సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
భవిష్యత్తు సినీ నిర్మాణ నిపుణుల ప్రయోగ వేదికగా ఇఫీ
భారతీయ సినిమా భవితను ఘనంగా చాటిన ‘క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో’ – 48 గంటల్లోనే మలిచిన సృజనాత్మక చిత్రాల ప్రదర్శన
గత సినీ దిగ్గజాలకూ, భవిష్యత్తుకు ప్రతినిధులైన యువతకూ ఈ ఏడాది ఇఫీ అంకితం – ఐ&బీ కార్యదర్శి సంజయ్ జాజు
కనిపించని ఓ మొబైల్ ఫోన్ ద్వారా మనిషికీ, సాంకేతికతకూ మధ్య సంబంధాన్ని సునిశితంగా చిత్రించిన ‘గుల్లు’ సినిమా సీఎంవోటీలో విజేత
ఉరకలేసే యువోత్సాహం, ఉత్తేజం నింపే వాతావరణం, ఎప్పటికీ గుర్తుండిపోయేలా అలుపూ సొలుపూ లేకుండా ఆస్వాదించిన 48 గంటలు – 55వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ)లో మాక్వినెజ్ ప్యాలెస్ వేదికగా జరిగిన క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో (సీఎంవోటీ) ముగింపు వేడుక విశేషాలివి.
దేశంలో సమర్థులైన ఔత్సాహిక సినీ రూపకర్తలను గుర్తించి ప్రోత్సహించే ప్రధాన వేదికగా సీఎంవోటీ అవతరించింది. ఈ ఏడాది 13 చిత్ర నిర్మాణ విభాగాల్లో 100 మంది యువ ప్రతిభావంతులు భాగస్వాములవడం విశేషం. గత ఎడిషన్లలో 10 నైపుణ్య విభాగాల్లో భాగస్వాములైన 75 మందితో పోలిస్తే ఈ ఏడాది గణనీయమైన పెరుగుదల నమోదైంది. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. దేశవ్యాప్తంగా 13 చలనచిత్ర సంబంధిత విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శిస్తూ 1,070 ఎంట్రీలు వచ్చాయి.
48 గంటల్లో సినిమా రూపకల్పన సవాలు ఈ కార్యక్రమంలోని విశేషాంశం. ఇందులో పాల్గొనేవారిని 20 మంది సభ్యుల చొప్పున ఐదు బృందాలుగా విభజించారు. ‘సాంకేతిక యుగంలో సంబంధాలు’ అనే ఇతివృత్తంతో వారు లఘుచిత్రాలను రూపొందించారు. నవంబర్ 21 నుంచి 23 వరకు ఈ ఛాలెంజ్ జరిగింది. పంజిమ్ చుట్టుపక్కల 4 కిలోమీటర్ల పరిధిలోని 12 ప్రదేశాలను ఇందుకోసం ఉపయోగించుకున్నారు. జట్టు సృజనాత్మకతను, ఉత్సాహాన్ని ఇది పరీక్షించింది.
ఈ ఏడాది సీఎంవోటీలో 48 గంటల్లో సినిమా రూపకల్పన ఛాలెంజ్ విజేతలు:
1. ఉత్తమ చిత్రం: గుల్లు
ఉత్తమ చిత్రం (రన్నర్స్ అప్): వి హియర్ ద సేమ్ మ్యూజిక్
2. ఉత్తమ దర్శకురాలు: అర్షలీ జోస్ (గుల్లు)
3. ఉత్తమ స్క్రిప్ట్: ఆదిరాజ్ బోస్ (లవ్ పిక్స్ సబ్ స్క్రిప్షన్)
4. ఉత్తమ నటి: విశాఖ నాయిర్ (లవ్ పిక్స్ సబ్ స్క్రిప్షన్)
5. ఉత్తమ నటుడు: పుష్పేంద్ర కుమార్ (గుల్లు)
“ఈ విజయం మా బృందం మొత్తానిదీ. మా చిత్రానికి స్క్రిప్టే నిజమైన హీరో. అది చదవగానే మనం కొంత ప్రత్యేకమని నాకనిపించింది. ఈ అసాధారణ బృందంతో పనిచేయడం మరచిపోలేని అనుభవం” అంటూ ఉత్తమ దర్శకత్వ పురస్కారం పొందిన శ్రీమతి అర్షలీ జోస్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ యువ ప్రతిభావంతులకు గత సీఎంవోటీ బృందాలు దిశానిర్దేశం చేశాయి. చిదానంద నాయక్, అఖిల్ లోత్లికార్, సుబర్ణ దాష్, అక్షిత వోహ్రా, కృష్ణ దుసానేను సీఎంవోటీ చాంపియన్లుగా ఆహ్వానించారు.
