కేంద్ర మంత్రివర్గ సచివాలయం
azadi ka amrit mahotsav

బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను దృష్ట్యా సన్నద్ధతను సమీక్షించేందుకు సమావేశమైన జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ

Posted On: 21 OCT 2024 5:44PM by PIB Hyderabad

బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను దృష్ట్యా సన్నద్ధతను సమీక్షించేందుకు కేబినెట్ కార్యదర్శి డాక్టర్ టి వి సోమనాథన్ అధ్యక్షతన జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ (ఎన్ సిఎంసి) సమావేశం జరిగింది.

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రస్తుత స్థితిగతులను భారత వాతావరణ శాఖ (ఐఎండి) డైరెక్టర్ జనరల్ కమిటీకి వివరించారు. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి అక్టోబర్ 22 ఉదయం వాయుగుండంగా , అక్టోబర్ 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత వాయువ్య దిశగా పయనించి అక్టోబర్ 24 ఉదయం ఒడిశా-పశ్చిమబెంగాల్ తీరాలకు సమీపంగా వాయవ్య బంగాళాఖాతం చేరుకోనుంది. వాయువ్య దిశగా కదులుతూనే అక్టోబర్ 24 అర్ధరాత్రి, 25వ తేదీ తెల్లవారు జామున తీవ్ర తుపానుగా గంటకు 100-110-120 కిలోమీటర్ల వేగంతో పూరీ, సాగర్ దీవుల మధ్య ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను దాటే అవకాశం ఉంది.

తుపాను ప్రభావం చూపే అవకాశం ఉన్న ప్రాంతాల లోని ప్రజలను రక్షించడానికి తీసుకుంటున్న సన్నాహక చర్యలు, స్థానిక యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను ఒడిశా, పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కమిటీకి వివరించారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని, ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్ లను కూడా సిద్ధం చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తగినన్ని షెల్టర్లు, విద్యుత్ సరఫరా, మందులు, అత్యవసర సేవలను సిద్ధంగా ఉంచారు. సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ముంపు ప్రాంతాల ప్రజలను గుర్తించారు.

జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్.డిఆర్ఎఫ్) పశ్చిమ బెంగాల్లో 14 బృందాలను, ఒడిశాలో 11 బృందాలను సిద్ధంగా ఉంచింది. ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డ్ కు చెందిన రక్షణ, సహాయ బృందాలతో పాటు నౌకలు, విమానాలను సిద్ధంగా ఉంచారు. పారాదీప్, హల్దియా రేవులకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు, సలహాలు పంపుతున్నారు. విద్యుత్, టెలీ కమ్యూనికేషన్లకు అంతరాయం ఏర్పడితే తక్షణ పునరుద్ధరణ కోసం,  పరిస్థితిని పర్యవేక్షించడం కోసం విద్యుత్, టెలికమ్యూనికేషన్ శాఖలు అత్యవసర బృందాలను నియమించాయి.

కేంద్ర సంస్థలు , ఒడిశా , పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాల సన్నద్ధత చర్యలను సమీక్షించిన క్యాబినెట్ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వాలు , కేంద్ర సంస్థలు అవసరమైన అన్ని నష్ట నివారణ , ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రాణనష్టాన్ని పూర్తిగా నివారించడం, ఆస్తులు, మౌలిక సదుపాయాల నష్టాన్ని తగ్గించడం లక్ష్యంగా ఉండాలని, నష్టం జరిగితే అతి తక్కువ సమయంలో అత్యవసర సేవలను పునరుద్ధరించాలని సూచించారు.

సముద్రంలో ఉన్న మత్స్యకారులను వెనక్కి రప్పించాలని, ముంపు ప్రాంతాల ప్రజలను సకాలంలో తరలించేలా చూడాలని కేబినెట్ కార్యదర్శి తెలిపారు. అన్ని కేంద్ర సంస్థలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయని, సహాయం కోసం అందుబాటులో ఉంటాయని ఆయన ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలకు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, చత్తీస్ గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు కూడా భారీ వర్షాల కారణంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలలోని డ్యామ్ ల నుంచి  నీటి విడుదలను పకడ్బందీగా నిర్వహించాలని కేబినెట్ కార్యదర్శి స్పష్టం చేశారు.

ఒడిశా, పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, మత్స్య, విద్యుత్, ఓడరేవులు, షిప్పింగ్, జలరవాణా శాఖ కార్యదర్శులు, ఆంధ్రప్రదేశ్ అదనపు ప్రధాన కార్యదర్శి, టెలికమ్యూనికేషన్ శాఖ సభ్యుడు (టెక్నికల్), చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ (సీఐఎస్సీ) సిబ్బంది నుంచి చైర్మన్ వరకు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇంకా జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సభ్య కార్యదర్శి, భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్, ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్, హోం మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు.


 

****




(Release ID: 2066893) Visitor Counter : 27