హోం మంత్రిత్వ శాఖ
మూడు కొత్త నేరవిచారణ చట్టాల అమలుపై న్యూఢిల్లీలో ఎన్‌సీఆర్‌బీతో సమీక్షా సమావేశం: అధ్యక్షత వహించిన హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
సీసీటీఎన్ఎస్ 2.0, ఎన్ఏఎఫ్ఐఎస్, జైళ్ళు, కోర్టులు, ప్రాసిక్యూషన్, ఫోరెన్సిక్స్‌ను అఖిల భారత స్థాయిలో ఐసీజేఎస్ 2.0తో కలిపే కార్యాచరణపై సమీక్ష
ఐసీజేఎస్ 2.0లో కొత్త నేరవిచారణ చట్టాలను పూర్తిస్థాయిలో అమలుచేయడానికి తోడ్పడాల్సిందిగా ఎన్‌సీఆర్‌బీకి హోం మంత్రి సూచన:
బాధితులకు, ఫిర్యాదుదారులకు మేలుకలిగేలా కేసు నమోదు నుంచి పరిష్కారం వరకూ అన్ని క్రిమినల్ కేసులకు ముందుగా నిర్ధారించిన దశలు, గడువుల విషయంలో సమాచారాన్ని పంపాలి: హోం మంత్రి
ముందుగా నిర్ధారించిన కాలావధుల ప్రకారం దర్యాప్తు అధికారులతో పాటు ఉన్నతాధికారులకు సమాచారాన్ని పంపిస్తే దర్యాప్తు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడంలో సాయం అందుతుంది
గుర్తు తెలియని మృతదేహాలను, తప్పిపోయినవారి ఆచూకీని గుర్తించడానికి బయోమెట్రిక్ టెక్నాలజీని ఉపయోగించాలి
ఎన్ఏఎఫ్ఐఎస్ ను సాంకేతికంగా అమలు చేయడంలో ఎన్‌సీఆర్‌బీ చేస్తున్న కృషికి హోం మంత్రి ప్రశంసలు
Posted On:
24 DEC 2024 12:36PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ)తో కలిసి మూడు కొత్త నేర విచారణ చట్టాల అమలు అంశంపై కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అఖిల భారతస్థాయిలో సీసీటీఎన్ఎస్ 2.0, నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఎన్ఏఎఫ్ఐఎస్), జైళ్ళు, న్యాయస్థానాలు, ప్రాసిక్యూషన్, ఫోరెన్సిక్స్ ను ఇంటర్-ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్) 2.0తో ఏకీకృతం చేసి అమలులోకి తీసుకురావడంపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి, ఎన్‌సీఆర్‌బీ డైరెక్టరు, హోం శాఖ, ఎన్‌సీఆర్‌బీ, ఎన్‌ఐసీల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఐసీజేఎస్ 2.0 పరిధిలో కొత్త నేర విచారణ చట్టాలను పూర్తిస్థాయిలో అమలుచేసే ప్రక్రియను సుగమం చేయాల్సిందిగా ఎన్‌సీఆర్‌బీకి హోం మంత్రి సూచన చేశారు. ప్రతి రాష్ట్రంలో, ప్రతి కేంద్రపాలిత ప్రాంతంలో ఈ-సాక్ష్య (eSakshya), న్యాయ శ్రుతి, ఈ-సైన్ (eSign), ఈ-సమన్లు (eSummons) వంటి సేవలను (అప్లికేషన్స్) వినియోగించాలని శ్రీ అమిత్ షా స్పష్టం చేశారు.
టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని కేంద్ర హోం మంత్రి ప్రధానంగా ప్రస్తావిస్తూ... అన్ని క్రిమినల్ కేసులకు ముందుగా నిర్ధారించిన దశలు, నిర్దిష్ట కాలావధులను అనుసరించి కేసు నమోదు స్థాయి నుంచి కేసు పరిష్కారం అయ్యే వరకు కూడా సమాచారాన్ని రూపొందించాలనీ, దీనివల్ల బాధితులకూ, ఫిర్యాదిలకూ మేలు కలుగుతుందనీ హోం మంత్రి అన్నారు. ముందుగా నిర్ధారించిన కాలావధుల ప్రకారం అలర్ట్ లను దర్యాప్తు అధికారులతోపాటే ఉన్నతాధికారులకు పంపించడంవల్ల దర్యాప్తు ప్రక్రియలో వేగాన్ని తీసుకురావడంలో ఈ ప్రక్రియ తోడ్పడుతుందని ఆయన అన్నారు. హోం శాఖ, ఎన్సీఆర్బీల అధికారులతో కూడిన ఒక బృందం రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో సాంకేతిక ప్రాజెక్టులను మరింతగా ఉపయోగించుకొనేటట్లు చూడడడనికీ, చేతనైన అన్ని విధాలుగానూ సాయాన్ని అందించడానికీ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు వెళ్లూఉండాలని ఆయన స్పష్టం చేశారు.
క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్), ఇంటర్-ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్)ల పురోగతిని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ ఉండాలని, దీనికోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీనియర్ పోలీసు అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశమవుతూ ఉండాలని శ్రీ అమిత్ షా ప్రధానంగా ప్రస్తావించారు. గుర్తు తెలియని మృతదేహాలనూ, తప్పిపోయినవారినీ గుర్తుపట్టడానికి బయోమెట్రిక్ టెక్నాలజీని ఉపయోగించాలని కూడా ఆయన సూచించారు.
దర్యాప్తు అధికారులు, నేర విచారణ వ్యవస్థలో భాగమైన ఇతర ఆసక్తిదారులకు మేలు కలిగేటట్లు డేటా ప్రధాన ప్లాట్‌ఫాంను ఎన్‌సీఆర్‌బీ సిద్ధం చేయాలని కేంద్ర హోం మంత్రి అన్నారు. కొత్త నేర విచారణ చట్టాలనూ, ఎన్ఏఎఫ్ఐఎస్ ను సాంకేతికత ప్రధాన పద్ధతుల్లో అమలుచేస్తున్నందుకు ఎన్‌సీఆర్‌బీని ఆయన అభినందించారు.
***
(Release ID: 2087981)
Visitor Counter : 6