హోం మంత్రిత్వ శాఖ
‘ఐక్యతా పరుగు’ కు న్యూ ఢిల్లీ లో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా పచ్చ జెండా; ‘జాతీయ ఏక్తా దినోత్సవం’లో భాగంగా ఈ ‘ఐక్యతా పరుగు’ నిర్వహణ
మహా నేత సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ను స్మరించుకోవడానికే ‘ఐక్యతా పరుగు’;
దీనిని నిర్వహించాలని 2015లోనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్ణయం;
దేశ ఏకత, సమగ్రతల పరిరక్షణకు పౌరులు ప్రతిజ్ఞ స్వీకరించడమే ఈ కార్యక్రమ లక్ష్యం
‘
‘ఐక్యతా పరుగు’ భారత్ ఏకత పరిరక్షణ ప్రతిన మాత్రమే కాదు; ఇది వికసిత భారత్‌ను ఆవిష్కరించాలన్న ప్రతిజ్ఞ కూడా
స్వాతంత్య్రం వచ్చాక, 550కి పైగా సంస్థానాలను ఏకం చేసి ఆధునిక భారతదేశానికి రూపురేఖలు;
సర్దార్ పటేల్ దృఢ సంకల్పం, సత్వర నిర్ణయంతో సాకారం
ప్రస్తుతం, ప్రపంచంలో భారత్ స్థానం సుదృఢం; ప్రతి రంగంలో నాయకత్వ పటిమ చాటుతున్న మన దేశం;
దీనికి పునాది వేసింది సర్దార్ పటేల్
సర్దార్ పటేల్ జ్ఞాపకాన్ని ప్రధాన మంత్రి శ్రీ మోదీ సజీవ రూపంగా నిలబెట్టారు;
గుజరాత్ లోని కేవడియాలో సర్దార్ పటేల్ కు ప్రపంచంలోనే అతి ఎత్తయిన విగ్రహ నిర్మాణం
సర్దార్ పటేల్ దార్శనికత, ఆలోచనలు, సందేశాలను అన్ని రంగాల్లోను సాకారం చేస్తున్న ప్రధాని శ్రీ మోదీ
పౌరులూ! దేశ ఐక్యతను బలపరుస్తూ ‘ఐక్యతా పరుగు’లో పాల్గొనండి: కేంద్ర హోం మంత్రి;
2047 కల్లా సంపూర్ణ వికసిత భారత్ కలను నేరవేర్చాలనేదే
Posted On:
29 OCT 2024 11:54AM by PIB Hyderabad
‘ఐక్యతా పరుగు’ కు కేంద్ర హోం - సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా న్యూ ఢిల్లీలో ఈ రోజు పచ్చజెండాను చూపించి, ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏటా అక్టోబరు 31న ‘జాతీయ ఐక్యత దినోత్సవం’లో భాగంగా నిర్వహిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రులు శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్, డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా, అనేక మంది ఉన్నతాధికారులు ఐక్యతా పరుగు కార్యక్రమంలో పాల్గొన్నారు.
మహా నేత సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ను స్మరించుకొంటూ 2015లో ‘ఐక్యతా పరుగు’ను నిర్వహించాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్ణయించిన విషయాన్ని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా తన ప్రసంగంలో గుర్తుకు తెచ్చారు. భారత్ ఏకత, సమగ్రతలను పరిరక్షిస్తూ పౌరులు ప్రతిజ్ఞ చేయడం ఇందులో భాగం అని శ్రీ అమిత్ షా అన్నారు. అప్పటి నుంచి ‘ఐక్యతా పరుగు’ మాధ్యమం ద్వారా యావత్తు దేశప్రజలు కేవలం ఏకత, సమగ్రతల పరిరక్షణ కు ప్రతిజ్ఞ చేయడం ఒక్కటే కాకుండా భరత మాత సేవకు పునరంకితం అవుతూ వస్తున్నారని శ్రీ షా అన్నారు. ‘ఐక్యతా పరుగు’ దేశ ఐకమత్య ప్రతిజ్ఞ ఘట్టాన్ని ఆవిష్కరించడంతో పాటు సర్వతోముఖంగా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని (‘వికసిత్ భారత్’) నిర్మించాలన్న ప్రతిజ్ఞగా కూడా రూపొందిందని కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. 2047 కల్లా అన్ని రంగాల్లో సంపూర్ణంగా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సాకారం చేయాలని దేశ ప్రజలందరి ఎదుటా ఒక ప్రతిజ్ఞను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదించారని కేంద్ర మంత్రి అన్నారు.
ఇవాళ ప్రపంచంలో వికసిస్తున్న, వర్ధిల్లుతున్న, బలమైన దేశంగా భారతదేశం నిలబడిందని శ్రీ అమిత్ షా అన్నారు. మనం ఒకసారి చరిత్రను పరిశీలిస్తే స్వాతంత్య్రం వచ్చిన తరువాత 550కి పైగా సంస్థానాలను ఏకతాటి మీదకు తీసుకువచ్చి, ఆధునిక కాలపు నవీన భారతదేశంగా మలచడం కేవలం సర్దార్ పటేల్ దృఢ సంకల్పం, సత్వర నిర్ణయాల వల్లనే సాధ్యపడిందని తెలుస్తుందని శ్రీ అమిత్ షా అన్నారు. సర్దార్ పటేల్ దృఢ సంకల్ప శక్తి కారణంగా నేడు భారతదేశం ప్రపంచంలో ఐకమత్యానికి, దృఢత్వానికి ప్రతీకగా ఉందని శ్రీ అమిత్ షా అన్నారు. ఇవాళ భారతదేశం ప్రపంచంలో ప్రతి రంగంలోను నాయకత్వాన్ని వహించే మార్గంలో పయనిస్తోందంటే అందుకు సర్దార్ పటేల్ పునాది వేశారని కేంద్ర మంత్రి అన్నారు.
సర్దార్ పటేల్ ను కొన్ని సంవత్సరాల తరబడి మరచిపోవడం దురదృష్టకరం, సర్దార్ పటేల్ ను ‘భారత్ రత్న’తో ఏనాడో గౌరవించుకోవలసి ఉన్నా అలా జరగలేదని శ్రీ అమిత్ షా అన్నారు. సర్దార్ పటేల్ కు గుజరాత్‌లోని కేవడియాలో ప్రపంచంలోనే అతి ఎత్తయిన విగ్రహాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏర్పాటుచేసి ఆయన జ్ఞాపకాన్ని చిరస్థాయిగా నిలబెట్టారని శ్రీ అమిత్ షా అన్నారు. సర్దార్ పటేల్ దార్శనికతకు, ఆలోచనలకు, ఆయన ఇచ్చిన సందేశానికి అన్ని రంగాలలోను నిర్ధిష్ట రూపాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చారని శ్రీ అమిత్ షా అన్నారు.
సర్దార్ పటేల్ అంతరంగంలోని గొప్ప గొప్ప ఆలోచనలు దేశ యువతరానికి మార్గదర్శనం చేస్తుంటాయని శ్రీ అమిత్ షా అన్నారు. ‘ఐక్యతా పరుగు’లో ప్రజలు పాలుపంచుకోవాలని, 2047కల్లా అన్ని రంగాల్లోను సంపూర్ణంగా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ఆవిష్కరించాలనే కలను పండించి భారత్ ఐక్యతను బలపరుస్తామంటూ ప్రతిజ్ఞ చేయాలని కేంద్ర హోం మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు.
***
(Release ID: 2069252)
Visitor Counter : 20