ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సింగపూర్ సంస్థ ఏఈఎంను సందర్శించిన ప్రధానమంత్రి

Posted On: 05 SEP 2024 10:22AM by PIB Hyderabad

సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రముఖ సంస్థ ఏఈఎంను సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తో కలసి  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందర్శించారు. అంతర్జాతీయ సెమీకండక్టర్ రంగంలో ఏఈఎం పాత్ర, దాని కార్యకలాపాలతో పాటు భారత్ లో వ్యాపార ప్రణాళికల గురించి సంస్థ ప్రతినిధులు వివరించారు. సింగపూర్ సెమీకండక్టర్ పరిశ్రమల సమాఖ్య ఆ దేశంలో సెమీకండక్టర్ పరిశ్రమల అభివృద్ధి, భారత్ లో ఉన్న అవకాశాలు, సహకారం గురించి క్లుప్తంగా వివరించింది. ఈ రంగానికి చెందిన ఇతర సింగపూర్ సంస్థల ప్రతినిధులు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు గ్రేటర్ నోయిడాలో జరగనున్న సెమికాన్ ఇండియా ఎగ్జిబిషన్‌లో పాల్గొనాల్సిందిగా సింగపూర్ సెమీకండక్టర్ సంస్థలను ప్రధాన మంత్రి ఆహ్వానించారు.

భారత్ లో సెమీకండక్టర్ తయారీకి అనుకూల వాతావరణాన్ని అభివృద్ధి చేయడానికి, ఈ రంగంలో సింగపూర్ సామర్థ్యాన్ని పరిగణించి ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించాలని రెండు దేశాలు నిర్ణయించాయి. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు తయారీ రంగంపై ముఖ్యంగా సెమీకండక్టర్లపై దృష్టి సారించాలని భారత్-సింగపూర్ మంత్రుల రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించారు. అలాగే సెమీకండక్టర్ తయారీ భాగస్వామ్యంపై ఇరు పక్షాలు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

ఏఈఎంలో శిక్షణ పొందుతున్న ఒడిశా వరల్డ్ స్కిల్ సెంటర్ కు చెందిన విద్యార్థులు , సీఐఐ ఎంటర్‌ప్రైజ్  ఇండియా రెడీ టాలెంట్ ప్రోగ్రామ్ ద్వారా భారత్ ను సందర్శించిన సింగపూర్ విద్యార్థులు, ఆ సంస్థలో పనిచేస్తున్న భారతీయ ఇంజనీర్లతో ఇద్దరు ప్రధానులు సంభాషించారు.

ఈ రంగంలో సహకారాన్ని పెంపొందించుకునేందుకు రెండు దేశాల నిబద్ధతను ఈ పర్యటన తెలియజేస్తోంది. ఈ సందర్శనలో తనకు తోడుగా వచ్చిన ప్రధాని వాంగ్ ను శ్రీ మోదీ ప్రశంసించారు.

 

****



(Release ID: 2052191) Visitor Counter : 50