ఛాలెంజ్ లో పాల్గొన్నవారిని ప్రశంసిస్తూ- “తీవ్రమైన ఒత్తిడిలోనూ 48 గంటల్లో ఇలాంటి ఉత్తమ చిత్రాలను రూపొందించడమే ఒక విజయం. ఇందులో పాల్గొన్న అందరూ విజేతలే” అని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. “ఈ ఏడాది ఇఫీని గతంలోని సినీ దిగ్గజాలకూ, భవిష్యత్తుకు ప్రతినిధులైన దేశ యువతకూ అంకితం చేస్తున్నాం’’ అని ప్రత్యేకంగా పేర్కొన్నారు. సీఎంవోటీ, ఫిల్మ్ బజార్, రెడ్ కార్పెట్ వంటి కార్యక్రమాలు ఔత్సాహిక సినీ రూపకర్తలకు వారి కలలను సాకారం చేసుకునే అవకాశాన్ని అందిస్తాయన్నారు.
నటుడు అమిత్ సాద్ కూడా వేడుకకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న యువ చిత్రనిర్మాతలు, నటీనటులకు చిత్ర పరిశ్రమ అవకాశాలను నేరుగా అందించడంపై ఇఫీని ప్రశంసించారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి నీరజా శేఖర్, ప్రసార శాఖ సంయుక్త కార్యదర్శి- ఎన్ఎఫ్ డీసీ ఎండీ పృథుల్ కుమార్, చలనచిత్ర విభాగం సంయుక్త కార్యదర్శి వృందా దేశాయ్, సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి అపూర్వ చంద్ర సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ రచయిత, గ్రాండ్ జ్యూరీ సభ్యుడు సామ్రాట్ చక్రవర్తి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ప్రేక్షకులు ఉర్రూతలూగుతుండగా విజేతలనను ప్రకటించిన అనంతరం.. షాట్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు, సీఈవో కార్టర్ పిల్చర్ మాట్లాడుతూ “ఈ ఏడాది రూపొందించిన చిత్రాల నాణ్యత, విషయాంశాలు అద్భుతమైనవి, అత్యుత్తమమైనవి” అంటూ పోటీలో పాల్గొన్నవారిని ప్రశంసించారు.
యూకే కేంద్రంగా నడిచే షాట్స్ ఇంటర్నేషనల్ సహకారంతో నిర్వహించిన 48 గంటల్లో సినిమా రూపకల్పన ఛాలెంజ్.. యువ చిత్రనిర్మాతలకు సృజనాత్మకత, కథన నైపుణ్యాలు, అతి తక్కువ సమయంలో జట్టుతో కలిసి పనిచేయడంలో తమను తాము పరీక్షించుకునే విశిష్టమైన అవకాశాన్ని అందిస్తుంది. సీఎంవోటీలో ఈ సినిమాల ప్రీ-ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రోడక్షన్ పనులన్నింటి బాధ్యతను కూడా షాట్స్ టీవీ తీసుకుంది.
ఈ ఏడాది సీఎంవోటీ.. యువ చిత్రనిర్మాతల అత్యుత్తమ ప్రతిభను చాటడం మాత్రమే కాకుండా, ఈ సినిమా రూపకర్తలకు ప్రయోగ కేంద్రంగా ఇఫీ స్థానాన్ని కూడా సుస్థిరం చేసింది.
***
(Release ID: 2076926)
Visitor Counter : 29
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Konkani
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam