ప్రధాన మంత్రి కార్యాలయం
ఐక్య రాజ్య సమితి ‘సమిట్ ఆఫ్ ఫ్యూచర్’ సమావేశాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగానికి ఆంగ్లానువాదం
Posted On:
23 SEP 2024 10:12PM by PIB Hyderabad
గౌరవనీయ సభ్యులారా,
ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామిక దేశం 140 కోట్ల మంది భారతీయుల తరఫున మీ అందరికీ అభినందనలు తెలియచేస్తున్నాను. మానవ చరిత్రలోనే గత జూన్ నెలలో భారతదేశంలో జరిగిన భారీ ఎన్నికల్లో భారత ప్రజలు.. వరుసగా మూడోసారి వారికి సేవ చేసే అవకాశాన్ని నాకు ఇచ్చారు. ప్రపంచ జనాభాలో ఆరో వంతు వాణిని ఇప్పుడు మీకు వినిపిస్తాను.
మిత్రులారా,
ప్రపంచ భవిష్యత్తు గురించి మాట్లాడే సందర్భంలో మానవ శ్రేయస్సుకే ప్రధమ ప్రాధాన్యం ఇవ్వవలసి ఉంటుంది. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధనలో మానవ సంక్షేమం, ఆహార, ఆరోగ్య భద్రతలకు ప్రాముఖ్యం ఇవ్వాలి. పేదరికం నుంచి 25 కోట్ల మంది పౌరులకు విముక్తి కల్పించడంతో, స్థిరమైన అభివృద్ధి సాధ్యమేనని మేం నిరూపించాం. మా ఈ విజయానుభవాన్ని గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న దేశాల)తో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నాం.
మిత్రులారా, మనిషికి సిసలైన విజయం ఐక్యతలోనే తప్ప యుద్ధభూమిలో దక్కబోదు. ప్రపంచ శాంతికి, అభివృద్ధికి, వ్యవస్థల్లో సంస్కరణలు అత్యావశ్యకం. నిత్యనూతనంగా ఉండేందుకు సంస్కరణలే మార్గం. న్యూఢిల్లీలో జరిగిన జి-20 సదస్సులో ఆఫ్రికా యూనియన్ కు శాశ్వత సభ్యత్వం కల్పించడం ఈ దిశగా ఒక ముఖ్యమైన ముందడుగు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రపంచ శాంతిభద్రతలకు ఉగ్రవాదం పెను సవాలుగా కొనసాగుతున్నప్పటికీ, సైబర్, సముద్రయాన, అంతరిక్ష రంగాల్లో ఘర్షణలు పెరుగుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు సంకల్పానికి సరితూగే గట్టి చర్యలు అనివార్యమని మరోసారి గుర్తుచేస్తున్నాను.
మిత్రులారా,
సాంకేతికత సురక్షితమైన పద్ధతిలో బాధ్యతాయుతంగా వినియోగించే క్రమంలో సరైన నియంత్రణా పద్ధతులు అవసరం. జాతుల ప్రాదేశిక సమగ్రత, చిత్తశుద్ధి నిలిచి ఉండాలంటే గ్లోబల్ డిజిటల్ పాలన అవసరమే! మరో విషయం, డిజిటల్ వ్యవస్థలు దేశాల మధ్య వారధి కావాలి తప్ప అవరోధంగా నిలువకూడదు. ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్ తన డిజిటల్ ప్రజావ్యవస్థని పంచుకునేందుకు సిద్ధంగా ఉంది.
“ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు” అన్న సూత్రం భారతదేశ నిబద్ధతకు తార్కాణం. ఇదే నిబద్ధత “ఒకే భూగోళం, ఒకే ఆరోగ్యస్థితి”, “ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే ఇంధన సరఫరా వ్యవస్థ” సూత్రాల్లో కూడా గమనించవచ్చు. మానవుడి హక్కులని కాపాడేందుకు, ప్రపంచ సౌభాగ్య సాధనకు భారత్ మనసా వాచా కర్మణా కట్టుబడి ఉంది.
అందరికీ ధన్యవాదాలు.
గమనిక : ఇది ప్రధానమంత్రి హిందీలో చేసిన వ్యాఖ్యల అనువాదం మాత్రమే.
(Release ID: 2058138)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam