ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దివ్య‌.. భ‌వ్య దీపోత్సవం ఎంతో అద్భుతం.. అస‌మానం.. అమోఘం!

అయోధ్య న‌గ‌ర ప్రజలకు అనేకానేక అభినందనలు: ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌శంస;

అర్ధ శతాబ్దం (500 ఏళ్ల) తర్వాత ల‌క్ష‌లాది రామభక్తుల నిరంత‌ర త్యాగాలు.. కష్టాల అనంతరం ఆవిష్కృతమైన ప‌విత్ర క్షణమిది

Posted On: 30 OCT 2024 10:44PM by PIB Hyderabad

   అయోధ్య‌లో భవ్య, దివ్య దీపోత్సవం నేపథ్యంలో ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నగరవాసులతోపాటు యావ‌ద్భారత ప్రజానీకానికి హృదయపూర్వక శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేరకు శ్రీ రామచంద్రుని జన్మస్థలమైన పవిత్ర అయోధ్య నగరంలో దీపోత్సవ శోభపై తన సంతోషాన్ని సగర్వంగా ప్రజలతో పంచుకుంటూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన వరుస సందేశాల్లో:
‘‘ఇదెంతో అద్భుతం.. అస‌మానం.. అమోఘం!
ఈ దివ్య, భవ్య దీపోత్సవంపై అయోధ్య నగర ప్రజలకు అనేకానేక అభినందనలు! లక్షలాది దివ్వెలతో భావోద్వేగభరితంగా సాగుతున్న ఈ జ్యోతిపర్వం బాల రాముడు జన్మించిన ఈ పుణ్యక్షేత్రాన్ని తేజోమయం చేసింది. అయోధ్య ధామం నుంచి పుట్టుకొచ్చిన ఈ కాంతి పుంజం దేశవ్యాప్తంగాగల నా కుటుంబ సభ్యులలో నవ్యోత్సాహం, నవోత్తేజం నింపుతోంది. దేశ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లేలా ఆ శ్రీ రాముడు వరమివ్వాలని ప్రార్థిస్తున్నాను. జై శ్రీ రామ్!’’ అని ప్రధాని పేర్కొన్నారు. అలాగే ఈ ఏడాది దీపావళికిగల ప్రత్యేకతను వివరిస్తూ-

 

 

‘‘పవిత్ర అయోధ్య!లో
మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడు తన మహా మందిరంలో ప్రతిష్ఠితుడైన తర్వాత మనం నిర్వహించుకుంటున్న తొలి దీపావళి ఇది. అయోధ్యలోని బాల రాముడు వెలసిన ఈ ఆలయ అపూర్వ సౌందర్యం అందర్నీ ఆనంద సాగరంలో ఓలలాడిస్తోంది. అర్ధ శతాబ్దం (500 ఏళ్ల) తర్వాత ల‌క్ష‌లాది రామభక్తుల నిరంత‌ర త్యాగాలు, కష్టాల అనంతరం ఆవిష్కృతమైన ప‌విత్ర క్షణమిది. ఈ చారిత్రక సందర్భానికి మనమంతా ప్రత్యక్ష సాక్షులం కావడం నిజంగా మన సుకృతం. ‘వికసిత భారత్’ సంకల్ప సాకారంలో శ్రీ రామచంద్రుని జీవితం, ఆయన ఆదర్శాలు దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకం కాగలవన్నది నా ప్రగాఢ విశ్వాసం...
జై సియారాం!’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

 

***

MJPS/SS




(Release ID: 2069896) Visitor Counter : 9