాఖపట్నానికి అదే స్థాయి ప్రాముఖ్యం ఉంది. మహాసముద్రానికి సంబంధించి ఉన్న అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవడానికి మేం నీలి ఆర్థికవ్యవస్థను ఉద్యమ తరహాలో ప్రోత్సహిస్తున్నాం. ఈ క్రమంలో, విశాఖపట్నం ఫిషింగ్ హార్బరును ఆధునికీకరిస్తున్నాం. ఆంధ్ర ప్రదేశ్‌లో చేపలు పట్టే వృత్తిలో నిమగ్నం అయిన మన సోదరులు, సోదరీమణుల వ్యాపారాలు, ఆదాయం వృద్ది చెందేటట్టు చూడడానికి మేం పూర్తి అవగాహనతో పనిచేస్తున్నాం. మేం మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డు వంటి సదుపాయాలను సమకూర్చాం. మహాసముద్రంలో సురక్ష కల్పించేందుకు కూడా మేం కీలక చర్యల్ని తీసుకొంటున్నాం.

మిత్రులారా,

దేశంలో ప్రతి ఒక్క రంగంలోనూ సమ్మిళిత, సర్వతోముఖ అభివృద్ది చోటుచేసుకోవాలనే దిశలో మన ప్రయత్నాలు సాగాలి. అదే జరిగినప్పుడు, అభివృద్ది ఫలాలు సమాజంలో అన్ని వర్గాలకూ అందుతాయి. దీనిని సాధించడానికి, ఒక సమృద్ధ, ఆధునిక ఆంధ్ర ప్రదేశ్‌‌ను ఆవిష్కరించడానికి ఎన్‌డీయే ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ రోజు ప్రారంభిస్తున్న ప్రాజెక్టులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమృద్ధినిస్తాయి. మరోసారి,  మీ అందరికీ ఈ ప్రాజెక్టులకు గాను అభినందనలను తెలియజేస్తున్నాను.  

మీకందరికీ అనేకానేక ధన్యవాదాలు.

గమనిక: ఇది ప్రధాని ఉపన్యాసానికి దగ్గరి అనువాదం. ఆయన హిందీలో ప్రసంగించారు.

 

***


(Release ID: 2091655) Visitor Counter : 6