ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియా పసిఫిక్ పౌర విమానయాన మంత్రుల రెండో సదస్సుకు హాజరు కానున్న ప్రధాన మంత్రి


ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన భద్రత, రక్షణ, సుస్థిరతను పెంపొందించే ఢిల్లీ డిక్లరేషన్‌ ఆమోదాన్ని ప్రకటించనున్న ప్రధాని

Posted On: 11 SEP 2024 7:41PM by PIB Hyderabad


సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో సాయంత్రం 4 గంటలకు  పౌర విమానయాన రంగంపై నిర్వహించనున్న 2వ ఆసియా-పసిఫిక్ మంత్రుల సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా జరిగే సమావేశంలో ఆయన ప్రసంగించనున్నారు.

 ఆసియా-పసిఫిక్ ప్రాంత విమానయాన రంగాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చే ఒక దార్శనిక ప్రణాళిక అయిన "ఢిల్లీ డిక్లరేషన్"ను సభ్య దేశాలన్నీ ఆమోదించినట్లు ఈ సందర్భంగా ప్రధాని ప్రకటించనున్నారు.

ఆసియా పసిఫిక్ పౌర విమానయాన రంగంలో భద్రత, రక్షణ, సుస్థిరతను పెంపొందించడంలో ఈ సదస్సు, అలాగే ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదం కీలక ముందడుగు కానున్నాయి. ఈ ప్రాంతంలోని దేశాల మధ్య సహకార స్ఫూర్తికి ఇది నిదర్శనం అవుతుంది.

అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ) సహకారంతో భారత పౌర విమానయాన శాఖ నిర్వహిస్తున్న ఆసియా-పసిఫిక్ మంత్రుల సదస్సులో ఈ ప్రాంతంలోని ఆయా దేశాలకు చెందిన రవాణా, విమానయాన మంత్రులు, నియంత్రణ సంస్థలు, ఈ రంగంలోని నిపుణులు పాల్గొంటారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మధ్య మరింత సహకారాన్ని పెంపొందిస్తూనే, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సుస్థిరత, శ్రామికశక్తి అభివృద్ధి వంటి కీలక సవాళ్ల పరిష్కారంపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారించనుంది.

 

****



(Release ID: 2054444) Visitor Counter : 15